27, సెప్టెంబర్ 2016, మంగళవారం

కొత్త పుస్తకం ... వింత పరిమళం ...
ఓలేటి శ్రీనివాస భాను అంటేనే నిలువెత్తు భావుకత.
తీయందనాల తెలుగు పదాల పోహళింపు.
భాను పేరు చెబితేనే పొగబండి కథలు కథా సంపుటం మదిలో మెరుపులా మెరుస్తుంది.కలకండ పలుకులు చవులూరిస్తాయి.  ఎల్వీ ప్రసాద్ పుల్లయ్య గార్ల జీవిత చరిత్రలు కళ్ళ ముందు  కదలాడుతాయి.
విరామ మెరుగని కలం యోద్ధ. చేపట్టని సాహితీ ప్రక్రియ లేదు.

మిత్రుడు భాను ఇటీవల వొక అందమయిన, అపురూప మయిన పుస్తకం వెలువరించేడు. అదే ముకుంద మాల !
శ్రీ కుల శేఖర ఆల్వారుల కృతికి అను సృజన. ముకుంద మాలను గేయ రూపంలో గుండెలకు చేరువ చేసిన భాను ధన్యుడు.
ఈ పుస్తకంలో చాలా విశిష్ఠతలున్నాయి.
శ్రీకృష్ణశ్శరణం మమ అంటూ వి.ఎ.కె రంగారావు గారు అందించిన మున్నుడి,  ముకుందమాలా గ్రధన కౌశలం పేరిట ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు కవి పై అవ్యాజానురాగంతో చల్లిన ఆశీరమృత సేసలు ! ఇంకేం!  పసిడికి పరిమళం అబ్బింది. చిన్ని పొత్తం తాళ ప్రమాణం అధిగమించి అలరించింది. పరిమళించింది.


ముకుంద మాలను గేయచ్ఛందస్సులో అందించడానికి తనకు స్ఫూర్తినిచ్చిన శ్రీ శ్రీభాష్యం అప్పలాచార్య గారి కి ముకుంద మాలను అంకితం
 చేస్తూ భాను వ్రాసిన మాటలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. కథన రూపంలో సాగిన వొక అపురూప ఙ్ఞాపకాల పునశ్ఛరణ అది.
శ్రీ పెమ్మరాజు రవికిశోర్ గారు గేయాలను అంద మయిన చేతి వ్రాతతో నగిషీలు చెక్కారు.
ముఖచిత్రం హిందూ దిన పత్రిక కార్టూనిస్ట్ ఖేశవ్ గారు పెయింటింగ్ కట్టి పడేసేలా ఉంది.

ముకుంద మాల లోకి ప్రవేశిస్తూనే వొక సంభ్రమాశ్చర్యాల మనశ్చలనానికి లోనవుతాం.
సరళ సుందర మయిన గేయ పంక్తులూ, ఆ ప్రక్కనే కళ్ళు త్రిప్పుకో లేని విధంగా శ్రీ బాలి గారు వేసిన బొమ్మలూ... రకరకాల భంగిమలతో ముకుందుడు కనువిందు చేస్తూ దర్శనమిస్తాడు. గేయ రచన, గీత రచన పోటా పోటీగా సాగాయి.ఈ ముకుంద మాల గేయాల పుస్తకానికి ఆ రేఖా చిత్రాలతో  బాలి గారు మరింత ప్రాణం పోసారు . తేజోవంతం చేసారు.


ఓలేటి శ్రీనివాస రావు గారి కొత్త పుస్తకం ముకుంద మాలను  క్రియేటివ్ లింక్స్  పబ్లికేషన్స్ , హైదరాబాద్ వారు ప్రచురించారు. అన్ని ప్రముఖ పుస్తక ప్రచురణాలయాల లోనూ లభ్యమవుతాయి. మిగతా వివరాల కోసం ఈ చరవాణిలలో సంప్రదించ  వచ్చు:
9440567151  లేదా  7032480233       ఓలేటి శ్రీనివాస భాను.
9848065658 లేదా 9848506964         ప్రచురణ కర్తలు.
నాటి జనార్దనాష్టకం లాగ అదే సైజులో, బాలి గారి వర్ణ చిత్రాలతో ఈ ముకుంద మాల కూడా  రావాలని కోరుకోవడం
అతి శయోక్తీ కాదు, అత్యాశాకాదు.వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

మీ అభిప్రాయం తెలియ చేస్తారు కదూ ?