8, ఆగస్టు 2014, శుక్రవారం

..శ్రీ లలితా సహస్రనామమ్


శ్రావణశుక్రవారం పర్వ దినం పందర్భంగా అందరికీ శుభాభినందనలు  ... మీ కథా మంజరి.





శ్రీలలితా సహస్రనామ స్తోత్రం
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః

శ్రీమాతా శ్రీమహారాఙ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ,
చిదగ్నికుండసంమ్భూతా దేవకార్యసముద్యతా.                            1
ఉద్యధ్భానుసహస్రాభా చతుర్భాహుసమన్వితా,
రాగస్వరూపపాశాఢ్యా క్రోధాకారాంకుశోజ్జ్వలా.                              2
మనోరూపేక్షుకోదండా  పంచతన్మాత్రశాయకా,
నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండలా.                              3
చమ్పకాశోకపున్నాగసౌగన్ధికలసత్కచా,
కురువిందమణిశ్రేణీకనత్కోటీరమండితా.                                   4
అష్టమీచంద్రవిభ్రాజదళికస్థలశోభితా,
ముఖచంన్ద్రకళంకాభమృగనాభివిశేషకా.                                    5
వదనస్మరమాంగల్యగృహతోరణచిల్లికా.
వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచనా.                                     6
నవచంపకపుష్పాభనాసాదండవిరాజితా,
తారాకాంతితిరస్కారినాసాభరణభాసురా.                                  7
కదంబమంజరీక్లుప్తకర్ణపూరమనోహరా,
తాటంకయుగళీభూతతపనోడుపమండలా.                               8
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభూః
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదా.                                  9
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా,
కర్పూరవీటికామోదసమాకర్షిదిగంతరా.                                   10  
నిజసల్లాపమాధుర్యవినిర్భర్త్సితకచ్ఛపీ,
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా.                              11
అనాకలితసాదృశ్యచుబుకశ్రీవిరాజితా,
కామేశబద్ధమాంగల్యసూత్రశోభితకంధరా.                             12
కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా,
రత్నగ్రైవేయచింతాకలోలముక్తాఫలాన్వితా.                          13
కామేశ్వరప్రేమరత్నమణిప్రతిపణస్తనీ,
నాభ్యాలవాలరోమాలిలతాఫలకుచద్వయీ.                          14
లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా,
స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా.                               15
అరుణారుణకౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ,
రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా.                             16
కామేశఙ్ఞాతసౌభాగ్యమార్దవోరుద్వయాన్వితా,
మాణిక్యమకుటాకారజానుద్వయవిరాజితా.                          17
ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణాభజంఘికా,
గూఢగుల్ఫా కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా.                      18
నఖదీధితిసంఛన్ననమజ్జనతమోగుణా,
పదద్వయప్రభాజాలపరాకృతసరోరుహా.                              19
శింజానమణిమంజీరమండితశ్రీపదాంబుజా,
మరాళీమందగమనా మహాలావణ్యశేవధిః .                         20
సర్వారుణా 2నవద్యాంగీ సర్వాభరణభూషితా,
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీనవల్లభా.                          21
సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా,
చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థితా.                       22
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ,
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ.                        23
దేవర్షిగణసంఘాతాస్తూయమానాత్మవైభవా,
భండాసురవధోద్యుక్తశక్తిసేనాసమనన్వితా.                           24
సంపత్కరీ సమారూఢసింధురవ్రజసేవితా,
అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటికోటిభిరావృతా.                            25
చక్రరాజరధారూఢసర్వాయుధాపరిష్కృతా,
గేయచక్రరథారూఢమంత్రిణీపరిసేవితా.                              26
కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా,
జ్వాలామాలినికాక్షిప్తవహ్నిప్రాకారమధ్యగా.                        27
భండసైన్యవధోద్యుక్తశక్తివిక్రమహర్షితా,
నిత్యా పరాక్రమాటోపనిరీక్షణసముత్సుకా.                        28
భండపుత్రవధోద్యుక్తబాలావిక్రమనందితా,
మంత్రిణ్యంబావిరచితవిషంగవధతోషితా.                           29
విశుక్రప్రాణహరణావారాహీవీర్యనందితా,
కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణేశ్వరా.                           30
మహాగణేశనిర్భిన్నవిఘ్నయంత్రప్రహర్షితా,
భండాసురేంద్రనిర్ముక్తశస్త్రప్రత్యస్త్రవర్షిణీ.                            31
కరాంగుళినఖోత్పన్ననారాయణదశాకృతిః ,
మహాపాశుపతాస్త్రాగ్నినిర్దగ్ధాసురసైనికా.                          32
కామేశ్వరాస్త్రనిర్దగ్ధసభండాసురశూన్యకా,
బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా.                    33

హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః ,
శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖపంకజా.                     34
కంఠాధఃకటిపర్యంతమధ్యకూటస్వరూపిణీ,
శక్తికూటైకతాపన్నకట్యధోభాగధారిణీ.                             35
మూలమంత్రాత్మికా మూలకూటత్రయకలేబరా,
కులామృతైకరసికా కులసంకేతపాలినీ.                           36
కులాంగనా కులాంతస్థా కౌలినీ కులయోగినీ,
అకులా సమయాంతస్థా సమయాచారతత్పరా.                  37
మూలాధారైకనిలయా బ్రహ్మగ్రంధివిభేధినీ,
మణిపూరాంతరుదితా విష్ణుగ్రంథివిభేదినీ.                        38
ఆఙ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంథివిభేధినీ,
సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణీ.                      39

తటిల్లతాసమరుచిష్షట్చక్రోపరిసంస్థితా,
మహాసక్తిః కుండలినీ బిసతంతుతనీయసీ.                       40
భవానీ భావనాగమ్యా భవారణ్యకుఠారికా,
భద్రప్రియా భద్రమూర్తిర్భక్తసౌభాగ్యదాయినీ.                      41
భక్తిప్రియా భక్తిగమ్యా భక్తివశ్యా భయాపహా,
శాంభవీ శారదారాధ్యా శర్వాణీ శర్మదాయినీ.                    42
శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరచ్చంద్రనిభాననా,
శాతోదరీ శాంతిమతీ నిరాధారా నిరంజనా.                       43
నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా,
నిర్గుణా నిష్కలా శాంతా నిష్కామా నిరుపప్లవా.                44


నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయా,
నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతరా.                     45
నిష్కారణా నిష్కలంకా నిరుపాధిర్నిరీశ్వరా,
నీరాగా రాగమధనీ నిర్మదా మదనాశినీ.                        46
నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాశినీ,
నిర్మమా మమతాహంత్రీ నిష్పాప పాపనాశినీ.                 47
నిష్క్రోధా క్రోధశమనీ నిర్లోభా లోభనాశినీ,
నిస్సంశయా సంశయఘ్నీ నిర్భవా భవనాశినీ.               48
నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశినీ,
నిర్నాశా మృత్యుమథనీ నిష్క్రియా నిష్పరిగ్రహా.               49

నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయా,
దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా.               50
దుష్ఠదూరా దురాచారశమనీ దోషవర్జితా,
సర్వఙ్ఞా సాంద్రకరుణా సమానాధికవర్జితా.                    51
సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా,
సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణీ.              52
సర్వయంత్రాత్మికా సర్వతంత్రరూపా మనోన్మనీ,
మాహేశ్వరీ మహాదేవీ మహాలక్ష్మీర్మృడప్రియా.             53
మహారూపా మహాపూజ్యా మహాపాతకనాశినీ
మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతిః.            54
మహాభోగా మహైశ్వర్యా మహావీర్యా మహాబలా,
మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరశ్వరీ.                  55
మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసనా,
మహాయాగక్రమారాధ్యా మహాభైరవపూజితా.                   56
మహేశ్వరమహాకల్పమహాతాండవసాక్షిణీ,
మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ.                     57
చతుష్షష్ఠ్యుపచారాఢ్యా చతుష్షష్ఠికలామయీ,
మహాచతుష్షష్టికోటియోగినీగణసేవితా.                          58
మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా,
చారురూపా చారుహాసా చారుచంద్రకలాధరా.                   59
చరాచర జగన్నాధా చక్రరాజనికేతనా,
పార్వతీ పద్మనయనా పద్మరాగసమప్రభా.                     60
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణీ,
చిన్మయీ పరమానందా విఙ్ఙానఘనరూపిణీ.                   61
ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మవివర్జితా,
విశ్వరూపా జాగరిణీ స్వపంతీ తైజసాత్మికా.                    62
సుప్తా ప్రాఙ్ఞాత్మికా తుర్యా సర్వావస్థావివర్జితా,
సృష్ఠికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ.                    63
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ,
సదాశివానుగ్రహాదా పంచకృత్యపరాయణా.                    64
భానుమండలమధ్యస్థా భైరవీ భగమాలినీ,
పద్మాసనా భగవతీ పద్మనాభసహోదరీ.                     65
ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః ,
సహస్రశీర్షవదనా సహసస్రాక్షీసహస్రపాత్.                      66
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయినీ,
నిజాఙ్ఞారూపనిగమా పుణ్యాపుణ్యఫలప్రదా.                   67
శ్రుతిశీమంతసిందూరీకృతపాదాబ్జధూళికా,
సకలాగమసందోహశుక్తిసంపుటమౌక్తికా.                     68
పురుషార్ధప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ,
అంబికా2నాధినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా.                  69
నారాయణీ నాదరూపా నామరూపవివర్జితా,
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదేయవర్జితా.           70
రాజరాజార్చితా రాఙ్ఞీ రమ్యా రాజీవలోచనా,
రంజనీ రమణీ రస్యా రణత్కింకిణిమేఖలా.                   71
రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా,
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణలంపటా.                 72
కామ్యా కామకలారూపా కదంబకుసుమప్రియా,
కల్యాణీ జగతీకందా కరుణారససాగరా.                     73
కలావతీ కలాలాపా కాంతా కాదంబరీప్రియా,
వరదా వామనయనా వారుణీమదవిహ్వలా.              74
విశ్వాధికా వేదవేద్యా వింద్యాచలనివాసనీ,
విధాత్రీ వేదజననీ విష్ణుమాయావిలాసినీ.                 75
క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్రక్షేత్రఙ్ఞపాలినీ,
క్షయవృద్ధివినిర్ముక్తా క్షేత్రపాలసమర్చితా.                 76
విజయా విమలా వన్ద్యా వందారుజనవత్సలా,
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండలవాసినీ.               77
భక్తిమత్కల్పలతికా  పశుపాశవిమోచినీ,
సంహృతాశేషపాషండా సదాచారప్రవర్తికా.                 78


తాపత్రయాగ్నిసంతప్తసమాహ్లాదనచంద్రికా,
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా.             79
చితిస్తత్పదలక్ష్యార్థా చిదేకరసరూపిణీ,
స్వాత్మానందలవీభూతబ్రహ్మాద్యానందసంతతిః .           80
పరా ప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా,
మధ్యమా వైఖరీరూపా భక్తమానసహంసికా.               81
కామేశ్వరప్రాణనాడీ కృతఙ్ఞా కామపూజితా,
శృంగారససంపూర్ణా జయా జాలంధరస్థితా.                 82
ఓడ్యాణపీఠనిలయా బిందుమండలవాసినీ,
రహోయాగక్రమారాధ్యా రహస్తర్పణతర్పితా.               83
సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా,
షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా.                84
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణసుఖదాయినీ,
నిత్యా షోడశికారూపా శ్రీకంఠార్ధశరీరిణీ.                     85
ప్రభావతీ ప్రభారూపా ప్రసిధ్దా పరమేశ్వరీ,
మూలప్రకృతిరవ్యక్తా వ్యక్తావ్యక్తస్వరూపిణీ.                 86
వ్యాపినీ వివిధాకారా విద్యా2విద్యా స్వరూపిణీ,
మహాకామేశనయనకుముదాహ్లాదకౌముదీ.               87
భక్తహార్దతమోభేదభానుమద్భానుసంతతిః ,
శివదూతీ శివారాధ్యా శివమూర్తిశ్శివంకరీ.                 88
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా,
అప్రమేయా స్వప్రకాశా  మనోవాచామగోచరా.             89
చిచ్ఛక్తిశ్చేతనారూపా జడశక్తిర్జడాత్మికా,
గాయత్రీ వ్యాహృతిస్సంధ్యా ద్విజబృందనిషేవితా.         90
తత్త్వాసనా తత్త్వమయీ పంచకోశాంతరస్థితా,
నిస్సీమమహిమా నిత్యయౌవ్వనా మదశాలినీ.          91
మదఘూర్ణితరక్తాక్షీ మదపాటలగండభూః,
చందనద్రవదిగ్ధాంగీ  చాంపేయకుసుమప్రియా.           92
కుశలా కోమలాకారా కురుకుల్లా కులేశ్వరీ,
కులకుండాలయా కౌలమార్గతత్పరసేవితా.               93
కుమారగణనాథాంబా తుష్టిః  పుష్టిర్మతిర్ధృతిః ,
శాంతిస్స్వస్తిమతీ కాంతిర్నందినీ విఘ్ననాశినీ.          94
తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ,
మాలినీ హంసినీ మాతా మలయాచలవాసినీ.           95
సుముఖీ నళినీ సుభ్రూః శోభనా సురనాయికా,
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ.             96
వజ్రేశ్వరీ వామదేవీ వయోవస్థావివర్జితా,
సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్వినీ.              97
విశుద్ధ చక్రనిలయా22రక్తవర్ణా త్రిలోచనా,
ఖట్వాంగాదిప్రహరణా వదనైకసమన్వితా.                98
పాయసాన్నప్రియా త్వక్ స్థా పశులోకభయంకరీ,
అమృతాదిమహాశక్తిసంవృతా డాకినీశ్వరీ.                 99
అనాహతాబ్జనిలయా శ్యామాభా వదనద్వయా,
దంష్ట్రోజ్జ్వలా2క్షమాలాదిధరా రుధిరసంస్థితా.             100
కాళరాత్య్రాదిశక్త్యౌఘవృతా స్నిగ్ధౌదనప్రియా,
మహావీరేంద్రవరదా రాకిణ్యంబాస్వరూపిణీ.               101
మణిపూరాబ్జనిలయా వదనత్రయసంయుతా,
వజ్రాదికాయుధోపేతా డామర్యాదిభిరావృతా.              102
రక్తవర్ణా మాంసనిష్ఠా గుడాన్నప్రీతమానసా,
సమస్తభక్తసుఖదా లాకిణ్యంబాస్వరూపిణీ.              103
స్వాధిష్ఠానాంబుజగతా చతుర్వక్త్రమనోహరా,
శూలాద్యాయుధసంపన్నా పీతవర్ణా2తిగర్వితా.        104
మేధోనిష్టా మధుప్రీతా బంధిన్యాదిసమన్వితా,
దధ్యన్నాసక్తహృదయా కాకిణీరూపధారిణీ.               105
మూలాధారాంబుజారూఢా పంచవక్త్రా2స్థిసంస్థితా,
అంకుశాదిప్రహరణా వరదాదినిషేవితా.                   106
ముద్గౌదనాసక్తచిత్తా సాకిన్యంబాస్వరూపిణీ,
ఆఙ్ఞాచక్రాబ్జనిలయా శుక్లవర్ణా షడాననా.                107
మజ్జాసంస్థా హంసవతీముఖ్యశక్తిసమన్వితా,
హరిద్రాన్నైకరసికా హాకినీరూపధారిణీ.                   108
సహస్రదళపద్మస్ధా సర్వవర్ణోపశోభితా,
సర్వాయుధధరా శుక్లసంస్థితా సర్వతోముఖీ.          109
సర్వౌదనప్రీతచిత్తా యాకిన్యంబాస్వరూపిణీ,
స్వాహా స్వధామతిర్మేధాశ్రుతిః స్మృతిరనుత్తమా.       110
పుణ్యకీర్తిః  పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా,
పులోమజార్చితా బంధమోచనీ బర్బరాలకా.           111
విమర్శరూపిణీ విద్యా వియదాదిజగత్ప్రసూః ,
సర్వవ్యాధిప్రశమనీ సర్వమృత్యునివారిణీ.              112
అగ్రగణ్యా2చింత్యరూపా కలికల్మషనాశినీ,
కాత్యాయనీ కాలహంత్రీ కమలాక్షనిషేవితా.             113
తాంబూలపూరితముఖీ దాడిమీకుసుమప్రభా,
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ.     114
నిత్యతృప్తా భక్తనిధిర్నియంత్రీ నిఖిలేశ్వరీ,
మైత్య్రాదివాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ.            115
పరాశక్తి పరానిష్ఠా ప్రఙ్ఞానఘనరూపిణీ,
మాధ్వీపానాలసా మత్తా మాతృకావర్ణరూపిణీ.         116
మహాకైలాసనిలయా మృణాలమృదుదోర్లతా,

మహనీయా దయామూర్తిర్మహాసామ్రాజ్యశాలినీ.      117
ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా,
శ్రీషోడశాక్షరీవిద్యా త్రికూటా కామాకోటికా.             118
కటాక్షకింకరీభూతకమలాకోటిసేవితా,
శిరఃస్థితా చంద్రనిభా బాలస్థేంద్రధనుఃప్రభా             119
హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతరదీపికా,
దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయఙ్ఞవినాశినీ.           120
దరాందోళితదీర్గాక్షీ దరహాసోజ్జ్వలన్ముఖీ,
గురుమూర్తిర్గుణనిధిర్గోమాతా గుహజన్మభూః        121
దేవేశీ దండనీతిస్థా దహరాకాశరూపిణీ,
ప్రతిపన్ముఖ్యరాకాంతతిధిమండలపూజితా.          122
కలాత్మికా కలానాధా కావ్యాలాపవినోదినీ,
సచామరరమావాణీసవ్యదక్షిణసేవితా.                123
ఆదిశక్తిరమేయాత్మా22 పరమా పావనాకృతిః ,
అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా.                124
క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్యపదదాయినీ,
త్రిపురా త్రిజగద్వంద్యా త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ.           125
త్ర్యక్షరీ దివ్యగంధాఢ్యా సిందూరతిలకాంచితా,
ఉమా శైలేంద్రతనయా గౌరీ గంధర్వసేవితా.         126
విశ్వగర్భా స్వర్ణగర్భా2వరదా వాగధీశ్వరీ,
ధ్యానగమ్యా2పరిచ్ఛేద్యా  ఙ్ఞానదా ఙ్ఞానవిగ్రహా.               127
సర్వవేదాంతసంవేద్యా సత్యానందస్వరూపిణీ,
లోపాముద్రార్చితా లీలాక్లుప్తబ్రహ్మాండమండలా.             128
అదృశ్యా దృశ్యరహితా విఙ్ఞాత్రీ వేద్యవర్జితా,
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా.     129
ఇచ్ఛాశక్తిఙ్ఞానశక్తిక్రియాశక్తిస్వరూపిణీ. 
సర్వాధారా సుప్రతిష్ఠీ సదసద్రూపధారినీ                     130         
అష్టమూర్తిరజాజైత్రీ లోకయాత్రావిధాయినీ,
ఏకాకినీ భూమరూపా నిర్ద్వైతా ద్వైతవర్జితా.                   131
అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్యస్వరూపిణీ,
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మానందా బలిప్రియా            132
భాషారూపా బృహత్సేనా భావాభావవివర్జితా,
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః .                   133
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా,
రాజత్కృపా రాజపీఠనివేశితనిజాశ్రితా.                         134
రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలేశ్వరీ,
సామ్రాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖలా.                135
దీక్షితా దైత్యశమనీ సర్వలోకవశంకరీ,
సర్వార్థదాత్రీ సావిత్రీ సచ్చిదానందరూపిణీ.                    136
దేశకాలపరీచ్ఛిన్నా సర్వగా సర్వమోహినీ,
సరస్వతీ శాస్త్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ.              137
సర్వోపాధివినిర్ముక్తా సదాశివ పతివ్రతా,
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండలరూపిణీ.                138
కులోత్తీర్ణా భగారాధ్యా మాయా మధుమతీ మహీ,
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా.             139
స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణామూర్తిరూపిణీ,
సనకాదిసమారాధ్యా శివఙ్ఞానప్రదాయినీ.                       140
చిత్కలా22నందకలికా ప్రేమరూపా ప్రియంకరీ,
నామపారాయణప్రీతా నందివిద్యా నటేశ్వరీ,                    141
మిథ్యాజగదధిష్ఠానా ముక్దిదా ముక్తిరూపిణీ,
లాస్యప్రియా లయకరీ లజ్జా రంభాదివందితా.                  142
భవదావసుధావృష్ఠిః పాపారణ్యదవానలా,
దౌర్భాగ్యతూలవాతూలా జరాధ్వాంతరవిప్రభా.                143
భాగ్యాబ్ధిచంద్రికా భక్తచిత్తకేకిఘనాఘనా,
రోగపర్వతధంభోలిర్మృత్యుదారుకుఠారికా.                       144
మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసనా,
అపర్ణా చండికా చండముండాసురనిషూదనీ.                  145
క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ,
త్రివర్గదాత్రీ సుభగా త్య్రంబకా త్రిగుణాత్మికా.                    146
స్వర్గాపవర్గదా శుద్ధా జపాపుష్పనిభాకృతిః ,
ఓజోవతీ ద్యుతిధరా యఙ్ఞరూపా ప్రియవ్రతా.                   147
దురారాధ్యా దురాదర్షా పాటలీకుసుమప్రియా,
మహతీ మేరునిలయా మందారకుసుమప్రియా.              148
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ,
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ.                   149
మార్తాండభైరవారాధ్యా మంత్రిణీన్యస్తరాజ్యధూః ,
త్రిపురేశీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా                     150
సత్యఙ్ఞానానందరూపా సామరస్యపరాయణా,
కపర్ధినీ కలామాలా కామధుక్కామరూపిణీ.                  151
కలానిధిః కావ్యకలా రసఙ్ఙా రససేవధిః ,
పుష్ఠా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణా.            152
పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా,
పాశహస్తా పాశహంత్రీ పరమంత్రవిభేధినీ.                     153
మూర్తా2మూర్తా2నిత్యతృప్తామునిమానసహంసికా,
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామిణీ సతీ.                154
బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుదార్చితా,
ప్రసవిత్రీ ప్రచండా22ఙ్ఞా ప్రతిష్ఠా ప్రకటాకృతిః .                   155
ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠ రూపిణీ,
విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వియత్ప్రసూః.                156
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ,
భావఙ్ఞా భవరోగఘ్నీ భవచక్రప్రవర్తినీ.                          157
చంధస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ,
ఉదారకీర్తిరుద్దామవైభవా వర్ణరూపిణీ.                          158
జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ,
సర్వోపనిషదుద్ఘుష్ఠా శాంత్యతీతకలాత్మికా.                    159
గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా,
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా.                  160
కార్యకారణనిర్ముక్తా కామకేళితరంగితా,
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ.                         161
అజా క్షయవినిర్ముక్తా ముగ్ధా క్షిప్రప్రసాదినీ,
అంతర్ముఖసమారాధ్యా బహిర్ముఖసుదుర్లభా.               162
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రిపురమాలినీ,
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధా సృతిః.        163
సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా,
యఙ్ఞప్రియా యఙ్ఞకర్త్రీ యజమానస్వరూపిణీ.                164
ధర్మాధారా ధనాధ్యక్షా ధనధాన్యవివర్ధినీ,
విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణీ.                     165
విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ,
అయోనిర్యోనినిలయా కూటస్థా కులరూపిణీ.                 166
వీరగోష్ఠీప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ,
విఙ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా.                     167
తత్త్వాధికా తత్త్వమయీ తత్త్వమర్ధస్వరూపిణీ,
సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబినీ.               168
సవ్యాపసవ్యమార్గస్థా సర్వాపద్వినివారిణీ,
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా.                 169
చైతన్యార్ఘ్యసమారాధ్యా చైతన్యకుసుమప్రియా,
సదోదితా సదాతుష్ఠా తరుణాదిత్యపాటలా.                     170
దక్షిణాదక్షిణారాధ్యా ధరస్మేరముఖాంబుజా,
కౌలినీ కేవలా2నర్ఘ్యకైవల్యపదదాయినీ.                         171
స్తోత్రప్రియా స్తుతిమతీ శృతిసంస్తుతవైభవా,
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః.                   172
విశ్వమాతా జగద్ధాత్రీ విశాలాక్షీ విరాగిణీ,
ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ.                173

వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ,
పంచయఙ్ఞప్రియా పంచప్రేతా మంచాధిశాయినీ.                 174
పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ,
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ.                  175
ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ,
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా.                    176
బంధూకకుసుమప్రఖ్యా బాలా లీలావినోదినీ,
సుమంగలీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ.                     177
సువాసిన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా,
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా.                178
దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరీ,
ఙ్ఞానముద్రా ఙ్ఞానగమ్యా ఙ్ఞానఙ్ఞేయస్వరూపిణీ.                   179
యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా,
అనఘా2ద్భుతచారిత్రా వాంఛితార్ధప్రదాయినీ.                   180
అభ్యాసాతిశయఙ్ఞాతా షడధ్వాతీతరూపిణీ,
అవ్యాజకరుణామూర్తిరఙ్ఞానధ్వాంతదీపికా                        181
ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘ్యశాసనా,
శ్రీచక్రరాజనిలయా శ్రీమత్త్రిపురసుందరీ.                           182

శ్రీశివా శివశక్త్యైకరూపిణీ లలితాంబికా,  ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రకం జగుః
    ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే, ఉత్తర ఖండే, శ్రీ హయగ్రీవాగస్త్య సంవాదే వ్రీ లలితా సహస్ర నామ
స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యయః
ఓం ఐం –హ్రీం – శ్రీం –ఐం - క్లీం –సౌః – క్లీం – ఐం

           (    టైపు చేసినది :  నా జీవన సహచరి శ్రీమతి పంతుల విజయ లక్ష్మి  )
                                    -------       -------      -------


,














22, ఏప్రిల్ 2014, మంగళవారం

మా తెల్లావు కథ ...... కథా మంజరి 400 వ టపా ...



ఇది కథా మంజరి 400వ టపా.

ముందుగా , ఈ కథా మంజరి బ్లాగును డిజైన్ చేసి. ఓపికగా చాలా సూచనలు చేసి, సాంకేతికాంశాలను తెలియజేసిన జ్యోతి వలభోజు గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియ జేస్తున్నాను.

అలాగే, నాకు కంప్యూటరు ఉపయోగంలోని మరి కొంత సాంకేతిక పరిఙ్ఞానాన్ని అందించిన మా సుధారాణి కి  కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను.

ఇప్పుడీ కథా మంజరి 400వ టపాగా మా తెల్లావు కథ రాస్తున్నందుకు

నాకు చాలా సంతోషంగా ఉంది... అదే సమయంలో ఎంతో విచారంగానూ ఉంది ...

కథా మంజరి మీద ఒట్టేసి చెబుతున్నాను. అంతా నిజమే చెబుతాను. అబద్ధం చెప్పను.

అప్పటి శ్రీకాకుళం జిల్లా, ఇప్పటి విజయ నగరం జిల్లా లో ఉన్న పార్వతీపురం మా ఊరు. పార్వతీపురం కుట్ర కేసుతో మా ఊరి పేరు దేశమంతా తెలిసిపోయింది.

ఇరుకిరుకు సందులూ, చెత్తా చెదరాం, రోడ్ల మీద పొర్లే మురికి కాలువలూ, ఏలిన వారి దయ వల్ల , ఇవాళకీ దాదాపు మా ఊరు అలాగే ఉంది.

ఊర్లో మావీధి పేరు కంచరి వీధి. కంచర్లు ఎక్కువ కుటుంబాలు ఉండడంతో ఆ పేరొచ్చింది.. ఇత్తడి బిందెలూ, కంచాలూ, గిన్నెలూ, గ్లాసులూ మొదలయినవి తయారు చేస్తూ ఉంటారు కంచర్లు. ఇప్పటికీ దేవుడి సింహాసనాల తయారీకి మా పార్వతీపురం కంచర్లే ప్రసిద్ధి. ఎక్క డెక్కడి నుండో జనాలు వచ్చి ఇక్కడ దేవుడి సింహాసనాలు ఆర్డరు మీద చేయించుకుని పట్టు కెళుతూ ఉంటారు.

కంచరి వీధిలో మాది పెద్ద లోగిలి. తాత గారు జోగయ్య పంతులు. మా వీధిలో మా ఇంటికి చాలా పేరుంది. నవ్య సంపాదకులు జగన్నాథ శర్మ గారు అగ్రహారం కథల్లో రాసిన‘‘ జోగారావు గారి మేడ ’’ మా లోగిలి గురించే.

వీధికి ఈ కొస నుండి ఆ చివర కూ కూరాకుల మడుల వరకూ వ్యాపించిన ఇల్లు మాది.

ఆ చివర ఉండేది. పశువు శాల. బాల్యంలోచాలా రోజులు , ముఖ్యంగా వేసవి శలవులలో నేను అక్కడే గడిపే వాడిని. శాల అటక మీద నెలా రెండు నెలలకి పరిపడా ఎండుగడ్డి ఉండేది. ఆ వాసన నాకిష్టంగా ఉండేది. ఊర్లోకి టీకాలు వేసే వాళ్ళొచ్చి నప్పుడు భయపడి దాక్కోడానికీ, ఇంట్లో అలిగి నప్పుడు నిరసన తెలియ జేయడానికీ అదే నాకు అనువైన చోటు. సురక్షిత ప్రదేశం !

మా పశువుల శాలలో మా తెల్లావు రావడానికి ముందు ఒకటి రెండు గేదెలు ఉండేవని అంటారు. నాకు తెలియదు. నా చిన్నప్పుడు నేను శాలలో చూసినది మా తెల్లావునీ, దాని దూడనీ ... తెల్లావు పెయ్యి మాత్రం ముదురు గోధుమ రంగులో ఉండేది.

‘‘ నువ్వేంటే, మీ అమ్మలాగా తెల్లగా లేవూ ? ’’ అనడిగే వాడిని దాని చెవిలో. ఓ సారి మా చిన్నాన్న దాని చెవిలో నేనిలా అనడం చూసి, తెగ నవ్వుకుని ఇంట్లో అందరికీ చెప్పి నా పరువు తీసాడు.

తెల్లావు అంటే, తెల్లావే ! ఎక్కడా ఒంటి మీద ఒక్క మచ్చ కనిపించేది కాదు.‘‘ మచ్చ లేని మంచావు మా తెల్లావు ! ’’ అంటూ నా చిన్నప్పుడు గర్వంగా కవిత్వం అల్లే వాడిని కూడా.

మా తెల్లావు ఎంత మంచి దంటే, ఏనాడూ ఏ ఒక్కరి మీది కొమ్ములు ఎగరేసి ఎరుగదు.

ఉదయాన్నే మేతకి వెళ్ళి, సాయంత్రానికి ఇల్లు చేరేది. వీధి గుమ్మం దగ్గర రెండు కాళ్ళూ వీధి గుమ్మం మొదటి మెట్టు మీద ఆన్చి నిలబడి ‘‘ నేనొచ్చా !’’ అన్నట్టుగా ‘‘ అంబా ’’ అని అరచేది. అప్పుడు దాని నల్లని కాటుక కళ్ళు చూడడం నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఆ వెంటనే

‘‘ మా లచ్చిమి వొచ్చినట్టుందర్రా ... పెరటి సందు తులుపు తెరవండి ..’’ అని మా నాయనమ్మ అచ్చమ్మ గారు ,, నాయి అనే వాళ్ళం, ఆవిడ కేక ఏ వంటింట్లోంచో వినబడేది. ఆసమయంలో మా పిల్లల్లో ఎవరుంటే వాళ్ళం వీధి గుమ్మం దగ్గరకి పరిగెట్టే వాళ్ళం. వీధి మొదటి మెట్టు మీద ముంగాళ్ళతో నిలుచున్న మా తెల్లావు గంగడోలుని ప్రేమగా నిమిరి,

‘‘ పద, పద ... పెరట్టోకి రా !’’ అని మూపు మీద మెల్లగా చరిచే వాళ్ళం. వెంటనే తెల్లావు మెట్టు దిగి, ఇంటి ప్రక్క నున్న పెరటి సందు వేపు తలూపుతూ వెళ్ళేది. మేం పరుగు పరుగున పెరట్లోకి వెళ్ళి గోర్జీ తలుపు తీసి ఉంచేవాళ్ళం. మా ఇంటికీ, మా పక్కింటి గుమ్మా వారింటికీ మధ్య ఉండే గోర్జీ లోంచి అది వేగంగా వచ్చేది.వస్తూనే ఆత్రంగా అప్పటికే సిద్ధం చేసి ఉంచిన కుడితి గోళెంలో మూతి పెట్టి కుడితి తాగేది. పెయ్యి దాని పొదుగు కుమ్ముతూ పాలు తాగేది. ఆ దృశ్యం నా కంటికి అపురూపంగా తోచేది.

మా ఇంట్లో పెద్ద వాళ్ళు రోజూ ఉదయాన్నే నిద్ర లేవగానే కళ్ళు నులుము కుంటూనే పెరట్లో ఆవుల శాల దగ్గరకి వెళ్ళి మా తెల్లావుని నిమురుతూ దానికి దండం పెట్టు కుంటూ ఉండే వారు. నాకూ అదే అలవాటు వొచ్చింది. ఇక ప్రతి శుక్ర వారం, మరింకా పండుగలూ పబ్బాలూ వొచ్చి నప్పుడు మా నాయినమ్మ తెల్లావు కొమ్ములకీ, మెడకీ పసుపు రాసి, కొమ్ముల మధ్య మందార పువ్వులు పెట్టేది.

తెల్లావు ఎన్ని పాలిచ్చేదో నాకచయితే తెలీదు ... కానీ మా ఇంటి వెనుక చావిడీలో పాల గది అని ప్రత్యేకంగా వో గది ఉండేది. ఆ గదిలో ఆగ్నేయ మూల మట్టితో నలుచదరంగా చేసిన పెద్ద పొయ్యి ఉండేది. దాని మీద రోజంతా పెద్ద పాత్రలో పాలు సలసలా కాగుతూనే ఉండేవి. ఆ పాల వాసన కమ్మగా ఇల్లంతా వ్యాపించి గమ్మత్తుగా ఉండేది. సాల గది ముందు పెద్ద వసారా ఉంది. రోజు వారీ వంటలు అక్కడ చేయక పోయినా, ప్రత్యేకంగా పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం ఆ వసారాలోనే చేసే వారు. పెళ్ళి వంటల వసారా అనే వాళ్ళం దానిని.

మా తెల్లావు ఙ్ఞాపకాలలో ఇవి కొన్ని తీపి గుర్తులయితే ...

ఇక మా తెల్లావు మిగిల్చి పోయిన విషాదం గురించి చెప్పడానికి మాటలు రావడం లేదు ..

అరవై ప్రాంతాలవి. అక్కయ్య పెళ్ళి. వీధి లోనూ, వాకిలి లోనూ పదింళ్ళు వేసారు. మధ్య వాకిలిలో పెద్ద రంగు రంగుల చాందినీలు కట్టారు. ఇల్లంతా చుట్టాలో నిండి పోయింది. అప్పటికి నాకు పదేళ్ళ వయసు. సందడంతా మా పిల్లలదే. పెళ్ళికి వారం ముందుగానే చుట్టాలంతా వచ్చేరు. వంటల వసారాలో మా సూరీడత్త పర్యవేక్షనలో అరిసెల వంటకం గుమ గుమలాడి పోతోంది. నిజం చెప్పాలంటే, అక్కయ్య పెళ్ళిలో నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న అంశాలు రెండే.

ఒకటి, - పెళ్ళిలో పెళ్ళి వారికి వడ్డనలో వేసేందుకుగాను మా తోట నుండి వచ్చిన మామిడి కాయలని మా ఇంటి ఎదురుగా ఉండే స్థలంలో

( అదీ మాదే ) ఉండే కొట్టు గదిలో మగ్గ పెట్టడం. పెళ్ళి రోజు నాటికి మామిడి పళ్ళు బాగా మగ్గి , వీధి వీధంతా మామిడి పళ్ళ వాసనతో నిండి పోయేది. ఆ కొట్టు గదిలో పెళ్ళి కోసం వందలాది కాయలని మగ్గ పెట్టేరేమో, మా పెద్దలు ఎవరయినా ఆ గది తలుపులు తెరిచి నప్పుడల్లా, మా పిల్లలం గబాలున లోపలికి చొరబడి తెచ్చుకో గలిగినన్ని పళ్ళని దోసిలి నిండా తెచ్చుకుని పీల్చుకు తినే వాళ్ళం. పెద్దల అభ్యంతరం ఉండేది కాదు.

ఇక, రెండవ ఙ్ఞాపకం ... మా తెల్లావు గురించి. ...

పెళ్ళికి రెణ్ణెళ్ళ ముందే, .మా తెల్లావుని, చూలుకి వచ్చిందని మా రైతులతో పొలానికి పంపించి వేసారు. చూడి పశువులకి మంచి మేత పెట్టి రైతులు అవి ఈనే వరకూ అక్కడే ఉంచి , ఈనేక దూడతోపాటూ తిరిగి మా ఇంటికి తెచ్చి అప్పగించే వారు.

మా అక్క పెళ్ళికి రెండు నెలలకి ముందే రైతులు తెల్లావుని పొలానికి పెయ్యితో పాటూ తోలుకు పోయారు.

మా పొలాలు మా ఇంటికి దాదాపు పది పన్నెండు మైళ్ళ దూరంలో ఉండేవి. అలా వెళ్ళిన ఆవు తిరిగి ఈనేక మాత్రమే ఇంటికి వచ్చేది.

మధ్యలో రావడం అంటూ జరగదు.

ముందే చెప్పాను, అంతా నిజమే రాస్తాను, అబద్ధం రాయనని ...

అక్కయ్య పెళ్ళి రోజున మా ఇంటి వీధి గుమ్మం నుండి తెల్లావు అంబారావం వినబడింది. ఇంట్లో అందరం ఇశ్చర్య పోయేం. పెళ్ళి పనుల కోసం రైతులు రెండు రోజులు ముందే వచ్చేరు.

ఇంత దూరం వెతుక్కుంటూ తెల్లావు ఒక్కటీ ఎలా వచ్చిందో తెలియదు !

మా పెద్దల ఆనందానికి అవధి లేకుండా పోయింది ...

‘‘ సందులూ గొందులూ వెతుక్కుంటూ ఇంత దూరం ఎలా వచ్చిందర్రా ఒక్కర్తీ !’’ అంటూ అంతా ఆశచ్చర్య పోవడమే !

‘‘ పిలవక పోయినా మా మనవరాలి పెళ్ళి చూడాలని వచ్చిందర్రా తల్లి !’’ అంటూ మా నాయనమ్మ తెగ ముచ్చటపడిపోయింది.

వెంటనే తెల్లావుని గోర్జీ లోంచి ఇంటి వెనుక శాలోకి తీసికెళ్ళి, పసుపూ కుంకుమలతో, పూలతో పూజలు చేసారు.

ఇక ఆ రోజంతా పెళ్ళింట్లో తెల్లావు రాక గురించిన కబుర్లే ...

ఆ ఆనందం మాకు ఎన్నో రోజులు మిగల్లేదు ..

అక్కయ్య పెళ్ళయిన రెండో రోజో, మూడో రోజో ... ఏం జరిగిందో కానీ, మా తెల్లావు ఓ ఉదయం వెళ్ళి చూసేసరికి కుప్పగా కూలి పడిపోయి ఉంది.

పెద్దలు గుండె నిబ్బరం చేసుకుని కొంత గుంభనగా ఉన్నా, మా పిల్లలంతా గోలు గోలున ఏడిచాం. మమ్మల్ని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కాలేదు ...

చివరకి మా తాతగారు మమ్మల్ని ఊరుకోమని చెప్పి, ‘‘ మనవరాలి పెళ్ళి చూదామనే వొచ్చింది. చూసింది. వెళ్ళి పోయింది ...పెళ్ళింట ఏడుపు లొద్దు ...వెళ్ళి పోయినా మహాలక్ష్మి దీవెనలు మనకెప్పుడూ ఉంటాయి ...’’ అంటూ మందలించేరు. సరిగ్గా ఇవే కాక పోయినా ఇలాంటివే ఏవో ఓదార్పు మాటలు చెప్పినట్టు నాకు గుర్తు.


అంతే ....

తెల్లావు పోయిన తరువాత మా ఇంట్లో తరతరాలుగా వస్తున్న పశుపోషణ ముగిసి పోయింది.

ఆ తరువాత మరెప్పుడూ ఇంట్లో ఆవుల్ని మేం చూడ లేదు ...

పశువుల శాల కూడా చాన్నాళ్ళు దిక్కు లేని అనాథలా ఉండి, క్రమేపీ ఒక్కో రాటా విరిగి పడగా , చివరకి ఎప్పుడో కూలి పోయింది.

ఇప్పుడా ల్లూ లేదు, ఎప్పుడో అమ్మేసాం ...

తెల్లావు ఙ్ఞాపకం మాత్రం నన్ను ఆబాల్యం వెంటాడుతూనే ఉంది ...

విరిగి పడిన మంచు కొండ చరియలా మా తెల్లావు గుర్తులు ఎప్పటికీ చెరిగిపోయేవి కావు ...


గోవు మా లచ్చిమికి కోటి దండాలు ....








18, ఏప్రిల్ 2014, శుక్రవారం

కుర్చీల కథ



కప్పల కథా, చెప్పుల కథా రాయగా లేనిది కుర్చీల కథ రాస్తేనేం ?

అందుకే ఇప్పుడీ కుర్చీల కథ రాయడం జరుగుతోంది ... అవధరించండి ...

పెద్దలు కురిచీ అనే పదం దేశ్య విశేష్యమని చెబుతారు. కూర్చోడానికి వీలుగా ఉండే ఎత్తయిన పీఠమని నైఘంటుకార్ధం. కుర్చీ అని దీనికి రూపాంతరం కూడా ఉంది. అసలు కంటే కొసరు ముద్దనీ, కురిచీ అనే పదం కంటే కుర్చీ అనేదే బాగా వాడుకలోకి వచ్చింది.



సరే, ఏదయితేనేం, డబ్బూ దస్కం, నీతి నియమాలూ, మనుషుల నడుమ ప్రేమాభిమానాలూ, ... ఇలా ఏవి లేక పోయినా, కనీసం కూర్చోడానికి వో కుర్చీ అంటూ లేని కొంప ఎక్కడా ఉంటుందనుకోను.

కుర్చీ మర్యాదకి చిహ్నం. ఆతిథ్యానికి ఆనవాలు. స్వాగత వచనానికి మారు పేరు. కాసేపు సేద దీరడానికి అనువైన ఉపకరణం. విశ్రమించడమే కాదు, కాలు మీద కాలు వేసుకుని కాస్త దర్పం ఒలకబోయడానికి కూడా తగినది కుర్చీయే కదా !

చెక్క బల్ల, పీట, స్టూలు మొదలయినవి కూడా కూర్చునేసాధనాలే. ఇలాంటివన్నీ కుర్చీలకి తమ్ముళ్ళు అనొచ్చు. చిన్న చిన్న కాకా హొటళ్ళలో కూర్చోడానికి కుర్చీలకు బదులు బల్లలే వేస్తారు. పోతే, సోఫాలూ అవీ మామూలు కుర్చీలకి పెద్దన్నలు. మహా రాజా కుర్చీలయితే మరీనూ, అవి కుర్చీల కుల పెద్దలు.

‘‘ కూర్చుండ మా యింట కురిచీలు లేవు ,,,’’ అంటారు కరుణ శ్రీ. మరీ చోద్యం కాక పోతే కనీసం వో పాత కాలపు ఇనప కుర్చీ అయినా ఉండి ఉండదా ?

వో సంగతి గర్తుకొచ్చింది. చెబుతా వినండి. కరుణశ్రీ గారు మా విజీనారం సంస్కృత కాలేజీకి వచ్చి నప్పటి సంగతి. వారు మాట్లాడుతూ వో సంగతి చెప్పారు. కొంత మంది కాలేజీ అమ్మాయిలు ఓ సారి వారింటికి వచ్చేరుట. అందులో వో గడుగ్గాయి కవి గారితో ‘‘ ఏఁవండీ ... మీ ఇంట్లో ఇన్ని కుర్చీ లున్నాయి కదా ... మరి

‘ కూర్చండ మా ఇంట కురిచీలు లేవు ! ’ అని రాసేరేఁవిటండీ అబద్ధం కాదూ ? ’’ అని అడిగిందిట. కవిగారు వెంటనే ‘‘ అమ్మాయీ, అది కవిత్వం. కుర్చీలు లేవంటే లేవని కాదు దానర్ధం. ఆ స్వామి కూచోడానికి తగిన చోటులు కురిచీలు కావు... అందుకే నా హృదయాంకమే సిద్ధ పరచ నుంటి అని చెప్పారుట.ఈ విరణ ఆ అమ్మాయికి  ఏమర్ధ మయిందో కానీ ‘‘సరే లెండి ఇంకెప్పుడూ అబద్ధాలు రాయకండి’’ అందిట. అంతే సభలో నవ్వులే నవ్వులు ! చప్పట్లే చప్పట్లు ! ...



‘‘ కుర్చీలు విరిగి పోతే కూర్చోడం మాన నట్లు ...’’ అంటూ శ్రీ .శ్రీ  వో గేయంలో  కుర్చీల  ప్రస్తావన తెచ్చాడు. అగ్గి పుల్లనీ. సబ్బు బిళ్ళనీ వదలని కవి కుర్చీల మాట ఎత్తాడంటే అబ్బుర మేముంది లెండి ?

మీకు తెలిసిన పద్యమే ...

కనకపు సింహాసనమున
శునకము కూర్చుండ బెట్టి శుభ లగ్నమునన్
ఒనరగ పట్టము గట్టిన
వెనుకటి గుణ మేల మాను ? వినరా సుమతీ !

కుక్కని  బంగారు గద్దె మీద కూర్చో పెట్టినా, అది దాని ముందటి  నీచ గుణం మార్చుకోదు ...

థూర్జటి కవి ఒక పద్యంలో ‘‘ ఒకరిం జంపి పదస్థులై బ్రదుక నొక్కొక్కరూహింతు రేలకో ...’’ అంటూ ఆశ్చర్య పోయాడు. అంటే, ఒకడిని పదవి నుండి కిందకి లాగేసి, ఆ పదవి తాను దక్కించు కోవాలని ఒక్కొక్కడు ఎందుకో అనుకుంటాడు. అంటే, ఒకడిని వాడి కురిచీ మీద నుండి లాగీసి తాను ఆ కుర్చీ మీదకి ఎక్కడమే కదా ఎందుకో ఈ తాపత్రయం ... ‘‘తామెన్నడు చావరో ? తమకు లేదో మృతి ?’’ అని కూడా అడుగుతాడు కవి.

అదీ కుర్చీ మహిమ ! ప్రతి వాడికీ కుర్చీ కావాలి. అంటే పదవి కావాలి. నిన్నటి వరకూ టీ డబ్బులకి టికాణా లేని నిరుద్యోగి ఉద్యోగం రాగానే కుర్చీకి అతుక్కు పోయి దర్జా వెలిగిస్తాడు. రాజకీయ నాయకులూ అంతే. పదవి వచ్చే వరకూ కాళ్ళూ గడ్డమూ పట్టు కుంటారు. గద్దె నెక్కాక మరి పట్టించుకోరు.

భరతుడు శ్రీరామపాదుకలను సింహాసనం మీద ఉంచి రాజ్యపాలన చేసాడని రామాయణ గాథ. అంటే కుర్చీ మీదే కదా ? రామపాదుకలను వహించిన ఆ కుర్చీ భాగ్యమే భాగ్యం ...

తన కుర్చీని కాపాడు కోడానికే కదా ఇంద్రుడంతటి వాడు  తపోధనుల దగ్గరకి రంభా, మేనకా మొదలయిన దేవ వేశ్యలను పంపిస్తాడు ?



కుర్చీ కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయో, ఎంత మారణ హోమం జరిగిందో లెక్క లేదు. గతమంతా తడిసె రక్తమున. కాకుంటే కన్నీళులతో .  ఒకప్పుడు మనిళ్ళలో గాడ్రెజ్ కుర్చీలని ఇనుప కుర్చీలు తెగ కనిపించేవి. ప్టాస్టిక్ యుగం మొదలయ్యేక మరుగున పడి పోయేయి..

కూర్చునేందుకు వీలుగా వాడే వన్నీ కుర్చీలే అయినా, కుర్చీల పెద్దన్నలది మరో దారి. సోఫాల పేరుతో వ్యవహరించ బడే వారి దర్జాయే వేరు. వాటిలో మళ్ళీ కుషన్ సోఫాలు మరీ ప్రత్యేకం. సగం ఇంటిని అవే ఆక్ర మిస్తాయి. పెద్ద పెద్ద ఇళ్ళలో అయితే ఫరవా లేదు కానీ, చిన్న కొంపల్లో కూడా దర్జా వెలగ బెట్టడం కోసం పెద్ద పెద్ద సోఫాలు ఇరుగ్గా ఇరకాటంగా కనిపిస్తూ ఉండడం చూస్తుంటాం.. ఆధిక్య ప్రదర్శనకి అదో సద్ధతి మరి ...




సన్మాన సభల్లోనూ, వివాహ వేడుకల్లోనూ ప్రత్యేకంగా ఉపయోగించేవి మహారాజా కుర్చీలు. ఇవి వెనుకటి రోజుల్లో రాజుల సింహాసనాల్లా గొప్ప హోష్ గా ఉంటాయి.


కృష్ణ దేవరాయల వారి సభా భవనంలో ఎనిమిది కుర్చీలను ప్రత్యేకంగా వేసే వారు. అందులో అష్ట దిగ్గజకవులు ఆసీనులయేవారు. అందులో పెద్ద కుర్చీ పెద్దనది.

వెనుకటి రోజులలో సినిమా హాళ్ళలో నేల, బెంచీ, కుర్చీ, బాల్కనీ అనే తరగతులుండేవి. నేలంటే నేలే. కటిక నేల మీదో, ఇసక మీదో కూర్చుని తమ చుట్టూ మరొకరు చేరకుండా ఉమ్మి వేసి ఆ స్థలాన్ని వో దుర్గంగా మార్చీసుకుని మహా విలాసంగా సినిమా చూసే వాళ్ళు.. సోడాల వాళ్ళూ, జంతికలు, కరకజ్జాలూ. వంటి తినబండారాలమ్మే వారి అరుపుల తోనూ నేల తరగతి నానా గలీజుగా ఉండేది. ఈలలూ. చప్పట్లూ తెగ బీభత్సం చేసేవి. మరో అణావో, బేడో పెడితే బెంచీ క్లాసు. ఆపైది కుర్చీ క్లాసు. బాల్కనీ తరగతి మరీ ధనవంతుల తరగతిగా ఉండేది. మరీ టూరింగు హాళ్ళలో నయితే, కొన్ని కుర్చీలు ఊరి పెద్ద మనుసుల కోసం స్పెషల్ గా వేసేవారు. అసలు, వారొచ్చి, ఆ కుర్చీలను అలంకరిస్తే కానీ ఆట మొదలయేది కాదు. సినిమాకే కాదు, నాటకాలకీ, హరికథలకీ, ఇతర సభలకీ కూడా అంతే.

సభలలో అయితే కుర్చీలను ‘‘ఆసనం’’ అని గౌరవిస్తూ ఉంటారు. ఫలానా వారు వచ్చి తమ ఆసనాన్ని అలంకరించాలని కోరుతున్నాము అంటే వచ్చి కుర్చీలో  కూచుని ఏడవరా నాయనా అనే అర్ధం.

భోజనం బల్లలని ( డైనింగు టేబిళ్ళని ) కుర్చీల సంక్యతోనే చెప్పడం వొక రివాజు. గమనించేరా ? మా ఇంట్లో డైనింగు టేబిలు ఆరు కుర్చీలదండీ ... అంటే, మా ఇంట్లో నాలుగు కుర్చీలదే సుమండీ, అదయితేనే సౌకర్యంగా ఉంటుంది అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి ...

ఇంటర్య్యూలకి వెళ్ళే అభ్యర్ధులకి అధికారులకి ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీలలో వెంటనే కూర్చోవాలా ? వాళ్ళు అనుమతిస్తేనే కూర్చోవాలా అనేది తెగని సమస్య. ఎంతకీ వాళ్ళు కనికరించకుండా కూర్చోమనక పోతే వాళ్ళడిగే చొప్పదంటు ప్రశ్నలకి కాళ్ళు పీకేలా నిలబడే జవాబులు చెప్పాలి.

టేకిట్ యువర్ ఛైర్ .. అంటే,  నీ కుర్చీ నువ్వుమోసుకొని ఫో అని అర్ధం ఎంత మాత్రమూ కాదు.

కుర్చీకుండే నాలుగు కాళ్ళూ సరిగా లేక పోతే దభాలున కింద పడడం తథ్యం. అందు వల్ల కొందరు బుద్ధిమంతులు ఎందుకయినా మంచిదని కూర్చునే ముందు కుర్చీని కొంచెం  లాగి, కదిపి మరీ చూసుకుని ఏ ప్రమాదమూ లేదని నిశ్చయించు కున్నాకే అందులో కూర్చుంటారు.

ఒకప్పుడు వీధి బడుల్లో తుంటరి పిల్లలు అయ్యవార్ల కుర్చీల కింద టపాసులు పెడుతూ అల్లరి చేసేవాళ్ళు.

కుర్చీలగురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది.



పడక కుర్చీ వైభోగమే వేరు. అందులో ఉంటే సగం కూర్చున్నట్టూ, సగం పడుకున్నట్టూ ఉంటుంది. వయసు మళ్ళిన వారికి ఇది మరీ అనువైనది. పడక కుర్చీ కబుర్లు అనీ ... ఏ పనీ పాటూ లేని కబుర్ల గురించి హేళన చేయడం కూడా ఉంది. ఇప్పుడయితే రాత్రి వేళ తిరిగే దూర ప్రయాణాల బస్సుల్లో ఈ రకం కుర్చీలు కొద్దిపాటి మార్పుతో ఉంటున్నాయి. రైళ్ళలోనూ, విమానాల్లోనూ ఈ తరహా కుర్చీలను హాయిగా రిలాక్సింగ్ గా ప్రయాణం  కోసం



అమరుస్తున్నారు ...అయితే వాటిని కుర్చీలు అనకుండా, సీట్లు అని అంటారు లెండి...

ఇక, మీకు కుర్చీలాట తెలుసు కదా ? అదేనండీ , మ్యూజికల్ ఛైర్ ఆట ! గుండ్రంగా కుర్చీలను అమర్చి, దాని చుట్టూ లయబద్ధంగా వినిపించే సంగీతానికో, పాటకో అనుగుణంగా తిరుగుతూ ఉండాలి. ధ్వని ఆగి పోగానే చప్పున దొరికిన కుర్చీలో కూర్చోవాలి. తిరిగే వారి సంఖ్య కంటె అక్కడ పెట్టే కుర్చీల సంఖ్య ఒకటి తక్కువగా ఉండేలా చూస్తారు కనుక, తప్పని సరిగా ఒకరికి కూచోడానికి కుర్చీ దొరకదు. అతడు ఔటయినట్టే లెక్క. ఇలా తడవ తడవకీ ఒక్కో కుర్చీ తీసేస్తూ ఉంటారు. చివరకి ఇద్దరు వ్యక్తులూ, ఒక్క కుర్చీ మాత్రమే మిగలడం జరుగుతుంది. మళ్ళీ వారిలో ఒక్కరే విజేతగగా నిలుస్తారు ...ఈ ఆటలో  కుర్చీలకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు ! పాట ఆగిందా ! సీటు గోవిందా !! అనే పాటా, ఆ సన్నివేశం ఉన్న సినిమా గుర్తుందా ?

ఒకప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు మాత్రమే వాడే రివాల్వింగు కుర్చీలు ఇప్పుడు చాలా మందికి అందుబాటు లోకి వచ్చేయి. డెస్క్టాప్ ముందు అవి మరీ అవసరమయ్యేయి.

గవర్నమెంటు ఆఫీసుల్లో గుమాస్తాల కుర్చీలు పని వేళల్లో ఖాళీగా ఉండడం ఆఫీసర్ల చేతగాని తనానికి లేదా ఉదార స్వభావానికీ నిదర్శనం.


ఇక, కుర్చీ కింద చెయ్యి గురించి మనందరికీ తెలిసినదే. కుర్చీ కింద చేతిని తడిపితే కానీ పనులు జరగవు.

కూర్చున్న కుర్చీకి ఎసరు అంటే, ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియని స్థితి. ప్రైవేటు ఉద్యోగాల్లో, ముఖ్యంగా మీడియా రంగంలో పని చేసే వారికి ఈ భయం జాస్తి అంటారు ...

ఇక, రకరకాల డిజైన్లలో కుర్చీలకి కొదవే లేదు ...మచ్చుకి వొకటి చూడండి ..




పూర్వపు రాజుల రత్న ఖచిత సింహాసనాల్లాగా ఇప్పటికీ విలాసవంతులూ, జనం ధనం తెగ కాజేసిన వాళ్ళూ ఇళ్ళలో బంగారంతో చేసిన కుర్చీలని వినియోగించిన వైనం ఇటీవలి కాలంలో చూసేం.

‘‘ నిన్న మావారి సన్మానానికి జనం బాగా వచ్చేరుట ... సగం హాలు నిండిందిట !‘‘ అందొకావిడ గొప్పగా.

‘‘ పోదూ బడాయి !.. సగం కుర్చీలు ఖాళీయేనట ! మావారు చెప్పారు ’’ అని మూతి మూడు వంకర్లు తిప్పిందిట పక్కింటావిడ.

మరో ముఖ్య విషయం ... పార్టీ టిక్కెట్టు రాని అభ్యర్ధుల అనుచరగణం తమ అక్కసంతా ముందుగా కుర్చీల మీదే చూపిస్తూ ఉంటారు. కుర్చీలను విరిచి పోగులు పెట్టే దృశ్యం తరచుగా చూస్తూ ఉంటాం.. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు .. ఎవరి మీదనో కోపం కుర్చీల మీద చూపడం సబఁవా ? మీరే చెప్పండి ? అప్పుడే కాదు, సభల్లోనూ, ఆఫీసుల్లోనూ. ఆస్పత్రులలో, ఇక్కడా అక్కడా అనేమిటి లెండి, ఎవరికి కోపం వొచ్చినా విరిగేవి కుర్చీలే !



 రాబోయేదే   400వ కథా మంజరి టపా .   మళ్ళీ కలుద్దాం ... ఇప్పటికింక కుర్చీల కథ సమాప్తం. సెలవ్ ... ...





















13, ఏప్రిల్ 2014, ఆదివారం

కప్పల కథ !



ఎన్నికల వేళ దేశంలో, మరీ ముఖ్యంగా మన   రాష్ట్రంలో రాజకీయాలు చూస్తూ ఉంటే, కప్పల కథ రాయాలనిపించడం యాదృచ్ఛికమేమీ కాదని మనవి చేస్తున్నాను.
లోగడ కథా మంజరిలో చెప్పుల కథ రాశానా ? ఇప్పుడు కప్పల కథ రాస్తే తప్పేఁవిటని అనిపించి రాస్తున్నాను. 
ముందుగా మన ఆనవాయితీ ప్రకారం కప్ప అనే అర్ధాన్నిచ్చే పదాలు ఇంకా ఏమేం ఉన్నాయో చూదాం ...
అజంభము, అజిరము, అజిహ్వము,అనిమకము,అనూపము, అలిమకము,కృతాలయము,
చలికాపు, సూచకము, దుర్దురలము,దాటరి. ప్లవము, భుకము,మండూకము లాంటి చాలా ఉన్నాయి కానీ అంత ఆయాసం మనకొద్దు.  అన్నట్టు హరి అనే పదానికి విష్ణువు అనే అర్ధంతో పాటూ కప్ప  అనే అర్ధం కూడా ఉందండోయి !
కప్పల్లో బావురు కప్ప, బాండ్రు కప్ప, చిరు కప్ప అని   చాలా రకాలు  కనిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో కప్పల గురించిన ప్రస్తావన వచ్చిన తావులు ఒకటి రెండు విన్నవిస్తాను ...
ఎప్పుడు సంపద కలిగిన
అప్పుడు బంధువులు వత్తు రది ఎట్లన్నన్
తెప్పలుగ చెఱువు నిండిన
కప్పలు పది వేలు చేరు కదరా సుమతీ !
అంటాడు సుమతీ శతకకారుడు బద్దెన. మరంతే ... మన దగ్గర సొమ్ముంటే ఎక్కడెక్కడి వాళ్ళూ బంధువుల మంటూ వచ్చి చేరుతారు. చెఱువు నీటితో కళకళలాడుతూ ఉంటే వేలాదిగా కప్పలు వచ్చి చేరుతాయి కదా, అలాగన్నమాట.

మరో పద్యం చూడండి ...
సరసుని మానసంబు సరస ఙ్ఞుఁడెఱుంగును, ముష్కరాధముం
డెరిఁగి గ్రహించు వాఁడె ? కొలనేక నివాసముగాఁగ దుర్దురం
బరయఁగ నేర్చు నెట్లు వికజాబ్జమరంద సౌరభో
త్కరము మిళింద మొందు క్రియ దాశరథీ ! కరుణాపయోనిథీ !

ఈ పద్యం కంచెర్ల గోపన్న రచించిన దాశరథీ శతకం లోనిది.   దుర్దురము (కప్ప ) ఉండేదీ, కమలం ఉండేదీ కూడా కొలను లోనే ! కానీ, ఆ కమలంలో ఉండే తేనెని  తుమ్మెద మాత్రమే ఆస్వాదిస్తుంది కానీ ప్రక్కనే ఉండే కప్పకి దాని మాధుర్యం తెలయదు కదా !అలాగే సరసుని మనసు పరసుడే తెలిసికో గలుగుతాడు అని దీని భావం. ఇందులో కప్ప ప్రస్తావన వచ్చి నప్పటికీ ఆ ప్రస్తావన దాని గౌరవం ఇనుమడించేలా మాత్రం లేదు పాపం ...

వెనుకటికి ఓ అవధాని గారికి  ‘‘ కప్పని చూచి పాము గడగడ వణికెన్ !’’ అని వో సమస్య నిచ్చేరుట. దానిని అవధాని   తెలివిగా, కిర్రు చెప్పులు వేసుకుని,  కర్ర పట్టుకుని, పొలం కాపునకు వచ్చిన రైతు     వెంకప్ప  (వెం –కప్ప) ను చూచి అక్కడ  వో పాము గడగడా వణికిందని  సమస్యాపూరణం చేసారు. మేకల్ని చూసి పులులూ , కప్పల్ని చూసి పాములూ ఎక్కడయినా భయ పడతాయా, మన వెర్రి గానీ !

నిజఁవే ... కప్పని చూస్తే జాలేస్తుంది. పరిశోధనల పేరిటా, పరీక్షల పేరిటా రోజూ కళాశాలల్లో ఎన్ని కప్పలు దారుణంగా చంపి వేయ బడుతున్నాయో కదా ... ఇలా కప్పలకి మనుష్య జాతి వలన పీడ  ఉండగా సర్ప జాతి వలన ప్రాణగండం ఎలానూ ఉంది. పాములు కప్పలు దొరికితే మహదానందంగా చప్పసరించేస్తాయి మరి ... కడుపు నిండి కప్పలు తిన్న పాము కదలకుండా నిబ్బరంగా పడుంటుందిట. కప్ప తిన్న పాములా కదలకుండా   ఎలా ఉన్నాడో చూడూ అనడం  లోకంలో వొక వాడుక.

శ్రీ.శ్రీ గారు వో గేయంలో ఘూకం కేకా ,,, భేకం బాకా అన్నారు. ఈ విధంగా ఆధునిక కవిత్వం లో కూడా కప్ప ప్రస్తావన వొచ్చిందని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

ఆత్రేయ గారయితే ఏకంగా కప్పలు అనే వొక ప్రసిద్ధమయిన నాటికనే రాసి పడీసేరు.
నూతి లోని కప్పలు అనే దానికి లోకం తెలియని మూర్ఖులు అని అర్ధం,
కప్పదాట్లు అంటే  తెలుసు కదా ?  నడకలోనో, పరుగులోనో మధ్యలో ఓ దాటు వదిలేసి అడుగులెయ్యడం. కొంత మంది తమ ప్రసంగంలో ఎంతకీ అవసరమయిన విషయాన్ని చెప్పకుండా  తప్పించు కోడానికి ప్రసంగంలో కప్పదాట్లు వేయడం కద్దు.  సమయం వచ్చి నప్పుడు వాడి బండారమంతా బయట పెడతాను ! అని అప్పటికా ప్రస్తావనని దాట వేసే కప్ప దాట్ల రాజకీయ నాయకులని చూసేం కదా ... కప్ప గెంతులు అనే ఆట ఆడపిల్లలకి చాలా ఇష్టమయిన ఆట వెనుకటి రోజుల్లో. ఇవాళ మన చిన్నారి పాపలకి ఈ ఆట ఆడుకోడానికి కంప్యూటర్ లో కప్పగెంతులు ఆట ఉందో లేదో నాకు తెలియదు.

కప్పదాట్లనే సంస్కృతీకరిస్తే మండూక ప్లుతి న్యాయం  అవుతుంది.

సంగీత రాగాలలో కూడా దాటు గతి   అని వొకటుందని చెబుతారు. ఇలాంటిదే కాబోలు. కానయితే దానికి మంచి గౌరవస్థానం ఉంది.

ఉపనిషత్తులలో మండూకోపనషత్తు ఉంది. దాని వివరాలు తెలిసిన పెద్దలు చెప్పాలి. నా లాంటి అల్పఙ్ఞుడికేం తెలుస్తుంది చెప్పండి ?

కప్పల తక్కెడ అని ఓ జాతీయం. తక్కెడలో కప్పలని ఉంచి తూకం వేయడం ఎవరి తరమూ కాదు. అవి వొక చోట స్థిరంగా ఉంటే కదా ?  ( మన రాజకీయ పార్టీ నాయకుల్లాగ ! )

అప్పాలు కప్పలుగా మారిన వైనం వెనుటి రోజులలో ఓ తెలుగు సినిమాలో చూసి తెగ నవ్వుకున్నాం గుర్తుందాండీ ?
‘‘కరవమంటే   కప్పకు కోపం, విడవమంటే పాముకి కోపం ’’అనే మాట విన్నారు కదూ ? కప్ప కరవడమేఁవిటి పాపం ... అందుకే కదా, ‘‘కప్ప కాటు లేదు, బాపన పోటు లేదు ’’అనే సామెత పుట్టిందీ ?
‘‘కప్పలు అరుస్తూనే ఉంటాయి, దరులు ( గట్లు) పడుతూనే ఉంటాయి ’’అనేది మరో సామెత.
‘‘కప్పలు ఎఱుగునా కడలి లోతు’’ అని కూడా మరో సామెత ఉంది.

వీటి మాటకేంగానీ,‘‘ కప్పలు అరిస్తే కుప్పలుగా వాన పడతుంది’’ అని వో సామెత ఉంది.
కప్పల పెళ్ళి చేస్తే జోరుగా వానలు పడతాయని మన వారిలో వో నమ్మకం ఉంది.
కప్పల బెక బెకలు పుష్కలమైన నీటి తావులకి చక్కని సంకేతాలు.  ( ట ! )
తాళం కప్పలో కప్పకీ మనం చెప్పు కుంటున్న కప్పకీ ఏఁవయినా సమ్మంధం ఉందో, లేదో ఆలోచించాలి ...

బాల సాహిత్యం లోనూ. జానపద సాహిత్యం లోనూ చాలా కప్పల కథలు కనిపిస్తూ ఉంటాయి.  కప్పలు అందమైన రాజకుమారిగా మారి పోవడమో, లేదా యువరాణి ముని శాపం చేత కప్పగా మారి పోవడమో  ... ....ఇలాంటి కల్పిత కథలు  చాలానే కనిపిస్తాయి.
ఇంతటితో కప్పల కథకి స్వస్తి !

బెక !  బెక !!  బెక !!!