మంచి సంబంధం.కట్నాల ఊసు లేదు.పిల్ల నచ్చింది."రెండు రోజుల్లో మళ్ళీ మూఢాలు వస్తాయి.కనుక,రేపే తాంబూలాలు మార్చుకుందాం" అని వియ్యాల వారి నుండి ఫోను.
ఆ యింట్లో అందరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయి పోయేరు."మా సునంద జాతకం చాలా మంచిదమ్మా" యీ మాట యిప్పటికి తల్లి సరస్వతమ్మ అనుకోవడం యిది ఏ వందో సారో. తండ్రి నారాయణ కూడా ఎంతగానో సంతోషించారు. వియ్యంకుల వారి నుండి ఫోను వచ్చింది లగాయితూ ఆ దంపతులకి కాలు ఒక చోట నిలవడం లేదు. చుట్ట పక్కాలకి ఉదయం నుండి ఫోన్లు చేస్తూ ఆ శుభ వార్త అందజేస్తూనే ఉన్నారు. ఇరుగు పొరుగులకీ,ఊళ్ళో స్నేహితులకీ ఆ వార్త చేర వేసారు. మరో ప్రక్క తాంబూలాలు యిచ్చుకుందుకి అట్టే వ్యవధి లేక పోవడంతో వాళ్ళకి కంగారు పెరిగిపోతోంది. పీకల మీదకి యీ మూఢాలొకటి వచ్చి పడుతున్నాయి. ఏం చెయ్యాలో తోచడం లేదు. తాంబూలాలకి కొంచెం సమయం కావాలని అడిగే సాహసం చేయ లేక పోయేరు.
సునంద కూడా యీ సంబంధానికి సుముఖత తెలియ జేసింది. అయితే యింత అవ్యవధానంగా నిశ్చయ తాంబూలాలు ఏర్పాటు చెయ్య మనడం ఆమెకి చిరాకనిపిస్తోంది."మరో సారి వాళ్ళతో మాట్లాడ కూడదూ, నాన్నా..."అంది తండ్రితో. అతను ఫోను చేసారు.
"అబ్బే...అనుకున్నాక మరి ఆలస్యమెందుకండీ...బావ గారూ...మూఢాలు రాకుండానే ఆ తంతు జరిపించేద్దాం...మాట్లాడుకోడానికి మరేం లేదు.. అదీ కాక, మా వాడికి యిప్పట్లో మళ్ళీ సెలవు దొరకదు . తాంబూలాల కార్యక్రమం చాలా సింపులుగా జరిసించేద్దాం...కాదనకండి..." అని జవాబొచ్చింది.
మరి చేసేదేముంది కనుక? హడావిడిగా పనులకి సిద్ధమయ్యారు నారాయణ దంపతులు.
కట్నం ప్రసక్తి లేని సంబంధం వొచ్చినందుకు సునంద ఎంతగానో ఆనందించింది. అమ్మాయి మంచి ఉద్యోగం చేస్తున్నా కట్నం కోసం వేధించే వారున్న యీ రోజులలో ...ఆ ఊసే ఎత్తని వారి ఉత్తమ సంస్కారానికి పొంగి పోయింది. ఆ రోజంతా షాపింగ్ చేసి, బట్టలూ, ప్వీట్లూ అవీ కొని, బిజీ బిజీ అయి పోయేరు నారాయణ దంపతులు. వియ్యాల వారిదీ అదే ఊరు కావడం చేత, ప్రయాణ హడావిడి లేదు. దగ్గరి వాళ్ళకి ఫోన్లు చేసి ఆహ్వానించారు.
మర్నాడు నిశ్చయ తాంబూలాల కార్యకమం నిరాడంబరంగానే, అయినా, ఎంతో ఉల్లాసంగా జరిగింది. కొద్ది పాటి మంది బంధువులూ, స్నేహితులూ హాజరై దీవించేరు. ఫొటోలూ, వీడియోలూ షరా మామూలే...
మూఢం వెళ్ళేక ముహూర్తాలు పెట్టుకుందాం అనుకున్నారు. వియ్యాల వారు వెళ్ళి పోయేక ఆ రాత్రంతా సరదా కబుర్లతోనే గడిచి పోయింది.
కట్నం లేని సంబంధం వొచ్చినందుకు నారాయణ గర్వించేడు.
* * * * * *
"సునందది మహర్జాతకం..." అనుకున్నాడు నారాయణ.
"అవును సుమీ..." అనుకుంది సరస్వతమ్మ.
కాని, ఆ సంతోషం అట్టే రోజులు వారికిొ నిలవ లేదు.
మూఢాలు వెళ్ళేక, పెళ్ళి ముహూర్తాలు పెట్టుకున్నది లగాయితూ వారి ఆనందం అడుగంటి పోసాగింది. వాళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెట్టించే సంఘటనలు చాలానే జరిగాయి...
వియ్యాల వారి నుండి రోజుకో ఫోను. పూటకో బెత్తాయింపు.కట్నం లేదు కనుక, పెళ్ళి మాత్రం ఆ పట్నంలోకెల్లా అత్యంత విలాసవంతమయిన హొటల్లో జరిపించాలని హుకుం జారీ చేసేరు. తమ తరఫు వాళ్ళెవరి వద్దా చిన్నపోకుండా పెట్టుపోతలూ అవీ ఘనంగా జరిపించాలని తేల్చి చెప్పారు. ఆ బట్టల ఖరీదులూ,వివరాలూ విని నారాయణ దంపతులకి గుండెలు జారి పోయేయి. ఇక,పెళ్ళి కూతురుకి పెట్ట వలసిన నగల గురించి విన్నాక,వారికి మూర్ఛ వచ్చినంత పనయింది. కళ్ళు బైర్లు కమ్మాయి.సారె సామాన్ల జాబితా, విందు భోజనాలలో మెనూ, పెళ్ళయాక నూతన దంపతుల హనీమూను ట్రిప్పు కోపం చేయాల్సిన యేర్పాట్లూ,.. ఇవన్నీ క్రమేపీ ఒక్కొక్కటీ వింటూ వాళ్ళ మెదళ్ళు మొద్దుబారి పోయాయి.
వియ్యాల వారి నుండి ఫోనంటేనే బెంబేలెత్తి పోతున్నారు. వారికి ముచ్చెమటలు పడుతున్నాయి.
కట్నం లేదన్న మాటే కానీ, ఆ గొంతెమ్మ కోరికలకి అంతూ పొంతూ లేకుండా పోతోంది. ట్రింగ్ ....ట్రింగ్ ... అనే ఫోను శబ్దం వాళ్ళ గొంతు తడారి పోయేలా చేస్తోంది.
కట్నం తీసుకోని కీర్తి వాళ్ళకి దక్కొచ్చు కాక, ఈ పెళ్ళి యేర్పాట్లతో తాము కుదేలయి పోవడం తధ్యం... సునంద కోపంతో చిందు లేస్తోంది. ఒక దశలో ఈ సంబంధం కేన్సిలు చేసెయ్యమని తెగేసి చెప్పింది.
అంత వరకూ వచ్చేక ఎలా వదులు కోవడం? అల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. మనిషి యోగ్యుడులాగే ఉన్నాడు. అయినా, పెళ్ళి ఘనంగా జరగాలని వారను కోవడంలో తప్పేమీ లేదు... కానీ, ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదా... అప్పుడు తను తూగగలడో లేదో ముందే వారికి చెప్పుకునే వాడు కదా...పెళ్ళికి ముందే యిలాగుంటే, పెళ్ళయాక తమ తలకి మించిన కోరికలు ఏం కోరుతారో....అదో బెంగ వారిని పీడించ సాగింది.
గొప్పగా ... మాట్లాడు కోడానికి ఏమీ లేదని చెప్పి, తాంబూలాలకి తొందర పెట్టి, తీరా యిప్పుడీ గొంతెమ్మ కోరికలతో చంపుతున్నారు...
వీళ్ళ ఆరాటం గమనించి , తెలిసిన స్నేహితుడొకాయన సలహా యిచ్చేడు ‘‘ కొందరంతే ...అన్నీ ఉచితం అని ప్రకటనలిచ్చి...చివర్లో ఎక్కడో కనీ కనిపించ కుండా షరతులు వర్తిస్తాయి అని వేస్తారు చూడండి... అలాగన్న మాట...పైకి సంస్కారం ప్రకటించి, తర్వాత వాళ్ళనుకున్న వన్నీ సాధిస్తారు...సరే ...అప్పో ...సప్పో చేసి, సునంద పెళ్ళి జరిపించండి ...అంతకన్నా మరో మార్గం లేదు...అన్నీ సర్దుకుంటాయి...పెద్ద వాడ్ని చెబుతున్నాను ... కాదనకండి ...’’ అని హితవు పలికారు. అయిష్టంగానే అంగీకరించేరు నారాయణ దంపతులు.
* * * * * *
పెళ్ళి మహా ఆడంబరంగా జరిగింది. చిన్నా చితకా తప్ప మరేం కొత్త కోరికలు కోర లేదు వాళ్ళు. ఆ మేరకు ... అదో ఊరట...
ఆ పెళ్ళితో ఆ దంపతులకి ఆనందంతో పాటూ పుట్టెడు అప్పూ, తెలీని బెంగా మిగిలి పోయేయి.
సునంద అత్త వారింటికి వెళ్ళి పోయింది. త్వరలోనే అందరితో బాగా కలిసి పోయింది.పదహారు రోజుల పండుగ పూర్తయేక ...సెలవు ముగించుకుని, సునంద తిరిగి తన ఉద్యోగంలో జాయనయింది రోజులు గడుస్తున్నాయి. నాలుగు నెలలయింది. సునంద తన జీతం ఏం చేస్తోందో తెలీడం లేదు. అత్త వారింటిలో ఒక్క పైసా యివ్వడం లేదు... ఆ యింట్లో అంతా మనసులోనే కుత కుత లాడి పోతున్నారు. సంస్కారపు తెర అడ్డొచ్చి, ఎవరూ నోరు మెదపడం లేదు.
ఆఖరికి ఉండబట్ట లేక, భర్తే ఓ రోజు సునందని జీతం గురించి అడిగేడు.
సునంద ప్రశాంతంగా బదులిచ్చింది."పెళ్ళయాక, ఉద్యోగం చెయ్యాలనీ, మానకూడదనీ అన్నారు కదా" ?
"అవును ... అయితే ..."
"అందుకే ఉద్యోగం మాన లేదు ...ఉద్యోగం చెయ్య మన్నారే కానీ ... జీతం మీకిమ్మని ముందే కండిషను పెట్ట లేదు కదండీ "
సునంద మాటలతో ఆ యింట్లో అంతా నిర్ఘాంత పోయారు.వాళ్ళకి కోపం తన్నుకొచ్చినా, ఎలా వ్యక్తం చేయాలో తెలీక ... మిన్నకుండి పోయేరు.ఆ విస్ఫోటనం మరింత పెద్దది చెయ్యడం యిష్టం లేక .... సునంద మళ్ళీ అంది ..."ఈ పరిస్థితులు కొంత కాలమే లెండి .....మా నాన్న మన పెళ్ళికి చేసిన అప్పులు తీరే వరకూ ... ప్లీజ్ ...అర్ధం చేసుకోరూ ..." అని.
కట్న ప్రసక్తి లేకుండా కోడల్ని తెచ్చుకున్న వారిగా అందరి మెప్పూ పొందిన ఆ యింట్లో ఎవరికీ ఆ మాటలతో మరింక నోళ్ళు పెగల లేదు...
ఎంతయినా ... వారిది సంస్కారవంతుల కుటుంబం కదా ? ......
* * * * * * *
నవ్య సచిత్ర వార పత్రికలో తే 9-9-2009 దీ సంచికలో ప్రచురణ.
1 కామెంట్:
చాలా బాగుంది. మీ కలంనుండి మరిన్ని కధలు చూడాలని ఉంది
కామెంట్‌ను పోస్ట్ చేయండి