18, డిసెంబర్ 2009, శుక్రవారం

శివ ! శివా !!


వెనుకటి రోజులలో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలలో భర్తలు భార్యలను ‘‘ వొసే ’’ ,, ‘‘ వొసేయ్ ’’ అని పిలవడం ఉండేది. గురజాడ వారి కన్యాశుల్కం ఓ సారి గుర్తుకు తెచ్చు కోండి ...

ఈ పిలుపును గురించి శ్రీ చెల్ల పిల్ల వేంకట శా స్త్రి గారు చక్కని పద్యం చెప్పారు. చూడండి ...

ఇతర దేశమ్ముల జనయించుకంటె
నాంధ్ర దేశాన జనయించుటార్య హితము
‘వశి వశి’ యటంచు పిలుతురు వారు భార్య
నదియు ‘శివ శివ’ యై తుద కఘములడచు !!


వేరే దేశాలలో (ప్రాంతాలలో) పుట్టడం కన్నా ఆంధ్ర దేశంలో పుట్టడం మంచిది. అక్కడి వాళ్ళు భార్యలని వశి వశి ( వొసేయ్ అని అన్న మాట) అని పిలుస్తారు. చివరికదే శివ శివా ! గా మారి పోయి అన్ని పాపాలు పోగొడుతుందిట!
మరా మరా అనేది రామ రామ అయినట్టుగానన్న మాట !
శివ నామ స్మరణ పాపాలు పోగొడుతుంది. నిజమే కదా ... భార్యలని అంత అవమానకరంగా పిలిచే ( అందులో ఆత్మీయతానురాగాపాలు ఎక్కువే ననుకోండి ) మగ వాళ్ళకి పాపం చుట్టుకోదూ !
అందు చేత కనీసం ఈ తిరగేసిన నామ స్మరణ వారికి తెలియ కుండానే వారి చేత శివ నామాన్ని పొద్దస్తమానం జపించేలా చేసి, ఆ పాపాన్ని పోగొడుతుందనుకోవాలి మరి !

1 కామెంట్‌:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

వాహ్!
అత్యద్భుత విషయమ్మును,
నిత్యము వా కొనెడి దాని నిరుపమ గతి నా
నిత్యులు తిరుపతి వేంకట
స్తుత్య కవులు తెలుప, తమరు చూపిరి మాకున్.

ఈ మీ సేవలు తెల్గు తల్లి మదిలో నెంతేని సంతోషమున్,
బ్రేమన్ గొల్పును. భాగ్యశాలు రిలలో ప్రీతిన్ కథా మంజరిన్
క్షేమం బిద్ది పఠింప యంచు చదువున్. గీర్వాణ భాషాంభుధీ!
ఈ మీ వెల్గులు తెల్గు వెల్గు లగుచున్, హృద్యంబుగా నిల్చుతన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి