మన పూర్వ కవి ఒకరు శ్లోకంలో ఎంత చక్కని సెటైరుని విసిరాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
చూడండి ...
రే రే రాసభ ! వస్త్రభారవహనాత్ కుగ్రామ మశ్నాశి కిం ?
రాజాశ్వావసధం ప్రయాహి, చణకాభ్యూషా సుఖం భక్షయాన్
సర్వా పుచ్ఛవతో హయా యితి వదంత్యత్రాధికారే స్థితా
రాజా తైరుపదిష్టమేవ,మనుతేన సత్యం తటస్థాపరే:
కవి గారు గాడిద పడుతున్న శ్రమని చూసి జాలి పడుతున్నట్టుగా గాడిదని ఉద్దేశించి ఈ మాటలంటున్నాడు:
‘‘ ఓ గాడిదా ! బట్టలు మోసుకుంటూ గ్రామాలు తిరుగుతూ ఎందుకు ఊరికే శ్రమ పడతావు ?
రాజుగారి గుర్రాల శాలకి వెళ్ళు. అక్కడ మిగతా గుర్రాలతో పాటు నువ్వూ హాయిగా గుగ్గిళ్ళు తింటూ గడుపు. తోకలున్నవన్నీ గుర్రాలేనని అధికారులంటారులే !! రాజు కూడా అదే నిజమని నమ్ముతాడు !!
అయ్యా, చూసారా !! గాడిదని అడ్డం పెట్టుకుని కవి గారు ఆ కాలం నాటి బ్యరోక్రసి మీదా, ప్రభువుల మీదా ఎంత గొప్ప పెటైరు విసిరాడో ! దీనిని మీరు ప్రస్తుతానికి కూడా అన్వయిస్తామంటే అభ్యంతరం లేదు.
సందర్భం ఎలాగూ వచ్చింది కనుక, గాడిదని పలకరిస్తూ మరో కవి గారు చెప్పిన తమాషా పద్యాన్ని కూడా గుర్తు చేసి చేతులు దులుపుకుంటాను....
బూడిద బుంగలైయొడలు పోడిమిఁదప్పి, మొగంబు వెల్లనై
వాడల వాడలం దిరిగి , వచ్చెడు వారలు ‘‘చొచ్చొచో’’ యనన్
గోడల గొందులం దొదిగి, కూయుచునుండెదు కొండ వీటిలో
గాడిద !! నీవునుం గవివి కావు కదా ?యనుమాన మయ్యెడిన్.
అవునూ, ఈ పద్యం ఎవరిదో చెప్పుకోండి చూద్దాం. మీకు తెలుసని నాకు తెలుసని మీకు తెలుసు కదూ !
3 కామెంట్‌లు:
అరరే గాడిద! వస్త్ర భార వహనవ్యాపారివై కూడ నీ
తెరగేమీ యిది? వట్టి గడ్డి దినుటా!! ధిక్ ధిక్ - నృపాలాశ్వ శా
ల రయానన్ జని గుగ్గిళుల్ దినుమురా! లాంగూలముంగల్గుచో
తురగంబందురు రాజసేవకులు-తోడ్తో నమ్ము నారాజు ప
ల్కరు వేరెయ్యదియున్ తటస్థులు పరుల్- భాగ్యమ్ము నీదే కదే!!!
అఙ్ఞాత గారికీ, dr గారికీ మన:పూర్వక కృతఙ్ఞతలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి