2, జనవరి 2010, శనివారం

పద్య భ్రమరుకం ... పాద భ్రమరుకం !

వేసవి కాలం. మధ్యాహ్నం ఎండ ఫెడీల్మని పేల్చేస్తూ ఉంటే, ఇంట్లో అమ్మో, నాన్నమ్మో, అత్తమ్మో, పెద్దమ్మో, అమ్మమ్మో ... ఎవరో ఒకరు మామిడి కాయలు ఊరగాయ కోసం తరుగుతూ ఉంటే ...



ఒకటో, రెండో ముక్కలు లాక్కుని, ఉప్పూ కారం నంచుకుని తింటూ ఉంటే...

వాహ్ ! ఆ రోజులు ఎంత భలేగా ఉండేవో ఓ సారి గుర్తుకు తెచ్చుకోండి...

అంతే కాదు, ఆ తరిగిన ముక్కల పక్కన పెద్దాళ్ళు పారేదామని ఉంచిన మావిడి జీడి కుప్పలోనుండి ఒకటో,రెండో తీసుకుని ... గోడల మీద కొక్కిరిబిక్కిరిగా ...
‘‘ దడిగాడు వాన సిరా’’ అని రాయడం గుర్తుకొస్తోందా?

ఎటు చదివినా ఒకే మాదిరిగా ఉండే ఈ వాక్యానికి మన తెలిగింటి మట్టి గోడలు గొప్ప ప్రాచుర్యాన్ని యిచ్చాయి కదూ!


మన కవులు కూడ యిలాంటి తమాషా పద్యాలు చాల రాసేరు. వాటిని పాద భ్రమకాలనీ, పద్యభ్రమకాలనీ అనొచ్చు.
ముందుగా పాద భ్రమకం. పద్యంలో ప్రతీ పాదమూ ఎటుచదివినా ఒకేలా కనిపించడం దీని ప్రత్యేకత! చూడండి ...

ధీర శయనీయశరధీ
మార విభాను మత మమత మనుభావి రమా
సార సవన నవసరసా
దారదసమతార తార తామ సదరదా !


ఇప్పుడు పద్య భ్రమకాన్ని చూద్దామా? పద్యం మామూలుగా మొదటి నుండి చదివినా, చివరి అక్షరం నుండి వెనక్కి చదివినా ఒకేలా ఉండడం దీని ప్రత్యేకత.

రాధా నాధా తరళిత
సాధకరధతావర సుత సరసనిధానా
నాధాని సరసత సురవ
తాధర కథసా తళిరత ధానాధారా !


ఆగండాగండి, యతి ప్రాసలూ గణాలూ తెలిస్తే, ఎటునుంచెటు చదివినా ఒకేలా ఉండే అక్షరాలను మేమూ పేర్చ గలం అని అనుకో వద్దు సుమా ! ... ఎందుకంటే, యివి రెండూ పూర్తిగా అర్ధవంతాలయిన పద్యాలు....
వీటి అర్ధాలను తెలిసిన వారు ప్రయత్నించి చెప్పమని కోరుతున్నాను ...

వీటి అర్ధం పూర్తిగా తెలుసుకోకుండా, ఈ పద్యాలను కథామంజరి బ్లాగులో ... దడిగాడు వాన సిరా.




Posted by Picasa

2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

బహుముఖపాటవంబమరిభాసిలుచున్నబుధావతంసమా!
అహరహమున్ త్వదీయమగుహర్షప్రకల్పకసత్ కథావళుల్
మహిమకుబద్ధచిత్తునయి మానకచూచెద.వచ్చునట్టి యా
గ్రఃహణమురాకముందెరవిఁగాంచగఁజేసితివయ్య! మిత్రమా!

మామిడి రాక ముందుగనె మామదిమామిడిపైకి పోవగా
నేమిటికయ్య చేసితివి? ఇంపుగ మామిడికాయ జూపినన్
ఏమరియున్నభ్రాంతి మదినేలుచునేమియుతోచనీయ దా
రామ వసంతశోభలను రంజుగ మున్నుగ చూపితీవెగా!

కవుల మనోజ్ఞ భావనలు కాలపు గర్భమునందునుండగా
రవియును గాంచఁజాలనివి రాజిలఁజేయఁగ వెల్వరించి,భా
రవియటుభాసమానముగరంజుగఁ జేసితివయ్య మిత్రమా!
సువిదితమౌనటుల్తెలిపి శొభను గూర్చుమ పద్యపాళికిన్.

జ్యోతి చెప్పారు...

ధీర శయనీయశరధీ
మార విభాను మత మమత మనుభావి రమా
సార సవన నవసరసా
దారదసమతార తార తామ సదరదా !


విద్వాంసుడు, ధైర్యవంతుడు,శయనించుటకు అర్హమైన సముద్రము కలవాడు.మన్మథుడి కాంతికి సమ్మతమైన అభిమానం కలవాడు. అంటే మన్మథుడివలె కాంతిమంతుడు. మంత్రమననముచే సమస్తశుభాలనీ ఇచ్చేవాడు.
శ్రేష్ఠమైన యజ్ఞములందు సనవరసుడని. పాదరసంలా మెరిసే మంచి ముత్యాల హారం కలిగినవాడు. తామసానికి భయాన్నిచ్చేవాడు అని.

కామెంట్‌ను పోస్ట్ చేయండి