2, జనవరి 2010, శనివారం

పాల పిట్ట కథలు - మన చిన్నారుల కోసం ఓ మంచి పుస్తకం !

Posted by Picasa మన చిన్నారులకి మనం యిచ్చే మంచి బహుమానం ఓ కొత్త బొమ్మ, ఓ బొమ్మల చొక్కా, ఓ పువ్వుల గౌను, ఓ రంగు రంగుల బెలూను, ఓ మంచి పెన్ను, కలర్ పెన్సిల్స్ ... ... ఇలాంటివే కదా?

కాదు ... కాదు ... వీటితో పాటు ... ఓ మంచి రంగు రంగుల పిల్లల పుస్తకం ! పెద్దక్షరాల పిల్లల పుస్తకం ! ... అందులో రాక్షసులూ , మాంత్రికులూ, మాట్లాడే చెట్లూ, పలకరించే గాలులూ, తమతో పాటు ఆడుకునే పక్షులూ, పిట్టలూ. జంతువులూ, ఎగిరి పోవడాలూ , మాయమైపోవడాలూ, ప్రత్యక్షమవడాలూ ... యింకా చాలా చాలా ... ఉండాలి ... ఉంటాయి కూడానూ ...
అప్పుడు చూడాలి వాళ్ళ కళ్ళలో మెరుపు !
అప్పుడు చూడాలి వాళ్ళ ముఖంలో ఆనందతాండవం !
అప్పుడు చూడాలి వాళ్ళ పెదాల మీద వెన్నెల విరజిమ్మినట్టు చిరు నవ్వు ...

చిన్నారి చేతులతో వాటిని అందుకుంటూ, థాంక్యూ మమ్మీ, థాంక్యూ డాడీ ... అంటూ పలికే ఆ చిన్నారుల చిలుక పలుకులని విని పరవశించి పోవాలని మనకుండదూ?

ఈ కొత్త సంవత్సరం మొదలవుతూనే, మన పిల్లలకి అపురూప బహుమతిగా యివ్వ తగిన ఒక చక్కని పుస్తకం పాల పిట్ట ప్రపంచ జానపద కథలు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు కొత్తగా వెలువరించారు!

కొత్త సంవత్సరం ( 1 - 1 - 2010 ) రోజున విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ లో ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి ఈ పాల పిట్ట పిల్లల పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఎ.ఎన్.జగన్నాధ శర్మ 27 ప్రపంచ ప్రసిద్ధ జానపద కథలను అందమైన , సరళమైన శైలిలో, పిల్లను అమితంగా ఆకట్టుకునే రీతిలో, చక్కని బొమ్మలతో వెలువరించిన పిల్లల పుస్తకం - పాల పిట్ట.

పత్రికా రచయిత, నవ్య వార పత్రిక సంపాదకులు, నవలా కథా రచయిత, టి.వి, సినిమా రచయితగా ప్రసిద్ధులైన శ్రీ జగన్నాధ శర్మ బాల సాహిత్యం మీద ఎనలేని మక్కువతో ప్రపంచ ప్రఖ్యాత జానపద కథలను పాఠకులకు అందించారు.
ప్రముఖ కవి శివారెడ్డి ఆవిష్కరించిన ఈ పాల పిట్ట పిల్ల పుస్తకం రూ. 90 లకే లభ్యమైతోంది.
‘‘ ఈ పాల పిట్టలోకి అడుగు పెట్టడమంటే, మనం మరిచి పోయిన దేశంలోకి, కొత్తగా అడుగు పెట్టడమే ! కొత్త రుతువులకి రెప రెపలాడే కిటికీలను తెరవడమే!’’ ... అంటున్నారు రమణ జీవి.

‘‘ ఈ కథల్ని పెద్దలు చదివారంటే తమ బాల్యంలోకి వెళ్ళి పోతారు. అమ్మమ్మలూ, నాన్నమ్మలూ చెప్పిన జానపద కథల్లోని మాయాప్రపంచంలో విహరిస్తారు పరుగుల ప్రపంచపు బాధలనుంచి కాస్త ఉపశమనం పొందుతారు ...’’ అంటున్నారు సుంకోజి దేవేంద్రాచారి.

‘‘ నా బాల్యంలో పెద్దలెవరయినా నాకు మంచి మంచి పిల్లల కథలు చెప్తే బావుండునని అనుకునే వాడిని.... కాని, మా కుటుంబ నేపథ్యం కారణంగా ఆ కోరిక సాంతం నెరవేర లేదు ... ఆ కోరిక యిప్పుడిలా తీర్చుకుంటున్నాను! ...
మా చిన్నారి మనవరాలు చిరంజీవి లాహిరికి ఎన్నో మంచి మంచి , గొప్ప గొప్ప పిల్లలల అద్భత కథలు చెప్పాలి. నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి ... అందుకే ఈ పాల పిట్ట కథలు రాసాను ...’’ అని రచయిత ఆవిష్కరణ సభలో ఒకింత ఉద్వేగానికి లోనవుతూ చెప్పారు ...


మరి, యింత మంచి పుస్తకాన్ని మనమూ మన పిల్లలకి బహుమతిగా కొని యిద్దామా?






















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి