2, జనవరి 2010, శనివారం
నత్తలుండవూ?!
అల్పులు ఎప్పుడూ తక్కువ ఆలోచనలేచేస్తూ ఉంటారు. ఉన్నతమయినఆలోచనలు వారికి రావు, మరి ! పద్యంచూడండి ...
నక్కలు బొక్కలు వెదుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్
చూసారు కదూ? అందుకే కదా అన్నారు, ‘‘ పంది బురద మెచ్చు, పన్నీరు మెచ్చునా? అని !
ఈ రకమయిన అల్పత్వాన్నే ప్రదర్శించిన ఓ బకరాజు వృత్తాంతం చూడండిదిగో ...
‘ ఎవ్వడవీవు? కాళ్ళు మొగ మెఱ్ఱన?’ ‘హంసను’. ‘ఎందునుందువో?’
‘దవ్వుల మానసంబునను’ ‘దాన విశేషములేమి తెల్పుమా?’
‘మవ్వపు కాంచనాబ్జములు మౌక్తికముల్ గలవందు ’ ‘నత్తలో?!’
‘అవ్వి ఎరుంగమ’న్న నహహాయని నవ్వె బకంబులన్నియున్.
ఓ రాయంచ మానస సరోవరం నుండి ఎలా వచ్చిందో, ఓ కొంగలుండే కొలను దగ్గరికి వచ్చింది దానిని చిత్రంగా చూసాయి, అక్కడున్న కొంగలన్నీ. కుతూహలంగా హంసను అడిగాయి : ‘‘ భలే ! నీ కాళ్ళూ, ముఖం ఎర్రగా ఉన్నాయి...నీ ఊరేది? ఎక్కడుంటావు? అక్కడి విశేషాలు చెప్పు .’’ అని.
రాయంచ బదులిచ్చింది : ‘‘ నేను హంసను. నా నివాసం మానస సరోవరం. అబ్బో అదిక్కడికి చాలా దూరం లెండి ...’’
‘‘ అలాగా ! మరక్కడ విశేషాలో?’’
రాయంచ పొంగి పోతూ తమ ప్రాంతం విశేషాలను గొప్పగా చెప్పింది : ‘‘ వాహ్ ! అక్కడ బంగారు పద్మాలూ, మంచిముత్యాలూ ఉంటాయి తెలుసా ?! ’’ అని..
కొంగలు చప్పున అడిగేయి : ‘‘ చాల్లే, సంబడం ! ... ఇంతకీ, అక్కడ నత్తలుంటాయా? అది చెబుదూ ముందు ... ’’
రాయంచ తెల్లబోయింది. అమాయికంగా బదులిచ్చింది : ‘‘ నత్తలా ! వాటి సంగతి మాకు తెలీదే ! ’’ అని.
దాంతో కొంగలన్నీ పక పకా ( బక బకా అని అందామా?) నవ్వి, రాయంచని‘ ఓసి వెర్రి మొహఁవా’ అన్నట్టుగా చూసివెక్కిరించాయిట !
ఇలాంటి బడుద్ధాయిలను చూసే కదా, మన ప్రజాకవి వేమన ...
అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా !
విశ్వదాభిరామ ! వినుర వేమ ! అని చెప్ప లేదూ !
ఎలాగూ హంసల గురించీ , కొంగల గురించీ వచ్చింది కనుక, బాతుల గురించి కూడా చెప్పుకుందాం...
శ్రీకృ ష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యదలో ఓ చక్కని పద్యాన్ని గుర్తు చేసుకుందాం ...
తలబక్షచ్చటగ్రుక్కి బాతువులు కేదారంపు గుల్యాంతర
స్థలి నిద్రింపగ జూచి యారెకు లుష స్నాతప్రయాతద్విజా
నలిపిండీకృత శాటులన్సవిధతద్వాసంబు జేర్పంగ రే
వుల డిగ్గ న్వెసబారు వాని గని నవ్వు న్శాలిగోప్యోఘముల్.
ఎంత అపురూపమైన వర్ణనో చూడండి ...
తెల్ల వారు ఝూమునే లేచి, నదీ తీరానికి పోయి, బ్రాహ్మణులు స్నానాదులాచరిస్తారు కదా? అయితే, వాళ్ళు ఒక్కో సారిఅక్కడ తమ బట్టల పిడుచలు మరిచి పోయి యిళ్ళకి వెళ్ళి పోతూ ఉండం కద్దు. ఓ రోజు, నది ఒడ్డున రెక్కలలో తలలుదూర్చుకుని, నిద్ర పోతున్న బాతుల్ని చూసి, అవి బాపనయ్యల బట్టలనుకుని, వాటిని వారికి తిరిగి యిచ్చేద్దాం అని, ఆరెకులు దగ్గరగా వెళ్ళారు. వాళ్ళు దగ్గరకి రావడంతో, ఆ చప్పుడికి బాతులు నిద్రలేచి,టపటపా ఈదుకుంటూ వెళ్ళిపోయాయిట! ఈ తతంగాన్ని చూసి, అక్కడున్న పైరు కాపరి యువతులు విరగబడి నవ్వారుట !
ఇంత మనోహరంగా వర్ణించడం రాయల వారికే చెల్లింది కదూ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి