8, జనవరి 2010, శుక్రవారం

చుక్కలూ ... చంద్రుడూ ....




















కమ్మని తెలుగు పద్యాలు ఓ రెండు చూద్దామా !!

మన కవుల అందమైన కల్పనలని చవి చూద్దామా !!

సోరణగండ్ల
రాఁ గొదమ చుక్కలు పట్ట సతుల్కవాటముల్
చేరుప మౌక్తికంబులని చిల్లులు వుత్తురు రమ్మటంచుఁబొ
ల్పారు వితాన హారముల యందొగి హారత వ్రేలి ప్రొద్దు పోఁ
గా రతి డస్సి గాడ్పులకు గాఁదెఱవన్జను విచ్చి మేడలన్.

( ఆముక్త మాల్యద - శ్రీ కృష్ణ దేవరాయులు )

మధురా నగరంలో మేడలని వర్ణిస్తూ చెప్పిన పద్యం, మధురా నగరంలో మేడలు ఎంత ఎత్తైనవి అంటే, ఆకాశంలో ఉండే పిల్ల చుక్కలు నగరిలో ఉండే మేడల కిటికీల లోనుండి దూరుతూ ఉంటాయి. అక్కడి స్త్రీలు తమకి దాపుగా వచ్చిన చుక్కలని పట్టు కోవాలని వెంటనే తలుపులు మూసి వేస్తారు. తమని ముత్యాలు కాబోలుననుకొని, హారం కట్టడానికి తమకి ఎక్కడ బెజ్జాలు వేస్తారో అనే భయంతో చుక్కలు కిమ్మనకుండా స్త్రీల హారాలలో వ్రేలాడుతూ ఉంటాయి. అలా ఆపదనుండి గట్టెక్కుతాయన్నమాట ! సరే, రాత్రి గడిచింది. రతి కేళి ముగిసి, చొక్కి, స్త్రీలు రవంత చల్ల గాలి కోసం కిటికీలు తెరుస్తారు. ఇంకేముందీ, మన చుక్కలు బతుకు జీవుడా అనుకుంటూ వెంటనే తమ హార రూపాలను వదిలి, కిటికీల గుండా తుర్రున సారి పోతాయిట !
కవి భావన ఎంత మనోహరంగా ఉందో గమనించేరు కదూ?

చుక్కల చిక్కులు యిలా ఉంటే, పాపం, మన అందమైన జాబిల్లి అవస్థ కూడ గమనిద్దామా?

రేలమృతాంశులో శశము రెమ్ముదమంచుఁదలంచి జాళువా
మేలి పసిండి సోయగపు మేడల గుజ్జెన గూళ్ళ సందడిన్
బాలిక లుండి యావలఁజనం గని, చింతిలి వంట యింటి కుం
దే లిది యెందు బోగలదు ? నేఁటికి నేమని యందురందులన్.

( విజయ విలాసము - చేమకూర వేంకట కవి.)

ఇంద్ర ప్రస్థ పురాన్ని వర్ణిస్తూ అక్కడి మేడలని గురించి కవి అతి శయోక్తిగా చెప్పిన పద్యం యిది ...
పురంలో వెన్నెల రాత్రుల వేళ బాలికలు అక్కడి జాళువా బంగారు మేడల మీద ఆడుకుంటున్నారు. మేడలు ఆకాశమంత ఎత్తైనవి కావడంతో చంద్రుడు తన దారంట తాను పోతూ, మేడల దగ్గరగా వస్తూ ఉండడం కద్దు. సారి చంద్రుడు అలా తమ మేడల దగ్గరకి వచ్చినప్పుడు చంద్రుడిలో ఉండే కుందేలుని పట్టుకుందామని తీర్మానించుకున్నారు. తీరా, తమ గుజ్జన గూళ్ళ ఆట సందడిలో పడి విషయం కాస్త మరిచి పోయేరు. చంద్రడు తమ మేడలోకి దూరి నట్టే దూరి తామంతా కాస్త ఏమరుపాటుగా ఉన్నప్పుడు తమని , మేడలనీ, దాటుకుని వెళ్ళి పోయాడుట. అయ్యో ! అనుకుని విచారించి, అంత లోనే, ఇది వంటయింటి కుందేలే కదా, ఎక్కడికి పోతుందిలే ! అనుకున్నారుట !
చుక్కల గురించీ, చుక్కల్లో చంద్రుని గురించీ మన కవులు వందలాది అందమైన పద్యాలు రచించారు. చక్కని కల్పనలు ఎన్నో చేసారు. ఇప్పటికి రుచి కోసం రెండూ ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి