9, జనవరి 2010, శనివారం

ఓ పాలిటు సూస్తే, మీ సొమ్మేం పోద్ది ?!


గ్రామ్య భాషా పద్య రచనలు - నా సేకరణలో లభించిన వాటిని - మీ ముందుంచుతున్నాను. చూడండి ...
ముందుగా యీ పద్యాలను చూడండి ... మీ ఎరుకన గల పద్యాలను కూడ జోడిస్తే సంతోషం.

మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే, కూపనటత్
భేకములకు నాకధునీ
శీకరముల చెమ్మ, నంది సింగయ తిమ్మా !



అని, రామ కృష్ణ కవి సన్నాయి నొక్కుల నొక్కినా,

ఎమిదిని సెపితివొ కపితము
బెమ పడి వెరి పుచ్చ కాయ దిని సెపితో
ఉమితక్కైదిని సెపితొ
అమవసి నిసి అనిన మాట అలసని పెదనా !

అని, పెద్దన కవిని మేలమాడినా ... గ్రామీణ జీవనమూ, అక్కడి జనుల భాషాసంస్కారాలూ, వారి నిసర్గ సుందర స్వభావమూ ఆహ్లాదకరాలు కదా?
సరే, కవి శ్రీనాథుని భయ పెట్టిన అనాగరిక వేష ధారుల గురించీ, గగుర్పాటునకు గురిచేసే వారి వర్తనల గురించీ కూడ చూదాం.

దస్త్రాలున్, మసి బుర్రలుం, గలములుం, దార్కొన్న చింతంబళుల్
పుస్తుల్ గారెడు దుస్తులుం, జెమట గంపు గొట్టు నీర్కావులుం
అస్తవ్యస్తపు గన్నడంబును, భయంబై దోచు గడ్డంబులున్
వస్తూ చూస్తిమి, రోస్తిమిన్, పడమటన్ వ్యాపారులంగ్రూరులన్.


ఈ అమ్మో బూచుల సంగతి కాస్త పక్కన పెట్టి మరో పద్యం చూదాం ...

పో!పో !బాపడ ! దోసెడూదలినన్ పోలేక పేరాసలన్
మీ పో జాగితి వేమి? నీ సదువు తిర్నామంబులో, సుద్దులో,
బూపాలంబులో, లంక సత్తెలో, బలా ! బాల్లావు పోట్లాటలో
కా ! పాటింప పటండ్రు బాలిశులు భర్గా ! పార్వతీ వల్లభా !


( కూచిమంచి తిమ్మ కవి - పార్వతీ వల్లభ శతకం)

ఈ కవి గారిదే, మరొకటి ...
అబ్బబ్బ ! కిందటేడప్పయ్య తీర్తాన
జోలె జంగమకిస్తి సోలెడుప్పు
సాతాని జియ్యరు సతికితే పోయిస్తి
కొల్లగా గుల్లెడు సల్ల బొట్టు
లంక సత్తెల వాడు పొంకాన పొగిడితే
మాల దాసరి కిస్తి మానెడూద
వేదాలు వాగితే యెల్లు బొట్టయ్యకు
కొలకుండ దోసెడు కొర్రలిస్తి

ఔర ! తమకన్న కూసుగాడవని నింక
గలడె యను మూర్ఖుడిద్ధర, కామ వైరి
భూసుత విలాస ! పీఠికా పుర నివాస !
కుముద హిత కోటి సంకాశ ! కుక్కుటేశ !


( కుక్కుటేశ్వర శతకం)
మరో పద్యం చంద్ర శేఖర శతకం నుండి ...

గంటము పేర యింటను బగాతము సెప్పితె, ఈదిలోనవో
రెంటిలి సూత్తి నేను, యిను, రేత్రిరమాండెము బాగ సెప్పె మా
యింటి దరోదనుండు బవు యిద్ద మిబీసను సించి లంకలో
మంటెలిగించి వొచ్చెననుమాంద్యుడు మూర్ఖుడు చంద్ర శేఖరా !


రామాయణానికీ, భారతానికీ లంకె పెట్టి, దుర్యోధనుడికీ, విభీషణుడికీ, లంక కాల్చిన హనుమంతుడికీ ఏ గతి పట్టంచాడో చూడండి ...
మరొకటి ...

సంగిత కాడ ! పాడకిక సాలును. నీవది పాడినందుకున్
యింగితమెంచి నేను మరి యిన్నదుకున్ సరి పోయె, నింక పై
హంగుగ నే తలూపినట్టి యప్పుకు తంబుర నీడ పెట్టి పో !
బంగుడ బాప నోడ ! యని పల్కును మూర్ఖుడు చంద్ర శేఖరా !!


రాత్రంతా బాగోతం చెప్పి, ఏఁవైనా యిస్తాడేమో నని గంపెడాశతో చేతులు కట్టుకుని నిలుచున్నాడు ఆ పేద కళాకారుడు.
వాడికి పిసినారి కళాభిమాని ఎలాంటి ఝలక్ యిచ్చాడో చూసారా !
‘‘ చాల్లే వయ్యా, నువ్వు పాడి నందుకూ, నేను విన్నందుకూ ... చెల్లు ! పాయె ! ..మరి నేను మెడ నొప్పెట్టేలాగున తలూపేను కదా ? దానిసంగతేంటి ? ... అంచేత ... నేను తలూపినందుకు నీ తంబురా అక్కడ పెట్టి మర్యాదగా వెళ్ళవయ్యా ....’’

శ్రోత్రియ బ్రామ్మణ కుటుంబాలలో భాషని అనుకరిస్తూ ఓ కవి చెప్పిన పద్యం కూడా చూడండిదిగో ...

అస్సే ! చూస్సివషే ! వొషే ! చెవుడషే !అష్లాగషే !ఏమిషే !
విస్సా వఝ్ఝుల వారి బుర్రి నటయా విస్సాయ కిస్సారుషే
విస్సండెంతటి వాడె, యేళ్ళు పదిషే, వెయ్యేళ్ళకీడేషుమా !
ఒస్సే, బుర్రికి ఈడషే, వొయిషుకేముంచుందిలే, మంచి వొ
ర్చెస్సే, యందురు శ్రోత్రియోత్తమ పద స్త్రీలాంధ్ర దేశమ్మునన్.


( తెలుగు నాడు - దాసు శ్రీరాములు)

కాళ్ళకూరి నారాయణ రావు చింతామణిలో సుబ్బి సెట్టి ...

ఇంటిలో కాలెట్ట నిచ్చిందె శాలని
యేలకి యేలు గుప్పేసినాను
పిల్ల సౌత్తాడింది, పెట్టాలి తిళ్ళంటె
బళ్ళతో సావాన్లు పంపినాను
యే పూట కాపూట యెచ్చని సిరు తిళ్ళు
పట్టెగెల్ళి మొగాన కొట్టినాను
మేలాని కెల్లొచ్చి, మెదలక తొంగుంటె
బిడియ మిడిసి కాల్ళు పిసిగినాను
అర్ధ రేతిరి కాడ ఆరికీరికి సీట్లు
మొయ్య మంటే కూడ మోసినాను
యిన్ని సేసిన వోణ్ణి ఈ డ్చి పారేసారు
తక్కినోళ్ళ మాట లెక్క యేంటి ?
యేఁవి లాబఁవట్టి యెదవల కొంపల
కెల్లకండి, యెల్తె తల్లి తోడు !


జరగాల్సిన శాస్తి జరిగేక కానీ , శెట్టికి తత్వం తలకెక్కలేదు, మరి !

‘మగ వాడికయినా ఆడదానికయినా నీతి వుండాలి ...’ ‘ వేశ్య అన గానే అంత చులకనా ...’ ‘సానిదానికి మాత్రం నీతి వుండొద్దూ ? ...’ అనడాని అందరూ మధుర వాణి లాంటి వాళ్ళు కాదు కదా?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి