11, జనవరి 2010, సోమవారం

మహా భారత యుద్ధం - అక్షౌహిణీ సంఖ్య వివరణ.






















మహా భారత యుద్ధంలో కౌరవ పాండవులు 18 దినాల పాటు
యుద్ధం చేసారు. భారత యుద్ధం శమంత పంచకం అనే చోట జరిగింది. భారత యుద్ధంలో మొత్తం 18 అక్షోహిణీ సేనలు మోహరించి యుద్ధం చేసాయి. పాండవుల పక్షాన 7 అక్షోహిణులు కౌరవుల పక్షాన 11 అక్షోహిణులు సేన యుద్ధం చేసింది. యుద్ధం మొదలు కాకుండానే యుద్ధ రంగంలో నిలచి ఉన్న తన బంధు వర్గాన్ని చూసి, అర్జునుడు యుద్ధ విముఖుడై దిగాలు పడి పోయాడు. శ్రీకృష్ణుడు గీతా బోధ చేసి, అర్జునుని యుద్ధ సన్నద్ధునిగా చేసాడు.
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న అక్షోహిణీ సైన్య వివరాలు చాల మందికి తెలిసినవే అయినా, తెలియని వారి
కోసం,తెలుసుకోగోరే వారి కోసం, తెలుసుకోవాలనే ఆసక్తి గల వారి కోసం ఇక్కడ పొందు పరిచాను.
అక్షోహిణి అంటే ? ....
ముందుగా యీ పద్యం చూడండి ...
వరరధ మొక్కండు వారణ మొక్కండు, తురగముల్ మూఁడు కాల్వురును నేవు
రను సంఖ్య గల యది యగుఁబత్తి, యది త్రిగుణంబైన సేనాముఖంబు, దీని
త్రిగుణంబు గుల్మంబు, దీని ముమ్మడుఁగగు గణము, తద్గణము త్రిగుణిత మైన
వాహిని యగు, దాని వడి మూఁట గుణియింపఁ బృతన నాఁబరఁగుఁ దత్ పృతన మూట

గుణిత మైనఁజము వగున్, మఱి దాని ముమ్మడుఁగనీకినీ సమాఖ్య నొనరు,
నదియుఁబదిమడుంగులైన నక్షౌహిణి యౌ నిరంతర ప్రమాను సంఖ్య.

దీని వివరణ:
ఒక శ్రేష్ఠమైన రధం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, కాల్బలం ఐదుగురు = పత్తి
మూడు పత్తులు = సేనా ముఖం
సేనా ముఖాలు మూడు = గుల్మం
మూడు గుల్మములు = గణము
గణములు మూడు = వాహిని
మూడు వాహినులు = పృతన
మూడు పృతనలు = చమువు
మూడు చమువుల = అనీకిని
అనీకినులు పది = అక్షౌహిణి.
లెక్కన చూస్తే ఒక అక్షొహిణి సేనలో మొత్తం బలం యిలా ఉంటుంది ...
రధములు = 21870
ఏనుగులు = 21870
గుఱ్ఱములు = 65,610
వీర భటులు ( కాల్బలం) = 1,09,350 మంది.
ఇలాంటి అక్షౌహిణీ సేనలు యిరు బలాల వారికీ కలిపి మొత్తం 18 అక్షౌహిణుల సేన కురుక్షేత్ర యుద్ధంలో సమరం
చేసింది.
కురు పాండవుల యుద్ధం శమంత పంచకం అనే చోట జరిగింది. ప్రాంతానికి అందు వల్ల కురుక్షేత్రం అనే పేరు
వచ్చింది.
కురు పాండవులు భండనం చేసిన శమంత పంచకానికి పేరు రావడానికి కారణం ఉంది ...
త్రేతా ద్వాపర యుగాల నడిమి కాలంలో పరశు రాముడు తన గొడ్డలితో సర్వక్షత్రియ హననం చేసి, రక్తం తో
ప్రాంతాన్ని పూర్తిగా తడిపాడు. ఐదు మడుగులుగా చేసి, తన పితృదేవతలకు తర్పణాలు అర్పించాడు. అందు వల్ల ప్రదేశానికి శమంత పంచకం అనే పేరు వచ్చింది.

2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

ప్రియ మిత్రమా!
చాలా బాగా వ్రాసావు.
నేనూ ఆంధ్రామృతంలోఉంచాను. చూస్తావని పంపిస్తున్నాను.

గురువారం 8 అక్టోబర్ 2009
అదొక పెద్ద వెల్లువ. దాని సంగతి మీకు తెలుసా?
2 COMMENTS

ప్రియ పాఠకులారా!
మనం అక్షౌహిణిని గూర్చి ముచ్చటించుకున్నాం కదా! అది బారతం వరకే మనం పరిమితమై చెప్పుకున్నాం. ఐతే రామాయణం లోనికి తొంగి చూస్తే భారతంలో చెప్పిన 18 అక్షౌహిణీల సైన్యం అత్యల్పమనిపించక మానదు. మీరూ పరికించండి.

కంబ రామాయణంలో " సుగ్రీవుని వద్ద గల సైన్యం " 70 వెల్లువలట.
ఈ వెల్లువ సంగతి మనకు వివరంగా తెలియక పోయినా "అది పార్టీ మీటింగ్‍కు వచ్చినజనమేంటిరా బాబు, అదో పెద్ద వెల్లువ" అని వాడేస్తూ ఉంటాం.
ఇప్పుడీ వెల్లువ విషయం తెలుసుకుందాం.

అక్షౌహిణికి ఎందరుంటారో మనం ఇంతకు ముందు టపాలో తెలుసుకున్నాం కదా! అటువంటీ
8 అక్షౌహిణులు = ఒక ఏకము.
8 ఏకములు = ఒక కోటి. {ఈ కోటి మనం వాడుకునే నూరు లక్షలొక కోటి అన్నది మాత్రం కాదని గుర్తించండి.}
8 కోట్లు = ఒక శంఖము.
8 శంఖములు = ఒక కుముదము.
8 కుముదములు = ఒక పద్మము.
8 పద్మములు = ఒక నాడి.
8 నాడులు = ఒక సముద్రము.
అటువంటి
8 సముద్రములు = ఒక వెల్లువ.
అంటే 366917139200 మంది సైన్యం ఉంటే దానిని వెల్లువ అంటారన్నమాట.

ఇటువంటివి 70 వెల్లువల సైన్యం సుగ్రీవుడి అధీనంలో ఉండేది.
అంటే 256842399744000 సైన్యమన్నమాట.
ఆ సుగ్రీవుని వద్ద గల సైన్యాధిపతులే 67 కోట్ల మంది.
వీటన్నిటికీ నీలుడు అధిపతి.
ఆశ్చర్యంగాలేదు?

తెలుకోవాలనుకున్నా, తెలియఁజెప్పాలనుకున్నా చాలా చాల విషయాలు మన చరిత్ర పుటల్లోంచి లభిస్తూనే ఉంటాయి గ్రహించేవారికి. మీకు తెలిసిన విషయాలు నాకూ తెలియఁజేయండి.

జైహింద్.
రాసింది చింతా రామకృష్ణారావు. AT THURSDAY, OCTOBER 08, 2009
LABELS: సాహితీ సంపద
బుధవారం 7 అక్టోబర్ 2009
భారత యుద్ధంలో పాల్గున్న 18 అక్షౌహిణీ లంటే ఎంత సైన్యం?
3 COMMENTS

పాఠకావతంసులారా!
మహాభారతంలో పర్వాలు 18.
మహాభారత యుద్ధంలో పాల్గొన్న సైన్యం 18 అక్షౌహిణీలు.
అసలు అక్షౌహిణి అంటే ఎంత సైన్యం?
దీనిని గూర్చి సప్రమాణికంగా తెలుసుకోవాలని మనందరికీ ఉంటుంది కదా! అందు నిమిత్తం
మహాభారతం ఆది పర్వంలో ప్రథమాశ్వాసంలో 80 వ నన్నయ వివరించిన అక్షౌహిణీ స్వరూపాన్ని యథా తథంగా చూద్దాం.

సీ:-
వర రథమొక్కండు, వారణ మొక్కండు, - తురగముల్ మూఁడు, కాల్వురును నేవు
రను సంఖ్య గలయది యగుఁబత్తి, - యది త్రిగుణంబైన సేవా ముఖంబు,
దీని త్రిగుణంబు గుల్మంబు,దీని మమ్మడుగగు - గణము,తద్గణము త్రిగుణితమైన
వాహిని యగు,దాని వడి మూఁట గుణియింపఁ - బృతననాఁబరగుఁ,దత్‍పృతన మూఁట
ఆ:-
గుణితమైనఁజమునగున్, మరి దానిము - మ్మడుఁగనీకినీ సమాఖ్యనొనరు,
నదియుఁబది యడుంగులైన నక్షౌహిణి - యౌ నిరంతర ప్రమాను సంఖ్య.

వివరణ:-
ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుఱ్ఱాలు, ఐదుగురు కాల్బలములు కలిసిన సైన్యము "పత్తి".
దానికి మూడు రెట్లు సైన్యమును "సేనాముఖము"
దానికి మూడు రెట్లున్న"గుల్మము"
గుల్మానికి మూడు రెట్లున్న "గణము"
గణానికి మూడు రెట్లున్న "వాహిని"
వాహినికి మూడు రెట్లున్న " పృతన"
పృతనకు మూడు రెట్లున్న "చమురు"
చమురుకు మూడు రెట్లున్న "అనీకిని"
అనీకినికి పది రెట్లున్న "అక్షౌహిణి"

అంటే
{రథము+ఏనుగు+3గుఱ్ఱాలు+5 కాల్బలమును}పత్తి
ఇంటూ 3=సేనాముఖము
ఇంటూ3=గుల్మము
ఇంటూ3=గణము,
ఇంటూ3=వాహిని
ఇంటూ3=వృతము
ఇంటూ3=చమురు
ఇంటూ3=అనీకిని
ఇంటూ10=అక్షౌహిణి.

అనగా అక్షౌహిణిలో
రథాలు 21,870
ఏనుగులు 21870
గుఱ్ఱాలు 65,610
కాల్బలము 1,09,350
ఉండును.

18 అక్షౌహిణీలలో
రథాలు 3,93,660
ఏనుగులు 3,93,660
గుఱ్ఱాలు 11,80,980
కాల్బలము 19,68,300

అంతే కాదండోయ్.
దీనికి అదనంగా రథానికొక సారథి చూపున, ఏనుగుకొక మావటివని చొప్పున అదనంగా కలుపుకోవాలి.
అలా కలుపుకుంటే
కురుక్షేత్ర యుద్ధంలో పాల్గున్నవారు 47,23,920 మంది.

ఈ 18 అక్షౌహిణీలలో పాండవుల బలం 7 అక్షౌహిణీలు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

జైహింద్.
రాసింది చింతా రామకృష్ణారావు. AT WEDNESDAY, OCTOBER 07, 2009
LABELS: సాహితీ సంపద

పంతుల జోగారావు చెప్పారు...

ధన్య వాదాలు. చదువరుల పరిశీలనార్ధం వీటిని కూడ ఇక్కడ పొందు పరుస్తున్నాను. మంచి వివరాలు సేకరించి అందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి