14, జనవరి 2010, గురువారం
తగునా యిది మీకూ ?!
రాచరికపు రోజులలో కవులు రాజాశ్రయాన్ని పొంది, తమ కవిత్వంతో రాజు గారిని మెప్పించి వారిచ్చిన తృణమో, పణమో ప్వీకరిస్తూ ఉండే వారు.
అప్పుడు కూడ ఆశించిన దానికన్నా అధికంగా యిచ్చి అబ్బుర పరిచే వారూ, యిస్తారనుకున్నది యివ్వకుండా యిబ్బంది పెట్టే వారూ, యిచ్చిందే చాలు పొమ్మనే వారూ, చాలదని నసిగితే కించ పడకుండా మరి కొంచెం యిచ్చే వారూ ... యిలా అన్ని రకాల వారూ ఉండే వారు ...
ఐతే, కవి చమత్కారానికి సంతోషించి. వారడిగినంతా యిచ్చి, తమ ఔదార్యాన్నీ, వితరణ గుణాన్నీ చాటుకున్న మహా రాజులూ ఉండే వారు. ఈ శ్లోకం చూడండి ...
అనవేల మహీపాల ! స్వస్త్యస్తు తవ బాహవే
ఆహవే రిపురోర్దండ చంద్రమండల బాహవే.
అనవేలు వేమా రెడ్డి ప్రభువుల వద్దకు ఒక కవి వచ్చి ఆశీర్వదిస్తూ ఈ శ్లోకం చెప్పాడు. రాజు గారి శౌర్య సంపదను కీర్తిస్తూ చెప్పిన శ్లోకమిది.
ఓ సారి శ్లోకాన్ని చూస్తే అందులో ‘ వే’ అనే అక్షరాలు మొత్తం నాలుగు ఉన్నట్టు గమనిస్తాం కదూ. అసలు కథ యిక్కడే మొదలయింది ..
కవి గారి కవిత్వాన్ని మెచ్చుకుని, రాజు గారు రెండు వేల వరహాలు యివ్వ బోయేడు.
కవి గారికి కొంటె తనం, లౌక్యం జాస్తి . అందుకే వాటిని తీసుకోకుండా తనకింకా ఎక్కువ కావాలనే విషయాన్ని చమత్కారంగా తెలియ జేసాడు ...వారి మధ్య జరిగిన సంభాషణని చిత్తగించండి.
కవి : ‘‘ అయ్యా, నేను తమకి నాలుగు వేలు యిచ్చాను. తాము నాకు రెండు వేలు యివ్వడం భావ్యమా చెప్పండి ? ( శ్లోకంలో వే అనే అక్షరాలు నాలుగు ఉండడం చూసాం కదా !)
సరేలెమ్మని రాజు మొత్తం అయిదు వేలు యివ్వ బోయాడు
కవి : ‘‘ రాజా ! మేము ఆరువేల నియ్యోగి బ్రాహ్మణులము. మా గౌరవం నిలుప రాదా ?’’
రాజు మరో వరహా కలిపి, మొత్తం ఆరు వరహాలివ్వబోయేడు.
కవి : ‘‘ మాది మాకిచ్చుట న్యాయమా ప్రభూ ! ’’ ( ఆరువేల నియోగి అన్నది బ్రాహ్మణులలో ఒక శాఖ. తమ శాఖ పేరు లోనే ఆరు ‘వే ’ లుండగా రాజు ఆరింటినే యివ్వడం తగదని చమత్కారం
రాజు నవ్వుకుని, మరొకటి కలిపి, మొత్తం ఏడు వరహాలు యిచ్చాడు. దానికీ కవిగారు తలాడించ లేదు.
కవి : ‘‘ ఏడు రోదన సంఖ్య కదా రాజా !’’ అని గునిసాడు. ( ఏడు ఏడుపు గొట్టు సంఖ్య అని చమత్కారం)
కవి చమత్కార భాషణకి రాజు ఎంతగానో సంతోషించి, మొత్తం ఎనిమిది వరహాలిచ్చి కవిని గౌరవించి పంపించేడు !
ఇందులో మరో చిన్న చమత్కారం కూడా యిమిడి ఉందండీ ... రాజు గారి పేరు చూడండి ... అనవేలు వేమా రెడ్డి. ఇందులోనూ రెండు ‘వే’లున్నాయి ! అసలందుకే ప్రభువుల వారు తమ పేరుకి తగ్గట్టుగా మొదట రెండు వేల వరహాలిచ్చాడు !
లేబుళ్లు:
మీ కోసం ఓ చమత్కార శ్లోకం ...
1 కామెంట్:
kadha chaala baavundandi.
-- Vinay Chaganti
కామెంట్‌ను పోస్ట్ చేయండి