16, జనవరి 2010, శనివారం

ఎవరివయ్యా, వచ్చినావూ ?!




కస్త్వం ? శూలీ. మృగయ భిషజం. నీల కంఠ ప్రియేహం
కేకామేకం కురు. పశు పతిర్నైవ దృశ్యే విషాణే
స్థాణుర్ముగ్ధే నవదతి తరు: జీవితేశశ్శివాయ:
గచ్ఛాటవ్యాం ఇతి హత వచ: పాతువశ్చంద్రచూడ:

శివ పార్వతులు సరస సంవాదాలు ఎంత హృద్యంగా ఉన్నాయో చూడండి ....
తలుపు అవతల శివుడు. లోన పార్వతీ దేవి....
పార్వతి : కస్త్వం ? ( ఎవరయ్యా నువ్వు ? )
శివుడు : శూలీ ( శివుడిని )
పార్వతి : మృగయ భిషజం ( అలాగయితే వైద్యుడి దగ్గరకి పో ! ఇక్కడికెందుకొచ్చావూ ? ( శూలి అంటే తల నొప్పి అనే
అర్ధం కూడ ఉంది
కదా ! )
శివుడు : నీల కంఠ ప్రియేహం ( అయ్యో, ప్రియా, నేను నీల కంఠుడిని )
పార్వతి : కేకామేకం కురు ( ఓహో ! నెమలివా ! అలాగ అరువ్ చూదాం ! )
శివుడు : పశుపతి: ( నేను పశుపతిని )

పార్వతి : నైవ దృశ్యే విషాణే ( పశు పతివా , మరి కొమ్ములేవీ ?)
శివుడు : స్థాణు: ముగ్ధే ( ముద్దరాలా ! నేను స్థాణువును.)
పార్వతి: వదతి. తరు: ( మరింక చెప్పకోయీ ! చెట్టువన్న మాట ! )
శివుడు : జీవితేశశ్శివాయ ( కాదు . కాదు. నీ జీవితేశ్వరుడిని. శివుడిని )
పార్వతి : గచ్చాటవ్యాం ( అలాగా ! అయితే అడవుల్లో తిరుగు నీకిక్కడేం
పని ! ..శివా అంటే నక్క అని కూడ అర్ధం ఉంది కదా, అందుకే పార్వతి యిలా మేలమాడింది.
ఇతి హత వచ: పాతువశ్చంద్రచూడ: = ఇలా తన సతి పార్వతీ దేవితో మాటల్లో ఓడిపోయిన శివుడు మమ్ము కాపాడు
గాక !









2 కామెంట్‌లు:

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

జగన్మాతా పితలు సరస సంభాషణ రసవత్తరంగా ఉంది. చక్కని విషయం చెప్పిఆనందం కలిగించిన మీకు ధన్యవాదములు.

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

మిత్రమా! నీవుంచిన శ్లోకానికి నా అనువాద సీసం చూడు.
శనివారం 16 జనవరి 2010
ఆంధ్రామృతముఁ గ్రోలు పాఠకులను ఆది దంపతులు రక్షించుఁగాక.

శ్లో:-
కస్త్వం ? శూలీ. మృగయ భిషజం. నీల కంఠ ప్రియేహం
కేకామేకం కురు. పశు పతిర్నైవ దృశ్యే విషాణే
స్థాణుర్ముగ్ధే నవదతి తరు: జీవితేశశ్శివాయ:
గచ్ఛాటవ్యాం ఇతి హత వచ: పాతువశ్చంద్రచూడ:
సీll
పార్వతి:- ఎవరివయ్యా నీవు?
శివుఁడు:- ఎఱుగుమా శూలిని.
పార్వతి:-శూలివా? తగు మందు చూచి, గొనుమ!
. . . . . . .(శూల= బాధ.;శూలి=తలనొప్పితో బాధ పడుచున్నవాఁడు)
శివుఁడు:-నీల కంఠునిగదే? ఏలనే కినుకయు?
. . . . . . . .(నీలికంఠుఁడు=నీలమైన కంఠముఁగలవాడు. నెమలి.)
పార్వతి:-నెమలి కూతను కూసి నిలుమ! కనుదు!
శివుఁడు:-పశుపతినే!
పార్వతి:- లేవు పశువు కొమ్ములు నీకు?
శివుఁడు:-స్థాణు వేనుగ!.(స్థాణువు= కదలనిది=చెట్టు)
పార్వతి:- వృక్ష జాతి వగుదొ?
శివుఁడు:- శివుడనేను.;పతిని!
పార్వతి:- శివుడన్న నక్కగా!(శివ=నక్క)
. . . . . . . .ఆడవి తిరుగ రాదె? నుడువులేల?
గీll
ఆది దంపతులు లిట్టుల యద్భుతముగ
సరస సల్లాపములఁ దేలు సమయమందు
భ్రాంతి నాంధ్రామృతముఁ గ్రోలు పాఠకులను
కాచి రక్షించుఁ గావుత! కాంక్ష తీర.
జైహింద్.
Print this post
రాసింది చింతా రామకృష్ణారావు. AT SATURDAY, JANUARY 16, 2010

కామెంట్‌ను పోస్ట్ చేయండి