28, జనవరి 2010, గురువారం

తిరుపతి వేంకట కవులు - అభినవాంధ్ర భోజ దర్శనం











తిరుపతి వేంకట కవులు నానా రాజ సందర్శనం చేస్తూ, అభినవాంధ్ర భోజులు, వితరణ శీలి , విజయ నగర ప్రభువులు ఆనంద గజపతి మహా రాజులను స్తుతిస్తూ చెప్పిన పద్య రత్నాలు ...

అల పతంజలి కృతంబైన భాష్యమునకే
పరిఢ విల్లును మహా భాష్య పదము
అల దేవ దేవుడై యలరారు శివునకే
తేజరిల్లును మహా దేవ పదము
అల త్రివిష్ఠప విభుండైన పాకారికే
యెన్నందగును మహేంద్ర పదము
అల కాళికా దాసుడౌ కవీశ్వరునకే
గణన కెక్కును మహా కవి పదమ్ము

రమణఁబరికింప నల మహా రాజ పదము
నీక తగు గాక, యన్యు లౌ లోక పతుల
కొకరికైనను చెల్లునే ! యోగ రూఢి
విజయ నగర మహా రాజ ! విపుల తేజ !

రాజు రాజనఁగనే రాజాయెనే చంద్రు ?
డల రాజ శేఖరు నాశ్రయించె
రాజు రాజనఁగనే రాజాయెనే యింద్రు ?
డర్క మాత్మజుని దాన మడిగి కొనియె
రాజు రాజనఁగనే రాజ రాజా కుబే
రుడు ? కిం నరేశత్వ రూఢి గాంచె
రాజు రాజనఁగనే రాజ రాజా సుయో
ధనుఁ? డధి కర్ణత్వ మనుగ మించె ;

రాజనిన రాజ రాజన్న రాజులందు
నీక తగు గాక యన్యు లౌ లోక పతుల
కొకరి కైనను చెల్లునే ? యుర్వి లోన
విజయ నగర మహా రాజ ! విపుల తేజ !

తానా రాజు, సుతుండు కోమటి ; కళత్రంబెన్న నక్షత్ర మెం
తో శైల్యమ్ము, నిశాకరత్వమును, శైత్యోపాధియుంగల్గు తా
రా నాధుండన దేహ గేహ వితత్రై వర్ణ సాకర్యకు
డౌనా ? యెన్నటికిన్ భవాదృశుడు ? కాడానంద భూపాలకా !


దీన పోషకుడన్న తేట మాటకు మహా
రాజ ! నీ నగరి కాలేజి సాక్షి !
విద్వత్ప్రభువటన్న విఖ్యాతి కో శాంత
నిధి ! భవన్నగర పండితులు సాక్షి !
శ్రిత పోషకుండన్న వితత కార్తికి మహా
మతి ! భవన్నగర హర్మ్యములు సాక్షి !
ఆనందమ కాలయంబన్న మాట కో
చారు ప్రతాప ! నీ పేరు సాక్షి !


నీ యశము దేశముల నిండె ననుట
కితర దేశాటకులమైన యేము సాక్షి !
పౌషవాడ కులాంబోధి పూర్ణ చంద్ర !
శ్రీమదానం గజపతి క్షితి తలేంద్ర !


తిరుపతి వేంకటేశ్వరులని ధీరులు పిల్తురు మమ్ము, బ్రహ్మ
ద్గురు వరు పాద సేవన మకుంఠిత సత్కృప మాకు నిచ్చె వ్యా
కరణము ; నీ కవిత్వమనఁగా నది పిన్నట నాడ పుట్టె
బ్బురముగఁ బెంచు కొంటి మిది పొమ్మనినన్ మఱి పోదు భూవరా !

ఎందఱఁ జూపెనేని వరియింపదు మా కవితా కుమారి,
న్నందుకు దేశముల్ దిరుగుటబ్బెను ; సౌఖ్యము లేక పోయె నా
నంద నృపాల ! నీదు సుగుణమ్ములు చెప్పిన నాలకించి వెం
టం దలయూచెఁగావునఁ దటాలునఁ దీనిఁబరి గ్రహింపుమా !


కవితా మాధురిఁ దా గ్రహించి, ‘‘ యిది శ్లాఘ్యంబిద్ది శ్లాఘ్యంబుగా
దు ; విశేషంబిట, నిర్విశేషమిట, మాధుర్యంబిటన్, వహ్వరే !
కవిరాజా !‘‘ యని, మెచ్చి యిచ్చు నృపుఁడొక్కడైనఁగర్వైనచోఁ
గవియై పుట్టుట కన్నఁబాప పరిపాకంబుండునే భూవరా !

అమ్మ వంకనుఁజుట్టమా యేమి ? భోజ భూ
పాల వర్యున కల్ల కాళి దాసు !
అబ్బ వంకనుఁజుట్టమా యేమి ? విక్రమ
ప్రభు వరేణ్యున కల్ల భట్ట సుకవి !
అత్త వంకనుఁజుట్టమా యేమి ? రాజ
రా ధీశ్వరునకు నన్నయ్య భట్టు !
మామ వంకనుఁజుట్టమా యేమి ? కృష్ణ రా
డ్ధరణీశ్వరునకు ఁబెద్దన్న గారు !

కవి యయిన వాని నెల్లను గారవింప
రాజయిన వాని కెల్ల ధర్మమ్ము గాక !
పూషవాడ కులాంబోధి ! పూర్ణ చంద్ర !
శ్రీమదానంద గజపతి క్షితి తలేంద్ర !!

శత ఘంట కవనం కరతలామలకంగా చెప్పి. అష్టావధాన కష్టావలంబనము ‘‘ నంబి కొండయ దండనము మాకు !’’ అనివచించిన ధీశాలురు తిరుపతి కవులు ! ‘‘ అల నన్నయ్యకు లేదు , తిక్కనకు లేదా భోగ...’’ మన గలిగినా, ‘‘ దోసమటంచెఱింగియును దుందుడు కొప్పఁగఁబెంచినార మీ మీసము ...’’ అన గలిగినా ధిషణ వారికే తగును కదా !!

2 కామెంట్‌లు:

కంది శంకరయ్య చెప్పారు...

ఈ సందర్భంగా నాకొక పద్యం గుర్తుకు వచ్చింది. దాని నెవరు రాసారో తెలియదు కాని ఈ పద్యం బొబ్బిలియుద్ధం సినిమాలో ఉంది.
రాజు కళంకమూర్తి, రతిరాజు శరీర విహీనుఁ డంబికా
రాజు దిగంబరుండు, మృగరాజు గుహాంతర సీమవర్తి, వి
భ్రాజిత పూసపాడ్విజయరామ నృపాలుఁడె రాజు గాక యీ
రాజులు రాజులే పెను తరాజులు గాక ధరాతలంబునన్.

పంతుల జోగారావు చెప్పారు...

ధన్యవాదాలండీ. మీరు పేర్కొన్న పద్యం రచించినది అడిదం సూర కవి. పెద్దాపురం జమీందారు
ఎదుట చదివిన పద్యం ఇది. సభ లో ఇతర రాజులు కినుక వహిస్తే, పద్యం లోకం లోని రాజుల గురించి చెప్ప లేదనీ, ఆ దోషమంతా ఇంద్రాది రాజులదనీ సర్ది చెప్పాడుట. దీనితో రాజులు శాంతించారు. కవికి సన్మానం జరిగింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి