29, ఏప్రిల్ 2010, గురువారం

మా వూరెళ్ళాం ...!!



















మొన్న 24వ తేదీ, శనివారం నాడు మా పార్వతీ పురం ప్రయాణం. పుట్టిన గడ్డకి వెళ్తున్నాం అనే సరదాతో మాకు వొళ్ళూ మీదా తెలియడం లేదు.

నవ్య వార ప్రతిక సంపాదకులు, ప్రముఖ రచయిత టి.వి , సినిమా ల రచయిత
శ్రీ ఎ.ఎన్.జగన్నాధ శర్మ కథల సంపుటి ‘ పేగు కాలిన వాసన’ ఆవిష్కరణ సభ అక్కడ మా బాల్య మిత్రులు , కథా రచయిత పి.వి.బి.శ్రీరామ మూర్తి , తదితర సాహితీ మిత్రులు చేస్తాం రమ్మన్నారు.

బాగానే ఉంది. ఈ నెపంతో నయినా, మళ్ళీ దాదాపు 35 ఏళ్ళ తర్వాత మా ఊరు చూడొచ్చు కదా, అనే సంబరంతో రైట్ వస్తాం అనేసాం.

ఇక్కడి నుండి ప్రముఖ కవి శ్రీ శివా రెడ్డి , నేను , జగన్నాథ శర్మ , పుస్తక ప్రచురణ కర్త గుడిపాటి ,
పొగబండి కథల రచయిత, ప్రముఖ పాత్రికేయుడు, టి.వి రచయిత ఓలేటి శ్రీనివాస భాను బయలు దేరాం.

24 వ తేదీ రాత్రి 9 గంటలకి బయలుదేరే నాగావళి ఎక్సప్రెస్ లో ఎ.సి. త్రీ టైరులో రిజర్వేషన్లు ఉన్నాయి. మా మొత్తం టిక్కెట్టు జగన్నాధ శర్మ దగ్గర ఉంది. అందరం 8 గంటల ప్రాంతంలో సికిందరాబాద్ రైల్వే స్టేషన్లో కలవడానికి తీర్మానం.
అందరికన్నా ముందుగా జగన్నాధ శర్మ చేరుకున్నాడు. ఇక చూడాలి, మా శర్మ తొందర ! నేను స్టేషన్కి చేరుకున్నాక, శర్మకి ఫోను చేసి, ‘ ఎక్కడున్నావురా బాబూ ’ అనడిగేను. ‘ ఇదిగో, సరిగ్గా ఓవరు బ్రిడ్జి దగ్గరే ’ అంటాడు. ఫోనులో ఒకరి మాటలు ఒకరికి వినబడడం లేదు. సికిందరాబాదు ప్లాట్ ఫారమ్మీద , ఆ రద్దీలో ఏ ఓవరు బ్రిడ్జి మొదట్లో ఎక్కడ ఉన్నాడో తెలీదు. ఎలాగయితే నేం కలుసుకున్నాం.అప్పటికే వచ్చేరు ఓలేటి శ్రీని వాస భానూ , గుడిపాటి. రైల్వేలో పనిచేసాడు కనుక కాబోలు శ్రీను ఈ రైల్వే అంతా నాదే ! అన్నంత ధీమాగా అటూ యిటూ నడుస్తున్నాడు. శర్మ, ‘చూడు చూడు , ఈ రైల్వే అంతా సొంత ఆస్థిలా ఎలి ఫీలై పోతున్నాడో ’ అంటూ నవ్వేడు. ఇక గుడిపాటి మాత్రం హరి మీద గిరి పడ్డా చలించని రీతిలో మహా నింపాది.

ఇక రావాల్సింది కవి శివా రెడ్డి. ఎంతకీ రాడే ! ఓ ప్రక్క రైలుకి టైమయి పోతోంది. ఫోను చేద్దాం అంటే, శివా రెడ్డి దగ్గర సెల్ లేదు. సెల్ వాడరు. శివా రెడ్డి కోసం ఇక పరుగో పరుగు ! ఓ ప్రక్క భానూ, మరో ప్రక్క గుడిపాటి వెతకడం మొదలెట్టారు. ఇంతలో ‘వచ్చేస్తున్నా ’ అని కవిగారి నుండి ఫోనొచ్చింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. ఎ.షి.త్రీ టైరు ఎటుందని శివారెడ్డి అడిగితే ఓ తలమాసిన వాడు తప్పుడు సమాచారం అందించడంతో, పాపం శివా రెడ్డి మొత్తం రైలుకి ఆ చివర నుండి యీ చివర వరకూ తిరగాల్సి వచ్చింది. వస్లూనే తనకి ఆ తప్పుడు సమాచారం యిచ్చిన వ్యక్తిని అటూ యిటూ ఏడు తరాలు తిట్టి పోసి, అలుపు తీర్చుకున్నాడు శివా రెడ్డి.

మొత్తానికి అందరం చేరేం. ఇక అప్పటి నుండి మా ప్రయాణం అంతా నవ్వులే నవ్వులు ! సరదాలే సరదాలు ! కబుర్లే కబుర్లు !! ఎవరి ముద్దలు వాళ్ళు యింటి దగ్గరే తిని రమ్మని శర్మ హుకుం జారీ చెయ్యడంతో రైల్లో తిండి బాధ లేదు. బెర్తులు చూసుకుని కుదురుకున్నాం.


జో పాపా ! లాలీ , జో !!

శివా రెడ్డికి కింద బెర్తులో ఉన్న ఓ ఇల్లాలు బాత్ రూం అవసరపడి, తన బిడ్డని కాస్త చూడమని అందించింది, ‘ ఉచ్చ పోసెయ్యదు కదా ?’ అడిగేరు శివారెడ్డి. ‘‘ లేదండీ, పాపకి డైఫరు కట్టేను ’’ అని భరోసా యిచ్చిందా తల్లి. సరే అని పాపని ఒళ్ళోకి తీసుకున్నశివా రెడ్డి పాట్లు ఇంక చూడాలి ! పాప ఒకటే ఏడుపు. శివా రెడ్డి పాపని సముదాయించడం ! ఆ దృశ్యం చూసి తీరాలి .ఎంత ముచ్చట వేసిందో.

ఆ రాత్రి మూడు గంటలకి తిరుపతి నుండి వచ్చిన మధురాంతకం నరేంద్ర మాతో కలిసేరు. ఆయనకి అక్కడి నుండి రిజర్వేషను శర్మ ముందే చేయించాడు.

నరేంద్రతో పాటు, శర్మతో ఎప్పుడో హైస్కూలులో చదువుకున్న ఓ మిత్రుడు - పేరు సత్య ప్రకాష్ - అంత రాత్రి వేళప్పుడు శర్మని కలుసుకోడానికి వచ్చేడు. ఇటీవల నవ్యలో జగన్నాధ శర్మ సినీ దర్శకుడు, రచయిత వంశీ గురించి రాసిన ఓ వ్యాసంలో కంఠు అని చూసి, చాలా రోజులకి తన పాత
మిత్రుడి జాడ పోల్చుకున్నాడుట , అతను. రైల్వేలోనే ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడుట. ఎప్పటిదో, శర్మది, చిన్నప్పటి ఫొటో ఒకటి జేబులో పోలిక పట్టడం కోసం ఉంచుకుని మరీ వచ్చేడు. నిజానికి ఆ ఫొటో ఇప్పుడు చూసి, శర్మే గుర్తు పట్ట లేడు. అంత భద్రంగా తన చిన్న నాటా మిత్రుని ఫొటో పదిలంగా దాచుకుని తెచ్చిన ఆ వ్యక్తి ని చూసి, అబ్బుర పడ్డాం.

విజయవాడ స్టేషనులో రాత్రి మూడు గంటల వేళలో ఆ బాల్య మిత్రులు ఇద్దరూ కలుసుకుని తనివితీరా కొద్ది సేపు కబుర్లు చెప్పుకునే ఆ దృశ్యం భువన మోహనంగా ఉంది.

శర్మ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టేడు.

కబుర్లతో జాము రాత్రి వరకూ హోరెత్తించి, పడుకున్నాం. ఏం పడుకోవడం లెండి ! నాకూ, శర్మకీ, భానుకీ మా సొంతూరు చూడబోతున్న ఆనందంతో నిద్ర పడితే కదా ?

తెల్లారి నాలుగో గంటకి అందరికీ తెలివొచ్చింది. శివా రెడ్డి అప్పటికే ఓ దఫా తేనీరు సేవించి, నాకొక టీ యిప్పించి కబుర్లు ప్రారంభించేరు. శర్మ వచ్చి చేరాడు. మరి కాస్సేపటికి భాను. శర్మ ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తూనే ఉంది.


రైలు విశాఖ పట్నం చేరింది. ఆంధ్రభూమిలో పని చేసే జ్యోత్స్న , అతని మిత్రులు మేడా మస్తాన్ రెడ్డి మమ్మలని కలవడానికి వచ్చేరు. టిఫిన్ పొట్లాలతో సహా ... మళ్ళీ కబుర్లు. ఫొటోలు దిగేం. టిఫిన్లయేక రైలు కదలబోతూ ఉంటే ఎక్కాం.


దార్లో తాటి ముంజెలూ, వేరు సెనక్కాయలూ , టీలూ ...
రైలు మా పార్వతీ పురం చేరబోతూ ఉంది. ఆ పరిసరాలని చూస్తూ శర్మ సంతోషం పట్ట లేక చిన్న పిల్లాడిలా కేరింతలు కొట్టేడు.

అదిగో శివాలయం. అదిగో సత్యనారాయణ స్వామి వారి దేవాలయం, అల్లదిగో వేణు గోపాల్ టాకీస్, ఇదిగిదిగో మా టౌను రైల్వే గేటు ....అంటూ పొంగి పోతూ. మా సరదా చూసి శివారెడ్డీ, గుడిపాటీ, నరేంద్ర ఎంత ముచ్చట పడ్డారో !

రైలు మా పార్వతీ పురం టౌను స్టేషన్లో ఆగింది. అక్కడే కదా, ప్లాట్ ఫారం చివర, తురాయి చెట్టు కింద, సిమ్మెంటు బల్ల మీద కథల గురించి చెప్పుకుంటూ - నేనూ, శర్మా, భానూ, మా పీ.వీ.బీ.శ్రీరామ మూర్తి - ఎన్నో సాయంత్రాలు చీకటి చిక్కబడే వరకూ గడిపే వాళ్ళం ... మమ్మలని రచయితలుగా మేం తీర్చి దిద్దుకున్న నేల తల్లి అదే కదా !

పొంగి పోయాం. కళ్ళు చెమర్చాయి. ఉద్విగ్నంతో ఎవరికీ నోరు పెగలడం లేదు.
ఆ గాలి, ఆనేల, ఆమట్టి వాపనా మాకిష్టం. .....
మమ్మల్ని రిసీవ్ చేసుకుందుకి చాలా మంది మిత్రులు రచయితలు వచ్చేరు.
రచయితలు పి.వి.బి.శ్రీరామ మూర్తీ, గంటేడ గౌరు నాయుడూ, చింతా అప్పల నాయుడూ. జల్దు బాబ్జీ, ... కార్లో సాదరంగా తీసికెళ్ళి మమ్మల్ని ఓ లాడ్జిలో దించేరు.

మా ఊరి వీధుల్లో ...


స్నానాలూ, భోజనాలూ కానిచ్చేక, నేనూ , జగన్నాధ శర్మా, ఓలేటి శ్రీనివాస భానూ మా ఊరినీ, మేం తిరిగిన వీధులనీ చూడడానికి బయలు దేరాం.
మా బాల్యాన్ని వెతుక్కుంటూ ఆ వీథులమ్మట ముచ్చట పడి పోతూ చాలా సేపు తిరిగాం

పార్వతీ పురంలో ఆ రోజు వరకూ ఎండలు అదర గొట్టేసాయిట. మేం ఊరిని చూడ్డానికి బయలు దేరామో, లేదో, చల్లగా అయి పోయింది వాతావరణం. మా ఊరి తల్లకి మేమంటే ఎంత ప్రేమో !!

వీధులన్నీ తిరిగేం. అప్పటి ఆత్మీయ మిత్రులని, బంధువులని కొందరిని కలుసుకున్నాం. ముచ్చట్లు కలబోసుకున్నాం.
ఒక సారి మేం దాదాపు నలభై ఏళ్ళ వెనక్కి వెళ్ళి పోయేం.మా కంఠు (శర్మ) అప్పటిలో పని చేసిన కర్రల మిల్లుని చూసాం. అదే కదా, పేగు కాలిన వాసన కథకి నేపథ్యంగా నిలిచిన చోటు....
శర్మ అగ్రహోరం కథల్లో చెప్పిన మా యిల్లు, జోగారావు గారి మేడ చూసాం. పాత పోలీసు స్టేషను వీధీ, కంచర వీధీ .. శర్మ రాసిన మాస్టర్ పీస్ మినీ కథ - పండా అప్పట్లో ఉన్న పూరిల్లూ ...
శర్మ అన్నయ్య గణపతి, తండ్రి పని చేసిన కోమటి గుమస్తా కొట్టు ... చూసి శర్మ కళ్ళలో నీళ్ళు ఉబికి రావడం గమనించి మాకూ కళ్ళు చెమరించాయి...
సాయంత్రం కావస్తోంది. పుస్తకావిష్కరణ సభా కార్యక్రమానికి వేళ దగ్గర పడుతోంది. ఆ వీధులని, ప్రదేశాలనీ వదల లేక వదల లేక మళ్ళీ మా బస దగ్గరకి చేరాం మేం వెళ్ళే సరికి కాళీ పట్నం రామారావు మాష్టారు వచ్చి ఉన్నారు. రచయితలు జయంతి వెంకట రమణ, డాక్టర్ వి. చంద్ర శేఖర రావు , ఎ,వి, రెడ్డి శాస్త్రి , వేద ప్రభాస్, డా. బి.ఎస్.ఎన్. మూర్తి, కొల్లూరు జగన్నాధ రావు, మల్లా ప్రగడ రామారావు గంటేడగౌరు నాయుడు, చింతా అప్పల నాయుడు, నఖ చిత్ర కారుడు పరిశి నాయుడు, ... చాలా మంది సభ జరిగే చోటుకి బయలు దేరడానికి రెడీ అయిపోయి ఉన్నారు. ఇక మాదే ఆలస్యం. వేగిరం స్నానాలు చేసి, తయారయి అంతా బయలు దేరాం ...

ఆ సాయంత్రం పేగు కాలిన వాసన కథా సంపుటి ఆవిష్కరణ సభ చాలా విజయవంతంగా జరిగింది.
ఎందరో రచయితలు చాలా దూర ప్రాంతాల నుండి వచ్చేరు. , మా బాల్య మిత్రులూ ఎక్కడెక్కడి నుండో వచ్చేరు...అంతా ఒక పండుగ వాతావరణం.

సభని ప్రారంభిస్తూ పి.వీ.బీ , చింతా అప్పల నాయుడు గారలు స్వాగతం పవలికారు.
సభాధ్యక్షులు శివా రెడ్డి . ముఖ్య అతిథి కాళీ పట్నం రామారావు మాష్టారు. పుస్తక సమీక్షలు అట్టాడ అప్పల నాయుడు, మధురాంతకం నరేంద్ర గారలు అపూర్వంగా పుస్తక సమీక్షలు చేసారు.. వాళ్ళు ప్రసంగిస్తున్నంత సేపూ చప్పట్లు ఆగ లేదు సభలో గుడిపాటి మాట్లాడుతూ త్వరలోనే జగన్నాధ శర్మ రాసిన అగ్రహారం కథలని ఒక చక్కని సంపుటిగా తీసుకురాబోతున్నట్టుగా ప్రకటించడంతో ఆనందంతో సభ మారు మ్రోగి పోయింది. .జల్దు బాబ్జీ ఆప్త వాక్యం చదివేడు. శర్మ మిత్రులు మంథా రఘునాథ శర్మ, పేర్రాజు, పంతుల లక్ష్మణ మూర్తి, శర్మ తమ్ముడు, రాము - రాయపూర్ నుండి వచ్చేడు... యిలా ఎందరో, ఇక , చాల మందిరచయితలు కూడా అతనితో తమ అనుబంధాన్ని కొద్ది మాటలలో సభలోని వారితో మాటల్లో పంచుకున్నారు.

తర్వాత జగన్నాధ శర్మకి అపూర్వమైన రీతిలో ఘన సన్మానం జరిగింది.
మేం పుట్టి, పెరిగి, తిరుగాడి, తొలి కథలు రాసుకున్న మా పార్వతీ పురంలో మా కంఠు (జగన్నాధ శర్మ)కి ఈ విధమైన

అపూర్వ సత్కారం లభించడం మాకు ఎప్పటికీ మరిచి పోలేని మధురానుభూతిని మిగులుస్తుంది.

మా నేలని తాకేం. మా ఊరి చెరువుల మీద నుండి, కొండల మీద నుండి వచ్చే చల్లని గాలి పీల్చాం. చిన్న నాటి మిత్రులని కలుసుకున్నాం. మా పెద్దల, గురువుల ఆశీర్వాదాలు అందుకున్సాం . మా బాల్యం లోకి వెళ్ళి పోయేం ....

బరువెక్కిన గుండెతో మా చల్లని తల్లికి, మా ఊరికి వీడ్కోలు పలికాం ....

పార్వతీ పురంలో పీ.వీ.బీ, జల్దు బాబ్జీగారల ఇళ్ళలో కమ్మని భోజనాలూ , టిఫిన్లూ . చవులూరించే ఆ రుచులు తలుచుకుంటూ తిరుగు ప్రయాణం. సభా విశేషాల గురించీ, మా పార్వతీ పురం ప్రజల ఆత్మీయతానురాగాల గురించీ చాలా సేపు మాట్లాడుకుంటూ గడిపేక, ఎవరి బెర్తుల మీదకి వాళ్ళు చేరాం. ఎన లేని ఆనందంతో కాబోలు అందరికీ బాగా నిద్ర పట్టింది.

మర్నాడు రైల్లో మళ్ళీ మామూలే ! ఉదయాన్నే మూడింటికి లేచాం. మధురాంతకం తిరుపతి వెళ్ళాలి కనుక విజయ వాడలో దిగేసారు ...

ఆ ఉదయం టీలు, కాఫీలు ఆరారా త్రాగుతూ కబర్లు మొదలెట్టాం ...

ఆ ఉదయం రైల్లో సైడు బెర్తు మీద బాసిం పట్టు వేసుకుని కూర్చుని శివా రెడ్డి చేసిన ప్రసంగం మహా అద్భుతంగా సాగింది.
నగర జీవితాన్ని గురించీ, కవిత్వాన్ని గురించీ, నవలా సాహిత్యం గురించీ అనువాద రచనల గురించీ, శ్రీశ్రీ, నారాయణ బాబు, ఆరుద్ర .... ఒక శాఖా చంక్రమణంగా సాగినా, శివా రెడ్డి ప్రసంగం వరద గోదావరిలా పరవళ్ళు తొక్కింది. నేనూ. జగన్నాధ శర్మ, ఓలేటి శ్రీనివాస భానూ, గుడిపాటి శ్రోతలం. శివాదెడ్డి అపూర్వ ప్రసంగాన్ని ఆ వేళ చల్లని ఉదయం సమయంలో , వేగంగా దూసుకు పోతున్న రైల్లో వినడం నిజంగా ఒక అపూర్వానుభూతి అనే చెప్పాలి.

రైలు ఉదయం తొమ్మిది గంటల వేళకి సికిందరాబాద్ చేరుకున్నాక, బరువెక్కిన గుండెలతో వెళ్ళొస్తామని ఒకరికొకరు చెప్పుకుంటూ స్టేషను బయటికి దారితీసాం ....


మరి కొన్ని ఫొటోలు చూడండి ...


జగన్నాధ శర్మ,పంతుల జోగారావు.జ్యోత్స్న, శివా రెడ్డి. (విశాఖ రైల్వే స్టేషన్లో)






ఆప్త వాక్యం చదువుతున్న జల్దు బాబ్జీ
ఈ కార్యక్రమ నిర్వహణలో తెర వెనుక సూత్రధారి. మా ఆత్మీయ మిత్రుడు.





పేగు కాలిన వాసన ప్రచురణ కర్త గుడి పాటి




పార్వతీపురం బసలో ఓలేటి శ్రీనివాస భాను, శివా రెడ్డి, మధురాంతకం నరేంద్ర, జగన్నాధ శర్మల పిచ్చాపాటీ







జగన్నాధ శర్మ తనకు చేసిన సన్మానానికి ధన్యవాదాలు చెబుతూ ....



శర్మ మిత్రుడు, క్లాస్ మేట్ పంతుల లక్ష్మణ మూర్తి ముద్దులతో శర్మని ముంచెత్తుతూ ....


శర్మ మరో మిత్రుడు మంథా రఘునాధ శర్మ











శర్మని అభినందిస్తూ క్లాస్ మేట్ పేర్రాజు ...


పంతుల జోగారావు


.మధురాంతకం నరేంద్ర పుస్తక సమీక్ష చేస్తూ ... చిత్రంలో కుడి వేపు చివర ఉన్నది మంచు పల్లి శ్రీరామమూర్తి


అట్టాడ అప్పల నాయుడు పుస్తక సమీక్షలు ....


కాళీ పట్నం రామా రావు మాష్టారు శర్మని అభినందిస్తూ ...


పార్వతీ పురంలో ఈ కార్య క్రమ నిర్వహణలో ప్రధాన సూత్రధారి, రచయిత, జగన్నాధ శర్మ కి ఆత్మీయ మిత్రుడు పి.వి.బి.శ్రీరామ మూర్తి.


6 కామెంట్‌లు:

అరుణ పప్పు చెప్పారు...

మనం మనం బరంపురం... :)
శర్మగారి సన్మానాన్ని, మీ ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. సంతోషం + అభినందనలు.

పంతుల జోగారావు చెప్పారు...

ధన్యవాదాలండీ.

ఆ.సౌమ్య చెప్పారు...

మీది పార్వతిపురమా, మాది విజయనగరం.

మిత్రులతో సొంత ఊరికి చేసే రైలు ప్రయాణం....ఓ తియ్యని అనుభూతి కదండీ. మీకు అది కలిగినందుకు చాల సంతోషం. పేగు కాలిన వాసన్ గురించి చాలా విన్నాను. ఇంకా చదవలేదు, త్వరలో చదవాలి.

కొత్త పాళీ చెప్పారు...

సెబాస్సెబాస్సెబాసో .. ఫొటోల్లో సాహితీబంధువలందర్నీ కళ్ళారా చూసుకుని నేనూ అక్కడే ఉన్నంత ఫీలింగొచ్చింది .. శివారెడ్డిగారు పాపాయిని సముదాయైంచడం .. బలే బలే.

చింతా రామకృష్ణారావు. చెప్పారు...

ఆనందో బ్రహ్మ అన్నరుగా పెద్దలు. ఆ దివ్యానందంలో మీరంతా పరమానందాన్నే పొందేరు. కథగా వ్రాసినంత అద్భుతంగా మీ ప్రయాణంలో మమ్మల్నీ ప్రయాణం చేయించి ఆ ఆనందానుభూతి మాకూ కలిగించిన మీకు ధన్యవాదములు. మీకు అభినందనలు.

Srinivas చెప్పారు...

మీతో మేమూ వెళ్ళొచ్చినంతా హాయిగా ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి