ద్వా విమౌ పురుషౌ లోకే, శిరశ్శూల సమౌ మతౌ,
గృహస్థశ్చ నిరారంభో, యతిశ్చ సప్రతిగ్రహ:
లోకంలో ఇద్దరి వల్ల చాలా ఇబ్బంది. వాళ్ళు మనకు తల నొప్పిగా పరిణమిస్తారు.
ఎవరయ్యా వాళ్ళు, అంటే,
ఏపనీ చేయని ఇంటి యజమాని ఒకడు.
రెండో వాడు సన్యాసం తీసుకుని కూడా గృహస్థుల దగ్గర డబ్బు ఆశించే యతి.
వీళ్ళిద్దరితో తల నెప్పి ఇంతా అంతా కాదు. శ్లోకంలో శిరశ్శూల సమౌ అనే పదం వీళ్ళు మనకి తల నెప్పితో సమానం అని చెబుతోంది.
నిజమే కదూ, ఏపనీ చేయకుండా, నిర్వ్యాపారంగా ఇంట కూర్చుని తింటూ, అలాగని ఊరు కోకుండా ప్రతి దానికీ సతాయిస్తూ ఉండే మగాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళతో తల నెప్పి కాక మరేమిటి?
ఇక, సన్యాసం తీసి కొన్న యతులు మన మతులు పోగొట్టే వైభోగాలు అనుభవిస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం కదా? కాషాయం కట్టి, సర్వం పరిత్యజించామని చెప్పుకునే వాళ్ళు కూడా, ధనం కోసం పీడించడం సతాయింపు కాక మరేమిటి చెప్పండి ?
వీళ్ళలో కొందరికి కట్న కానుకలు కావాలి. పాద పూజలు కావాలి. పూల దండలు కావాలి. ఎర్ర తివాచీ ఆహ్వానాలు కావాలి. ఏసీ కార్లూ, గదులూ కావాలి. విమాన ప్రయాణాలు కావాలి. విదేశాలలో లభించే సకల వైభోగాలూ కావాలి.
కుదిరితే కప్పు కాఫీ లాగ, అందమైన అమ్మాయిలూ, సినీ తారలూ కావాలి ...
అబ్బో, ఆశా పాశము కడున్ నిడుపు. లేదంతంబు ....
పనీ పాటు చేయని వాళ్ళంటే, కేవలం రిటైరయిన వాళ్ళూ, వృద్ధులూ మాత్రమే అనుకో నక్కర లేదండీ. మంచి వయసులో ఉండే మగానుబావులు కొందరిలోనూ ఈ పని గండం గాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళ సతాయింపు అనుభవించే ఇంట్లోని వ్యక్తులకే ఎరుక.
శ్లోకంలో పురుషుల గురించే చెప్పారు కనుక ఆడవారికి మినహాయింపు ఉందనుకో నక్కర లేదండోయ్.
పని చేస్తూనో, చేయకుండానో, , చేస్తున్నట్టు నటిస్తూనో, సతాయించే తల నెప్పి లలనలకు
తక్కువేం లేదు.
ఏతావాతా ఈ సతాయింపు గాళ్ళు తల నెప్పి మాత్రలూ, మందులూ తయారు చేసే కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్లుగా చక్కగా పనికొస్తారు.
అయితే, అందుకూ సతాయిస్తారేమో, కదూ !
3 కామెంట్లు:
nijam......
మీ టపాలు ఆణిముత్యాల్లాగా, సమయానికి తగినట్టు ఉంటాయి. మీ బ్లాగింగ్ సుదీర్ఘంగా కొనసాగాలని ఆశిస్తాను. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలను పుష్కలంగా ఇవ్వాలి.
లక్స్మీ రాఘవ గారికి, కావేరి గారికి ధన్యవాదాలండీ,
కామెంట్‌ను పోస్ట్ చేయండి