ఉత్తరాంధ్రలో విజయ నగర ప్రభువులు అభినవ ఆంధ్ర భోజులు. వారి పోషణలో ఎందరో కవి పండితులు అపూర్వమైన గ్రంధ రచనలు చేసి మహత్తరమయిన సాహిత్య పోషణ చేసారు. అలాంటి దిగ్గంతులలో ఒకరిని ఈ టపాలో స్మరించుకుందాం ...
ఆనంద వర్ధనుడు సంస్కృత భాషలో వెలయించిన ఆలంకారిక గ్రంథము ధ్వన్యాలోకము. కావ్యాత్మ ఏది అని ప్రశ్నించి, కావ్యమునకు ఆత్మ ధ్వని అని ఒక అపూర్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.ధ్వని గర్భితమైన రచన కావ్య సౌందర్యాన్ని ఇనుమడింప చేయడమే కాక, కావ్యానికి పరిపుష్ఠినీ, ఉత్తమ స్థానాన్నీ కల్పిస్తుంది. సమర్ధుడైన కవి తన వక్తవ్యాంశాన్ని కేవలం వాచ్యంగా చెప్పడు.ధ్వని తో స్ఫురింప చేస్తాడు.అవాంతర భేదాలతో విస్తరించి ఉన్న ఈ ధ్వని
శాస్త్రాన్ని గురించి గురు ముఖత: గ్రహించడమే మేలు గహన సదృశంగా తోచే ఈ మహత్తర
ఆలంకారిక గ్రంథానికి పంతుల లక్ష్మీ నారాయణ శాస్త్రి గారు ఆంధ్ర ధ్వన్యాలోకము అనే పేరుతో చక్కని అనువాదం చేసారు.
శ్రీ శాస్త్రి గారు విజయనగర వాస్తవ్యులు. అక్కడి ప్రభుత్వ మహా రాజ సంష్కృత కలా శాలలో విద్యాభ్యాసం చేసి , అక్కడే ఆంధ్ర భాషా ప్రధానాధ్యాపకునిగా బాధ్యతలు నిర్వర్తించారు. సంగీత సాహిత్యాలలో దిట్ట.
ఇందులో ఆనంద వర్ధనుని ధ్వన్యాలోకనంతో పాటు, ధ్వన్యాలోకన వ్యాఖ్యాతలలో ఒకరైన
అభినవగుప్తపాదుల వారి లోచన వ్యాఖ్యను కూడ అనువదించడం జరిగింది.మాతృక లోని లక్ష్య శ్లోకాలను దీనిలో సరళ సుందరమయిన తెలుగు పద్యరూపంలో మనకి అందించడం జరిగింది
.
అసలు ఏమిటీ ధ్వని?
అర్ధం ఎప్పుడూ శబ్దాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. అలా గోచరించే అర్ధం వాచ్యం అయితే
చదవగానే, లేదా వినగానే స్ఫురించే అర్ధమే కాక వేరొక అర్ధం స్ఫురించడమే ధ్వని. దీనికే వ్యంగ్యం అని నామాంతరం. ధ్వని గర్భిత రచనకి ఎప్పుడూ ఉత్తమ స్థానం లభిస్తుంది..
ధ్వని గర్భితాలయిన రెండు చిన్న పద్యాలను చూదాం ....
కనులు కాన రాని కటిక చీకటి రేయి
వలస పోయె మగడు, వంటి దాన !
దొంగ లెవ్వరయిన దోతురేమో సుమ్ము
కంట గనుము, ప్రక్క యింటి వాడ !
ఒక ఊరిలో ఒక నెరజాణ ఉంది. ఆమె బయటకి కడు ముద్దరాలిలా కనిపిస్తుంది. ఆమె నాథుడు ఏవో పనుల మీద దేశాంతరం పోయి చాలా దినాలయింది. ఆమె వయసు ఊరు కోవడం లేదు. శరీరం సహకరించడం లేదు. మతి లయ తప్పుతున్నది. పురుష స్పర్శ కోసం దేహం తహ తహలాడి పోతున్నది. ఎలా? ఎవ్వరకీ అనుమానం రాకుండా పొరుగింటి యువకుడిని ఉద్దేశించి ఇలా అంది:
అయ్యో, చీకటి పడింది. కళ్ళు పొడుచుకున్నా కనబడడం లేదు. నా భర్త దేశాంతరాలు వలస పోయాడు. ఇప్పటిలో రాడు. నేనా, వంటరి దానిని ! అదను చూసి దొంగలెవరయినా దోచుకుంటారేమో భయంగా ఉంది. మా ప్రక్క ఇంటి వాడివే కదా, నన్నూ, మా యింటినీ ఓ కంట కాస్త కనిపెడుతూ ఉండు సుమీ !
ఇదీ పద్యం. వాచ్యంగా చూస్తే ఒక దీన మైన అభ్యర్ధన తప్ప ఇందులో మరేమీ గోచరించదు.ఎక్కడా అనౌచిత్యం, అశ్లీలం కనిపించదు.
కొంచెం లోతుగా చూస్తే మాత్రం ఆ నెరజాణ గడుసుతనం, మాటకారితనం, మనసులోని మర్మం అన్నీ ప్రకటితమవుతాయి.
చీకటి పడిందయ్యా. నా మగడు ఊర లేడు. నేనో, ఒంటరి దానిని. మగ తోడు కావాలనిపిస్తున్నది. రాకూడదూ? అని పిలుపు ! భర్త లేడని చెప్పడం వలన మరేమీ భయపడ వలసిన పని లేదని ధ్వని. కటిక చీకటి అనడం వలన ఎవ్వరూ చూడ లేరులే అని సూచన. వంటరి దానను అనడం వలన ఇంటిలో మన కలయికకు ఎవరూ అడ్డంగా లేరులే అనే భరోసా, దొంగ లెవరయినా దోచేస్తారేమో అనడం వలన, నువ్వు తక్షణం రాక పోతే మరెవరయినా వొచ్చి, నా పొందు స్వీకరించే భాగ్యం పొంద గలరు సుమా అనే బెదిరింపు. కంట కనుము అని అనడం వలన, నా అంత అంద గత్తె పిలుస్తూ ఉంటే జాగు చేయక వెంటనే ఓ చూపు చూడవయ్యా అని కవ్వించడం. ప్రక్క యింటి వాడ ! అనడం వలన నువ్వు చాలా కాలంగా మా ప్రక్క ఇంటి లోనే ఉంటున్నావు కనుక ఈ అదృష్టం నీకే అభిస్తోందయ్యా అని ఊరించడం ..... ఇదీ ధ్వని !
మరో పద్యం, శాస్త్రి గారి అనువాదం:
ఒడలెరుఁగ దిచ్చట శయించు చుండు నత్త,
నేనొ, యిచటఁబరుండుదును, నీవొ, రేయి
నంధుడవు ! పాంథ ! దివసకమందె, దీని
చక్కగాఁజూడు పడకు మాశయ్యలందు
ఇదీ పద్యం. ఈ నెరజాణ పరిస్థితీ అలాంటిదే. మగడు ఊర లేడు. చాలా రోజులయింది.
విదేశగతుడై. తానా ,యవ్వనవతి. దేహం మగతోడు కావాలంటోంది. ఉప్పూ కారం తినే వయసాయె!
సరే, ఇంటికి ఓ అతిథి వచ్చేడు. చూడ చక్కగా ఉన్నాడు. ఈవిడ గారి కన్ను వాడి మీద పడింది. ధ్వని గర్భితంగా సంకేతం వినిపించింది.
ఓ బాటసారీ, ఇదిగో చూడు. మా అత్త వొళ్ళూ మీదా కానకుండా ఇక్కడ పడుకుని ఉంటుంది. ఆవిడ గారికి ఓ సారి నిద్ర పడితే మరి అంతే . ఒళ్ళెరుగదు. నేను ఇక్కడ ఈ మంచం మీద పడుకుంటూ ఉంటాను. నువ్వు చూడబోతే రేచీకటి గాడిలా ఉన్నావు. రాత్రి వేళ మంచి నీళ్ళు త్రాగడానికో, మరేదో అవసరానికో లేస్తావు. నీకు రేచీకటిలా ఉంది. ఎవరెక్కడ పడుకుంటారో ఇప్పుడే చెబుతున్నాను. ఈ పగటి వెలుతురు లోనే చక్కగా చూసి గుర్తు పెట్టుకో. మా పడకల మీద పడకు సుమీ !
వాచ్యార్ధంలో ఇందులో ఎంచడానికేమీ లేదు. నెరజాణ గడుసుతనమంతా తన కోరికను ధ్వన్యంతరంగా చెప్పడం లోనే ఉంది.
ముందుగా రాత్రి వేళ అత్త ఎక్కడ పడుకుంటుందో చెప్పింది. ఆవిడ ఒళ్ళెరక్కుండా పడుకుంటుంది కనుక మనకింక భయమేమీ లేదని సూచించింది. తను ఏ మంచం మీద పడుకుని ఉంటుందో చక్కగా సూచన చేసింది. రేచీకటి గాడివనడంలో, ఆ రాత్రి ఇంట్లో దీపం లేకుండా అంతా చీకటిమయం చేసి ఉంచుతానని చెప్పకనే చెప్పింది. ఎవరెక్కడ పడుకుంటారో పగటి వేళ వెలుతురు ఉండగానే చక్కగా చూసి గుర్తు పెట్టు కోమని హెచ్చరించింది.
ఇక , పడకు మా శయ్య లందు అనడం వల్ల రాత్రి తన పడక మీదకి రమ్మని ధ్వని ఎలా కుదురుతుంది?
అని సందేహం రావచ్చును.
మా పడకల మీద పడ వద్దు అని వాచ్యంగా నిషేధించింది. పడకలు అని బహువచనం వాడడం వలన ఆ నిషేధం అన్వర్ధము కదా ?
అత్త పరుండే శయ్య మీద కాకుండా తాను ఒక్కతె పరుండే పడక మీద పడవచ్చుననే ధ్వని ఇందులో ఉంది. వాచ్య రూప నిషేధంలోనే విధి రూప అంగీకారం ఉంది.
ఇదీ ధ్వని.
మరో ఉదాహరణ కూడ చెబుతాను.
ఒక అటవీ ప్రాంతలో ఒక ప్రేమ జంట కులాసాగా తిరుగుతూ ఉంది. అక్కడి పూల పొదలే వారి పడకటిల్లు. మంచి యుక్త వయసులో ఉన్నారు. కామోపభోగాలు చక్కగా అనుభవిస్తున్నారు.
ఒక బ్రాహ్మణుడు పూజకు పువ్వులు కోసుకోవడం కోసం రోజూ వాళ్ళండే పొదల దగ్గరకి వస్తూ ఉన్నాడు. వారి ఏకాంతానికి ఇది భంగకరంగా పరిణమించింది. ఇటు వేపు రావద్దయ్యా అని చెప్పాలంటే భయం. ఆ సద్బ్రాహ్మణుడికి అలా చెప్పే ధైర్యం వారికి లేదు.తమ కలయికకు ఆటంకం కలిగిస్తున్న అతని రాకను నివారించాలి. తనంతట తానుగా ఆ బ్రాహ్మణుడు మరి అటు వేపు రాకుండా చేయాలి.
అందుకే ధ్వని గర్భితంగా అతనితో వినయంగా ఇలా చెప్పారు:
ఓ బ్రాహ్మణుడా ! నువ్వు రోజూ పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ Iఉన్నావు, ఇక్కడ రోజూ నిన్ను ఓ కుక్క అల్లరి పెడుతోంది కదా ? ఇక్కడ తిరిగే ఓ పెద్దపులిని చూసి, మరి ఆ కుక్క నీ జోలికి రాదు. ఇక్కడి నుండి ఉడాయించింది,. నువ్వు ఇక మీదట ఎప్పటి లాగే రోజూ నిర్భయంగా పూలు కోసుకోడానికి ఇక్కడకి వస్తూ ఉండ వచ్చును. మరేమీ భయం లేదు.
కుక్కకే భయపడే ఆ బ్రాహ్మణుడు మరి పులి పేరెత్తితే ఇక ఆ ఛాయలకు వస్తాడా చెప్పండి?
అంతే ! ఇక, అటు వేపుగా ఆ వెర్రి బ్రాహ్మణుడి పత్తా లేదు !
ఆ యువతీ యువకులకి పండుగే పండుగ !
స్వస్తి.
2 కామెంట్‌లు:
చాలా మంచి విషయాల్ని చెప్పి మన కళాశాలలో చదువుకొనే రోజులను స్మరణకు తీసుకు వచ్చావు మిత్రమా! ధన్యవాదములు.
డా. ముద్దు వెంకట రమణా రావు గారు జీ మెయిల్ ద్వారా ఈ సందేశం పంపించారు.
We all know about past glories and great people of Vizianagaram.Please let us know about present greatness of that town.
ramanarao.muddu
@ వీలు చూసుకుని ఆ ప్రయత్నమూ చేస్తానండీ. ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి