ఈ మధ్య విజయ నగరం వెళ్ళినప్పుడు అలా మూడు లాంతర్ల వరకూ వెళ్తే పొటిగరాప్పంతులు కలిసేడు.
కన్యాశుల్కం మొదటి అంకంలో వచ్చే పొటిగరాప్పంతులు పని వాడుగుర్తున్నాడా?
సాన్దీ గిరీశమూ కలిసి తీయించుకున్న ఫొటోల డబ్బులు వసూలు చేసుకుని రమ్మని వాడిని పంతులు పంపిస్తాడు.
నేను కలిసింది ఆ పొటిగరాప్పంతులు గారి మనవడిని. పొటిగరాప్పంతులు, జూనియర్ నన్న మాట.
‘‘పొటిగరాప్పంతులూ ఎలా ఉన్నావెలా ఉన్నావ్’’ అనడిగేను.
‘‘ ఏం ఉండడంలే, ఏదో, యిలా ...’’ అన్నాడు.
‘‘ అదేం ? ’’
‘‘ మా తాత గారు కాలం చేసే వరకూ గిరీశం గారి బాకీ కోసం మనుషులని పంపించీ, తను కాళ్ళరిగేలా తిరిగీ కూడా ఆ బాకీ రాబట్టుకో లేక పోయేరు. వారి తదనంతరం మా తండ్రి గారూ . తర్వాత నేనూ, కనీసం గరీశం గారి మనవళ్ళెవరయినా కనిపించక పోతారా, వారి తాత గారివ్వాలిసిన బాకీ తీర్చక పోతారా అనే ఆశతో ఇలా విజనగరం వీధులంట తెగ తిరుగుతున్నాను..‘‘
‘‘ ఎవరూ కనిపించ లేదూ?’’
‘‘ కనిపించకేం. కానీ అందరూ ఆ తాత గారి చందమే‘‘
‘‘అదేమిటి?’’
‘‘ అందరూ దాదాపు గిరీశం గార్లాంటి వాళ్ళే తయారయేరు. సానుల్తో ఫొటోలు దిగడం, డబ్బుల కోసం మనిషిని పంపిస్తే ఏవో మాయ మాటలు చెప్పి తప్పించు కోవడం ... పైగా గాయత్రి మీద ప్రమాణాలు చెయ్యడమొకటీ ... బిజినెస్సు దివాళా తీసిందనుకో’’ అన్నాడు విచారంగా.
పాపం. అనుకున్నాను. పొటిగరాప్పంతులు పంపిన మనిషికి టోకరా ఇచ్చి, గిరీశం , శిఫ్యడు వేంకటేశంతో ఆ బడుద్ధాయికి చదువు చెప్పే నెపంతో ఉడాయించడం ..... క్రిష్ణరాయపురం అగ్రహారం వెళ్ళి, అగ్ని హోత్రావధాన్లు ఇంట తిష్ఠ వేయడం..... అన్నీ గుర్తొచ్చాయి,
‘‘ సరే కానీ, విజయ నగరం అందాలు చూపించే ఫొటోలు ఏవయినా ఉంటే ఇద్దూ, మా బ్లాగు మిత్రులకి చూపిస్తాను’’ అనడిగేను.
‘‘ బ్లాగా ? అంటే ...? ’’ అనడిగేడు అనుమానంగా.
‘‘ దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కానీ, ముందు ఫొటోలుంటే ఇవ్వు’’
‘‘సరేలే, నీ ఏడుపేదో నువ్వుఏడువ్. ఏవో కొన్ని ఫొటోలున్నట్టున్నాయి. ఇస్తాను తీసికెళ్ళి ఎలా తగలడతావో నీ ఇష్టం.
ముందు నాకో మాంఛి చుట్ట పీక ఉంటే ఇలా పారెయ్‘‘
‘‘ చుట్ట లేదు కానీ, కింగ్ సైజు ఫిల్టరు సిగరెట్టుంది, కాల్చు’’ అంటూ ఓ సిగరెట్టూ, అగ్గి పెట్టె అందించాను.
చీదరగా ముఖం పెట్టాడు పంతులు.
‘‘ చుట్ట లేదూ? గురజాడ వారు మా గిరీశం నోటంట చుట్ట మాహాత్మ్యం గురించి ఎంత గొప్పగా చెప్పారో అప్పుడే మరిచి పోయేరా వెధవ కక్కకట్టల్లారా.... ’’ అంటూ అయిష్టంగానే సిగరెట్టు వెలిగించి, ఓ దమ్ము లాగి వదిలేడు.
‘‘ మరి నేనడిగిన ఫొటోలో?’’
‘‘ నీ అమ్మ కడుపు కాల. వదలేలా లేవురా. సరే నా దగ్గర కొన్ని ఫొటోలేవో ఉన్నట్టున్నాయి. ఇస్తాను. అప్పటి విజయనగరం కాదురా తండ్రీ. చాలా మారి పోయింది. పండు ముత్తయిదువులా ఎంత బాగుండేదని ... ఇప్పటి రూపంలో మన విజయ నగరాన్ని చూస్తూ ఉంటే కడుపు తరుక్కు పోతుందిరా బాబూ ....నువ్వే చూడు ...’’ అంటూ కొన్ని ఫోటోలు అందించేడు.
ఆత్రంగా వాటినందుకుని, గబగబా చూసేను. ‘‘ అవునూ, ఇంకా చాలా స్థలాలకి చెందిన ఫొటోలు ఉండాలే , ఏవీ,
చా.సో గారి హవేలీ , మచ్చ కొండా, కొట లోని రౌండ్ మహల్, మోతీ మహల్, పెద్ద చెరువు గట్టు మీద రాజుల విగ్రహాలూ, ఏనుగుల తోటా, నారాయణ దాసు గారూ, ద్వారం వారూ, కోడి రామ్మూర్తి గారూ నివసించిన ఇళ్ళూ, వ్యాయామశాల, పూల్ బాగ్, , బాబా మెట్ట , దివాన్ గారి మేడ, రాజారావు మేడ, అంబటి సత్రం, అయ్య కోనేరు గట్టున వెలసిన వేంకటేశ్వర స్వామి వారి చిన్న గుడీ. చిన్న ఆంజనేయ స్వామి వారి కోవెలా, లంక వీధి, కానుకుర్తి వారి సత్రం, అయోధ్యా మైదానం,, రాజు గారి సాని సింహాచలం మేడ ... ఇవన్నీ ఏవీ ? ’’ అడిగేను.
‘‘ నీ ముఖం తగలెయ్య. పైసా విదల్చకుండా ఫొటోలన్నీ దొబ్బుకు పోతూ, మళ్ళీ అవి లేవు, ఇవి లేవు అంటూ సణుగుడొకటా.? ఇప్పటికి ఉన్నవి తీసికెళ్ళు. ఈ సారి మిగతావి దొరికితే ఇస్తానులే. సరే కానీ, ఈ సారి వచ్చి నప్పుడు మంచి చుట్టల కట్ట తేవడం మాత్రం మరిచి పోవద్దు సుమీ....ఇక వెళ్ళు ఆ గిరీశం ఎలానూ ఇక దొరకడు. కనీసం వాడి మనవలో, మునిమనవలో కనిపిస్తారేమో చూడాలి. మా తాత గారు తీసిన పుటిగరాపుల బాకీ వసూలు చేసుకోవద్దూ? అసలప్పుడే మా తాత గారు సౌజన్యారావు పంతులు గారిని కలిసి ఆ గిరీశం మీద దావా పడేద్దామనుకున్నారట కానీ, విశాఖ పట్నం వెళ్ళి రావడానికి ఛార్జీలు లేక ఉండి పోయార్ట. .. సరేలే, వెళ్ళిరా ...’’ అంటూ జనంలో కలిసి పోయేడు.
ప్రవాహంలా సాగి పోతున్న అ జన వాహినిలో ఈ జూనియర్ పుటిగరాప్పంతులుకి వందలాది, వేలాది గిరీశంలాటి వాళ్ళు కనిపిస్తారు.
గిరీశం నేర్పించి పోయిన టక్కరి విద్యలు ఉపయోగించి పంతులుని లాఘవంగా బురిడీ కొట్టించి చక్కా పోతారు.
పంచె కట్టు మానీసి, ఫేంటూ చొక్కాలతో లుబ్ధావధాన్లూ, కరటక శాస్త్రీ , అగ్ని హోత్రావధాన్లూ వగైరాలు కాని ,
వాళ్ళ లాంటి వారు కానీ, కూడా కనిపించ వొచ్చును.
సౌజన్యారావు పంతులు కనిపించడు. కనీసం అలాంటి మహానుభావులూ కనిపించరు.
ఇక మధుర వాణి సంగతంటారా? అక్కడే కాదు యావద్దేశంలోనూ, ఆ మాట కొప్తే యావత్ ప్రపంచం లోనూ పొటిగరాప్పంతులకే కాదు, అసలు ఎవరికీ మరి కనిపించదు. ఎందుకంటే ఆవిడ గురజాడ వారి కాళ్ళొత్తుతూ
ఏ స్వర్గంలోనో అంత గొప్ప పాత్రగా తనని తీర్చి దిద్దిన ఆ మహా రచయిత ఋణం తీర్చుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మరి ....
మరింక పుటిగరాప్పంతులు (జూ) ఇచ్చిన ఫొటోలు చూడండి .......
మహా రాజా వారి కోట. ఇందులోనే రౌండ్ మహల్, మోతీ మహల్ వగైరా భవనాలు ఉన్నాయి. ఇప్పుడీ కోట లోని భవనాలన్నీ రాజుల వితరణ త తో విద్యాసంస్థలకు నెలవులయి విలిసిల్లుతున్నాయి.
ఈ ప్రదేశాన్ని బొంకుల దిబ్బ అని అంటారు. గురజాడ వారి కన్యాశుల్కం నాటకం మొదటి అంకం లోని మొదటి స్థలం ఇదే. బొంకుల రాయడు గరీశం బొంకుల దిబ్బ దగ్గరే నాటకంలో తొలి సారిగా కనిపిస్తాడు..ఇప్పుడీ ఖాళీ జాగాలో కూరగాయల మార్కెట్టు ఉంది.
దీనిని మూడు లాంతర్ల జంక్షన్ అంటారు. నిజానికిది నాలుగు రోడ్ల కూడలి కాదు. ఇక్కడ మూడు రోడ్ల కూడలి ఉంది. ఒకటి కస్పా బజారు మీదుగా కోట వేపు వెళ్ళే రోడ్డు కాగా, దానికి ఎదురుగా అంబటి సత్రం, పూల్ బాగ్లకి వెళ్ళే రోడ్డు ఉంటుంది. ఇక, మూడులాంతర్లకి ఎదురుగా పోయే రోడ్డు లో మొదట్లోనే అమ్మ వారి గుడీ, అది దాటేక గంట స్థంభం వస్తాయి. ఆ దారి తిన్నగా రైల్వే స్టేషన్కి దారితీస్తుంది. గంటస్థంభం నుండి మధ్యలో ఎడమ వేపు తిరిగితే పెద్ద చెరువు, రాజుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఈ మూడు లాంతర్లు మూడు సింహం బొమ్మలు. వాటి మీద ఒకప్పుడు చవురు దీపాలను వెలిగించే వారుట. తర్వాత తర్వాత ఎలక్ట్రిక్ దీపాలూ ఉండేవి. ఇప్పుడా దీపాలూ లేవు. ఆ వెలుగులూ లేవు. ఒకప్నపుడు రోడ్డుకి ఎత్తుగా మూడు మెట్లతో ఉండే ఈ కట్టడం , రోడ్డు మందంగా బలియడం వల్ల కురచగా మారి పోయింది.
ఈ కట్టడాన్ని గుమ్చీ అంటారు. శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు ఇక్కడ హరి కథలు చెప్పే వారు.
విజనగర రాజుల పరమత సహనానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఈ దర్గా కోటకు అతి సమీపంలో కస్పా బజారుకి వెళ్ళే దారిలో ఉంది.
ఇది కోటకీ, బొంకుల దిబ్బకీ సమీపంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రదేశాన్ని ముద్దుగా ప్యారిస్ కార్నర్ అని పిలుచుకుంటూ
రోజూ సాయంత్రాల వేళ కవులూ, రచయితలూ కబుర్లతో సందడి చేస్తూ ఉండే వారు.
ఈ మూడు కోవెళ్ళ లోనే దాసు గారు తరచుగా హరి కథలు చెప్పే వారు.
ప్రభుత్వ మహా రాజా సంస్కృత కళాశాల. ఇక్కడ వేద పాఠశాల, భాషా ప్రవీణ, సాహిత్య విద్యాప్రవీణ, వ్యాకరణ విద్యాప్రవీణ కోర్సలు నిర్వహించే ప్రాచ్య కళాశాల, ఉన్నత పాఠశాల, ఉన్నాయి. దేశం గర్వించే మహా పండితులు మెసలిన చోటు,
ఇది విజయనగర ప్రభువులు నిర్మించి అవిఘ్నంగా నిర్వహిస్తున్న విద్యార్ధి ఉచిత భోజన శాల.
సింహాచల దేవస్థానం చౌలటరీ అంటారు. ఏళ్ళ తరబడి రోజూ వందలాది విద్యార్ధులకి ఉచితంగా కమ్మని భోజనాన్ని సమకూరుస్తూ వారి విద్యాభ్యాసం కుంటు పడకుండా కాపాడుతున్న చల్లని తల్లి.
విజయగరం ప్రభుత్వ మహా రాజ సంగీత కళాశాల.
ద్వారం నాయుడు గారి లాంటి సంగీత దిగ్దంతులు నడయాడిన చోటు. ఘంటసాల సంగీత సాధన జరిగింది ఇక్కడే.
అయ్య కోనేరు తూర్పు గట్టున వెలసిన పెద్ద ఆంజనేయ స్వామి వారి కోవెల.
కోట వెనుక భాగం. కందకం
రాజా వారి డిగ్రీ కళాశాల. గురజాడ చదివినదీ, ఉద్యోగం చేసినదీ ఇక్కడే
గంటస్థంభం. విజనగరానికి ఇది తలమానికం.
పెద్ద చెరువు. వేలాది ఎకరాల నేలకు సాగునీరు అందిస్తున్న పెద్ద చెరువు. దేవుల పల్లి కృష్ణ శాస్త్రి ఓ సారి తమ విజయనగర అనుభవాలను స్మరించుకుంటూ , విజయగరంలోని ఒక్కో ప్రదేశాన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇలా అన్నారు:
‘‘విజయనగరంలో నాకన్నీ ఇష్టం. చివరకి పెద్ద చెరువులో దోమలు కూడా. ’’ అని.
ఈ పెద్ద చెరువు దగ్గర దోమల మందిరం అని ఒకటుండేది. అక్కడ దోమలు ఎక్కవగా ఉండే రోజులలో దాదాపు ఒక నెల రోజుల పాటు పాఠశాలలకి ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే వారుట.
శ్రీ పైడితల్లి అమ్మ వారి గుడి. విజయనగర రాజుల ఇల వేలుపు. ఏటా విధిగా జరిగే అమ్మ వారి పండుగలో సిరిమానోత్సవం ఒక ప్రత్యేక ఆకర్షణ.
అమ్మ వారికి చెందిన తొలి గుడి విజయ నగరం రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంది. వనం గుడి అని ఆ గుడికి పేరు.
కన్యాశుల్కం, ముత్యాల సరాలు, తెలుగు తొలి కథ దిద్దుబాటు మొదలయిన గురజాడ రచనలు జాతి నోముల ఫలంగా వెలుగు చూసిన చోటు ఇదే.
విద్యార్ధి భోజనశాల
గుమ్చీ ఈ ప్రక్కగా వెళ్తే శంకర మఠం వస్తుంది. కౌముదీ పరిషత్తు తొలి రోజుల కార్యక్రమాలు అక్కడే జరిగేవిట.
ఇవీ జూనియర్ పొటిగరాప్పంతులు నాకిచ్చిన ఫొటోలు. మరోసారి అతను మిగతా ప్రదేశాల ఫోటోలు ఇచ్చాక మీముందు పెడతాను.
ఈ లోగా అతని కోసం మంచి చుట్టలు ఎక్కడ దొరుకుతాయో వాకబు చేయాలి. మరి ఉంటాను.
3 కామెంట్‌లు:
ఫొటోలూ, వాటికి మీ పరిచయవాక్యాలూ చాలా బాగున్నాయి.
నెనర్లు
ధర్యవాదాలండీ
photoestho baagaa rasaru
కామెంట్‌ను పోస్ట్ చేయండి