చెప్పదగుఁ గవిత రసముల్
జిప్పిల నప్పప్ప ! భళి భళీ !యన, లేదా,
యెప్పుడుఁజేయక యుండుట
యొప్పు సుమీ ! సుకవి యెంత యుచితఙ్ఞుఁడొకో !
మాదయ గారి మల్లన రాజ శేఖర చరిత్రలో చెప్పిన పద్యమిది.చెబితే రసవంతమైన చక్కని కవిత చెప్పాలి. లేదా కవిత్వం జోలికి పోకుండా ఉండాలి. అంతే కానీ చచ్చూ పుచ్చూ కవిత్వాలు వద్దర్రా అని ఖండితంగా చెప్పాడు.
కవిత్వం అంటే, లేత అరిటాకు మీద వెన్నెల ప్రసరించి నట్టుగా తళుక్ మనేలా ఉండాలి.
పురి విప్పిన నెమలి గోడ మీద నుండి చెంగున దూకి నట్టు గుండె ఝల్లు మనేలా ఉండాలి.
అనే వారు మా గురు దేవులు శ్రీ మానా ప్రగడ శేషశాయి గారు.
కవిత్వం ఎలా ఉండాలో చాలా మంది చాలా రకాలుగా చెప్పారు.
బైచరాజు వేంకట కవి మాత్రం కాస్త ముందుకు పోయి ఇలా చెప్పాడు:
ఘనతర ఘూర్జరీ కుచయుగ క్రియ గూఢము కాక, ద్రావిడీ
స్తన గతిఁ దేట గాక, యరచాటగు నాంధ్ర వధూటి చొక్కపుం
జనుగవ బోలి గూఢమును చాటు దనంబును గాక యుండఁజె
ప్పిన యదిపో కవిత్వమనిపించు, నగించు నటుగాక యుండినన్.
కవిత్వం ఘూర్జరీ వనితల స్తన ద్వయం లాగా మరీ అంత గూఢంగా ఉండి పో కూడదుట.అలాగని ద్రవిడ స్త్రీల కుచ మండలం వలె మరీ బహిరంగమూ కాకూడదట.
మరెలా ఉండాలయ్యా కవిత్వం ? అంటే, ఆంధ్ర స్త్రీల చనుగవ వలె అంత గూఢమూ, అంత బాహిరమూ కాకుండా, కనీ కనిపించనట్టుగా , కవ్వించే లాగున ఉండాలని పచ్చిగా ఈ కవి గారు శలవిస్తున్నారు. అలా చెబుతేనే అది కవిత్వమనిపిస్తుందని దబాయిస్తున్నారు. లేక పోతే నవ్వులపాలయి పోతుందని బెదిరిస్తున్నారు.
హవ్వ !ఇలా చెబుతే కాని కవిత్వం ఎలా ఉండాలో తలకెక్కి చావదు కాబోలు!
కవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే . ఓపిక చేసుకుని ఈ టపా చూడండి.
1 కామెంట్:
మల్లెలు పూచు భంగి ; పవమానుడు చల్లగ వీచు భంగి ;రే
పల్లెను గొల్ల పిల్లడలవాటుగ వేణువు నూదు భంగి; వి
ద్యుల్లత తళ్కుమంచు దివి తోచిన భంగి; వధూవరుల్ సదా
యుల్లములుల్లసిల్లు మధురోక్తుల నాడెడు భంగి; వర్షపున్
జల్లులు రాలగా నెమలి సమ్మతి నృత్యము సేయు భంగి; పూ
విల్లు ధరించి మన్మథుడు వేమరు తూపుల వేయు భంగి ; రం
జిల్లి ముదమ్మునన్ శిశువు చెల్వుగ నవ్విన భంగి ; నిండు జా
బిల్లి సుధాప్రసారమన వెన్నెల వన్నెలనీను భంగి ; మేల్
పల్లకి నెక్కి రాసుత విలాస విహారము సల్పు భంగి ; సం
పల్లలితాంగి సత్కరుణ భాగ్యములిచ్చిన భంగి ; కచ్ఛపీ
వల్లకిపై సరాగముల భారతి మీటిన భంగి; కోవెలన్
ఘల్లున నుల్లముల్ తనియ గంటలు మ్రోగెడు భంగి ; కోయిలల్
పల్లవముల్ భుజించి గరువమ్మున నిమ్ముగ కూయు భంగి ; సం
ఫుల్ల సరోజముల్ సరసి మోహన రీతిని బొల్చు భంగి ; మేల్
చల్లని చందనమ్మలది స్వామికి తాపము బాపు భంగి ; ధీ
తల్లజు డాశు రీతి కవితా రస ధారల జిమ్ము భంగి ; మే
నెల్ల శ్రమంబు మాని పులకింపగ నింపుగ సొంపు మీరగా
పల్లె పడంతి శ్రావ్యముగ పాడెడు జానపదమ్ము భంగి ; వ
ర్తిల్లవలెన్ కవిత్వము ; మరిన్ ప్రజ నాలుకలందు నిల్చి వ
ర్థిల్లవలెన్ కవీంద్రు డతిరిక్త యసస్సముదీర్ణ సాంద్రుడై!!!
కామెంట్‌ను పోస్ట్ చేయండి