కుమారుడు, తటాకము,కావ్యము,నిధానము,ఆలయము,వనము,భూదేవ స్థాపనము ఈ ఎనిమిదింటినీ మన పూర్వీకులు సప్త సంతానాలుగా పేర్కొన్నారు.
వీటిలో కొందరు కుమారునికి బదులుగా సత్ర ప్రతిష్ఠ ను సప్త సంతానాలలో ఒకటిగా భావిస్తూ ఉంటారు. అదలా ఉంచితే, వీటిలో వనము అంటే తోట అని అర్ధం. తోటలు పెంచడంలో మన పూర్వీకులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. అందులో ధార్మిక దృక్పథమూ, లోక కల్యాణ సంకల్పమూ తప్ప, వ్యాపార దృక్పథం ఇసుమంతయినా ఉండేది కాదు.
ఆర్ధిక ప్రయోజనం లేదనుకుంటే, ఎలాంటి చెట్లనయినా, అనాలోచితంగా మొదలంటా నరికి వేయడానికి సందేహించని ప్రవృత్తిని పెంపొందించుకున్నాం. ఎంత దురదృష్టమో కదూ?
ఈ సందర్భంగా మాకూ ఉన్నాయి స్వగతాలు పేరిట గోపీచంద్ వ్రాసిన తుమ్మ చెట్టు గుర్తుకు వస్తున్నది. అందులో భూకామందు తన పొలంలో పెంచుకున్న తుమ్మ చెట్టుని ఎంతో ప్రీతి పాత్రంగా చూసుకుంటాడు. కాని, అతను గతించాక, కాని కాలం దాపురించి, అతని అల్లుడు పొలం గట్టున ఆ తుమ్మ చెట్టు అసహ్యంగా ఉండడమే కాక, వ్యర్ధంగా ఉందని భావించి, నిర్దయగా దానిని కొట్టి వేయిస్తాడు. ఇందులో తుమ్మ చెట్టు ఆత్మగతం ఎంతో విఙ్ఞాన దాయకంగానూ, చాలా హృదయంగమంగానూ ఉంటుంది. తుమ్మ ముళ్ళు కాళ్ళలో దిగబడుతున్నా, దాని ఉపయోగం తెలిసిన రైతులు తుమ్మ చెట్టును ఎంతో ఆదరంగా చూసుకుంటూ ఉంటారు. దాని విశిష్టత తెలియని వ్యక్తుల దృష్టిలో తుమ్మ చెట్టు ఒక పనికి రాని చెట్టు. ఈ రచన చదివితే, ఒక్క తుమ్మ చెట్టే కాదు, ప్రతి చెట్టూ మానవాళికి ఎంతో ఉపయోగకారి అని గ్రహిస్తాం.
ఇక ప్రస్తుత విషయానికి వస్తే ...
మన పెద్దలు వన దేవతలను కొలిచారు. చెట్లనూ, పుట్లనూ సేవించడం మన హైందవ సంస్కృతిలో ఒక ప్రథానభాగం.
మా చిన్నప్పుడు సోషలు పాఠంలో అశోకుడు రహదారికి ఇరు ప్రక్కలా చెట్లు నాటించెను. అనే అంశాన్ని ఎంతో ఇష్టంగా చదువుకునే వాళ్ళం. అశోకుడు రోడ్డుకి రెండు ప్రక్కలా చెట్లు ఎందుకు నాటించాడో తెలుసునా? అనడిగితే, దారి మధ్యలో అయితే ఇబ్బంది కదండీ అనే కొంటె కోణంగుల కాలమిది.
చెట్లను ప్రేమించడమంటే, ప్రకృతిని ఆరాధించడం.
ఎప్పుడో, ఏడాదికోసారి వన మహోత్సవాల తంతు తూతూ మంత్రంగా జరిపించి, చేతులు దులుపుకోవడం అనే ప్రహసనం మనకు తెలిసిందే.
కాని , మన పూర్వీకుల అలా కాదు. వృక్ష జాతిని దేవతాగణంగా తలపోసి ఆరాధించే వారు.
వాపీకూప తటాకాలు ప్రతిష్ఠించి, వనాలను అభివృద్ధి చేసే వారు. అటవీ సంపదకూ, వర్షాలకూ, భూసార పరి రక్షణకూ, సుఖతరమైన ప్రజా జీవితానికీ, చెట్లు ఆధారం అని ఏనాడో గ్రహించారు. అలాంటి వనాలను అభివృద్ధి చేసి ఆదర్శప్రాయులయ్యారు.
వృక్షో రక్షతి రక్షిత: అన్నారు.
ఈ శ్లోకం ఆ విషయాన్నే ఎలుగెత్తి చాటుతోంది. చూడండి:
దశకూప సమా వాపీ. దశ వాపి సమో హ్రద:
దశ హ్రద సమ: పుత్రో దశ పుత్ర సమో ద్రుమ:
పది నూతులతో ఒక దిగుడు బావి సమానం. నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటె
సూనృత వ్రత యొక బావి మేలు .... అని నన్నయ గారు శకుంతలోపాఖ్యానంలో శకుంతల చేత చెప్పించిన పద్యం ఇదే విషయాన్ని వివరించింది.
ఇక, పది దిగుడు బావులతో ఒక చెఱువు సమానం. ఒక కుమారుడు పది చెఱువులతో సాటి రాగలడు.
పదిమంది పుత్రులతో సమాన మైనది ఒక మహా వృక్షం !!
అని, చెట్టు ప్రాముఖ్యం ఎలాంటిదో వివరించారు.
అంతే కాదు, ఏయే చెట్లు నాటి పోషిస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందో కూడా వివరించారు.
చూడండి:
అశ్వత్థ మేకం పిచుమన్ద మేకం, న్యగ్రోథ మేకం దశతిన్త్రిణీకం
కపిత్థ బిల్వా2మలక త్రయంచ, పంచామ్రవాపీ నరకం న పశ్యేత్.
ఒక రావి చెట్టు, ఒక పిచుమంద వృక్షం ( అంటే, వేప చెట్టు. దీనినే నింబతరువు అని కూడా పిలుస్తారు), ఒక మ్రరి చెట్టు, పది చింత చెట్లు, మూడు వెలగ చెట్లు, మూడు మారేడు చెట్లు, మూడు ఉసిరిక చెట్లు, అయిదు మామిడి చెట్లు కలిగిన తోటను పెంచాలని ఈ శ్లోకంలో చెప్పబడింది. దానిలో ఒక దిగుడు బావిని తవ్వించమని కూడా చెప్పారు. అలా చేసిన వారు నరకం చూడరని దీని భావం ! అంటే, వారికి స్వర్ట ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు.
స్వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని శ్లోకంలో చెప్పిన లెక్క ప్రకారం అవే చెట్లను అదే లెక్కతో నాటి, అక్కడ ఓ దిగుడు బావి తవ్విస్తే సరి పోతుంది కాబోలు అనుకో వద్దు. లెక్క కేం కానీ, వీలయినన్ని చెట్లను పెంచి తగిన నీటి వసతి ఏర్పరచ మని చెప్పడమే ప్రధానోద్దేశం.
చెట్లు కూలుతున్న దృశ్యాలు మనకింక కనిపించ కూడదు. కదూ?
స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి