26, అక్టోబర్ 2010, మంగళవారం

నూక్రా స్యాత్ అంటే, ఏమిటండీ బాబూ ?!


దువ్వూరి వేంకటరమణ శాస్త్రి గారు ప్రముఖ సంస్కృత పండితులు. వారొకసారి విజయ వాడ నుండి బందరు రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఏమీ తోచక రైలాగితే పక్కన కూర్చున్న ఆయన్ని స్టేషను పేరేమిటండీ అనడిగారు.

దానికాయన తరిగొప్పుల అని జవాబిచ్చేరు. మళ్ళీ రైలు వెడుతూ ఉంటే, తర్వాతి స్టేషనేమిటని శాస్త్రి గారు అడిగారు. ఇందుపల్లి అని జవాబిచ్చేరాయన. ఇలా పదే పదే అడుగుతూ ఉంటే, మీకు సంస్కృతం వచ్చునాండీ అని ఆ వ్యక్తి అడిగారుట. శాస్త్రి గారు తెల్ల బోయి వచ్చునని తలూపేరుట. అప్పుడాయన ఈ క్రింది శ్లోకం చెప్పారు:

బెరానిఉత ఇందోగు నూకవప్పె చిమా: క్రమాత్
స్టేషన్సు బెజం శాఖాయాం నూక్రాస్యాదితి నిర్ణయ:

ఆ పెద్ద మనిఫి ఇందులో బెజవాడ నుండి బందరు వెళ్ళే దారిలో ఉన్న స్టేషన్ పేర్ల మొదటి అక్షరాలన్నీ వరుసగా కూర్చి చెప్పాడు.
బె = బెజవాడ
రా = రామవరప్పాడు
ని = నిడమానూరు
ఉ = ఉప్పులూరు
త = తరిగొప్పుల
ఇం = ఇందుపల్లి
దో = దోసపాడు
గు = గుడివాడ
నూ = నూజెళ్ళ
క = కవుతరం
వ = వడ్లమన్నాడు
పె = పెడన
చి = చిలకలపూడి
మ = మచిలీపట్నం (బందరు)

ఈ చమత్కారానికి శాస్త్రి గారు సంతోషించేరు. అయితే, ఆయన చెప్పిన దాంట్లో రెండో పాదంలో నూక్రాస్యాత్ అంటే ఏమిటో మాత్రం శాస్త్రి గారికి అర్ధం కాలేదు. అదే , అడిగారు ఆ పెద్ద మనిషిని.

అదా, మరేం లేదండీ, నూ = నూజెళ్ళలో, క్రా = క్రాసింగు, స్యాత్ = అవుతుంది ! అని చెప్పి, శాస్త్రి గారు ఆశ్చర్యం నుండి తేరుకునే లోపలే ఆ పెద్ద మనిషి రైలాగేక, చక్కా దిగి వెళ్ళి పోయాడుట !

( సురభి - సమాహారం నుండి)

ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా పార్వతీ పురం దాటేక లడ్డ అనే ఊరొకటి ఉంది. అక్కడ నుండి ఒరిస్తా రాష్ట్రం మొదలవుతుంది. అక్కడే, లంజ అనే ఊరు కూడా ఉందండోయ్ ! మీరు నమ్మినా , నమ్మక పోయినా ఇది ముమ్మాటికీ నిజం !

లడ్డ దాటగానే , వచ్చేది ఏ వూరని అడిగిందిట ఒకామె. రైలు చేసే చప్డుడులో ఆమెకి వినబడదో, ఏమో అని , ఆ పెద్దాయన పెద్ద గొంతుకతో , లంజ అన్నాడుట . దాంతో వాళ్ళిద్దరకీ పెద్ద తగువయి పోయిందిట ! ఈ ముచ్చట మా ప్రాంతంలో చెప్పుకుని నవ్వుకునే వారు.

తమాషాగా అనిపించే ఊరి పేర్లు చాలా కనిపిస్తాయి. అలాంటిదే, మా వేపు మల్లడుగు అనే ఊరి పేరు. ఒకాయన ప్రక్కనున్న వ్యక్తిని మీదే ఊరండీ అనడిగేడు. మల్లడుగు అని ఈయన బదులిచ్చేడు. ఎన్నిసార్లడిగినా, ఆయన నోటంట అదే జవాబు. అడిగినాయనకి కోపం తన్నుకొచ్చింది. మీకేం చెవుడా? అని కసిరాడు. మల్లడుగు ఊరికి చెందిన ఆసామీ నోరు వెళ్ళ బెట్టాడుట.

ఇవన్నీ ఇలా ఉంచితే, ఇలా తొలి అక్షరాల సాయంతో మన 18 పురాణాలు పేర్లూ గుర్తుంచుకునే వీలు కలిపించారు. పెద్దలు . ఈ శ్లోకం చాలా మందికి తెలిసే ఉండొచ్చు. తొలి అక్షరాల ముచ్చట కనుక. సందర్భం వచ్చింది కదా అని తెలియని వారి కోసం ఇక్కడ ఆ శ్లోకాన్ని పొందుపరుస్తున్నాను.
చూడండి:

వ్యాస ప్రోక్త పురాణాలు మొత్తం 18. వీటి పేర్లు వరుసగా గుర్తు పెట్టు కోవడండ కోసం ఒక శ్లోకం కంఠోపాఠం చేస్తే సరి !
చూడండి:

మద్వయం,భద్వయం చైవ, బ్రత్రయం, వ చతుష్టయమ్
అ,నా,ప,లిం,గ,కూ,స్కాని పురాణాని పృథక్ పృథక్

వివరణ:
మద్వయం - మ అనే అక్షరంతో మొదలయ్యే రెండు పురాణాల పేర్లు:

మత్స్య పురాణం , మార్కండేయ పురాణం

భద్వయం - భ అనే అక్షరంతో మొదలయ్యే రెండు పురాణాల పేర్లు:

భాగవత పురాణం , భవిష్య పురాణం

బ్ర త్రయమ్ - బ్ర అనే అక్షరాలతో మొదలయ్యే పురాణాలు 3.

బ్రహ్మాండ పురాణం , బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం,

వ చతుష్టయమ్ - వ అనే అక్షరంతో మొదలయ్యే 4 పురాణాల పేర్లు:

వామన పురాణం, వాయవ్య పురాణం, వైష్ణవ పురాణం, వరాహ పురాణం

ఇక రెండో పాదంలోని అక్షరాలతో మొదలయ్యే పురాణాల పేర్లు చూడండి:

అ - అగ్ని పురాణం
నా - నారద పురాణ:
ప - పద్మ పురాణం
లిం - లింగ పురాణం
గ - గరుడ పురాణం
కూ - కూర్మ పురాణం
స్కా - స్కాంద పురాణం

స్వస్తి.











9 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

Mnemonics :)
రైలుస్టేషన్ల శ్లోకం మట్టుకి భలే ఉంది.

Ayalasomayajula చెప్పారు...

మంచి శ్లోకం గుర్తుచేశారు

karlapalem Hanumantha Rao చెప్పారు...

నమస్కారం పంతుల జోగారావు గారు!
మీ బ్లాగ్ చాలా చాలా చాలా అద్భుతంగా వుంది.చూపులకే కాదు...విషయానికి కూడా ! మీ బోటి వారి దగ్గరనుంచి ఇంత కన్నా తక్కువ ఆశించటం తెలివి తక్కువ తనమే అవుతుందను కోండి౧ అన్నట్లు మీరు చెప్పిన అనాపలింగ కూ స్కాం -ని నేను ఒకప్పుడు నా నాటికకు శీర్షిక గా వాడుకున్నాను.రవీంద్ర భారతిలో వేసారు.తరువాత ఆకాశవాణి నాటకోత్సవలలో కూడా కబీర్ దాస్ వాళ్ళు వేసారు .మంచి విషయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలండి!

అజ్ఞాత చెప్పారు...

manassuku hattukunels vraasaru.

కాంత్ చెప్పారు...

బాగుందండీ స్టేషన్ల శ్లోకం. BTW, విజయనగరం-రాయ్‌పుర్ లైన్‌లో లంజిఘర్ రోడ్ అని స్టేషన్ ఉందండి. ఒరిస్సాలో లంజిఘర్ అనే ఊరికి వెళ్ళాలంటే అక్కడ దిగాలనుకుంటా. అది "లంజ" కాదండీ (pun unintended).

కథా మంజరి చెప్పారు...

కె.కె గారూ,
మీరన్నది నిజమే. ఆ గ్రామం పేరు లంజిఘర్. కాని పార్వతీపురంలో చాలా మంది, కొంటెతనం కోసమో, యేమో, దానిని లంజ అని పిలవడం కద్దు. అదే విషయం ప్రస్తావించేను తప్ప ఏ ఊరి పేరునూ ఎగతాళి చేయాలని కాదు.

కెక్యూబ్ వర్మ చెప్పారు...

జోగారావు గారు మీరన్న లడ్డ స్టేషన్ దగ్గర లంజ వూరు లేదండి. అది కొమరాడ మండలం నయ పంచాయతీలో చాలా చిన్న వలస. మామూలుగా ప్రచారమైన కథ మాత్రమే ఇది. ఈ వూరు పేరు మాకు వుద్యోగ రీత్యా కూడా ఆడవారున్నచోట, అధికారుల దగ్గర పలకడానికి ఇబ్బంది పడుతుంటాం..

అలాగే లంజిఘర్ అనేది నేడు వేదాంత కంపెనీ వాళ్ళు బాక్సైట్ తవ్వకాలు జరుపుతున్న ప్రాంతం. ఇది ఒరిస్సాలోది. ఇక్కడి వారే వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా పోరాడి దాని అనుమతులు రద్దు చేయించారు.

కథా మంజరి చెప్పారు...

@ విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు.
ఆ ఊరు కొమరాడ మండలంలో ఉందని నాకు తెలియదు.అప్పట్లో అందరూ అనుకునే విషయాన్నే చెప్పాను. అలాగే, ఆ ప్రాంతంలో ఒక చమత్కార వాక్యంలో వరుసగా నాలుగైదు ఊర్ల పేర్లు పలుకుతూ ఉండే వారు. అదేమిటో నాకు గుర్తుకు రావడం లేదు. తమాషాగా ఉండే ఓ నాలుగైదు ఊర్ల పేర్లతో ఒక వాక్యం తయారయేది.

లంజిఘర్ ప్రజలు తమ నిరసనోద్యమంలో విజయం సాధించారని తెలిసి సంతోషించాను.

అజ్ఞాత చెప్పారు...

ఆమధ్య పేపర్ లొ చదివాను-ఆ ఊరి పేరుని ఇపుడు వై.ఎస్.ఆర్.గ్రామం గా మార్చారు. ఊరి ప్రజలు ఎంతో కాలం విన్నపాలు చేసిన పిమ్మట అని.
-asha kiran

కామెంట్‌ను పోస్ట్ చేయండి