5, నవంబర్ 2010, శుక్రవారం

పేకాట పద్యాలు


గుఱ్ఱం జాషువా చీట్ల పేక శీర్షిక క్రింద వ్రాసిన పేకాట పద్యాలు చూడండి ...


నాలుగు రంగుల వాలజూపుల సాని

అతికాల భుక్తికి నాటపట్టు

గెలిపించి యోడించు కులుకు నవ్వుల పిల్ల

కలహమ్మునకు నిండు కారణమ్ము

వ్యసన వల్లికలకు బలమైన చేయూత

తొలఁగించు కొనరాని జెలగపట్టు

ప్రొద్దెఱుంగని మోహమునకుఁజింతామణి

నలునిల్లు గూల్చిన నంగనాచి

నెత్తి గొరిగి పంపు నెల్లూరి నెఱజాణ

కితవ, జాండములకు బ్రతుకు దెరువు

త్రాగుడునకుఁ గొంత దగ్గఱ చుట్టమ్ము

చేతి డబ్బు పోక చీట్ల పేక !

ఇస్పేటు,ఆఠీను, కళావరు, డైమండ్ ఈ నాలుగూ నాలుగు రంగులలో ఉంటాయి పేక ముక్కలు. ఈ వాలు చూపుల పేక సాని కూడా అన్ని రంగులు, అన్ని హొయలు కలిగినది

.

వేళాపాళా లేని తిండికి పేకాట ఆటపట్టు. పేకాటలో కూర్చుంటే నిద్రాహారాలు గుర్తనకు రావు.

ఓ సారి గెలిపిస్తుంది. మరో తూరి ఓడిస్తుంది. అలా గెలుపోటములతో కులుకు నవ్వుల పిల్ల పేకాట.

తగువులకు పూర్తి కారణం ఇదే. పేకాటలో వచ్చే పేచీలకు కొదవ ఉండదు. వ్యసన మనే లతకు బలమైన చేయూత. వ్యసనాలను పెంచి పోషిస్తుంది.

ఒక సారి పేకాట వ్యసనంగా మారితే, ఆ వ్యసనం జలగలాగా మరి వదలదు.

రేయి పవళులు తెలియ నివ్వ కుండా సుబ్బి శెట్టి సాని చింతామణి వ్యామోహంలో నిండా మునిగి పోయి నట్టు, పేకాటలో కూచున్న వారికి రాత్రీ లేదు, పగలూ లేదు. నలుడంతటి వాడు కూడా ఈ వ్యసనం వల్లనే కదా, ఇల్లు గుల్ల చేసుకున్నాడు?

నెల్లూరి నెఱజాణలాగా తల గొరిగి (అంటే, గుండు చేయించి అని కాదు కానీ, ఉన్నదంతా ఊడ్చుకుని అన్న మాట) మరీ పంపిస్తుంది. పేకాటలో కుదేలయి పోతే , నెత్తిన గుడ్డ వేసుకో వలసినదే కదా?

ఈ పేకాట వ్యసనం మద్యపాన వ్యసనానికి కూడా దగ్గరి చుట్టం. ప్రక్కన మద్యం సీసాలు, గ్లాసులు పెట్టుకుని పేకాట ఆడే జల్సారాయళ్ళు ఎందరో ! చేతి చమురు వదిలి పోయేలా చేస్తుంది, ఈ పేకాట

.

జోకరుగానిఁ దోడుకొని, చుక్కల చక్కదనంబు మీఱ, ‘‘ మూ

డాకులయాట, యెత్తిళులు, నడ్డు, షర’’ త్తని మ్రోయుచున్న యో

పేక బొజంగి ! నన్ను వలపింపకు, మింతట బుద్ధి వచ్చె, నీ

యాకులపాటులో కలుగు నాకుల పాటుఁదలంప సిగ్గగున్.

జోకరు, చుక్కలు, వీటితో కలగలిపి, ఆడే మూడు ముక్కలాట, ( దీనికే కొంపలు ముంచే కంపీ అని ముద్దు పేరు కాబోలు)యెత్తురుపు, అడ్డాట, షరదాట ...వీటితో ఒప్పుతూ ఉండే ఓ విటురాలా, పేక సానీ, నన్ను వలపించ వద్దు. నన్ను నీవలలో పడేలా చేయకు. నాకు బుద్ధి వచ్చింది. పేకాట వ్యసనం వల్ల కలిగే చీకాకు తలుచుకుంటే వొళ్ళు కలవరపాటు చెందుతోంది.

అంగీకార నినాదముల్ పటుతర వ్యాహారముల్, భ్రూకుటీ

భంగాక్షేపణముల్, పరస్పర జయ వ్యామోహ వాద ధ్వనుల్

సంగీతంబులు, కూనిరాగములు, నీలల్, దీర్ఘనిశ్వాసముల్

నింగిన్ దాకుచునుండు, నీదు కేళీతరంగ మధ్యంబునన్.

పేకాటలో కూర్చున్నాక, ఇక మొదలవుతాయి, రకరకాల హావభావ చేష్టలూ, వికారాలూ, విన్యాసాలూనూ. సరేనని ఒప్పుకోవడం, కాదని దెబ్బలాడడం, కను బొమలు ముడి వేసి ఆక్షేపణలు తెలియ జేయడం, ఒకరి గెలుపుని ఒకరు హర్షిస్తూ బాగుంది !బాగుంది ! అనడం.మధ్య మధ్య నోటికొచ్చిన సాటలు పాడడం ( బూతు పాటలయితే మరీ రంజుగా ఉంటాయంటారు, పేకాట రసిక శేఖరులు), లేదా, కులాపాగా కూని రాగాలు తీయడం, ఒక్కో సారి హఠాత్తుగా ఈల పాట రఘురామయ్యలుగా మారి పోతూ వారెవ్వా ! అంటూ ఈలలు వేయడం, మరొకప్పుడు వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ( ముక్క కలవనప్పుడు మరీనూ) ఉండడం,.. మిన్నంటే ఈ చర్యలన్నీ పేకాట మధ్యలో పేకాట రాయళ్ళు చేసే విన్యాసాలు చూసి తీరాల్సిందే కానీ చెప్ప నలవి కావు..

నిఱుపేదన్ గరుణించి పాపమని కానీ, ధర్మ మర్పింపఁ జి

ల్లర లేదంచుఁ దొలంగ లుబ్ధుఁడు, సముల్లాసంబుతో మేటి తెం

పరియై, నూటికి నూరు లొడ్డి విరమింపండక్కటా ! పేక సుం

దరి ! నీ ముక్కలు మోహనాస్త్రములు, చింతాసఔధసోపానముల్.

అయ్యో, పాపం కడు నిరు పేద అని జాలి పడి ఒక్క ఎర్ర ఏగానీ ఇవ్వడానికి చేతులు రావు, కానీ, వందకి వందా ఒడ్డి పేకాటలో ఎంత పోగొట్టు కున్నా, విడువ కుండా ఇంకా ఆట ఆడుతూనే ఉంటారు, కొందరు (పేక) పట్టు వదలని విక్రమూర్ఖులు.) ఓ పేక సుందరీ, నీ పేక ముక్కలు సమ్మోహనం కలిగించే మోహనాస్త్రాలు కదా? చింతాసౌధానికి దారి తీసే మెట్ల దారి కదా?

అనుంగు బిడ్డఁడు బావిలోఁ బడె నన్నా ! లేచి రమ్మన్నఁదె

చ్చున దీ మార్గమెకా యటంచు వచియించున్ జూదగాడందు, రిం

దున సందేహము లేదు, కేవలము మందుండై విషగ్రస్తుఁడై

తనరున్, రంగ మలంకరించిన మహాతత్వఙ్ఞుఁడున్, వ్రేల్మిడన్.

పేకాటలో కూర్చున్న వారికి ఒళ్ళూ మీదా తెలియదు. ముద్దుల కొడుకు బావిలో పడి చచ్చేడయ్యా, ఆ ముక్కలు అలా పారేసి, వేగం రావయ్యా, అని పిలిచినా, పేకాట వదలి లేవడు.పైపెచ్చు, శవాన్ని ఈ దారంటే తెస్తారు కదా, అప్పుడు చూదాం లే అంటాడు. సందేహం లేదు. వట్టి మూర్ఖుడు.మత్తుడు.భవభంధాలను తృణప్రాయంగా చూసే మహా తత్వవేత్త కాబోలు

.

గెలుపా ! యూయెల సంశయంబునకు మఒగ్గెన్, బేస్తులా రెండు రూ

కలపై చిలక్కు కుదేళు లిచ్చు కొననింకం బావులా కాని గా

వలె, నీ ఘోర విపత్తు మస్తమున సంప్రాప్తించెనా ! వాఁడు వి

హ్వల నాగేంద్రము పాహి !పాహి !వఱకై యబ్జాక్షుఁడున్ రావలెన్.

గెలుపు కలిగేలా లేదు. బేస్తులు రెండు రూకలకు మించి పోయేలా ఉంది. కుదేలు ఇచ్చు కోవాలంటే పావలా ఐనా కావలె. ఎంత ఆపద వచ్చిందిరా నాయనా.ఈ ఆపద గట్టెక్కించడానికి అలనాడు గజరాజునికాపాడిన శ్రీ మహా విష్ణువే రావాలి కదా. ( ఈ పద్యం లోని పేకాటకి చెందిన సాంకేతిక పదజాలం నాకు బొత్తిగా తెలియక పోవడం వల్ల భావం తోచిందేదో రాసేను.మన్నించాలి,)

పేకయాటలోని పింఛనీదారుండు

చుట్ట త్రాగు కొనుచుఁజూడ వచ్చి

‘‘చెఱచి’’ తనుచు ముక్కు చిట్లించు కొని పోవు

పేకయాట, గుండె పీకులాట.

ఈ పద్య భావం కూడా అందడం లేదు. పేకాట వొట్టి గుండె పీకులాట అనేదే తెలుస్తోంది.

అర్ధమైనంత వరకూ, పేకాట జరిగే చోటుకి ముసలాళ్ళు చుట్టలూ అవీ త్రాగుతూ వచ్చి, కాసేపు ఎవడి ప్రక్కనో చేరి ఆట చూసి, ‘‘ పాడు చేసావోయ్’’ అని విసుక్కుని వెళ్ళి పోతూ ఉంటారు అని కాబోలు.

పేకాట గాళ్ళ ప్రక్కన చేరే వారికి మనం ఏ ముక్క కొట్టినా నచ్చదు.మనం శుద్ధ తెలివి తక్కుగా ఆడుతున్నామని వారి ప్రగాఢ విశ్వాసం. ఊరికే విసుక్కు పోతూ ఉంటారు.వాళ్ళ ఆలోచన మనకి తట్టక పోవడం మన తప్పా, చెప్పండి?


ఇవండీ, పేకాట పద్యాలు.


దపావళి పండుగ పూట, సరదాగా పేకాట ఆడుకుందా మనుకుంటూ ఉంటే, ఇలాంటి టపా పెట్టావేమిటయ్యా, అని కోపగించు కుంటారేమో !

మరందు చేత అందరకీ ...


.

4 కామెంట్‌లు:

హను చెప్పారు...

pekaTa ki kuDa padyalu vunnayi ani ee roju ee telisimdi naaku

SRRao చెప్పారు...

జోగారావు గారూ !
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు

- శి.రా.రావు
శిరాకదంబం

కథా మంజరి చెప్పారు...

హను గారికీ, ఎస్.ఆర్. రావు గారికీ ధన్యవాదాలు.

కొత్త పాళీ చెప్పారు...

హ హ. బాగుంది.
కన్యాశుల్కంలో మధురవాణి తన "ఎదంఐరర్స్" అందర్నీ పెట్టుకుని పేకాడుతుండగా పూజారి గవరయ్య మధురవాణి మీద పేకలోని రాణులతో పోలుస్తూ ఆశువుగా ఓ పద్యం చెబుతాడు .. సమయానికి గుర్తు రావట్లేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి