8, నవంబర్ 2010, సోమవారం

నా నరక లోక యాత్ర ... మొదటి భాగం !


ముందుగానే విన్నవించు కుంటున్నాను. ఇది ఏ వర్గాన్నీ కించ పరచడానికి వ్రాస్తున్నది కాదు. పంచతంత్రంలో ఒక శ్లోకం ఉంది. అందులో పురోహితులూ, సన్యాసులూ తప్పకుండా నరకానికి పోయే అవకాశం గురించిన ప్రస్తావన ఉంది.

చూడండి:

నరకాయ తే మతి శ్చేత్,
పౌరోహిత్యం సమాచర
వర్షం యావత్ కిమన్యేన
మఠచింతాం దినత్రయమ్.

ఈ శ్లోకంలో కచ్చితంగా ఎవరు నరకానికి పోతారో బల్ల గుద్ది మరీ చెబుతున్నాడు శ్లోక కర్త.

వారెవయ్యా, అంటే,

నీకు నరకానికి పోవాలని కోరిక ఉంటే ఒక యేడాది పాటు పౌరోహిత్యం చెయ్యి !

అంతకాలం ఓపిక లేదనుకుంటే దానికీ ఓ మార్గం ఉంది.

ఒక మూడు రోజులు మఠం గురించి ఆలోచించు. మూడు రోజుల పాటు మఠ ప్రవేశం చేసి చూడు. అంతే, నీకు నరకం తథ్యం !

పౌరోహిత్యం చేసే వాళ్ళూ, సన్యాసులూ తప్పులు చేసే అవకాశం పుష్కలంగా ఉంది కనుక, వారు తప్పకుండా నరకానికి పోవలసిన వారే అని దీని భావం.

నాకున్న ఒకటి రెండు అనుభవాలు ఆలోచిస్తే, కనీసం, నాకు అది నిజమే అనిస్తుంది.
నేను ఉద్యోగ రీత్యా పని చేసే ఒక ఊరిలో ఒక పురోహితుడు ఉదయాన్నే, నాతో పాటు గంగయ్య హొటల్ లో పెసరట్టూ ఉప్మా లు తృప్తిగా తిని, వేడి వేడి కాఫీ కులాసాగా సేవించి, ఆతర్వాత, అవి అరిగే వరకూ వీధరుగుల మీద చీట్ల పేకలో తరించి, ప్రొద్దు తిరిగి, మధ్యాహ్నంఏ మూడింటికో తద్దినం పెట్టడానికి తీరికగా బయలు దేరే వాడు. అంత వరకూ, తద్దినం పెట్ట వలసిన ఇంటి యజమాని, వారి బంధుగణం ఉదయం నుండీ అభోజనంతో ఆకలితో నకనకలాడి పోతూ. నీరసాలు ముంచు కొచ్చి, ఇతని కోసం ఎదురు చూపులు చూస్తూ శోష వచ్చి పడి పోయే స్థితికి చేరు కునే వారు...

ఓ సారి మా మామ గారి ఇంట్లో ఒక భోక్త తీరా భోజనానికి కూర్చున్నాక, తిన లేక తిన లేక నాలుగు ముద్దలు నోట పెట్టుకని భళ్ళున అక్కడే వమనం చేసుకున్నాడుట. కారణం మరేమీ కాదు, డబ్బు కక్కుర్తితో అప్పటికే వేరొక చోట ఆ వ్యక్తి భోక్తగా వెళ్ళి కడుపు నిండా తిని రావడమేనని తెలిసింది.

నేను ఓ కుగ్రామంలో పని చేసే రోజులలో ఒక బ్రాహ్మణ కుటుంబీకులు ఇంట్లో పితృకార్యం చేస్తూ సాయంత్రం ఐదయినా, పిలిచిన భోక్తలు ప్రక్క ఊరి నుండి ఎంతకీ రాక పోవడంతోదిగాలు పడి పోయి, చివరకి పెళ్ళయిన బ్రహ్మచారిగా ఆ ఊళ్ళో ఒంటరిగా ఒక గది తీసుకుని ఉంటున్న నన్ను భోక్తగా రమ్మని బ్రతిమాలేరు. అప్పటికే నేను మధ్యాహ్న భోజనం కానిచ్చి, ఏదో పుస్తకం చదువుతూ ఓ కునుకు తీస్తున్నాను. నా భోజనం అయిపోయింది కదా, నేనెలా పనికి వస్తాను ? అనడిగేను. ఆ కుగ్రామంలో మరొక బ్రాహ్మణ నలుసు లేక పోవడం చేత, పాపమో,పుణ్యమో తమ ఇంటికి వచ్చి భోక్తగా తమ తల్లి గారి ప్రసాదం తిని వెళ్ళమని కన్నీళ్ళతో వేడుకున్నారు. నాకిక తప్పింది కాదు.ఆ రోజు నేను వారింటి పితృకార్యంలో నిష్ఠగా పాల్లొన లేదు. వారి బలవంతం చేతనే కావచ్చు, తిండి తినీసి, వారింటికి భోక్తగా వెళ్ళడం జరిగింది. ఈ విధంగా ఆచారం మంట కలపేను. ఆ కారణం చేత నాకు నరకం తప్పదని నేను ఇప్పటికే నిర్ణయానికొచ్చీసేను.

ఇప్పుడు చెప్పండి, నిష్ఠగా, శుచిగా, చిత్త శుద్ధితో చేయాల్సిన పురోహిత కార్యాలు మొక్కుబడిగా, అశ్రద్ధగా,తూతూ మంత్రంగా, పిండి కొద్దీ రొట్టె, యావత్ తైలం, తావద్వాఖ్యానమ్ లాగా , ఇచ్చే డబ్బు కొద్దీ చేయించే వారూ నరకానికి పోతారంటే, పోరూ మరి !

అలాగే, నిత్యానంద స్వాముల వంటి వారు మన వెర్రిభారతంలో వేలూ, లక్షలూనూ. వాళ్ళందరూ నరకానికి కాక పోతే, స్వర్గానికి పోతారా ! ఆలోచించండి.

అందుకే, శ్లోక కర్త అథమపక్షం ఓ ఏడాది పాటు పౌరోహిత్యం చేసిన వారూ, కనీసం ఓ మూడు రోజుల పాటు సన్యాసిగా ఉండే వారు సైతం నరకానికి పోవసిందే అని ఢంకా బజాయించి చెబుతున్నాడు ...

తప్పులు చేసే పురోహితులూ, సన్యాసులే కాదు, తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!

సరే, అదలా ఉంచితే, నాకు నరక లోకపు బెర్తు ఖాయం అని తేలి పోయింది. ఏం చేస్తాం చెప్పండి. అయితే, నాకు తోడుగా అక్కడ నాకంటె ముందుగానో, కాస్తంత అటూ యిటూ గానో, మిత్రుడు భీమ్ పాపాల శర్మ , కవితా కరవాలాలతో చెండాడే కుకవులూ, భార్యలను ఏడిపించుకుని తినే భర్తలూ, భర్తలను కాల్చుకు తినే భార్యలూ, రేగింగు వీరులూ, కల్తీ మందులూ వస్తువులూ విక్రయించే వ్యాపారులూ, అధిక వడ్డీలు గుంజే అధమాధములూ, ప్రజా సేవ పేరిట ప్రజా కంటకులైన నాయకమ్మన్యులూ ( రాజ్యాంతే నరకం ధృవమ్ కదా ) , పసి పిల్లలను గొడ్డుల్లా బాది పైశాచికానందం పొందే టీచర్లూ, క్షుద్ర సాహితీ సమరాంగణ సార్వ భౌములూ, నాలాగా చేతికొచ్చిన బ్లాగులు పెట్టి బాధించే బ్లాగు పిశాచులూ, హత్యలూ, దోపిడీలూ చేసే వాళ్ళూ, రాంగ్ కాల్స్ చేస్తూ విసిగించే ఫోనాసురులూ ... ... మరింక చెప్ప లేను ... ఇలా చాలా మంది వచ్చి చేరుతారనే నిబ్బరంతో నరక లోక యాత్రకు రెడీ అయి పోతున్నాను, మరి ... నరక లోకపు జాగిలమ్ములు మబ్బు చాటున ఖణేళ్ మన్నాయ్ !!

నా నరక లోక యాత్ర ద్వితీయ భాగంలో ఆ ముచ్చటలు వివరిస్తాను. మీరంతా చదివి ఆనందించ వచ్చును. మనకి స్వర్గమో, నరకమో ఇతమిత్థంగా ఇంకా తేలని స్థితిలో, ఎదుటి వాడికి నరకం ఖాయమని తేలి పోయేక , మనకి ఆనందం వెయ్యదూ?!




2 కామెంట్‌లు:

లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ చెప్పారు...

>>
తాము స్వీకరించిన వృత్తిని ప్రేమించని వారూ, త్రికరణ శుద్ధిగా మెలగని వారూ,తమ వృత్తిని ద్వేషించే వారూ,వృత్తికి న్యాయం చేయని వారూ,న్యాయ మార్గంలో వృత్తి బాధ్యతలు నిర్వహించని వారూ .... వీళ్ళంతా వెళ్ళేది నరకానికే కదా ?!
>>
100% agreed with you sir.

ముద్దు కృష్ణ జ్యోతి చెప్పారు...

జోగారావుగారూ,
మీ మామగారి ఇంట్లో జరిగిన విషయం నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే అది మా ఇల్లే కదా. అలా జరగగానే అమ్మ మధ్య వాకిట్లోకొచ్చి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, ఇల్లుగల మామ్మగారు అప్పుడే అన్నారు. 'అయ్యో మీరెందుకండి బాధపడతారు, ఇందులో మీ తప్పేముంది. 'వాడే' నరకానికి పోతాడు అని అప్పుడే అన్నారు. జ్యోతి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి