17, నవంబర్ 2010, బుధవారం

అప్పటికి కానీ బుద్ధి రాదు, మరి !


అంధత్వం ఒక అంగ వైకల్యం. దురదృష్టవశాత్తు జన్మత: అంధత్వం కలిగితే, ఆ బ్రతుకంతా ఇక దుర్భరమే.

గ్రుడ్డితనం అనేది మనుషులకు చూపు సరిగా ఉండి కూడా, వేరే విధంగా వచ్చే అవకాశం ఉంది.

కళ్ళుండీ చూడ లేని కబోదులు కొందరుంటారు. వారిదంతా వక్ర బుద్ధి. అందు చేత వారి దృష్టి కూడా వక్ర మార్గాన్నే పడుతుంది.

దయామయుడైన భగవంతుడు రెండు నేత్రాలనూ ఇచ్చినది ప్రకృతిలోని అందాలను తనివి తీరా చూసి తరించేందుకే కదా ! హరిత శోభతో అలరారే చెట్లూ, చేమలూ, లతానికుంజాలూ, సూర్యోదయ సూర్యాస్తమయాల వేళ రాగ రంజితమైన ఆకాశమూ, నదులూ, సెలయేళ్ళూ, ఎగిరే పక్షులూ, పుచ్చ పువ్వులాంటి వెన్నెలా, రంగుల హరివిల్లులూ, కొండ కోనలూ. జలపాతాలూ, చెంగున దుమికే లేళ్ళూ, ... ఇలా ప్రకృతి అందాలు చూడడానికే కదా కళ్ళున్నది, కానీ, కరెన్సీ నోట్లను మాత్రమే చూడగోరే కళ్ళు ఉండీ లేనట్టే. అలాంటి వారు జాత్యంధులతో సమానం.

మహా భారతంలో ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. దానికి తోడు అతనికి అలవిమాలిన పుత్ర
వాత్సల్యం అనే గ్రుడ్డితనం కూడా దాపురించింది. దానితో కౌరవ వినాశనానికి అతడే మూల కారకుడయ్యేడు.

సారపు ధర్మం, విమల సత్యం పారము పొంద లేక నాశనమవుతూ ఉంటే, నివారింప గల సమర్ధత కలిగి ఉండి కూడా , ఎవడు ఉపేక్ష చేస్తాడో , అది వాడికే చేటు కలిగిస్తుందని శ్రీకృష్ణుడు మహా భారతంలో హెచ్చరించాడు కదా?

అందు వల్ల కళ్ళు లేక పోవడం దయనీయమే అయినా, కళ్ళుండీ కానక పోవడం మాత్రం క్షంతవ్యం కానేరదు.

చాల మంది ఇలా కళ్ళున్న కబోదులుగా ఎందుకు మారుతున్నారయ్యా అంటే, మదం ముదిరి పోవడం వల్ల, అహంకారం అతిశయించడం వల్ల. అయాచితంగా ఉన్నత పదవీయోగం చేకూరడం వల్ల. తరాల తరబడి తిన్నా తరగని గని లాంటి సంపదలు వచ్చి పడడం వల్ల.

ఇలాంటి వారు పయనించేది పతన మార్గమే. ఇలాంటి వారిని అనుసరిస్తే మనకు పట్టే గతి కూడా అట్టిదే సుమా !

భాగవతంలో పోతనామాత్యుడు చెప్పిన పద్యం తెలిసినదే కదా?

కానని వాని నూత గొని కానని వాడు విశిష్ట వస్తువుల్
గానని భంగి కర్మములు గైకొని కొందఱు కర్మ బద్ధులై
కానరు, విష్ణుఁగొందఱటఁగందు రకించన వైష్ణవాంఘ్రి సం
స్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు దానవేశ్వరా !

గ్రుడ్డి వాడు మరొక గ్రుడ్డి వాని చేయి పట్టుకుని వాని సాయంతో ఏ వస్తువునూ చూడ లేడు.
అదే విధంగా, విషయాసక్తులై, కర్మ బంధాలలో చిక్కువడిన వారు శ్రీహరిని చూడ లేరు. కొందరు మహా విష్ణు భక్తులు మాత్రం ఆ స్వామిని కనులారా చూడ గలరు. అంతే కానీ సంసారంలో కొట్టు మిట్టాడుతూ ఉండే వారు భగవంతుడిని ఎన్నటికీ చూడ లేరు.

పుట్టుక చేతనే గ్రుడ్డితనం ప్రాప్తించిన వారిని సాయం తీసికొని మనం సత్యదర్శనం చేయ లేమని పోతన ఇందులో చెప్పాడు. కళ్ళున్న కబోదులను అనుసరించినా మన గతి అంతే అని కూడా అర్ధం చేసుకోవాలి.

కళ్ళున్న కబోదుల గురించి ఒక శ్లోకంలో కవి ఇలా వివరించాడు. చూడండి ...

సంపన్నో2ధవదేవ కించి దపరం నో వీక్షతే చక్షుషా,
సద్భి ర్వర్జితమార్గ మేవ చరతి ప్రోత్సాహితో జాలిశై:
తస్మిన్నేవ ముహు: స్ఖలన్ ప్రతిపదం గర్వాంధకూపే పత,
త్యస్యాంధత్వ నివర్తకైషధ మిదం దారిద్ర్య మేవాంజనమ్ !

మితి మీరిన సంపదలు కలవాడు గ్రుడ్డి వాడితో సమానం. అంధుడి లాగానే, వాడు తన కన్నులతో ఏమీ చూడ లేడు. దుష్టులతో తిరుగుతూ, వారి ప్రోత్సాహంతో సత్పురుషులు ఏవగించుకునే చెడు దారులలోనే సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఆ చెడు మార్గం లోనే నడయాడుతూ ఉంటాడు. తమ చెడు ప్రవర్తన వలన చీటికీ మాటికీ అనేకమయిన దెబ్బలు తింటూ ఉంటాడు. అయినా బుద్ధి రాదు. తమ నడవడిక మార్చుకోడు. చివరకి అంధకూపంలోకి కూలి పోతాడు.

మరి, అలాంటి కళ్ళున్న కబోదుల అంధత్వం తొలిగించడానికి మార్గమే లేదా?

ఉంది.

వారి అంధత్వం పోగొట్టాలంటే దానికి దారిద్ర్యం అనేది ఒకటే తగిన అంజనం సుమా !

అంటే, అలాంటి వారి కళ్ళు తెరుచు కోవాలంటే, వారి సంపద ఉన్నదంతా ఊడ్చి పెట్టుకు పోయి, వాళ్ళు దరిద్రులయి పోవాలి, అంతా పోయేక కానీ వారి కళ్ళు తెరచు కోవు అంటున్నాడుశ్లోకంలో
కవి.

అలాగే, అధికార మదం చేత కళ్ళు కనిపించకుండా పోయే వారికి ఆ పదవి ఊడి పోతే తప్ప తిరిగి చక్కని చూపు రాదు. అధికారాంతమున చూడ వలె కదా, అయగారి సౌభాగ్యముల్ ! అని కదా ఓ కవి చెప్పాడు ...

స్వస్తి.

1 కామెంట్‌:

కామెంట్‌ను పోస్ట్ చేయండి