16, డిసెంబర్ 2010, గురువారం

వెర్రి మొర్రి శంకలు

అనుమానం పెనుభూతం అన్నారు. మనకి రాను రాను అన్నీ అనుమానాస్పదాలుగానే తోచడం ఒక విషాదం. తినే తిండి మంచిదో కాదో అనుమానం. తాగే నీరు మంచిదో కలుషితమైనదో భయం. పీల్చే గాలి స్వచ్ఛమైనదో కాదో అనే శంక పీడిస్తూ ఉంటుంది. చదివే చదువుకి సరైన ఉపాథి లభిస్తుందో లేదో తెలియక సతమత మైపోతూ ఉంటాం. దరి చేరిన వాడు మిత్రుడో, సమయం చూసి వెన్ను పోటు పొడుస్తాడో తెలియదు. వొంటికి ఏ రోజున ఏ రోగం వస్తుందో అని హడలి పోయి ఛస్తూ ఉంటాం. సగం రోగాలకి ఆ భయమే కారణం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మ కూడదో తెలియదు. నమ్మిన వాడు పాల ముంచుతాడో, నట్టేట ముంచుతాడో అర్ధం కాదు. నమ్మక పోతే ఏం అనర్ధమో తెలియదు. ఆఫీసు కెళ్ళిన భర్త / భార్య అక్కడ ఎలా ప్రవర్తిస్తున్నారో అనే అనుమానంతో వ్యథ చెందే అనుమాన పిశాచులూ ఉంటారు. అలాంటి మూర్ఖుల వల్ల వారికీ మశ్శాంతి ఉండదు. వారిని వెన్నంటి ఉండే వారికీ సుఖం ఉండదు. ఇంటికి వేసిన తాళం గడియ ఊడిపోయే లాగున పది సార్లు లాగి చూస్తే కానీ తాళం సరిగా వేసామో, లేదో, అనే శంక తీరదు. ఊరికెళ్ళి వచ్చే సరికి ఇల్లు దోచుకో బడకుండా భద్రంగా ఉంటుందో లేదో అనే అనుమానంతో మనశ్శాంతి కరువవుతుంది. బజారులో కొన్న పచారీ వస్తువులు కల్తీవో, నాణ్యమైనవో గ్రహించడం కష్టమై పోతోంది. విత్తనాలు కొన్న రైతుకి పాపం, అవి మంచివో, నకిలీ విత్తనాలో తెలీదు. పోనీ, పండిన పంట ఏరకమయిన అతివృష్టి, అనావృష్టి లాంటి వేవీ లేకుండా సరిగా చేతి కందుతుందో లేదో తెలీదు. మన వద్ద ఉన్న వంద, అయిదు వందలు, వెయ్యి నోట్లు మంచివో కాదో తెలియక తికమక పడిపోతూ ఉంటాం.బోలెడు డబ్బు పోసి టిక్కెట్లు కొనుక్కుని వెళ్తే సినిమా బావుంటుందో, చీదేస్తుందో తెలియదు.ఇంట్లో కరెంటు ఎప్పుడు టప్పున ఆరి పోతుందో, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా ఎంత సేపు ఉంటుందో గ్యారంటీ లేదు. ఇంటాయన ఇంటద్దె ఎప్పుడు పెంచేస్తాడో ఏమో అని బెంగ పడుతూ ఉంటాం. సొంత ఇల్లయితే, ఏలిన వారు ఎంత శాతం పన్ను పెంచి పన్నూడ గొడతారో తెలియదు.ముచ్చట పడి కొనుక్కున్న చీర రంగు ఎంత కాలం వెలిసి పోకుండా ఉంటుందో నిర్ధారణగా చెప్పలేం. పత్రికకి పంపిన రచన పడుతుందో, తిరిగొస్తుందో ఎవరికెరుక ? అచ్చేసుకున్న పుస్తకాలు అమ్ముడు పోతాయో, మూలన పడి బూజు పడతాయో తెలియదు. ఎక్క వలసిన రైలు, లేదా విమానం సకాలానికి బయలు దేరుతుందో, రద్దవుతుందో తెలియదు. నల్లా లో నీళ్ళు ఎప్పుడు వదులుతారో ఏమో తెలియదు. వచ్చినా, ఎంత సేపు ఉంటుందో తెలియదు. ఎంత బాగా రాసినా పరీక్షలో ఎన్ని మార్కులు పడతాయో తెలియదు. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చిన ఉద్యోగం ఎప్పుడు ఊడి పోతుందో నమ్మకం లేదు. కంప్యూటరు ఎప్పుడు మొరాయిస్తుందో ఖర్మ ! మహిళా బిల్లు అమలుకి నోచు కుంటుందో లేదో ? భీమ్ పాపాల శర్మ మన నెత్తి మీదకి మళ్ళీ ఏ సినిమా కథ చెబుతాడో తెలీదు. విప్లవం వస్తుందో రాదో అగమ్య గోచరం. ఏ ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టు కుంటుందో ఎవడికీ తెలియదు. పొత్తులు ఎంత కాలం నిలుస్తాయో అసలే తెలీదు. అయోధ్యలో రామాలయం కడతారో లేదో తెలీదు. తెలంగాణా వస్తుందో రాదో తెలీదు. వస్తే, హైదరాబాదు సంగతి ఏం చేస్తారో తెలీడం లేదు. తీరా, తెలంగాణా ఇచ్చేక మరెన్ని చిన్న రాష్ట్రాల కోసం పేచీలు మొదవుతాయో తెలీదు. గెలిపించిన ప్రభుత్వం ఐదేళ్ళూ పాలిస్తుందో, మధ్యంతరానికి దారులు తీస్తుందో చెప్ప లేం. 2012 దాటేక ప్రళయం వస్తుందో ఏమో నని బెంగ. ( ఈ విషయంలో ఇప్పటికే ఘనత వహించిన కొన్ని టీ వీ ఛానెళ్ళు పని కట్టుకుని ఊరికే ఊదర గొట్టేస్తున్నాయి కదా ? )

ఈ కథా మంజరి టపాని ఎంత మంది చదువుతారో తెలీదు. చదివిన వారు ఎంత మంది కామెంట్ లు పెడతారో తెలీదు

ఇది అనంతం. వీటికి అంతం లేదు.....

హితోపదేశంలో కవి ఒక శ్లోకంలో మనకు కలిగే అనేక శంకల గురించి ఉటంకిస్తూ, అన్ని శంకలు పెట్టుకుంటే బతక లేం అని తేల్చి పారేసేడు.

చూడండి:

శంకాభి: సర్వ మాక్రాంతం, అన్నం పానం చ భూతలే
ప్రవృత్తి: కుత్ర కర్తవ్యా, జీవితవ్యం కథం ను వా.

భూమ్మీద అన్ని విషయాలూ అనేక అనుమానాలతో కూడి ఉంటున్నాయి.
చివరకి అన్నం తినడం, నీరు త్రాగడం కూడ అనుమానం వల్ల దుర్భరమవుతోంది. అంటే,
తినడానికీ, త్రాగడానికీ కూడా ఊరికే భయ పడి పోతూ ఉంటున్నాం. ఇలాగయితే బతకడం ఎలాగ ? అని దీని భావం.

ఇన్ని అనుమానాలతో బతకడం కష్టం కనుక మరీ వెర్రి మొర్రి అనుమానాలు పెట్టు కోకుండా ప్రశాంతంగా బతకడం అలవాటు చేసుకోవాలి. ఈ టపా రాయడంలో నేను చెప్ప దలచిన పరమార్ధం అదే.

ఈ విషయం ఎంత మంది సరిగా అర్ధం చేసుకుంటారో కదా, అనేదే నా అనుమానం !!

స్వస్తి.



4 కామెంట్‌లు:

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

గురువుగారూ, మీరు చక్కగా సోదాహరణంగా అన్నీ వివరిస్తూ ఉంటారు.
మీ బ్లాగు మెచ్చే నాలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ వ్యాఖ్య వ్రాయకపోయినంత మాత్రాన చదువరులు లేరనుకోకండి.
తప్పకుండా మీరు రాస్తూనే ఉండండి అని అభ్యర్థన.

కథా మంజరి చెప్పారు...

మందాకిని గారూ, ధన్యవాదాలండీ.

www.apuroopam.blogspot.com చెప్పారు...

అయ్యా నిత్య శంకితులు గారూ మీరు చెప్పింది అక్షర సత్యం .మీ లిస్టు అనంతం. మీరు విమానం బయల్దేరుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేసేరు.అది అక్కడితో ఆగదు. బయల్దేరిన విమానం గాలిలోనే మండి పోతుందో సేఫ్ గా లేండ్ అవుతుందో లేదో కూడా తెలీదు ఖర్మ, అందుచేత మరి ఇది అనంతం. మీమీదొక పద్యం:

నమ్మడెవరిమాట నమ్మడు తనసతి
నమ్మడెపుడు వాని అమ్మనైన
బెమ్మ ఎదుట నిల్చి నమ్మబల్కినగూడ
సణుగుచుండు నిత్య శంకితుండు --
పంతుల గోపాల క-ష్ణ

సుధారాణి చెప్పారు...

అబ్బబ్బబ్బ....మరీ ఇన్ని అనుమానాలతో బతుకుతున్నామని తెలీకుండానే బతికేస్తున్నాం మేము....అసలు ఈ బతుకూ ఓ బతుకేనా అనే అనుమానం ఉందనుకోండి.
కన్యాశుల్కం సినిమాలో రామప్పంతులు ....వెర్రి అనుమానాలు పడకు మరీనూ...అని చెప్పాడు కదా.
చాలాబాగా రాసేరు...అనుమానాలగురించి... కామెంట్లు ఈ బాక్స్ లో రాయనంతమాత్రాన మీ పోస్టు ఎవరూ చదవలేదేమోనని అనుమానం పడకండిస్మీ...
ఇంతకీ నాకో అనుమానం.
ఈ కామెంట్ మీచేత అంగీకరించబడి ప్రచురణ పొందుతుందో లేదోనని.....

కామెంట్‌ను పోస్ట్ చేయండి