17, డిసెంబర్ 2010, శుక్రవారం

పొగడ దండలు !!


లోకంలో పొగడ్తకి లొంగని వాడు లేడు. బయటకి ’అబ్బే, మీరు మరీనూ ...‘ అంటూ సన్నాయి నొక్కులు నొక్కినా, లోపల లోపల ఆ పొగడ్తలకి పొంగి పోతూనే ఉంటాడు. మరి కాస్సేపు పొగిడితే బావుండునని అనుకుంటూ ఉంటాడు.తనని పొగిడే వాడి కోసం ఏం చేయడానికయినా సిద్ధ పడి పోతాడు.పొగడ్తల మహిమ అలాంటిది మరి !

ఆడవాళ్ళయితే ఈ పొగడ్తలకి మరింత తేలికగా వశులై పోతారనే అభిప్రాయం కూడా లోకంలో ఉంది. మగరాయళ్ళు ఆ బలహీనతను బాగా ఉపయోగించు కుంటూ పబ్బం గడుపుకుంటూ ఉంటారు.

పూర్వ కాలంలో రాజులు ఈ పొగడ్తలు చెవిని పడనిదే శయ్య దిగే వారు కాదు. కనులు తెరిచే వారు కాదు. భట్రాజులు రకరకాలుగా పొగుడుతూ ఉంటే కాని వారి అడుగు ముందుకి పడేది కాదు.

రాజకీయ నాయకుల చుట్టూ చేరే అనుచర గణం ఆ నాయకుని ప్రతి మాటకీ చర్యకీ వత్తాసు పలుకుతూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. దానితో సదరు నాయకమ్మన్యుడు భూమికి ఓ అడుగు ఎత్తున విహరిస్తూ ఉంటాడు.

పొగడ దలచిన వాడెప్పుడూ స్వీయ ప్రయోజనం నెర వేరాలనే ఆలోచిస్తాడు. ఎవడిని పొగుడు తున్నాడో వాడిలో అతనికి ఏ లోపాలూ కనిపించవు. అన్నీ సుగుణాలే మిల మిలా మెరిసి పోతూ ఉంటాయి. ధగ ధగా వెలిగి పోతూ ఉంటాయి.

కూరిమి గల దినములలో నేరము లెన్నడూ కనిపించవు కదా ! ఆ కూరిమి విరసమై నప్పుడే కదా, అన్ని దోషాలూ కనిపిస్తూ ఉంటాయి.

అందు వలన ఇవాళ పొగిడిన వాడు రేపు పొగుడుతాడనే గ్యారంటీ లేదు. పొగిడినా, మునపటి స్థాయిలో పొగుడుతాడనే భరోసా లేదు.

నీ ప్రభ వెలుగుతున్నంత కాలం నిన్ను పొగడ్తలతో ముంచెత్తిన వాడే రేపు నిన్ను నిర్ధాక్షిణ్యంగా తిట్టి
పోయడానికి వెనుదీయడు.

నువ్వు ఇంద్రుడివనీ, చంద్రుడివనీ, అదనీ ఇదనీ , తెగ పొగిడిన నోరే తెగనాడుతుంది.

నీ ముందు పాదాక్రాంతుడైన వాడే నీ ముఖాన ఛీత్కరించుకు పోతాడు.

సరే, ఇదంతా కాస్సేపు ప్రక్కన పెడితే.

ఎవరెవరిని పొగడాలో ఎవరిని అస్సలు పొగడ కూడదో కవి గారు ఒక శ్లోకంలో చెబుతున్నారు.

చూడండి:

ప్రత్యక్షే గురవ: స్తుత్యా:, పరోక్షే మిత్రబాంధవా:
కర్మాంతే దాసభృత్యాశ్చ, న కదాచన పుత్రకా:

గురువులను ఎదుట పొగడ వచ్చును.
బంధువులను, మిత్రులను వారి పరోక్షంలో మాత్రమే పొగడాలి.
సేవకులను, వారి విధి నిర్వహణ పూర్తయేక పొగడాలి.
పుత్రులను మాత్రము ఎన్నడూ పొగడ కూడదు సుమా !

గురువులు ఙ్ఞాన ప్రదాతలు. వారి గొప్పతనాన్ని వారి సముఖాన పొగిడితే దోషం కాదు. వారు స్థిత ప్రఙ్ఞులు కనుక మనం పొగిడినంత మాత్రాన పొంగి పోరు. పొగడక పోతే చిన్నబుచ్చు కోరు.

బంధువులు . స్నేహితులు ... వీరి గురించి ఎట్ట ఎదుట పొగడ కూడదు. మరీ అంత భజన పనికి రాదు. మరీ పొగుడుతూ ఉంటే వారి కళ్ళు స్థాన భ్రంశం చెందే అవకాశం కూడా ఉంది.

ఇక, పని వాళ్ళని ఎప్పుడు పొగడాలయ్యా, అంటే, వాళ్ళ పని, వాళ్ళు సక్రమంగా పూర్తి చేసిన తరువాత మాత్రమే పొగడాలి.

మా పనమ్మాయి అంత మంచిది, ఇంత మంచిది, అంత పనిమంతురాలు, ఇంత పనిమంతురాలు అంటూ ఆమె పని చేయక ముందే పొగిడితే ఉబ్బి తబ్బిబ్బయి పోయి మనతో పాటు టీ.వీ చూస్తూ కూర్చుంటుంది, కమ్మని కాఫీ ఇస్తే చప్పరిస్తూ ...

చివరిగా ఎవరిని ఎప్పుడూ పొగడ కూడదో కూడా చెబుతున్నాడు కవి, పుత్రులను అసలు ఎప్పుడూ పొగడనే కూడదట.

అలా పొగడడం వారికి ఆయుక్షీణం అని మన వారి నమ్మకం కూడానూ.

పుత్రులను పొగడరాదని చెప్పడానికి ప్రచారంలో ఉన్న ఓ కథని చూదాం ...

కిరాతార్జునీయమ్ వ్రాసిన భారవి గురించిన ఈ కథ లోకంలో ప్రచారంలో ఉంది.

యువకుడైన భారవి కవిత్వాన్ని, గొప్పతనాన్ని మెచ్చు కుంటూ అందరూ తెగ పొగుడుతూ ఉంటే, భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాటా అన లేదుట.

దానితో భారవికి విపరీతమైన కోపం ముంచుకు వచ్చింది. తండ్రి బుర్ర బ్రద్దల కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది.

అదే పని మీద ఓ రాత్రి ఒక పెద్ద బండ రాయిని పట్టుకుని అటక ఎక్కి కూర్చున్నాడు. రాత్రి పూట తండ్రి గారి బుర్ర మీద దానిని గిరాటు వేసి, తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చు కోవాలని అనుకున్నాడు.

సరే, రాత్రయింది. భారవి తల్లిదండ్రులు అక్కడకి చేరి మాట్లాడుకుంటున్నారు. అదను కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి.

‘‘లోకమంతా మన భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చు కుంటూ ఉంటే, మీరేమిటండీ వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాటా అనరు ? వాడిని పొగిడితే మీ నోటి ముత్యాలేమయినా రాలి పోతాయా ? ’’ అని నిష్ఠూరంగా పలికింది తల్లి.

దానికాయన, ‘‘ పిచ్చి ముఖఁవా ! ( పెళ్ళాల వెప్పుడూ పిచ్చి ముఖా లే కదా, హత విధీ !!) భారవి గొప్ప తనం నాకు తెలియదుటే? వాడు ఎంత గొప్ప కవిత్వం వ్రాస్తున్నాడో చూస్తున్నాను. వాడి గొప్ప తనం చూసి ఎంతగా పొంగి పోతున్నానో, నీకేం తెలుసు? అయితే, మన బిడ్డని మనం పొగడ కూడదు. అది వాడికి శ్రేయస్కరం కాదు. అంచేత వాడిని పొగడడం లేదు కానీ , వాడంటే ఇష్టం లేక కాదు సుమీ ! ’’ అన్నాడు.

అంతే !

భారవి కవి ఆగ్రహమంతా మంచులా కరిగి పోయింది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ తండ్రి కాళ్ళ మీద పడి తను చేయ దలచిన ఘోరకృత్యం గురించి చెప్పి, తన పాపానికి తగిన శిక్ష విధించ మని కోరాడు.
పశ్చాత్తాపానికి మించిన శిక్ష లేదని తండ్రి ఎంత చెప్పినా విన లేదు. శిక్ష విధించి తీరాలని పట్టు పట్టేడు.

‘‘సరే, ఓ యేడాది పాటు మీ అత్తారింట గడిపి రా ! ’’ అని తండ్రి శిక్ష విధించాడు.‘ ఇదేం శిక్ష! ’ అనుకుని భారవి ఎగిరి గంతేసి, భార్యతో పాటు అత్తారింటికి వెళ్ళాడు.

కొన్ని రోజు పాటు అత్త వారింట సకల మర్యాదలూ జరిగేయి. తర్వాత మొదలయ్యేయి, విసుక్కోవడాలూ, సణుక్కోవడాలూ, పిల్లి మీదా కుక్క మీదా పెట్టి వ్యంగ్యాస్ర్తాలూ, సూటీపోటీ మాటలూ ...

కవి గారు ఏం చేస్తారు; భరించక తప్పదు, శిక్షా కాలం యేడాదీ ముగిసే వరకూ.

ఇలా ఉండగా భార్య ఏదో నోము చేయాలనుకుంది. చేతిలో ఎర్ర ఏగానీ లేదు. భార్య కోరిక ఎలా తీర్చడం ?

భారవి అప్పుడు తను వ్రాస్తున్న కిరాతార్జునీయమ్ కావ్యం లోనుండి ఓ శ్లోకం ఉన్న తాటాకు తీసి, ఆమెకి ఇచ్చి, ఎవరిదగ్గరయినా దానిని కుదవ పెట్టి ధనం తెచ్చుకుని నోము చేసుకొమ్మన్నాడు.

ఆమె దానిని ఊర్లో ఓ ధనవంతుడయిన ఒక వ్యాపారి వద్ద కుదవ పెట్టింది. అతడు ఆ శ్లోకం చూసి, భారవి కవిత్వం గొప్ప తనం తెలిసినవాడు కనుక, ఆమెకు చాలా ధనం ఇచ్చి పంపించాడు.

తరువాత, అతడు ఆ తాళ పత్రాన్ని ఒక కత్తి ఒర లో ఉంచి, గూట్లో పెట్టాడు. ఆ పిమ్మట ఆ వణిజుడు వర్తకం కోసం చాలా ఏళ్ళపాటు దూర దేశాలకు వెళ్ళాడు.

అలా దేశాలు పట్టి తిరిగి, చాలా ఏళ్ళకి ఇంటి కొచ్చిన అతనికి తమ పడక గదిలో ఎవరో పరాయి మగాడు ఉండడం గమనించి ఆగ్రహం కలిగింది. మరో ఆలోచన లేకుండా గూట్లో ఉన్న ఓర లోనుండి కత్తిని బయటకి లాగేడు. దానితో పాటు, ఎప్పుడో తాను అందులో పెట్టిన తాళపత్రం కూడా బయట పడింది. దాని సంగతే అతను మరిచి పోయాడు. ఏమిటా, అని చదివాడు.

అందులో భారవి వ్రాసిన ఈ శ్లోకం ఉంది:

సహసా విధధీత నక్రియామ్
అవివేక: పరమాపదాం పదాం
వృణుతేహి విమృశ్య కారిణామ్
గుణ లుబ్ధా: స్వయమేవ సంపద:

వేయి విధాలుగా ఆలోచించి కాని ఏ పనీ చేయ కూడదు. చక్కగా ఆలోచించి పని చేసిన వానికి సంపదలు తమంతట తామే సమ కూడతాయి. అని దీని భావం.

ఈ శ్లోకం చదివేక, అతని కోప తీవ్రత కొంత తగ్గింది. కాస్త చల్ల బడ్డాడు. ఈ లోగా భార్య లేచి, అతని రాకను చూసి అమితానందం చెంది, ఆ పురుషుని తమ బిడ్డగా పరిచయం చేసింది.చాలా ఏళ్ళ క్రింట తాను విదేశ గమనానికి సిద్ధ పడిన రోజులలో భార్య గర్భవతి అన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చిందతని.

తొందర పడి కత్తి వేటుకి చేజేతులా భార్యనీ కొడుకునీ కడ తేర్చే వాడిని కదా అని అతడు పశ్చాత్తాపం చెందాడు. తనని తొందర పాటు నుండీ, ఒక మహా విపత్తు నుండీ కాపాడిన ఆ శ్లోక కర్త భారవికి అతడు భూరి కానుకలిచ్చి సత్కరించేడు.


ఇక, పొగడడంలో ప్రత్యక్ష పద్ధతి, పరోక్ష పద్దతి అనే రకాలు కూడా ఉన్నాయండోయ్. అంటే, పొగుడు తున్నట్టుగా తిట్టడం, తిడుతున్నట్టుగా పొగడడం. వీటినే మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అంటారు. ఆ రకమయిన పద్ధతులను గురించి విపులంగా పొగడ దండలు 2 టపాలో చూదాం.

స్వస్తి.

1 కామెంట్‌:

కొత్త పాళీ చెప్పారు...

మాస్టారు, మీరిక్కడ రాసిన రెండు కథలూ నాకు చిన్నతనంలో పరిచయమైనవే అయినా, ఇక్కడ మీరు సందర్భోచితంగా వీటిని గుదుగుచ్చి చెప్పింది చదవడంతో గగుర్పొడిచింది.
Excellent stories. Thank you!

కామెంట్‌ను పోస్ట్ చేయండి