20, డిసెంబర్ 2010, సోమవారం

భజంత్రీలు


పొగడ దండలు అనే టపాలో పొగడ్తల గురించి కొంత మాట్లాడు కున్నాం కదా ? ( ఇక్కడ నొక్కి చూడండి)

ఇప్పుడు పొగడ్తలలో రకాల గురించి చెప్పు కుందాం.

తప్పని పరి పొగడ్తలు, మొహ మాటపు పొగడ్తలు, బలవంతపు పొగడ్తలు, బరి తెగించిన పొగడ్తలు,ముక్తసరి పొగడ్తలు యిలా చాలా రకాలు ఉన్నాయి లెండి. ఇవి పొగిడే వాడి లెవెలుని బట్టీ,పొగిడించు కునే వాడి అర్హతానర్హతలను బట్టీ కూడా మారుతూ ఉంటాయి.

ఇవన్నీ అంతర భేదాలు. పొగడ్తలన్నీ కేవలం పొగడ్తలే కాక పోవచ్చు. అవి తెగడ్తలు కూడా కావచ్చును.

మందీ మార్బలాన్ని వెంట బెట్టుకుని ఓ పత్రిక ఆఫీసులో చెల్లికి ( మళ్ళీ) పెళ్ళి అని సొంత కవిత్వం వినిపించిన తణికెళ్ళ భరణి గుర్తున్నాడా ? అతను కవిత శీర్షిక చెప్తాడో, లేదో, చుట్టూ ఉన్న వాళ్ళు వహ్వా, వహ్వా అంటూ భజంత్రీలు వాయించేస్తారు. భరణి గారు ష్ ! నేనింకా కవిత్వం షురూ చెయ్ నే లేంటూ విసుక్కుంటారు కూడానూ.

ముత్యాల ముగ్గులో రావు గోపాల రావు ప్రక్కన సొంత డబ్బాకి భంజంత్రీలు వాయించే మేళం మీకు గుర్తుండే ఉంటుంది.

ఎవడు కాయిన్ చేసాడో, కానీ, సొంత డబ్బా అనే మాట చాలా విలువైనది.

డబ్బా మనదైనప్పుడు ఎంత సేపయినా, ఎలాగయినా వాయించు కో వచ్చును కదా.

సొంత డబ్బా సంగతి ఇలా ఉంటే, ఒకరి జబ్బ ఒకరు చరుచు కోవడం కూడా ఉంటుంది. నువ్వు నా జబ్బ చరిస్తే, నీ జబ్బ నేను చరుస్తాను. అదీ మన మధ్య ఒప్పందం.

నువ్వు నా వీపు గోకితే, నేను నీ వీపు గోకుతాను. ( నా టపాకి నువ్వు కామెంట్లు పెడితేనే నీ టపాకి నేను కామెంట్లు పెడతాను )

ఈ సూత్రం అనుసరించి భజంత్రీలు మ్రోగుతూ ఉంటాయి. డబ్బాలు వాగుతూ ఉంటాయి. వీపులు గోక బడుతూ ఉంటాయి.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, పొగడ్తల రకాలు చూదాం.

మన వాళ్ళు వ్యాజ స్తుతి, వ్యాజ నింద అని రెండు రకాలు చెబుతూ ఉంటారు.

బయటకి పొగుడు తున్నట్టే ఉంటుంది. లోపలి అర్ధం తిట్టడమే.

బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని , నిజానికి అది పొగడడమే.

వ్యాజ స్తుతి అంటే, స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.

వ్యాజ నింద అంటే, నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.

ముందుగా వ్యాజస్తుతికి ఉదాహరణలు చూదాం:

పెద్దా పురం ప్రభువు తిమ్మ రాజు వొట్టి లోభి. ఎంగిలి చేత్తో కాకికిని తోలడు. దాన దరిద్రుడు. ఒక కవి అతని మీద చెప్పిన పద్యం చూడండి:

అద్దిర శ్రీ భూ నీళలు

ముద్దియలా హరికి గలరు ముగురందరిలో

పెద్దమ్మ నాట్య మాడును

దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్.

శ్రీహరికి ముద్దు సతులు మువ్వురు. శ్రీభూనీళలు. వారిలో పెద్దమ్మ తిమ్మరాజు ఇంట నాట్యమాడుతూ ఉంటుందిట. పెద్దమ్మ అంటే దరిద్ర దేవత అని ఇక్కడ కవి భావం.

తెనాలి రామ కృష్ణ కవి పేర వినిపించే ఈ చాటువు చూడండి:

అన్నాతి గూడ హరుడగు

నన్నాతిని గూడ కున్న నసుర గురుండౌ

నన్నా తిరుమల రాయుడు

కన్నొక్కటి లేదు కాని కంతుడు గాడే.

కవి ప్రభువును సాక్షాత్తు శివుని తోను, శుక్రాచార్యునితోను, మన్మధుని తోను సరి పోలుస్తున్నాడు.

అయితే, ఈ పొగడ్తలు కండిషనల్డ్ పొగడ్తలు. ఎలాగంటే,

రాజు గారు తమ రాణీ గారితో కూడి ఉన్నప్పుడు సాక్షాత్తు శివుడే. ఎందు కంటే, పాపం, రాజు గారు ఏకాక్షి. ఒంటి కన్ను వాడు. రాణి గారి తో కూడి ఉన్నప్పుడు మొత్తం ఇద్దరివీ కలిపి మూడు కన్నులవుతాయి కనుక, ప్రభువులవారు ముక్కంటితో సమానం.

రాణి తో కలసి ఉండ నప్పుడు ప్రభువు సాక్షాత్తు అసుర గురుడయిన శుక్రాచార్యడితో సమానం.

శుక్రాచార్యుని వలె రాజు గారికి కూడా ఒకే కన్ను కనుక ఈ పోలిక అన్వర్ధం అంటాడు కవి.

అంతే కాదు, ఒక కన్ను లేదు కానీ, ప్రభువు సాక్షాత్తు మదనుడేనట.

నగపతి పగతు పగతుని

పగతుండగు మగధ రాజుఁబరి మార్చిన యా

జగ జట్టి యన్న తండ్రికి

దగు వాహన మైన యట్టి ధన్యుండితడే.

ఈ పద్యంలో బాదరాయణ సంబంధం చిక్కు విడ దీస్తే వచ్చే అర్ధం - దున్న పోతు

అని !

నగపతి - ఇంద్రుడు

అతని పగతుడు (శత్రువు) - నరకుడు

అతని పగతుడు - శ్రీ కృష్ణుడు

అతని పగతుడు - జరాసంధుడు ( మగధ రాజు)

అతని పగతుడు - భీముడు

అతని అన్న - ధర్మ రాజు

అతని తండ్రి - యముడు

అతని వాహనం - దున్న పోతు !

ఈ పద్యంలో కవి సభలోని వారిని కసి తీరా ఎలా పొగడ్త రూపంలో తిడుతున్నాడో చూడండి:

కొందరు భైరవాశ్వములు, కొందరు పార్ధుని తేరి టెక్కెముల్

కొందరు ప్రాక్కిటీశ్వరులు, కొందరు కాలుని యెక్కిరింతలున్

కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు నీ సదస్సులో

నందరు నందరే మఱియు, నందరు నందరు నందరందరే.

సభలోని వారందరినీ కుక్కలు, కోతులు,పందులు, దున్న పోతులు, గాడిదలు అని కవి వెక్కిరిస్తున్నాడు.

ఈ పద్యం చూడండి:

ఎఱుగుదువు సకల విద్యలు

నెఱుఁగని విఁవ రెండు కలవ వేవే వన్నన్

పిఱికి తనంబును లోభము

గుఱుతెఱుఁగవు జగతి నెన్న గువ్వల చెన్నా

కవి గారు రాజుని పొగుడుతూ, ఇలా అన్నాడు: ఈ ప్రభువుకి అన్నీ తెలుసు. సకల విద్యలూ వచ్చును. మహా వివేకి. కాని రెండే తెలియవు . అవి ఏమంటే, పిఱికి తనం అంటే తెలియదు. లోభత్వం అంటే తెలియదు. పొగడ్త అంటే శీతాకాలంలో గోరు వెచ్చని నీటి స్నానం లాగ ఇలా ఉండాలి!

చివరిగా ఓ పద్యం. ( బూతు అని వార్యం)

జూపల్లి ధర్మా రాయుడు అనే రాజు మహా పిసినారి. అర్ధులకు మొండి చెయ్యి చూపిస్తూ ఉంటాడు.రప రాజు అనే బట్టు కవి అతనిని యాచించ డానికి అతని సభకి వెళ్ళి వచ్చేడు. ఆ కవికి సూరప రాజు అనే కవి మిత్రుడు ఒకడు ఉన్నాడు. రాజ దర్శనానికి వెళ్ళి వచ్చిన తన మిత్రుడైన ఈరప రాజుని చూడగానే ఆత్రతతో ప్రభువులు ఏమిచ్చారు, ఏమిచ్చారు ? అని అడిగేడు.

సూరప రాజు:

‘‘ జూపల్లె ధరాయం

డేపాటి ధనం బొసంగె ? నీరప రాజా ?’’

దానికి ఈరప రాజు ఇచ్చిన సమాధానం ఇదీ !

‘‘పాపాత్ముండెవ్వరికిని

చూపనిదే చూపెనయ్య, సూరప రాజా !’’

ఆ పాపాత్ముడు ఎవరికీ చూపించనిది కవిగారికి చూపించేడుట.

ఇప్పుడు నిందా రూప స్తుతి చూదాం

బయటకి నిందిస్తున్నట్టే ఉంటుంది. అంతరార్ధం మట్టుకు పొగడడమే. దీనికి కాసుల పురుషోత్తమ కవి రచించిన ఆంధ్రనాయక శతకం గొప్ప ఉదాహరణ. మచ్చునకు ఒక్క పద్యం చూదాం:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై

యఖిల భారకు డన్న నాఖ్యఁదెచ్చె

నిష్ట సంపన్నురాలిందిర భార్య యై

కామితార్ధదుఁడన్న ఘనత తెచ్చె

కమల గర్భుఁడు సృష్టి కర్త తనూజుఁడై

బహు కుటుంబికుఁడన్న బలిమి తెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై

పతిత పావనుఁడన్న ప్రతిభ తెచ్చె

అండ్రు బిడ్డలుఁ దెచ్చు ప్రఖ్యాతి కాని

మొదటి నుండియు నీవు దామోదరుఁడవె !

చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ 1

హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !!

శ్రీకాకుళ ఆంధ్ర మహా విష్ణువుకి అఖిల భారకుడు, కామితార్ధదుడు, బహు కుటుంబీకుడు, పతిత పావనుడు అనే బిరుద నామాలు ఉన్నాయి. వాటికి వరుసగా సమస్త లోకాల భారాన్ని వహించే వాడు, కోరిన కోరికలను తీర్చే వాడు, పెద్ద కుటుంబం కల వాడు, అన్ని పాపాలు పోగొట్టే వాడు అని అర్ధాలు. అయితే, విష్ణు దేవునికి ఈ బిరుద నామాలు అన్నీ అతని ఇరువురి భార్యలు, కుమారుడు, కుమార్తెల వలన వచ్చినవే కాని అతని గొప్ప ఏమీ లేదని, అతను తొలి నుంచి దరిద్ర దామోదరుడనీ కవి ఇందులో హేళన చేస్తున్నాడు.

నిజానికి ఇది, నిందా రూపమైన స్తుతి .

సమస్త భారాన్నీ వహించే భూదేవి అతని భార్య. భర్త అంటే, భరించే వాడు. అంటే సమస్త భారాన్నీ వహించే భూ దేవిని భార్యగా పొందిన హరి ఎంత ఘనుడో కదా ? సర్వ సంపదలనూ ప్రసాదించే లక్ష్మీ దేవినే భార్యగా పొందిన విష్ణువు ఘనత ఎన్నతరమా ?

అదే విధంగా, అన్ని ప్రాణులను సృష్టించే వానిని పుట్టించిన వాడు, పాపాలు హరించే గంగను కుమార్తెగా పొందిన వాడు ఎంతటి ఘనుడో కదా.

దామోదరుడు అంటే, దామము ( పద్మము) ఉదరము నందు కల వాడు అని అర్ధం. పద్మ గర్భుడు .

చిత్ర విచిత్రమయిన ప్రభావాలు కల వాడు, దయా గుణము కల వాడు, శత్రువులనే వారిని రూపుమాపిన వాడు శ్రీకాకుళ ఆంధ్ర నాయకుడు.

ఇవీ నిందా రూప స్తుతి, స్తుతి రూప నిందలకు కొద్ది పాటి ఉదాహరణలు.

ఇస్తే పొగడడం లేక పోతే నోటి కొచ్చినట్టు తిట్టడం కూడా ఒక కళగా మన కవులు నిర్వహించేరు.

చూడండి. వీర మల్లుడు అనే రాజు ఒక కవికి కొన్ని మాన్యాలు ఇచ్చేడు. తిరిగి ఎందుకో వాటిని లాగేసు కున్నాడు దాంతో కవి గారికి తిక్క రేగి రాజుని ఇలా తిట్టేడు:

తెగి తాఁ బొడువని పోటును

తగ నర్ధుల కీయ నట్టి త్యాగము, సభలోఁ

బొగిడించు కొనుచుఁ దిరిగెడి

మగ లంజల మగడు వీర మల్లుడు ధాత్రిన్

వీర మల్లుడు వట్టి పిరికి పంద. దాన గుణం ఇసుమంత లేదు. ఎప్పుడూ చుట్టూరా తనని పొగిడే వాళ్ళని ఉంచుకుని తనివి తీరా పొగడించు కుంటూ ఉంటాడు. ఈ వీర మల్లుడు మొడుడికి మొగుడు.

ఇవీ పొగడ దండలు. స్వస్తి.

3 కామెంట్‌లు:

కమనీయం చెప్పారు...

vధనమిస్తే చంద్రలేఖావిలాసము .ఇవ్వకపోతే చంద్రలేఖావిలాసము. ramanarao.muddu

కమనీయం చెప్పారు...

vధనమిస్తే చంద్రలేఖావిలాసము .ఇవ్వకపోతే చంద్రలేఖావిలాసము. ramanarao.muddu

కథా మంజరి చెప్పారు...

క్రీ.శ. 1720 కి చెందిన కూచి మంచి జగ్గ కవి మొదట చంద్ర రేఖా విలాసము అనే గ్రంధం వ్రాసి, దానికి ప్రభువుల ఆదరణ లేక పోవడంతో ఆగ్రహించి, చంద్ర రేఖా విలాపము అనే పచ్చి బూతు పుస్తకం ఒకటి రాసేడు. ఈ కవి జానకీ పరిణయము, సుభద్రా పరిణయము, సోమ దేవ రాజీయము అనే గ్రంధాలు కూడా రాసేడు.
రుక్మిణీ కల్యాణము, అచ్చ తెనుగు కావ్యం నీలా సుందరీ పరిణయము, రసిక జన మనోభి రామము, కుక్కుటేశ్వర శతకము వంటి గ్రంధాలను రచించిన కూచి మంచి తిమ్మ కవికి ఈతడు సోదరుడు. చాల మంది జగ్గ కవి రచనను చంద్ర రేఖా విలాపము అనే దానికి బదులు చంద్ర లేఖా విలాపము అనకుంటూ ఉండడం జరుగుతోంది.

ఇవ్వని వారిని బూతులు తిట్టడం నాటి కవులకు సరదాగా ఉండేది కాబోలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి