10, జనవరి 2011, సోమవారం

ఎంత కష్టం ! ఎంత కష్టం !


‘’ హాయిగా ఇంత వండి పడేసి, మొగుడు ఆఫీసుకి వెళ్ళాక, తిరిగి యింటికి తగలడే వరకూ నీకు పనేం ఉంటుంది చెప్పు? ఏ పత్రికో పట్టుకుని ఆ వెర్రి మొర్రి సీరియల్సూ గట్రా చదవుతూ పడుకోవడమో, లేదంటే, పిచ్చి పిచ్చి టీ.వీ జీళ్ళ పాకం సీరియళ్ళు చూస్తూ గడపడమో తప్పితే ?’’

ఈ రకమయిన మాటలు ఇదే మోతాదులో కాక పోయినా, కొంత మాటల మేకప్ వేసుకుని దాదాపు ప్రతి యింటా విన బడుతూనే ఉంటాయి.

మీరేం చేస్తున్నారని ఎవరయినా అడిగితే ఎందుకో తెలీదు కానీ , కొంచెం అనవసరంగా మొహమాట పడి పోతూ జాబేమీ చేయడం లేదండీ, హౌసు వైఫునిఅని జవాబిచ్చే సగటు ఆడవాళ్ళని చాలా మందిని చూస్తూ ఉంటాం.

జాబ్ చేసే ఆడవారికి తామేదో తీసి పోయి నట్టుగా పాపం , కించ పడుతూ మాట్లాడుతూ ఉండే వారూ కనిపిస్తారు. ఈ వేగవంతమయిన రోజులలో ఉద్యోగం ఆడవాళ్ళకి కొంత వెసులు బాటుని కలిగించేదే కానీ అదనపు సదుపాయం మాత్రం కాదని నాకనిపిస్తూ ఉంటుంది. ఆర్ధిక స్వేచ్ఛ వలన ఆడవాళ్ళకి అదనపు గౌరవంతో పాటు అదనపు సమస్యలూ తెచ్చి పెడుతూ ఉండడం కూడా కొన్ని ఇళ్ళలో కనిపించే విషాదం.

సరే, ఈ విషయం కాస్త ప్రక్కన పెట్టి, ఇళ్ళలో ఆడవాళ్ళు చేసే అవధానం ఎలాంటిదో శ్రీమాన్ గరిక పాటి నరసింహా రావు అవధాని గారు చెప్పిన ఒక ప్రసిద్ధ మైన ఆశు పద్యం తెలియని వారి కోసం చెప్పుకుందాం.

అష్టావధానం లో సమస్యా పూరణం, నిషేధాక్షరి, దత్తపది, వర్ణన, ఆశువు, ఘంటానాదం ,పురాణ పఠనం,అప్రస్తుత ప్రసంగం మొదలయిన ఎనిమిది అంశాలు ఉంటాయి కదా. ఈ అంశాల ఎన్నికలో అవధాని అభిరుచిని బట్టి కొన్నిటి స్థానంలో వేరే అంశాలూ చేర్చబడుతూ ఉంటాయి. ఏమైనా అంశాల సంఖ్య ఎనిమిదికి మించదు. ఘంటా నాదం బదులు పుష్ప గణనం, కానీ చదరంగ క్రీడ కానీ ఉండవచ్చును. కొందరు అవధానులు ఈ ఎనిమిది అంశాలలో న్యస్తాక్షరిని చేర్చి అవధానం చేస్తూ ఉంటారు.

పృచ్చకులు నిర్వహించే సమస్య మొదలగు వాటి గురించి క్లుప్తంగా చెప్పు కుందాం,

1. సమస్యా పూరణం: పృచ్ఛకుడు ఏదో ఒక ఛందస్సులో ఒక పద్యం యొక్క నాలుగవ పాదం చెబుతాడు.అతను ఇచ్చిన పాదం కొంత అసంబద్ధంగానో, అసంగతంగానో, అశ్లీలార్ధ ద్యోతకంగానో కనిపించ వచ్చును.హేతు బద్ధంగా అనిపించక పోవచ్చును. కానీ, అవధాని పద్యం యొక్క మీది మూడు పాదాలు చెప్పడంతో ఆ అసంగత్వం ఏదేనా ఉంటే, తొలిగి పోయి చక్కని భావ యుక్తమయిన పద్యం తయారవుతుంది. ఇది సమస్య.

ఉదాహరణకి : ఒక పృచ్ఛకుడు ‘‘ ఈతాకుల గుడిసె లోన ఇనుడు దయించెన్’’ అనే సమస్య ఇచ్చాడు. ఇది పద్యంలోని నాలుగో పాదం. తూర్పు కొండల్లో ఉదయించాల్సిన సూర్యుడు ఈతాకుల గుడిసెలో ఉదయించడ మేమిటి ? అవధాని గారి పూరణతో పద్యంలో ఆ సందిగ్ధత తొలిగి పోతుంది. చూడండి:

సీతా పతి పూదోటకు

ఏతా మెత్తంగ వలయు వేకువ జామున్

తాతా ! తొంగున్నావా ?

ఈతాకుల గుడిసె లోన ఇనుడుదయించెన్.

శ్రీరాముల వారి పూల తోటను చూసు కుంటూ ఉండే తోట మాలి తన ఈతాకుల గుడిసెలో పడుకుని ఉన్నాడు. తెల్ల వారింది. తాతను నిద్ర లేపుతూ మనుమరాలు కాబోలు, అంటోంది:

‘‘ తాతా, సూర్యుడు ఉదయించాడు. రాముల వారి పూల తోటకు ఏతాం ఎత్తి నీళ్ళు పట్టాలి. ఇంకా నవ్వు నీ ఈతాకుల గుడిపెలో పడుకుని లేవ లేదా?’’ అని అవధాని గారి చక్కని పూరణతో పృచ్ఛకుడు సమస్య ఇచ్చి నప్పటి అసంబద్ధత తొలిగి పోయింది కదూ?

2. నిషేధాక్షరి: పృచ్ఛకుడు ఏదో ఒక అంశం యిచ్చి కోరిన ఛందస్సులో అవధాని పద్యం చెప్పడం మొదలు పెడుతూ పాదం తొలి పదంలో తొలి అక్షరాన్ని పలుకుతాడు. వెంటనే పృచ్ఛకుడు తర్వాతి పదాన్ని నిషేధిస్తాడు. అంటే అవధాని ఇక ఆ అక్షరాన్ని ఉపయోగించ కూడదన్న మాట. దానికి బదులు మరో అక్షరాన్ని వేసు కోవాలి. ఉదాహరణకి అవధాని శ్రీరాముని మీద పద్యం చెప్పడానికి సిద్ధ పడి శ్రీ అని అన్నాడను కోండి, పృచ్ఛకుడు అనే అక్షరాన్ని నిషేధిస్తాడు. దానితో అవధాని ర అనే అక్షరానికి బదులుగా మరో అక్షరం వాడాలి. ఇలా పృచ్ఛకుడు ప్రత్యక్షర నిషేధం కానీ, తాను కోరిన చోట నిషేధం కానీ విధిస్తూ ఉంటాడు. నిషేధించిన అక్షరాన్ని వదిలి అవధాని వేరే అక్షరాన్ని ప్రయోగిస్తూ , మొత్తానికి అర్ధవంతమయిన పద్యం చెప్పాలి. అవధానంలో అవధాని ప్రతిభకు నిషేధాక్షరి ఒక అగ్ని పరీక్ష అని చెప్పాలి.

3. దత్త పదిలో పృచ్ఛకుడు తనకు తోచిన నాలుగు పదాలు చెబుతాడు. వాటిని వరుసగా ఒక్కో పాదంలో ఉపయోగిస్తూ, అర్ధవంతమయిన చక్కని పద్యం అవధాని చెప్పాలి.

చూడండి, ఒక దత్తపది. ఒక పృచ్ఛకుడు పాలు, పెరుగు, నేయి, నూనె అనే పదాలు ఇచ్చి, వాటిని ఉపయోగిస్తూ భారతార్ధం వచ్చే లాగున ఒక పద్యం చెప్పమన్నాడు.

అవధాని గారి పూరణ చూడండి:

పాలు పంచడు రారాజు పాండవులకు

పెరుగు చున్నది వానిలో దురితము గన

నే యిలను గల్గ దిట్టి యహితము వాని

నూనె మూర్ఖత తప్పదు యుద్ధ మింక.

నాలుగు పాదాల లో పృచ్ఛకుడు ఇచ్చిన నాలుగు పదాలూ వచ్చేయి కదా. ఇక భావం చూడండి:

దుర్యోధనుడు పాండవులకు రాజ్య భాగం ఇవ్వడు. దుర్మార్గం వాడిలో మరీ పెచ్చు పెరిగి పోతోంది. ఇలాంటి మూర్ఖత్వం ఎక్కడా చూడం .వాడిలో మూర్ఖత్వం ప్రబలి పోయింది. ఇక యుద్ధం తప్పదు.

4. వర్ణన: పృచ్ఛకుడు కోరిన అంశం గురించి, కోరిన ఛందస్సులో కోరిన వర్ణన చేస్తూ అవధాని పద్యం చెప్పాలి.

ఇవి సాధారణంగా దేవతా వర్ణనలో, ప్రకృతి వర్ణనలో అయి ఉంటాయి.

5. .ఆశువు: అవధాని పృచ్ఛకుడు అడిగిన విషయం మీద చక్కని పద్యం చెప్పాలి. అడిగే వాడు పకోడీ మీద పద్యం కావాలన వచ్చు. కంప్యూటరు గురించి కావాలన వచ్చు దేని గురించయినా పద్యం చెప్పమన వచ్చు. అతనిష్టం. అవధాని ఆశువుగా, ధారాశుద్ధితో మొత్తం పద్యం చెప్పాలి.

6. ఘంటా నాదం (లేదా) చదరంగం (లేదా) పుష్ప గణన (లేదా) తేదీ, వారాల లెక్క :

(a) ఘంటానాదం: అవధానం జరుగు తున్నంత సేపూ ఒక వ్యక్తి ఠంగ్ మని ఒక్కో గంట కొడుతూ ఉంటాడు. అవధానం చివరలో అతడు ఎన్ని గంటలు కొట్టేడో అవధాని లెక్క తప్ప కుండా సరిగ్గా చెప్పాలి.

(b) చదరంగం: ఒక ప్రక్క ఇతర పృచ్ఛకులకు పద్య పాదాలు అవీ చెబుతూనే అవధాని ఒక వ్యక్తితో చదరంగం ఆడాలి. గెలవక పోయినా ఫరవా లేదు కానీ, ఓడిపో కూడదు.

(c) పుష్ప గణన: ఇది కూడా ఘంటా నాదం లాంటిదే. గంటలకు బదులు ఇక్కడ పూల లెక్క ఉంటుంది.

ఒక వ్యక్తి పూల రాశి లోనుండి ఒక్కో పువ్వునూ తీసి ప్రక్కన పెడుతూ ఉంటాడు. అవధాని ఆ పూల సంఖ్య సరిగ్గా చెప్పాలి.

(d) తేదీ వారాల లెక్క: పృచ్ఛకుడు ఏడాది, నెల, తేదీ చెప్పి, ఆ రోజు ఏ వారమో చెప్ప గలరా ? అనడిగితే తడుము కోకుండా అవధాని ఆ వారం పేరు సరిగ్గా చెబుతాడు.

7. పురాణపఠనం: పృచ్ఛకుడు కోరిన గ్రంధం లోనుండి కోరిన భాగం లోని పద్యాలు చదివి,పురాణం చెప్పడం.

8. అప్రస్తుత ప్రసంగం: అవధానం జరుగుతున్నంత సేపూ, అవధాని గారి ఏకాగ్రతను చెడ గొడుతూ ఒక పృచ్ఛకుడు చమత్కారవంతమైన సంభాషణ తనకు తోచిన రీతిని చేస్తూ ఉంటాడు. అవధాని అతనికి తగు రీతిలో , అతనడిగిన దానికి దీటుగా బదులు చెబుతూ ఉండాలి.

అష్టావధానంలో చోటు చేసుకుంటూ ఉండే మరో అంశం వ్యస్తాక్షరి అని చెప్పు కున్నాం కదూ. ఇదెలా చేస్తారంటే, పృచ్ఛకుడు అనుష్టుప్ శ్లోకంలో ఉండే సంఖ్యానుగుణంగా గడులు గీసుకుని సిద్ధంగా ఉంటాడు. అవధానం మొదలయ్యేక, పృచ్ఛకుడు తనకు నచ్చిన అంశం మీద ఒక శ్లోకం చెప్పమంటాడు. సాధారణంగా ఇది కూడా ఏ దేవతా ప్రార్ధనో అవుతుంది. అయితే, శ్లోకమంతా ఒకే సారి కాకుండా, తనకు నచ్చిన గడి సంఖ్య చెప్పి, ఆ గడిలో ఉండ తగిన అక్షరం చెప్పమని అవధానిని అడిగి, అతను చెప్పిన అక్షరాన్ని ఆ గడిలో వ్రాసుకుంటాడు.అవధానం పూర్తయే లోగా మొత్తం అన్ని గడులూ అవధాని అప్పుడూ అప్పుడూ చెప్పిన అక్షరాలతో నిండి పోతాయి. అవధానం చివరలో ఆ అక్షరాలన్నీ కలిసి ఒక పూర్తి అర్ధవంతమయిన శ్లోకం అవుతుంది..

అవధానం లోని అంశాల గురించి ఇక్కడ నేను వ్రాసినది సర్వ సమగ్రం కాక పోవచ్చును. కొంత అస్పష్టత ఉండ వచ్చును. నా తెలియమి కూడా కారణం కావచ్చును. కానీ నాకు తెలిసినంతలో అవధానం లోని అంశాలను వివరించాను. పెద్దలు సరి చేస్తే సరి దిద్దుకుంటాను.

అవధాని పృచ్ఛకులకు ఒకే సారి నాలుగు పాదాలూ చెప్పనవసరం లేదు. చెప్పడు కూడా. ఆవృత్తికి ఒక పాదం చొప్పున చెబుతాడు, అవధానం ముగిసే సమయానికి పద్యం నాలుగు పాదాలూ పూర్తవుతాయి.

ఆ తరువాత అంశం, ధారణ. అవధాని ఒక్కో పాదం చొప్పున అన్ని ఆవృత్తాలలో చెప్పిన మొత్తం పద్యాలు తిరిగి ఆయా అడిగిన వారికి (పృచ్ఛకులకు) ధారగా అప్ప చెబుతాడు. ఎక్కడా తడుము కోరాదు. ఏం చెప్పానని అడుగ రాదు. మొదట చెప్పిన దానికి భిన్నంగా చెప్ప రాదు. ధారణ విజయవంతంగా చేస్తే అవధానం విజయవంతంగా పూర్తయినట్టు లెక్క ! మరో విషయం, మొత్తం అవధాన సమయం నాతి దీర్ఘంగా ఉండ కుండా చూడడం కూడా అవధాని ప్రతిభకు పట్టం కట్టేదే.

ఇంత కష్టసాధ్యమైన అవధానం మన ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా ఎలా చేస్తూ ఉంటారో ఈ పద్యంలో చూడండి:

అడుగడుగున నిషేధాఙ్ఞ జారీ చేయు

భర్త నిషేధాక్షరార్తిఁదోప

గుప్పిళ్ళు నిండని గ్రుడ్డి గవ్వల తోడ

మాసమ్ము గడప సమస్య కాగ

అది సర్దు మిది సర్దు మని చంపు కాన్వెంటు

దత్తుండు దత్త పదమ్ము కాగ

ముద్దు లొల్కెడి చంటి బుజ్జాయి పాపాయి

వర్ణనీయాంశమై వరలు చుండ

పాలు కూరలు పళ్ళ బండ్ల వారల రాక

ఆశు ధారా కవిత్వార్ధ మనఁగ

అత్తయ్య వేసెడి అక్షింత లవి యన్ని

పాత పురాణంపు పఠన మనఁగ

చీటి మాటికి వచ్చు సెల్లు సందేశాలు

వ్యస్తాక్కరమ్ముల వరుస గాగ

విసుగు తెప్పించెడి వీర ధారా వాహి

అధిక ప్రసంగమై అడ్డు పడఁగ

దినము దినమిట్లు వనితలు తిప్పలు పడి

పూట పూటకు అవధాన పూర్ణ బుద్ధి

తనరు చుండంగ పురుషావధాను లేల?

వర సహస్రావధానులీ పడతు లెల్ల !

.ఆడ వాళ్ళు అవధానంలో అవధాని గారు చేసే పనులన్నీ తమ నిత్య జీవితమనే అవధానంలో ఎలా చేస్తున్నారో చూడండి.

మొగుడు ప్రతీ దానికీ అడ్డు పడుతూ అది వద్దు, ఇది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యకు అంటూ తల తినేస్తూ ఉంటాడుట. దీనిని నెట్టుకు రావడమే ఆడ వారు చేసే నిషేధాక్షరి .

చాలీ చాలని జీతం రాళ్ళతో, లేదా బొటా బొటీ డబ్బులతో నెల గడపడమే వారికి సమస్య.

అదీ ఇదీ సర్దవే అమ్మా, అంటూ వెంట పడే కాన్వెంటు పిల్లలను ముస్తాబు చేసి, బడికి పంపడమే దత్తపది.

ఇంట్లో బుజ్జి పాపాయిలు ఉంటే నిత్యం వారిని ముద్దాడుతూ, వారికి సేవలు చేయడంతోనే సరి పోతుంది. అదే వర్ణన.

పాలబ్బాయ్, కూరలబ్బాయ్ సండ్ల బళ్ళ వాళ్ళతో చేసే సంభాషణే ఆశువు

ఇక ఇంట్లో అత్త గారు కనుక ఉంటే ఆవిడ గారు వేసే అక్షింతలు, వినిపించే పాత పురాణం అంతా యింతా కాదుట. అదే పురాణపఠనం

ఈ మధ్యలో సెల్ ఫోను రింగవుతూ ఉంటుంది. ఆ బాధ మరీ వర్ణనాతీతం ఇల్లలికి. అది వ్యస్తాక్షరి.

విసుగు తెప్పించే బుల్లి తెర ధారావాహికలు అధిక స్రసంగాలు.

ఇలా రోజూ తిప్పలు పడే వనితలు గొప్ప అవధాన విద్య ప్రదర్శిస్తున్నారు. సహస్రావధానులైన పడతులుండగా, ఇక పురుషావధాను లెందుకండీ ...

నిత్యావధానులైన ఆడవారికి నమోవాకాలు .

తల్లుల కష్టం వెల కట్ట లేనిది. వెల కట్ట రానిదీనూ.

వారికి ఆది వారమూ లేదు, శలవు దినమూ ఉండదు. కదూ?

రిటైర్మెంటు అసలే లేదు.

3 కామెంట్‌లు:

voleti చెప్పారు...

ఎంత మంది రాస్తారండి ఈ అరిగి పోయిన రికార్డులు, ఆడవాళ్ళంటే సరే , మీరు కూడానా ఎక్కడ మొదలెట్టేరు, ఎక్కడ ఆగారు?

కథా మంజరి చెప్పారు...

అరిగి పోయిన రికార్డులే కానీ, రికార్డు స్థాయిలో ఆడ వాళ్ళ సమస్యలు పుట్టుకు వస్తూ ఉంటే రాయాలనే ఉంటుందండీ. ఆడ వాళ్ళంటే సరే, మీరు కూడానా ? అనడంలో అంత అసహనం ఎందుకండీ?

ఎక్కడ మొదలు పెట్టానో, ఎక్కడ ముగించానో కదూ,ఆదీ అంతూ లేని ఆడ వాళ్ళ సమస్యల్లాగే ఉందేమో నా టపా.

నేను టపాలో ప్రస్తావించిన మాటల మేకప్ గురించి కొంత సహృదయంతో ఆలోచించండి.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

ఇంటిపనులని నిర్వహించే ఇల్లాళ్ళ సమస్యని అష్టావధానంతో (అష్టావధానం గురించి తెలియని వారికి చక్కగావివరించి మరీ) పోల్చి , చక్కటి ముగింపుగా పోలికని గేయంగా అందించారు.
అభినందనలు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి