తాడు మీద బ్యాలెన్స్ చేసుకుంటూ నడిచే వ్యక్తి, ఆ చివరి నుండి ఈ చివరి వరకూ ఎక్కడా తూలి పడి పోకుండా నడిస్తేనే కదా, అతడు ఆ విద్యలో విజయం సాధించి నట్టు !
రంజకం అంటుకుని, ఝయ్ ఝయ్ మని వెలగడం మొదలు పెట్టిన చిచ్చు బుడ్డి అంత లోనే తుస్సుమంటే అదోలా ఉంటుంది.
బ్రహాండమయిన పబ్లిసిటీ ఇచ్చిన చిత్రరాజం మొదటి రీలే మొహం మొత్తేస్తే రెండో ఆట వేసే ప్రసక్తే ఉండదు కదా.
గొప్ప ఆర్భాటాలకు నీరసమైన ముగింపులు అందగించవు.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఒక కార్ట్యూన్ల పుస్తకంలో మొదటి కార్టూను నుండి చివరి కార్టూను వరకూ కూడా పొట్ట పగిలేలా నవ్వించ గల కార్టూన్ల పుస్తకం దొరికితే ఎంత బావుంటుంది చెప్పండి?
ఆ ముచ్చట నిశ్చయంగా నూటికి రెండు వందల పాళ్ళు తీర్చ గల మంచి కార్టూన్ల పుస్తకాలు - సరసి గారి కార్టూన్ల పుస్తకాలు రెండూనూ.
సరస్వతుల రామనరసింహం గారు సరసి అనే కలం పేరుతో రెండు కార్ట్యూన్ పుస్తకాలు ప్రచురించారు.
ఇప్పటికే వందలాది కార్ట్యూన్ అభిమానుల పొట్టలు చెక్కలు చేసిన నేరానికి సరసి గారు ఇలాంటి కార్టూన్లు ఇంకా వేలాదిగా వేయాలని , ఆవిధంగా వీరికి కఠిన దండ (న) విధించాలని యువరానర్,
కోరుకుంటున్నాను.
సరసిజ మనువిద్ధం శైవలేనా2పి రమ్యం
మలినమపి హిమాంశో ర్లక్ష్మ లక్స్మీం తనోతి ...
అంటాడు శకుంతల గురించి కాళిదాసు. నాచు చేత కూడినదై నప్పటికీ పద్మం మనోహరంగా ఉంటుంది. మాలిన్యం కలదైనప్పటికీ చంద్రుని లోని మచ్చ శోభను విస్తరిస్తోంది అని శ్లోకంలో ఈ రెండు పాదాలకీ అర్ధం.
సరసి గారి కార్టూన్లు కూడా ఆయన మాటల్లోనే చెబుతే, ఆస్తిపాస్తులు అట్టే వున్నవి కావు. ఎక్కువగా మధ్య తరగతి ప్రాణులు. సూటు వేసుకో లేని బడుగు బనీను జీవులు. నేతల చుట్టూ తిరగకుండా , నేత బట్టలు చుట్టుకుని తిరిగేవి. సమస్యల్లో నవ్వులు వెదుక్కునేవి. తమ మీద తామే పడి నవ్వుకునేవి. ఆ విధంగా ఈ కార్టూన్లన్నీ బడుగుల జీవితాల్లో నుండి, వారి అలవాట్ల నుండి, ఆలోచనల నుండి, ఆశల నుండి, నిరాశల నుండి,మాటల్లోంచి, చేతల్లోంచి, వచ్చిన దినుసులే.
అలా ఈ రెండు పుస్తకాలలోని కార్టూన్లు ‘సరసి’జ మనువిద్ధాలు.
సరసి గారి కార్టూన్లు ఆంధ్ర ప్రభలో వచ్చే రోజులలో శ్రీ బాపు గారి నుండి ఆ పత్రికా సంపాదకులకు ఈ విధంగా ఉత్తరం వచ్చింది:
‘‘ మీ పత్రికలో సరసి అన్నతను ( లేదా, ఆమె) వేస్తున్న కార్టూన్లు చాలా బావుంటున్నాయి.
తెలుగు కార్టూనిస్టులలో ఆమాత్రం తెలివైన వానిని ఇంత వరకూ చూడ లేదు’’
బాపు గారి నుండి ఇంత గొప్ప కితాబు అందుకున్న సరసి గారి కార్టూన్ల గురించి వేరే చెప్పనవసరం లేదు.
ప్రతి పద్యము నుందు చమ
త్కృతి గలుగం చెప్ప నేర్తు వెల్లడ బెళుకౌ
కృతి వింటి మపారముగా
క్షితిలో నీ మార్గ మెవ్వరికిన్ రాదు సుమీ !
అని, నుతిస్తాడు రఘునాథుడు విజయ విలాస కర్త చేమకూరి వెంకన్నను.
చేమకూర కవి ప్రతి పద్యం లోనూ చమత్కారం చిలికిస్తే, ప్రతి గీత లోనూ, ప్రతి రాత లోనూ చక్కని చమత్కారాన్ని, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని పండించిన అచ్స తెలుగు కార్ట్యూనిస్ట్ సరసి గారు. వారి కార్టూన్ లు తెలుగుతనంతో చక్కిలిగంతలు పెడుతూ ఉంటాయి.
మనమీదేనర్రోయ్ అనిపిస్తూ ఉంటాయి.
ఆ పుస్తకాలను చూస్తే ఈ రహస్యాన్ని మీరు కూడా నాలాగే కనిపెట్ట వచ్చును.
సరసి గారి గీతా మాధుర్యం రుచి చూడడం కోసం వారి కార్టూన్ పుస్తకాలలో ప్రచురించిన మొదటి, చివరి కార్టూన్ లు సరదాగా ఇక్కడ చూడండి:
ఇవి సరసి కార్టూన్లు మొదటి సంకలనం లోని తొలి పుట లోని కార్టూన్ లు.
అదే పుస్తకం లోని చివరి పేజీ కార్టూను ఇది!
సరసి కార్టూన్లు - 2 పేరుతో వచ్చిన రెండవ సంకలనం లోని మొదటి కార్టూను ఇది !
ఆ కార్టూన్ల పుస్తకం లోని చివరి పేజీలో ఉన్న కార్టూను ఇది !
రెండు పుస్తకాల లోనూ తొలి , మలి కార్టూన్ ల రుచి చూసారు కదా ? ఇహ మధ్యలో ఉండే మాధుర్యాన్ని మీరే జుర్రుకోండి ...తనివి తీరా నవ్వు కోండి. అంత కంటె ముందు ఈ కార్టూన్ పుస్తకాలను కొనుక్కోండి. అది మాత్రం మరిచి పోకండేం?
ఎక్కడ దొరుకుతాయంటారా? అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద దొరుకుతాయి. వెల గురించి బెంగ లేదు. మీరు ఒక్కో పుస్తకానికీ వంద చొప్పున రెడింటికీ రెండు వందలు యిచ్చి, పాతిక రూపాయల చొప్పున మొత్తం ఏభై రూపాయలు ఇమ్మని దబాయించి మరీ వసూలు చేసుకోండి. కాదంటే సరసి గారికి కంప్లయింట్ చేయండి.
అన్నట్టు, ఈ కార్టూను పుస్తకాలు కొన్న వారికి కలకండల్లాంటి తియ్యని ముందు మాటలు - శ్రీరమణ,తనికెళ్ళ భరణి గార్లవి - పూర్తి ఉచితంగా ఇవ్వబడును. ఆలసించిన కార్టూన్ భంగం. ఆపైన మీ యిష్టం. నన్ననకండి.
సరసి గీతలే కాదు, రాతలు కూడా చక్కిలి గింతలు పెట్టేవే. వాటి గురించి మరో మారు ....
ఇంకా వివరాలూ గట్రా కావాలంటే సరసి గారితోనే నేరుగా మాట్లాడితే ఓ పనైపోతుంది ...
వారి ఫోను: 09440542950 మెయిలెడ్రసు: sarasi-cartoonist@yahoo.com
1 కామెంట్:
వారి గూర్చి మీరు వ్రాసిన దాంట్లో ఒక్క ముక్క కూడా అతిశయోక్తి లేదండి.
పెళ్ళి తంతు పై ఆయన కార్టూన్స్ అన్నీ భలే ఉంటాయి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి