11, ఏప్రిల్ 2011, సోమవారం

దేవతలకు కూడా దారిద్ర్యమేనా ?దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.

చూడండి:

హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య, నలాంగలం
క్రమ పరిమితా భూమిర్విష్ణో: న గౌ ర్న చ లాంగలం
ప్లవహతి కృషి:నాద్యా ప్యేషాం ద్వితీయం గవం వినా
జగతి సకలే నే దృగ్దృష్టం దరిద్ర కుటుంబకమ్.

బలరాముడికి నాగలి ఉంది. కాని ఎద్దులు లేవు.
శివుడుకి ఎద్దు ఉంది. కాని నాగలి, భూమి లేవు.
హరికి మూడడుగుల నేల ( బలి ఇచ్చినది) ఉంది. కానీ, ఎడ్లు, నాగలి లేవు.
ఇంత దరిద్ర కుటుంబం ఎక్కడా చూడ లేదయ్యా ! అంటున్నాడు కవి ఈ శ్లోకంలో.

కేవలం చమత్కారం కోసమే సుమండీ. నాగలి, ఎద్దు, భూమి మొదలయినవి ఆయా దేవతలకి వరుసగా ఆయుధమూ, వాహనమూ, ధర్మ పత్ని గానూ శోభిల్లుతున్నాయి.

కాసుల పురుషోత్తమ కవి కూడా వ్యాజ నిందా రూపమైన తన ఆంధ్రనాయక శతకంలో హరి పరమ దరిద్రుడని వెటకారంగా అన లేదూ?
చూడండి:

ఆలు నిర్వాహకురాలు భూదేవియై
యఖిల భారకుడను నాఖ్యఁదెచ్చె

ఇష్ట సంపన్నురాలిందిర భార్యయై
కామితార్ధదుడన్న ఘనతఁదెచ్చె

కమలఘర్భుడు సృష్టికర్త తనూజుడై
బహు కుటుంబికుడన్న బలిమిఁదెచ్చె

కలుష విధ్వంసిని గంగ కుమార్తెయై
పతిత పావనుడన్న ప్రతిభఁదెచ్చె

ఆండ్రు బిడ్డలుఁదెచ్చు ప్రఖ్యాతి కాని
మొదటి నుండియు నీవు దామోదరుడవె !
చిత్ర చిత్ర ప్రభావ ! దాక్షిణ్య భావ !
హత విమత జీవ ! శ్రీకాకుళాంధ్ర దేవ !

శ్రీహరికి అఖిల భారకుడు ( సమస్త లోక భారాన్ని వహించేవాడు), కామితార్ధదుడు ( కోరిన కోరికలు ఇచ్చే వాడు), బహు కుటుంబికుడు ( జగమంత కుటుంబంకలవాడు), పతిత పావనుడు
( పతితులను వారి పాపాలు పోగొట్టి, పుణ్యాత్ములుగా చేసే వాడు) అనే పేర్లు ఉన్నాయి.

అయితే , మన కవి హరికి ఈ పేర్లన్నీ రావడానికివరుసగా అతని భార్యలు భూదేవి, శ్రీ లక్ష్మి, అతని కుమారుడు బ్రహ్మ, కుమార్తె గంగ కారణం తప్ప అతని గొప్పేమీ లేదని వ్యాజ నిందా రూపంలో చెబుతున్నాడు. హరి మొదటి నుండీ (దరిద్ర) దామోదరుడేనుట !

దామోదరుడు అంటే, దామము (పద్మము) ఉదరము నందు కలవాడని అర్ధం. శ్రీహరి నాభిలో కల పద్మం నుండే కదా బ్రహ్మ జనించినది.

ఇది నిందా రూప స్తుతి. అట్టి మహనీయులను పత్నులుగాను, కుమారునిగాను, కుమార్తె గాను కలిగిన హరి మరింత ఘనత వహించిన వాడు కదా. వ్యాజ నిందా రూపంలో హరిని నుతించడానికి కవి అతనికి లేని పోని దారిద్ర్యాన్ని ఆపాదించి చెబుతున్నాడు.

దేవతల దారిద్ర్యాన్ని గురించిన మరొక చాటువు కూడా చూదాం

శివుడద్రిని శయనించుట
రవి చంద్రులు మింట నుంట, రా
జీవాక్షుండ విరళముగ శేషునిపై
బవళించుట నల్లి బాధ పడ లేక సుమీ !

కవి తమాషాగా శివుడు హిమవత్పర్వతం మీద నివాసం ఏర్పరచు కోవడం, సూర్య చంద్రులు ఆకాశంలో ఉండడం, శ్రీహరి నిరంతరం పాలకడలిలో ఆది శేషుని మీద పవళించడం కేవలం నల్లి బాధ పడ లేకనే అని చెబుతున్నాడు.నల్లులూ, దోమలతో వేగాల్సిన దరిద్రం ఆ దేవతలకీ తప్పడం లేదని చమత్కారంగా చెబుతున్నాడు.

పరమేశుడు కాశీ నగరం విడిచి రావడానికి కూడా ఈ దరిద్రమే కారణం కదా.

దేవతల దారిద్ర్యం గురించిన ఈ చమత్కారాలకు ఇక స్వస్తి. మరో టపాలో మళ్ళీ కలుద్దాం.