31, ఆగస్టు 2011, బుధవారం

కంటికి నిద్ర లేదు !!


సంజయుడు రాయబారిగా పాండవుల వద్దకు వెళ్ళాడు. తిరిగి వచ్చాడు. అక్కడి విషయాలు తెలుసు కోవాలని ధృతరాష్ట్రుడికి మహా తొందరగా ఉంది. ఐతే , తిరిగి వచ్చిన సంజయుడు అతనికి ఏమీ అప్పుడు చెప్ప లేదు. బడలికగా ఉందన్నాడు. మరు నాడు ఉదయమే అందరూ సభదీరే వేళ అక్కడ జరిగిన విశేషాలన్నీ చెబుతానని తన నివాసానికి వెళ్ళి పోయాడు.

అంతే !

మరింక కురు మహారాజుకి కంటి మీద కునుకు పట్ట లేదు. అశాంతితో అటూ ఇటూ దొర్లు తున్నాడే కానీ నిద్ర వస్తేనా ?
విదురుడిని తన దగ్గరకి పిలిపించు కున్నాడు. నాలుగు మంచి మాటలు చెప్పి తన అశాంతిని దూరం చేయమన్నాడు.

విదురుడు రాజుకి చాలా నీతులు బోధించాడు. అక్కడక్కడా చురకలు కూడా వేసాడు.

బలవంతుఁడు పై నెత్తిన
బలహీనుఁడు ధనము గోలు పడిన యతఁడు మ్రు
చ్చిల వేచు వాఁడు, గామా
కుల చిత్తుఁడు నిద్ర లేక కుందుదు రధిపా !


బలవంతుడు మీద పడిన బలహీనుడూ, డబ్బు పోగొట్టు కొన్న వాడూ, ఎప్పుడు ఎవడి సొమ్ము కాజేదామా అని కాచుకుని కూర్చునే వాడూ, కామం చేత మనస్సు కలత చెందిన వాడూ నిద్ర పట్టక అవస్థ పడతారు సుమీ ! అని
హిత బోధ చేసాడు విదురుడు.

ఈ సందర్భం లోనే గొప్ప తాత్త్వికార్ధాలతో కూడిన తిక్కన గారి మహా భారతం ఉద్యోగ పర్వం లోని ఒక చిన్న పద్యం చూడండి:

ఒకటిఁ గొని, రెంటి నిశ్చలయుక్తిఁ జేర్చి
మూఁటి నాల్గింటఁ గడు వశ్యములుగఁ జేసి
యేనిటిని గెల్చి యాఱింటి నెఱిఁగి యేడు
విడిచి వర్తించు వాఁడు వివేక ధనుడు !

అధికారాన్ని చేపట్టి, మంత్రమూ ఉత్సాహమూ అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా జత చేయాలి, మిత్రులూ, అమిత్రులూ , తటస్థులూ అనే మూడు వర్గాల వారినీ, సామ, దాన, భేద, దండములు అనే నాలుగు ఉపాయాల చేతా పూర్తిగా వశ పరచు కోవాలి. త్వక్కు ( చర్మం) ,చక్షువు ( కన్ను ) , శ్రోత్రము ( చెవి ), జిహ్వ ( నాలుక), ఘ్రాణం
( వాసన) అనే సంచేంద్రియానూ జయించాలి. సంధి , విగ్రహం, యానం , ఆసనం, ద్వైదీభావాలు(2) అనే ఆరింటినీ తెలుసు కోవాలి. వేట ,జూదం, పానం, స్ర్తీ , వాక్పారుష్యం ( కఠినంగా మాటలాడడం, ) దండపారుష్యం ( హింప చేయడం), అర్ధ దూషణం ( దుబారా చేయడం) అనే సప్త ( 7) వ్యసనాలనూ విడిచి పెట్టి ఎవడయితే ఉంటాడో వాడే వివేకవంతుడు.


స్థూలంగా ఈ పద్యానికి ఇదీ భావం. కానీ పెద్దలు ఈ చిన్న పద్యానికి వేరే తాత్త్విక పరమయిన అర్ధాలు చెబుతారు. వాటిని కూడా చూదామా ?

ఒకటి బుద్ధి. దీనికి వాక్కు , క్రియ, అనే రెండింటినీ నిశ్చలంగా ఉండేలా చేర్చాలి. అంటే ఏది చెబుతాడో అదే చేయాలి.
ఇక, ధర్మార్థ కామాలను మూడింటినీ బ్రహ్మచర్యం, గార్హస్థం, వానప్రస్థం, సన్యాసం అనే నాలుగు ఆవ్రమవిధులతో వశం చేసు కోవాలి. కర్మేంద్రియాలు ( వాక్కు, పాణి, పాదం, వాయువు, గుహ్యం ) ఐదింటినీ గెలవాలి. యజన, యాజన, ఆద్యయన, దాన, ప్రతిగ్రహాలు అనే స్మార్త కర్మలను తెలుసుకొని, ఆవరణం ( పంచభూతాలు పృధ్వి, అప్,తేజస్సు, వాయువు, ఆకాశం) బుద్ధి, అహంకారం ఈ మొత్తం ఏటింటినీ విడిచి వర్తించే వాడు వివేకధనుడు.

పెద్దలు చెప్పే మరో తాత్త్వికార్ధం:

ఒకటి - సత్త్వం , రెండు -రజస్తమస్సులూ , మూడు -ధన, దార ( భార్య) పుత్రుల పట్ల మమకారం, నాలుగు - ధ్యానం, ధారణ, యోగం, సమాధి. తక్కినవి మీద చెప్పినవే.

మూల భారతంలో దీని శ్లోకం ఇలా ఉంది:

ఏకయా ద్వౌ వినిశ్చిత్య త్రీం శ్చతుర్భి ర్వశే కురు
పంచ జిత్వా విదాత్వా షట్ సప్త హిత్వా సుఖీ భవ !


ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చేడు మా తింగరి బుచ్చిగాడు. ( వాడి తొలి పరిచయం ఇక్కడ చూడండి ) ఏఁవిటి రాస్తున్నావని ఆరా తీసాడు.

అంతా చదివి వినిపించేను. నా ఖర్మ కాలి, ఏ కొంచెమైనా అర్ధమయిందా అనడిగేను.

భలే వాడివే , అర్ధం కాక పోవడమేం ! గుడ్డి రాజుకి పాపం నిద్ర పట్ట లేదు. అంతే కదా ! అన్నాడు. నా బుర్ర తిరిగి పోయింది.

ఓ నిద్ర మాత్ర వేసుకుంటే పోలా ! అని ముక్తాయించేడు.

నాకు బ్లాగు రాయడం మీద చెప్ప లేనంత విరక్తి కలిగింది. కథా మంజరిని మూసేద్దామని నిర్ణయాని కొచ్చేను.

కానీ మా తింగరి బుచ్చి గాడు తన ఆత్మ కథను కథా మంజరిలో రాయాలని పట్టుబట్టేడు. అందు వల్ల తప్పడం లేదు.

త్వరలో మా తింగరి బుచ్చి గాడి ఆత్మ కథ కథా మంజరిలో. వేచి చూడండి ...