28, సెప్టెంబర్ 2011, బుధవారం

కొన గోట మీటితే చాలు ... ( nail art )

నిజమే.

కొందరు కొన గోట మీటితే చాలు, అపురూప నాదాలు పలుకుతాయి. కొందరికయితే అద్భుతమైన నఖ చిత్రాలు రూపు దాల్చి అలరిస్తాయి.

రంగు ల్లేవు. కుంచెల్లేవు. ఏ ఇతర చిత్రకళా సాధన సంపత్తీ లేదు. కేవలం చేతి గోరు ఉపయోగించి 7 x 5 అంగుళాల దళసరి కాగితం మీద ఆయన ఎంతో అందమైన కళాఖండాలు చిత్రిస్తారు. ఒక తపస్సుగా సాధన చేసిన ఈ గోటి బొమ్మలు ( సంస్కృతీకరిస్తే, నఖ చిత్రాలు ) దేశ విదేశాల వారిని ఎంతగానో అలరించాయి. అలరిస్తూనే ఉన్నాయి.

ఈ నఖ చిత్రకారుని పేరు శిష్ట్లా రామ కృష్ణారావు. పార్వతీపురం స్వస్థలం. 12.4.1939 లో పుట్టారు. తల్లిదండ్రులు,సాంబశివరావు,సరస్వతమ్మ గారలు. విజయనగరం మహారాజా కళాశాలలో పట్టభద్రులు. విశాఖ పట్నం హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఉద్యోగం చేసి , నఖ చిత్ర కళ మీద ఉన్న ఎన లేని మక్కువ కొద్దీ ఆ కళలో పూర్తిస్థాయి సాధన నిమిత్తం స్వచ్ఛంద పదవీ విరమణ చేసారు.

హనుమద్యుపాసకులైన వీరు కొన్ని వేల నఖ చిత్రాలు గీసారు. గీస్తూనే ఉన్నారు.

వాల్మీకి రామాయణ గాథను దాదాపు 800 నఖ చిత్రాలలో వేసి తరించారు. 200 పైగా నఖచిత్రాలలో హనుమాన్ చాలీసాను చిత్రించి పరవశించారు.

ఇవి కాక బైబిల్, భగవద్గీత లను కూడా నఖ చిత్రాలతో అలరించి ధన్యులయ్యారు

వీరి నఖచిత్రాలు కొన్నింటిని మీ కోసం ...వీరు తన కొనగోటితో ఎందరో మహనీయుల చిత్రాలు వేసారు. ఇవే కాక, కేవలం కొన గోటితో జంతువులు , పక్షులూ, చెట్లూ చేమలూ, నదీ నదాలూ, సముద్రాలూ ... ప్రకృతిలోని సమస్తమైన అందాలనూ చిత్రించారు.

వీరిని వరించిన బిరుదులకూ, వీరు పొందిన పురస్కారాలకూ అంతే లేదు.

నఖచిత్ర కళా బ్రహ్మ, నఖచిత్ర కళా ప్రపూర్ణ, నఖచిత్ర శిల్పి, వినూత్న కళా స్రష్ఠ, నఖ చిత్ర వాల్మీకి , విశ్వ నఖచిత్ర కళా సామ్రాట్, నఖచిత్ర కళా ధుని, చిత్ర నఖామారుతి, నఖచిత్ర కళా తపస్వి, నటచిత్ర కళా సార్వభౌమ, విశ్వ నఖ చక్రవర్తి, నఖ చిత్ర కళా విధాత .... ఇవీ వీరి బిరుదులలో కొన్ని.

The Limca Book Of Records లో చోటు చేసుకున్న నఖ చిత్రకారులు వీరు.

జవహర్లాల్ నేహ్రూ, డా. సర్వేపల్లి రాధా కృష్ణ, పి.వి.జి. రాజు, కుముద్బెన్ జోషి, ఢిల్లీ తెలుగు అకాడమీ, జి.యమ్.సి. బాలయోగి, యునెస్కో, నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, మొదలైన ప్రముఖుల చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. కడప ఆర్యవైశ్య సంఘం వారు స్వర్ణ సింహ తలాటాలు, గండపెండేరం, తొడిగి గజారోహణం చేయించి అపూర్వమైన రీతిలో వీరిని సత్కరించారు. భారతప్రథాని నుండే కాక, నెల్సన్ మండేలా, బిల్ క్లింటన్ ల ప్రశంసలు అందుకున్నారు ... దేశ విదేశాలలో వీరి నఖచిత్ర కళా ప్రదర్శనలు విజయవంతంగా జరిగాయి.

ఈ గోటి బొమ్మల మేటి గొప్ప తనాన్ని సంగోరు కాదు కదా, శతాంశమైనా చెప్ప లేక పోయాను.

శలవ్.