4, నవంబర్ 2011, శుక్రవారం

సారీ, గురూ !


మా తింగరి బుచ్చి గాడు మీకు గుర్తున్నాడు కదూ!

వీడు రెండో తరగతి రెండుసార్లు చదివి ‘ ఇహ మనకీ చదువులు వంట బట్టవు కానీ ’ అనుకోని వదిలేసాడు. ఆ తర్వాత తన నేస్తులయిన బడి గుంటలంతా పాస్ పీస్ మంటూ ఏవో ఇంగిలిపీసు ముక్కలు మాట్లాడేస్తూ ఉండడంతో తనూ ఓ నాలుగు ఇంగిలీసు ముక్కలు నేర్చుకోవాలను కున్నాడు. ముందుగా ఓ రెండింటిని ఒంట పట్టించు కున్నాడు.

అవి : 1. టాంక్యూ
2. షారీ ! ...
వాడు వాటిని అలాగే పలుకుతాడు. అవేమిటో మీకు నేను చెప్పనక్కర లేదు. ఈ రెండూ నేర్చుకొన్న కొత్తలో ఏది ఎప్పుడు వాడాలో తెలియక తెగ తికమక పడి పోతూ ఉండే వాడు. దానికిదీ, దీనికదీ వాడేస్తూ ఉండే వాడు. అలవాటయ్యే సరికి వారం పది రోజులు పట్టింది.

సరే, టాంక్యూ సంగతి అలా ఉంచితే వాడు షారీ పదం నేర్చుకొన్న కొత్తలో ఆ మోజు కొద్దీ దాన్ని ప్రయోగించడానికి తగిన పరిస్థితులను తానే కల్పించుకొనే వాడు.

సినిమా హాళ్ళలో, ఇంటర్వెల్ అయ్యాక తిరిగి షో మొదలయ్యే వేళ, చీకట్లో కావాలనే కుర్చీలలో కూర్చునే వారి కాళ్ళు
తొక్కి ‘ షారీ ’ ! అని పళ్ళికిలించే వాడు. ఈ సరదా ఒక్కో సారి వికటించి, ‘‘ ఎవడ్రా నువ్వూ ’’తో మొదలై తిట్ల దండకాలతోనూ, ఒక్కోతూరి గూబ గుయ్యి మనిపించడాలతోనూ ముగిసేది. మూడు తిట్లూ, ఆరు చెంప కాయలతో వాడికా పదం బాగా వంటబట్టింది. ఇక అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకో లేదు వాడు.

మనలో చాలా మంది ఈ సారీ పదం అలవోకగా వాడేస్తూ ఉంటాం. అడుసు తొక్క నేల ? కాలు కడుగ నేల ? అని కూడా చూసు కోం.

అండగా సారీ అనే దిక్కుమాలిన పదం ఒకటుండగా
ఆలోచించి పని చెయ్యడ మెందుకు దండగా ! ... అనుకొంటూ ఉంటాం, కాస్త కవితాత్మకంగా.

మన పూజా విధానంలోనూ, మనం పలికే మంత్రంలోనో, చేసే పూజలోనో, అసలు మన భక్తిలోనో ఏమేనా పొరపాట్లూ గట్రా ఉంటే దేవుళ్ళకు సారీ చెప్పేసే సుళువు ఒకటి మన వాళ్ళు పొందు పరిచే ఉంచారు.

మీ తెలిసినదే కదా.

వినాయక పూజ చేస్తున్నామనుకోండి, చివరలో

మంత్రహీనం, క్రియాహీనం, భక్తి హీనం గణాధిప:
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే.

అని లెంపలు వాయించు కోవాలి. ఎలాగూ సారీ చెప్పేస్తున్నాం కదా అని భక్తిలో కానీ, పూజా విధానంలో కానీ, మంత్రంలో కానీ బుద్ధి పూర్వకంగా పొరపాటు చేయ కూడదు. అలాగే ఏమరుపాటూ తగదు. కళ్ళు పోతాయ్.

అసలు సారీ చెప్పు కోవాల్సిన పరిస్థితి తెచ్చు కోవడమే తప్పయితే, అలా చెప్పే సారీని కూడా కుర్రకారు కొంతమంది
మరీ విడ్డూరంగా, యాదాలాపంగా, నిర్లక్ష్యంగా , తలపొగరుగా కూడా చెబుతూ ఉండడం కద్దు. అదే -

సారీ గురూ ! ఇది మరింత దిక్కు మాలిన పదం.

ఇక,

మన ప్రాచీన కవులకు కవిత్వం పట్ల, ఛందస్సు పట్ల , అసలు అక్షరం పట్ల ఎంత విధేయత ఉండేదో చూడండి :

యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమో2స్తుతే.

ఎక్కడయినా అక్షర స్ఖలనం జరిగినా, అంటే అక్షర దోషం కలిగినా, ఛందోభంగం వచ్చినా, లేదా మరే దోషాలు నా కవిత్వంలో ఉన్నా, ఓ అక్షర మూర్తీ ! వాటిని అన్నింటినీ మన్నించు తండ్రీ ! నారాయణుడవైన నీకిదే నా నమస్కారం !

ఇంత భక్తీ, నిబద్ధతా ఉండబట్టే వారు మహా కవులయ్యారు. ఋషులయ్యారు. నానృతి: కురుతే కావ్యమ్ కదా.

పొరపాటు చేసినా క్షమించమని అడగడంలో ఇంత ఉదాత్తత చూపించాలి. ఇంత విధేయత కనబరచాలి.

అంతే కానీ, సారీ గురూ ! అనేస్తే చాలనుకో కూడదు. ఇదే నేను చెప్ప దలచినది.

నేను చెప్ప దలచిన దానిని అర్ధమయ్యేలా సరిగా చెప్ప లేదనిపిస్తోందా. కథా మంజరి ( ఏకైక నస బ్లాగు ) తరఫున,

సారీ, గురూ !