8, జనవరి 2012, ఆదివారం

స్నాన ఘట్టాలు !


కవి గారు చెప్పనే చెప్పారు కదా. జలకాలాటలలో ఏమి హాయిలే హలా ! అని ! వస్తే పాటలు పాడుకుంటూనో, లేదంటే కూని రాగాలు తీసుకుంటూనో, జలకాలాటలు ఆడుకుంటూ ఉంటే ఆ హాయే వేరు. బాత్ రూమ్ లలో షవర్ కింద, నల్లాల కింద జలకాలాటలు ఆడాలంటే కుదిరే పని కాదు. నదులలోనో, సరస్సులలోనో, ఏరుల్లోనో, చెరువుల్లోనో అయితే బావుంటుంది.

బుడుంగ్ బుడుంగ్ మని ఓ రెండు చెంబుల నీళ్ళు నెత్తి మీద పోసుకొని స్నానం అయిందనిపిస్తే సరి కాదు. తీరిగ్గా గోరు వెచ్చని నీళ్ళతో చేసే స్నానం చేయడంలో మజాయే వేరు. అది శీతాకాపు పొద్దు అయితే ఆ మజా మరీనూ.

స్నానము అనే అర్ధం ఇచ్చే పదాలు చాలా ఉన్నాయి.

చూడండి: అభిషనము, అభిషేకము, అభిషేచనము, అవగాథము, అవభృథము, ఉదగామము, దానము, బుడుక, మజ్జనము, మునుక, స్నయము, స్నాత్రము , నిమజ్జనము, పరి కర్మము, నీరాటము, జలక్రీడ, ప్రక్షాళనము, నీరు పోరు,
తీర్ధ మాట ప్రణేజనము .....

ఇదిలా ఉంచితే, తల మీద నుండి చేసే స్నానానికి శిరస్నానము, అభ్యంగము, అభ్యంజనము, తలగడుగు, తలమునుక, తలంటు మొదలయిన పేర్లు ఉన్నాయి.

సిల్లలకు చేయించే స్నానానికి బోరుకు అంటారు.

వివాహ వేళ, వధూ వరులకు మంగళ స్నానాలు చేయిస్తారు.

పండుగలప్పడూ, వేడుక లప్పుడూ తలంటు స్నానాలు చేసాకే కదా, కొత్త బట్టలు కట్టు కునేది ?

స్త్రీలు బహిష్ఠు సమయంలో చేసే స్నానానికి ఋతు స్నానం, మాఱు నీళ్ళు అంటారు.

అన్ని శుభాశుభ కార్యాలకీ ముందూ వెనుకా చేసే స్నానాలను వరసగా మంగళ స్నానాలనీ, మైల స్నానాలనీ అంటారు.

నవజాత శిశువుకి బొడ్డుతాడు కోసాక ముందుగా చేయించే ఉపచర్య స్నానమే కదా.


స్నానానికి ఉపయోగించే నలుగు పిండిని సున్ని, స్నానీయం అని కూడా అంటారు.

సబ్బుని చౌకారం, స్తోమక్షారం అంటారు.

పసుపుకి చాలా పేర్లు ఉన్నాయి : అళది, కాంచని, కావేరి, పవిత్రం, మేఘాగ్ని, విభావరి, హరిద్ర, శోభన, యామిక .... ఓ, మరెన్నో ఉన్నాయి లెండి.

స్నానానికి చెందిన సామెతలు కొన్ని కనిపిస్తున్నాయి.

స్నానానికి ముందు, సంభావనకు వెనుక కూడదు.

ఈ సామెత వెనుక చాలా దూరాలోచన ఉంది. స్నానం చేయాలంటే నదుల్లోనో, చెరువుల్లోనో, మడుగుల్లోనో దిగే వారు కదా, పూర్వం? తెలిసిన చోటయితే ఫరవా లేదు కానీ, కొత్త చోట దాని లోతెంతో తెలియదు. అందు చేత, స్నానాకి ముందుగా తయారయి పోవడం మంచిది కాదని ఈ సామెత చెబుతోంది. ముందు దిగిన వాడెవడయినా, లోతు తెలియక దిగి. బుడంగున మునిగి పోతే మనం ముందుగా దిగం కనుక బతికి పోవచ్చు.

ఇక, సంభావనకు వెనుక ఉండ కూడదన్నారు. నిజమే కదా, దొరలూ, రాజులూ, జమీందారులూ ఇచ్చే సంభావనలకు ముందే ఉండాలి. లేక పోతే మనకు దక్కే సంభావన తగ్గి పోవచ్చు. లేదా, మొదటికే మోసం రావచ్చు. ఏమంటారు !

తా మునిగింద గంగ, తా వలచింది రంభ అని మరో సామెత.

స్నానాలు లేని బ్రాహ్మలకు శాపాలు లేవు అని, వేరొక సామెత ఉంది. అంటే, శుచీ శుభ్రం లేని బ్రాహ్మల శాపాలు పని చెయ్యవని కాబోలు.

మోక్షానికి పోతే, మొసలెత్తుకు పోయిందిట !

ఈ సామెతకి అర్ధం, ముక్తి కోరి తీర్ధ స్నానం చేస్తే ఆ సరస్సులో ఉండే మొసలి ఎత్తుకొని పోయిందిట. పుణ్యానికి పోతే ... అంటే యిదే నన్న మాట !

తల కడుక్కోవడం అనే జాతీయం, బరువు బాధ్యతలు తీరాక, తలారా స్నాం చేసి, హమ్మయ్య ! అనుకోవడం గురించి కదా.

ఈ సందర్భంగా సన్ బాత్ గురించి గుర్తుకు తెచ్చు కోక తప్పదు. ఇదో రోగ నిదాన ప్రక్రియ. కాక పోతే ఆరోగ్య పరి రక్షణకు కొందరు సన్ బాత్ చేస్తూ ఉంటారు. ఆవిరి స్నానం అని కూడా ఒకటి ఉంది.

సన్ బాత్ ఉన్నప్పుడు మూన్ బాత్ ఎందుకు ఉండ కూడదూ ! అని మా తింగరి బుచ్చి గాడు లాజిక్కు లేవ తీస్తూ ఉంటాడు. అది వేరే విషయం.
ఇక,

పుణ్య తిథులలోనూ. గ్రహణాల వేళ పట్టు విడుపుల సమయాలలోనూ సముద్ర స్నానాలు చేయడం తెలిసినదే కదా !


స్నానాల గురించి మరి కొంత సమాచారం ...

ఇప్పు డెక్కడా నూతులు లేవు కానీ, నూతి నీళ్ళతో చేసే స్నానం చాలా హాయిగా ఉంటుంది.

కూపోదకం, వటచ్ఛాయా, తరుణీ స్థన మండలం
శీత కాలే భవేదుష్ణం, ఉష్ణ కాలేతు శీతలమ్ అంటారు.

కూపం అంటే నుయ్యి. నూతిలో నీళ్ళు శీతా కాలంలో వెచ్చగానూ, వేసవి కాలంలో చల్లగానూ ఉంటాయన్న మాట ! మిగతా రెండింటి విషయమూ ఇక్కడ అప్రస్తుతం కనుక వాటి గురించిన వివరణ ఇవ్వడం లేదు.

శ్రీ.శ్రీ గారి గొప్ప కథ ‘‘ ఒసే, తువ్వాలందుకో ’’ గుర్తుందా ?

చాలా మంది మగ మహా రాజులకి బాత్ రూం లలో దూరి తలారా స్నానం చేసాక కానీ తువ్వాలు తెచ్చు కోలేదన్న మాట గుర్తుకు రాదు. అప్పుడు అరుస్తారు, ‘‘ఏమేవ్ ! తువ్వాలందుకో !’’ అని.

శ్రీ.శ్రీ గారి కథలో ఇలాంటి మగ మహారాజే తువ్వాలు మరిచి పోయి, స్నానాల గదిలో దూరి భార్యని ముద్దుగా కేకేసి, ‘‘ ఒసే, తువ్వాలందుకో !’’ అని అరుస్తాడు. అంతకు ముందు స్నానాల గదిలో భర్త గారి ఊహాపోహలు, , ఇటు భార్య గారి ఆలోచనలూ ఈ కథకి ఆయువు పట్టులు. సర్దుకు పోయే సంసారాల గుట్టు ఇందులో గొప్పగా చెప్పారు శ్రీ.శ్రీ.

బెజ్జ మహా దేవి పరమేశ్వరుని పసి వాడిగా చేసి స్నానాలు చేయింే ఘట్టం పాల్కురికి సోమన తన బసవ పురాణంలో అద్భుతంగా చిత్రీకరించేడు. చూడండి:

అనయంబు బెజ్జ మహా దేవి తాను
జననియై పరమేశుఁదనయు గావించి

తొంగిళ్ళు పైనిడి లింగ మూర్తికిని
నంగన గావించు నభ్యంజనంబు

ముక్కొత్తు చెక్కొత్తు ముక్కన్ను పులుము
నక్కొత్తు కడుపొత్తు నట వీపు నిమురు
బెరుగంగ వలెనని తరుణి వీడ్డడగ

చరణముల్కరములు చాగంగ దిగుచు
నలుగులు నలుచు నర్మిలి పెట్టి

జలముల వీపున చరుచు నంతతంత
వెగచి బెగడ కుండ వెన్ను వ్రేయుచును

నొగి మస్తకమున నీరొత్తు దోయిటను
వదనంబు సొచ్చుచో యుదకంబు లనుచు
నదుము పొట్టను నోరి కడ్డంబు పట్టు

చెన్నుగా పసుపార్చి చేయు మజ్జనము
కన్నులు చెవులును గాడంగ నూదు .... ....

బెజ్జ మహా దేవి పరమ శివుని పసి వానిగా భావించి, చేయించిన అభంయంజనమిది ! పసుపు రాసేది. నలుగు పెట్టేది. తల మీద నూనె అదిమేది. ముక్కూ, చెక్కిళ్ళూ అదిమేది. మూడో కన్ను పులిమేది. బాగా పొడవుగా పెరగాలని కాళ్ళూ చేతులూ సాగదీసేది. నీళ్ళు దోసిళ్ళతో తీసికొని వాని నడ్డి మీద చరిచేది. వెన్ను నిమిరేది. తల మీద నీళ్ళు కళ్ళ లోకి జారకుండా పదిలంగా పోసేది. అందు కోసం వాని నోటికి అడ్డంగా చెయ్యి పెట్టేది. కడుపు అదిమేది. స్నానం చేయించాక, కళ్ళూ చెవులూ గట్టిగా ఉఫ్ మని ఊదేది ....


ఇక, ద్రౌపదీ దేవి మహా భారతంలో ...

‘‘ రాజసూయావభృథంబున శుచియై పెనుపొందిన వేణి వట్టి, ఈ యేవురు సూడగా సభకు నీడ్చె, కులాంగన నిట్లొనుర్తురే ! ’’ అని వాపోయింది.

రాజసూయ యాగం పరి సమాప్త మయ్యాక అభ్యంగన స్నానం చేయడం వల్ల పవిత్రమైన ఈ జుత్తు పట్టుకొని , నాభర్తలు ఈ ఐదుగురూ చూస్తూ ఉండగా ఒకడు ( దుశ్శాసనుడు ) కౌరవ సభలోనికి ఈడ్చుకొని వచ్చేడు. లోకంలో ఎక్కడయినా కుల స్త్రీలను ఇలా అవమానం చేస్తారా ?’’ అంటూ విలపించింది.

పుష్కర కాలంలో పవిత్ర నదీ జలాల లోకి ముక్కోటి దేవతలూ ప్రవేశిస్తారని, అందు చేత ఆ కాలంలో నదీ జలాలు పరమ పవిత్రాలని హిందువుల విశ్వాసం. అందు చేత, పుష్కర సమయంలో నదులలో పవిత్ర స్నానాలు చేయడానికి తహతహలాడుతారు. అలా స్నాలు చేసే స్థలాలు పుష్కర ఘట్టాలు, స్సానాల రేవులూనూ. అక్కడ స్నాలు చేసే వారి భద్రత కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి.

తిరుపతి మొదలైన చోట్ల పాప వినాశనం వగైరా చోట భక్తులు ఆ జలధారల కింద స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.

వెనుకటి రోజులలో వీర మడిని పాటిస్తూ కొన్ని వర్గాలకు చెందిన ఆడవారు నది లోనో, చెరువు లోనో స్నానాలు చేసుకొని, మడి నీళ్ళ బిందె నెత్తి కెత్తుకొని , దారంట వస్తూ, మళ్ళీ ఏదో కారణం చేత మడి భంగం ( వ్రత భంగం లాగ !)
జరిగితే మళ్ళీ స్నానం , మళ్ళీ బిందోతో నీళ్ళు పట్ట కోవడం జరిగేది.

పెళ్ళిళ్ళలో , ముఖ్యంగా బ్రాహ్మల వివాహాలలో సరిగ్గా భోజనాల వేళ ఏటికి లేదా నదికి పోయి స్నానం చేసి, సంధ్య వార్చకొని వస్తానంటూ పెళ్ళి పెద్దలలో ఎవరో ఒకరు వెళ్ళి పోయే వారు. అంతే ! దానితో భోజనాలు బంద్. అతను వచ్చే వరకూ వడ్డింపులు, ఉండేవి కావు. పంక్తి నకనకలాడుతూ అతని రాక కోసం ఎదురు చూసేది. ఎంతకీ రాడాయన. ఇదో అల్లరి ( ట ?!).
ఇదిలా ఉంచండి ...ఇక ...


గంగానది కలుష హారిణి. గంగలో స్నానం చేయడం ఒక అపూర్వానుభవం.

చేమకూర కవి విజయ విలాసంలో తీర్ధ యాత్రలు చేస్తూ గంగా నదిలో మునక వేయడం జరిగింది. ఈ ఘట్టంలొ కవి గొప్ప శబ్ద చమత్కారం కలిగిన ఒక చిన్న పద్యం చెప్పాడు. చూడండి:

మునుకలు గంగా నదిలో
నొనరించుట కన్న భాగ్య మున్నదె ? యనుచున్
మునుకలు గంగా దిగి, పరి
జనములు కైలా గొసంగ స్నానోన్ముఖుఁడై

అర్జునుడు తీర్ధ యాత్రల సందర్భంగా గంగా నదిని చూసి ఇలా అనుకున్నాడు. గంగా నదిలో ముుకలు వేయడం కన్నా ( స్నానం చేయడం కన్నా ) మరేమి భాగ్యం ఉంది ? ఇలా అనుకుంటూ సేవకులు దారి చూపిస్తూ ఉంటే, గంగలో దిగి స్నానం చేసాడు.

ఈ పద్యంలో మునుకలు గంగా నదిలో అనీ మును కలుగంగా అనీ పదచ్ఛేదం వల్ల గొప్ప శబ్ద చమత్కతి సాధించాడు కవి. మొదటి దానికి గంగా నదిలో మునకలు వేయడం అనీ, రెండవ చోట సేవకులు నది లోతుపాతులు తెలుసు కోడానికి ముందుగా దిగి చూసాక అనీ స్వారస్యం చెప్పారు పెద్దలు.

కవి గంగా నది గురించి, దాని పవిత్రత గురించి మరిన్ని చెప్పాడు. మచ్చునకు మరో పద్యం :

తల నీ గంగా తీర్ధము
చిలికినవాఁడీశ్వరుండు . చేరెడు లోఁగోఁ
గలిగినఁ దరగలఁదేలం
గలిగినఁ దన్మహిమ లెన్నఁగా దర మగునే ?

తల మీద గంగా జలాన్ని చిలకరిస్తేనే ఈశ్వరత్వం పొందు తున్నారు. ఇకచ చేరెడు గంగా తీర్ధం పుచ్చుకొన్నా, గంగా నదిలో స్నానం చేసినా, ఎంత గొప్ప ఫలితం కలుగుతుందో కదా !

ఇక, తీర్ధ యాత్రలు చేస్తూ, పవిత్ర నదీ జలాలలో స్నానాలు ఆచరించడం మన సాంప్రదాయం.

ప్రవరుడు మను చరిత్రలో సిద్ధుడిని ఏయే దేశాలు చూశారు చెప్పరూ ? అంటూ అడిగిన ప్రశ్నావళిలో ఏ తీర్ధాలలో స్నానాలు చేసారు ? అని కూడా ఉండడం గమనించాలి.

దేవతా స్త్రీలూ, రాచ కన్నెలూ వన విహారాలూ, జల క్రీడలూ చేయడం చాలా గ్రంథాలలో చదువుతాం.

గోపికలు విలాసంగా నదీ స్నానాలు చేస్తూ ఉంటే వారి కోక లెత్తుకు పోయిన కొంటె కృష్ణుడి గురించి వేరే చెప్పాలా?

మరో రెండు శ్లోకాలను చూడండి:

కించి దుష్ణోదక స్నానం, కించి దుష్ణాన్న భోజనం.
మానవానా మిదం సధ్యం, సయ: స్నానం వయ: స్త్రియ:

అంటే, గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం, మృష్టాన్న భోజనం చేయడం, పాలు త్రాగడం, తరుణ స్త్రీ సంగమం - ఈ నాలుగూ మనుషులకు పథ్యాలుట !

స్నానానంతరం చేయాల్సినవి కూడా మన పెద్దలు చెప్పారండోయ్ ! చూడండి:

స్నాత: చందన లిప్తాంగ: సుగంధ: సు మనోన్విత:
భుక్త వృష్య స్సు వపన: సువేష సమలంకృత:

తాంబూలవదన: పత్న్యాం, అను రక్తో2ధిక స్మర:
పుత్రార్ధీ పురుషో నారీమ్, ఉపేయా చ్ఛయనే శుభే.

దీని భావం ఏమిటంటే, స్నానం చేసి, పరి శుద్ధు డయ్యాక, చందనాది సుగంధ ద్రవ్యాలు పూసు కోవాలి. పు్వులు పట్టు కోవాలి. మంచి బట్టలు ధరించాలి. చక్కని ఆహార్యం ధరించాలి. అలంకారాలు పెట్టు కోవాలి. బలవర్ధక మైన ఆహారంభుజించాలి. తంబూలం వేసు కోవాలి. భార్యయందు అనురక్తితో ఆమె పొందు స్వీకరించాలి. ఇది శాస్త్రం చెప్పిన తృతీయ పురుషార్ధం అన్న మాట!

‘క్షణంలో బాత్ చేసి రానూ !’ అంటూ బాత్ రూం లో దూరి, గంటలు గడిచినా రాని స్నాన రుద్రులూ, ఏడాదికి ఒకసారో, రెండు సార్లో తప్ప అసలెప్పుడూ స్నానం చెయ్యని తెగల వారూ ఉన్నారని తెలుసు కోవాలి.

ఈ టపా రాస్తూ ఉంటే, ఆంధ్ర జ్యోతి ఛానెల్ లో తణికెళ్ళ భరణి గారు తన జీవిత కాలంలో పేద్ధ బాత్ రూం కట్టకొని, అందులో తనివితీరా గంట సేపు స్నానించాలనీ , తన మనసులో కోరికను బయట పెట్టారు.

అయ్యా, ఇదీ స్నాన ఘట్టం ! స్నానాల గొడవ ! ఇలా చెబుతూ పోతూ ఉంటే, దీనికి అంతూ పొంతూ ఉండేలా లేదు ... కనుక,

స్వస్తి.

స్నానాల గురించి బ్లాగరు రసఙ్ఞ గారు చక్కని శాస్త్రీయమైన వివరణలతో ఒక టపా రాసారు. దాని లింక్ ఇక్కడ నొక్కి చదవండి.

అంకితం :

స్నానాల గదిలో ఒళ్ళంతా సబ్బు పట్టించు కున్నాక, తొట్టెలో నీళ్ళు నిండుకొని, కుళాయిలు బంద్ అయి పోతే, నానా అవస్థలూ పడే వారికి ఈ టపా అంకితం చేస్తున్నాను.

మరింకా, మా తింగరి బుచ్చి గాడికి కూడా లోపాయికారీగా అంకితం చేస్తున్నాను. ఎందుకంటే జల గండం పేరిట వాడు మూడ్నాలుగు రోజులకో సారి స్నానం చేస్తాడని కథా మంజరి దగ్గర విశ్వసనీయమైన సమాచారం ఉంది.
















4 కామెంట్‌లు:

Sudha Rani Pantula చెప్పారు...

మంచి ఎండవేళ శుభ్రమైన ఏరు పారుతు ఉంటే పైన వెచ్చగా కింద చల్లగా నీళ్ళు ఒంటిని ఒరుసుకుని ప్రవహిస్తూ ఉంటే....బుడుంగ్ బుడుంగ్ మని మునకలేస్తూ మనసు ఆనందంతో ఆహ్లాదంతో గంతులు వేస్తూ ఉంటే ఎంచక్కా స్నానించిన చక్కని అనుభూతి కలిగింది మీటపా చదివాక.....సాహిత్యంలో మీరు వివరించిన స్నాన ఘట్టాలు చాలా బావున్నాయి.

కథా మంజరి చెప్పారు...

ధన్యవాదాలు సుధ గారూ.

రసజ్ఞ చెప్పారు...

ఎన్నో ఆసక్తికరమయిన,కొత్త విషయాలు తెలిసాయి. నాకు తెలిసినంతలో నేను కూడా ఒకసారి ఈ స్నానాల గురించి వ్రాయటం జరిగినది. వీలుంటే ఒకసారి చుడండి!
http://navarasabharitham.blogspot.com/2011/09/blog-post_14.html

కథా మంజరి చెప్పారు...

రసఙ్ఞ గారూ, మీరు స్నానాల మీద రాసిన టపా పూర్తిగా చదివి చాలా సంతోషించాను. చాలా, నిజంగా , చాలా గొప్పగా రాసారు.
ధన్యవాదాలు. నిజానికి స్నానాల గురించి మీ అంత సీరియస్ గా నేను రాయ లేదు. మీ టపాలో చాలా డెప్త్ ఉంది.మరోసారి మనసారా అభినందనలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి