12, మే 2012, శనివారం

ఒకటి కొంటే ఒకటి ఉచితం ... రామాయణం పుస్తకం కొంటే భారత గ్రంథం ఉచితం !


























మన ప్రాచీన కవులు గొప్ప సాండిత్య ప్రకర్షతో రెండర్ధాల కావ్యాలూ, మూడర్ధాల కావ్యాలూ రాసారు. వాటినే ద్వ్యర్ధి, త్ర్యర్ధి కావ్యాలంటారు..


పింగళి సూరన రాఘవ పాండవీయం అనే ద్వ్యర్ధి కావ్యం రాశాడు. రామాయణ పరంగానూ, భారత పరంగానూ అర్ధాలు వచ్చేలా మొత్తం కావ్యం లోని పద్యాలన్నీ ఉంటాయి ! రెండర్ధాలు కలిగిన పద్యం ఒకటి వ్రాయడమే కష్టం. ఆ విధంగా మొత్తం కావ్యమంతా ఉంటే, ఆపాండిత్యం ఓహో ! అనిపించదా ! అందులోకీ తెలుగు కావ్యం అద్భుతం అంటారు. ఈ లోకంలో రామ భారత కథలు జోడించి కావ్యం చెప్ప గల దక్షుడు ఎవడున్నాడయ్యా ! .... అన్నాడు సూరన.


మరో మాట ... ఎందుకేనా మంచిదని చెప్పి చదువరులను ముందే హెచ్చరించాడు.


ఒక కథ వినేటప్పుడు మఱొక కథ మీద దృష్టి నిలిపితే, మొత్తం మొదటి అర్ధం గోచరించకుండా పోతుంది. అందు చేత ఈ రాఘవ పాండవీయం చదివేటప్పుడు ఒకే అర్ధం కలిగిన మామూలు కావ్యాన్ని ఎలా చదువుతారో అలాగే చదవండి. అంటే, ముందుగా రామాయణార్థాన్ని చదువుదామనుకుంటే, మనసు లోకి మరింక భారతార్థం ఏమిటా అని ఆలోచించకండి. అలాగే భారతార్ధం వచ్చేలా చదివేటప్పుడు రామాయణార్ధ ఏమిటా అని ఆలోచించకండి. ఏకార్ధ కావ్యం ఎలా చదువుతారో అలాగే చదువు కోండి. అని వివరణ ఇచ్చాడు.






రాఘవ పాండవీయం లోని రామాయణార్థంలో నూ భారతార్ధం లోనూ అర్ధాలు వచ్చే ఒక పద్యం ఉదాహరణకు చూద్దామా !


వెలయునఖిల భువనములలోన వారణ


నగరిపురమ తల్లి నాదనర్చి


రాజ్య లక్ష్మి మిగుల బ్రబల నయోధ్యనా


రాజ వినుతి గనిన రాజధాని.






ఈ పద్యం రామాయణ పరంగా అయోధ్యా నగరాన్ని వర్ణించే పద్యం. ఇదే పద్యం భారతార్ధంలో అయితే, హస్తినాపురాన్ని వర్ణిస్తున్న పద్యం !




ఇందులో సంస్కృతాంధ్ర శబ్ద సభంగ శ్లేష కవి వాడాడు.






ముందుగా రామాయణ పరంగా అర్ధం ఎలాగంటే,


రామాయణ పరంగా పద్యంలోని పదాలు ఇలా విరిచి చదువు కోవాలి.






అఖిల భువనముల లోన్, = అన్ని లోకాలలోనూ


అవారణ, నగరిపు, రమ, తల్లి = అడ్డు లేని ఇంద్రుని యొక్క సంపదయైన అమరావతికి తల్లి అన్నట్లుగా రాజ వినుతి గనిన = గొప్ప పేరు గాంచిన


రాజధాని అయోధ్యనాన్ = అయోధ్య అనే పేరుతో ప్రబలున్ = వెలయు చున్నది.






అంటే,

ఇంద్రుని రాజధాని అమరావతి. . దానికి తల్లి లాంటి నగరం అయోధ్య అన్నమాట.!






ఇక, భారతార్థంలో అన్వయం చూదామా !






న + యోధ్య = అయోధ్య ( యుద్ధం చేసినా జయింప బడనిది )


వారణ నగరి = వారణం అంటే ఏనుగు, వారణ నగరి అంటే హస్తినా పురం !


పురమ తల్లి = పుర శ్రేష్ట్రం. ( శ్రేష్ఠమైన నగరం )


అన్వయం ఇలా చూడాలి.






అఖిల భువనములలోన + వారన నగరి + పురమ తల్లి..






అంటే, అన్ని లోకాలలోనూ, హస్తినా పురం చాలా గొప్పది అని అర్ధం అన్నమాట !


తక్కిన అర్ధమంతా సుబోధకమే కదా !


వార్నాయనో ! ఒక్క పద్యానికి రెండు రకాల ( రామాయణ, భారతార్ధాలు ) అర్ధాలు గ్రహించడానికే ఇంత పీకులాట అయింది. ఇక మొత్తం కావ్యం అంతా చదవాలంటే మాటలా ? అనుకుంటున్నారా ?


తప్పదండీ, బాబూ, కష్టే ఫలీ ! అన్నారు. కావ్య రసం గ్రోలాలంటే ఆ మాత్రం కష్టపడొద్దూ ?


పనిలో పని, పింగళి సూరన కళా పూర్ణోదయం చదవండి..ఒక మిష్టరీ నవల చదువుతున్నట్టగా ఉంటుంది. తెలుగు కవుల గొప్ప తనమేమిటో తెలుస్తుంది. ! మన కావ్య సంపదను మనం ఎంత పదిలంగా కాపాడు కోవాలో తెలుస్తుంది !






స్వస్తి.




4 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

శీర్షిక చదువుతూ అనుకున్నా రాఘవ పాండవీయం పుస్తకం కాదు కదా అని! నా ఆలోచనని నిజం చేస్తూ అదే పెట్టారు. అద్భుతమయిన, అందరూ తప్పక చదవవలసిన కావ్యం. ఈ కావ్యం మా ఇంట్లో ఉంది.

కథా మంజరి చెప్పారు...

రసజ్ఞ గారూ, ధన్యవాదాలండీ.

కమనీయం చెప్పారు...

ఈ రోజుల్లో ఒక పద్యకావ్యం చదవడమే కష్టం.మూడు నాలుగు పాదాలకన్నా ఎక్కువ కవితలు చదవడం కష్టం.అలాటిది ద్వ్యర్థి కావ్యమే?అబ్బో.ఐనా కొందరికైనా పనికిరావచ్చును కాబట్టి వ్రాయడం మంచిదే .అభినందనీయమే.

చింతా రామ కృష్ణా రావు. చెప్పారు...

అత్యద్భుతమైన అత్యవసరమైన విషయాన్ని పాఠకులకు మీ వివరణ ద్వారా అందించిన మీకు నా ధన్యవాదములు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి