చప్పట్ల బాబా నాకో బంపర్ ఆఫర్ ఇచ్చేడు. అదివిని దభీమని నేలమీద దఢాలున స్పృహ తప్పి పడి పోయాను. వంట గదిలో మా ఆవిడ పరిస్థితీ దాదాపు అలాగే ఉన్నట్టుంది. కథా మంజరీ ... ఏఁవండీ కథామంజరీ అంటూ బాబా చప్పట్లు చరిచేరు. చప్పట్ల మహిమ చేత నేను స్పృహ లోకి వచ్చేను.
‘‘నేను విన్నది నిజఁవేనా ? ’’ అడిగేను బేలగా.
‘‘ ఇందులో అబద్ధానికేఁవుంది ? ... తిట్ల బాబాలూ, బెత్తం దెబ్బల బాబాలూ, కాలి తాపుల బాబాలూ లేరూ ? అలాగన్న మాట ! మనం కేవలం చప్పట్ల బాబాలం, మహా అయితే భక్తుల అరచేతులు నొప్పెట్టడం తప్పితే అంతకన్నా అధికంగా హింస ఉండదు. కాలి తాపులూ, బెత్తం దెబ్బలూ వగైరాలు వికటిస్తే, ఆ తన్నులూ. దెబ్బలూ ఎదురు తిరిగే ప్రమాదం ఉంది. మనకెందుకా బాధ ? మన భక్తవర్యులు చక్కగా, తనివితీరా ఊగిపోతూ చప్పట్లు చరుస్తూ ఉంటారంతే. ఆవిధంగా మనం ముందుకు పోతాం. ఆధ్యాత్మిక సేవ చేస్తాం. మనకెలాగూ ప్రభుత్వోద్యోగాలు వచ్చే సావకాశం లేదు. ప్రైవేటు జాబులూ మన చరిత్ర తెలిసిన వాళ్ళెవరూ ఇవ్వడానికి సాహసించరు. వ్యాపారాలనికీ మనకీ చుక్కెదురు. ఒక్కటీ కలిసి రావడం లేదు. అంచేత సుదీర్ఘంగా ఆలోచించేక చప్పట్ల బాబాగా అవతరించి ఆధ్యాత్మిక సేవ చేసి నాలుగు రాళ్ళు వెనకేసు కోవడమే మంచిదని నిర్ణయానికొచ్చేను. ఉదరపోషణార్ధం బహుకృత వేషమ్ అని పెద్దలు శెలవిచ్చేరు కదా. తప్పు లేదు. ప్రజలు పిచ్చి ముండా కొడుకులవడం మన తప్ప కాదు కదా ? ఎవరి ఖర్మ వాడిది. ఎవడు చేసిన తప్పుకి ఫలితం వాడనుభవిస్తాడు...’’
‘‘ మరి .. బూడిదలూ గట్రా ఇవ్వడం లాంటిది ఏఁవన్నా ఉందా ? ...’’ అడిగేను నంగిగా.
‘‘ అవన్నీ ఓల్డు ఫేషన్ కథామంజరీ ... మనం ఆల్ట్రా మోడ్రన్. అంచేత మనం అలాంటివేవీ ఇవ్వం. వయసులో ఉన్నవారికి అబ్బాయిలయితే సినీతారల ఫోటోలూ, అమ్మాయిలయితే యువ హీరోల ఫోటోలూ ఇస్తాం. పెద్దవాళ్ళకి రాజకీయ నాయకుల ఫొటోలూ, వృద్ధులయితే దేవుళ్ళ ఫొటోలూ ప్రసాదిస్తాం. దీనివలన బహుముఖమైన లాభాలు ఉన్నాయి. యువతరం సంతోషిస్తుంది. రాజకీయ నాయకులూ, సినిమాతారలూ మనపట్ల వ్యతిరేక భావంతో ఉండరు. పాపం, బాబా అభిమానాన్ని మనం ఎందుకు కాదను కోవాలీ అని సమాధాన పడతారు. మన జోలికి రారు. పైపెచ్చు చప్పట్ల భక్త బృందంలో చేరినా చేరే అవకాశమూ ఉంది. దానితో మన పాప్యులారటీ పెరిగుతుంది. మన చుట్టూ ఓ రక్షణ కవచం దానంతట అదే ఏర్పడుతుది. అన్నట్టు దానివలన పోలీసులు కూడా మనపట్ల ఉదాసీనభావంతో ఉంటారు,
ఇక పోతే, ఈ తొక్కలో జర్నలిష్టులు ... టీవీల వాళ్ళూ ... పేపర్ల వాళ్ళూ ... వీళ్ళ వల్ల మాత్రం కొంత ఇబ్బంది ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఇన్విష్టిగేటివ్ జర్నలిజమూ వాళ్ళ పిండాకూడూనూ. అందు చేత మనఁవే ముందుగానే వాళ్ళని చప్పట్లు కొట్టి పిలిచి
మన చప్పట్ల ఆశ్రమంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకూ తావు లేదనీ వివరిస్తాం. ఏదో మమ్మల్నిలా బతకనివ్వండని కన్నీళ్ళ పర్యంతమై ఆఫ్ ద రికార్డుగా వేడుకుంటాం. వాళ్ళు కనికరించేరో సరేసరి. లేదూ మన గురించి అవాకులూ చవాకులూ ప్రచారం చేస్తే మనకొచ్చే బాధ ఏమీ లేదు. వ్యతిరేక ప్రచారాన్ని మించిన ప్రచారం మరొకటి లేదనే సంగతి తెలిసినదే కదా.
అదలా ఉంచితే, ఈ సినిమా తారల ఫొటోలూ, రాజకీయ నాయకుల ఫోటోలూ పందేరం చేయడమేఁవిటి హన్నా ! అని ఎవరయినా చిందు లేసారనుకుందాం. ఏమీ, భగవంతుడు సర్వాంతర్యామి, నాలో ఉన్నాడు. నీలో ఉన్నాడు. అంతటా ఉన్నాడు. అలాంటి దేవుడు రాజకీయ నాయకులలోనూ. పినిమా తారల లోనూ ఉండడా ? ఉండడనుకోవడం దైవ దూషణ కాదా ? మహా పాపం కాదా ? కళ్ళు పోవా ? అని ఎదురుదాడి చేస్తాం. అప్పటికీ మన పప్పులుడక్క పోతే దుకాణం మూసేస్తాం. అంతే. ’’
ఇంతకీ ఈ చప్పట్ల బాబా ఎవరో ఇంకా చెప్పనే లేదు కదూ ? లోగడ కథామంజరిలో సరదాకి అనే లేబిల్ క్రింద మా తింగరి బుచ్చి అనే వాడి గురించి చాలా చెప్పడం జరిగింది. ఆ తింగరి బుచ్చే ఈ చప్పట్ల బాబా. అసలింతకీ బాబాల గత చరిత్ర గురించి కూపీ తియ్యబోవడమంత పాపం మరొకటి లేదు. ఏరుల జన్మంబు, శూరుల జన్మంబు లాగే బాబాల జన్మంబు ఎవరికీ తెలియదు. తెలీడానికి వీల్లేదు.
ఇక, మన చప్పట్ల బా నాకిచ్చిన బంపరు ఆఫరు గురించి ఇంకా చెప్పవలసే ఉంది కదూ ?
‘‘ ఓయి కథామంజరీ, అంచేత నేను చప్పట్ల బాబాగా అవతరించిన తరువాత నువ్వు చప్పట్ల బాబా ప్రవచనాలు అంటూ ఓ నాలుగయిదు చిన్న చిన్న పుస్తకాలు రాసి పెట్టాలి. ఒక్కోటీ పది ఇరవై పేజీలకు మించ నక్కర లేదు. అలాగే చప్పట్ల బాబా మహిమలు అంటూ మరో మూడు నాలుగు పుస్తకాలు రాసి పెట్టాలి. ఆ మహిమల గురించి చదివేక నేనే ఆశ్చర్య పోవాలన్నమాట. ఆ కల్పనా శక్తి నీకుంది నాకు తెలుసు. ప్రవచనాలూ. మహిమలూ అన్నీ నీ ఊహాజనితాలే కావాలి. కొత్తవే రాస్తావో, ఎక్కడినుండయినా ఏరుకొస్తావో అది నీ ఇష్టం. పుస్తకాల ప్రచురణ వ్యయం గురించి నీకేమీ దిగులక్కర లేదు. అదంతా మా చప్పట్ల ఆశ్రమం చూసుకొంటుంది. నీకు రాయల్ట్రీ గట్రా దొరుకుతుంది. మిగతా వాటి సంగతికేం గానీ ఇలాంటి పుస్తకాలు వేడి పకోడీల్లా అమ్ముడయి పోతాయి. నాది గ్యారంటీ. చెప్పు ఈ డీల్ నీకు సమ్మతమేనా ? ఈ ఒప్పనందం ఖరారయితే నీకు మరో బంపర్ ఆఫర్ ఉంది. అదేఁవిటంటే ..మా చప్పట్ల ఆశ్రమానికి చెందే ట్రష్టు బాధ్యతలు నీకే అప్పగిస్తాను. ఆలోచించుకో ...’’
ఆలోచించడానికేమీ లేదు. నా వల్ల కాదు అనీపాను నిక్కచ్చిగా. మరో సారి చెప్పి చూసి నీఖర్మం అని పెదవి విరిచేసాడు ( కాబోయే ) చప్పట్ల బాబా.
చప్పట్ల బాబా భవిష్య ప్రణాళిక వింటూ ఉంటే నాకు చప్పున ఓ పద్యం గుర్తుకు వచ్చింది. అవధరించండి ...
ఎక్కడి మంత్ర తంత్రములవెక్కడి చక్రము లేడ పాచికల్
ఎక్కడి జ్యోతిషమ్ములవి యెక్కడి హేతువు లేడ ప్రశ్నముల్ ?
తక్కిడి గాక పూర్వకృత ధర్మ సుకర్మమె నిశ్చయంబు పో
పెక్కురు పొట్టకూటికిది వేషమయా శరభాంక లింగమా !
అని సరిపుచ్చుకొని. ‘‘ సరే కానీ, బాబా అన్నాక భక్తులకు రవంతయినా ఆధ్యాత్మిక బోధనల చేయాలి కదా ? ... మనకి చూసొచ్చిన సినిమా కథలు చెప్పడఁవే సరిగా రాదు ... ఎలా మేనేజ్ చేస్తావ్ ’’ అనడిగేను.
‘‘ అవును. ఆ విషయమూ ఆలోచించేను. అందు కొంత హోమ్ వర్క్ చేసాను.
సత్యాన్ని మించిన అసత్యం లేదు,
హింసను మించిన అహింస లేదు.
ఙ్ఞానాన్ని మించిన అఙ్ఞానం లేదు,
ఇలాంటి కొత్త భావజాలంతో ఉసన్యసిప్తాం. అర్ధం కావడం లేదు గురూజీ అనే మొండి భక్తుల నోళ్ళు
అర్ధం కాక పోవడమే అర్ధమవడంరా మూఢ భక్తుడా ! అని మూయిస్తాం.
మరో విషయం ... ఎవరికీ చెప్పనంటే చప్పట్ల రహస్యం నీకు చెబుతాను ... విను ...
మన భక్తులు ఊగిపోతూ, తన్మయత్వంతో, ఒకరిని మంచి ఒకరు పెద్దగా చప్పుడు చేస్తూ చప్పట్లు కొడుతూ ఉంటారా ! ... అప్పుడు ప్రారంభిస్తామన్నమాట మన తాత్విక బోధనలు. మనం ఉపన్యాసం యిస్తున్నామో, ఊరికే పెదవులు కదిలిస్తున్నామో ఎవరూ పోల్చుకో లేని విధంగా ఉంటుందన్నమాట. దాంతో మన అఙ్ఞానం పదిలంగా ,భద్రంగా, గూఢంగా ఉండి పోతుంది. చప్పట్ల హోరులో ఏఁవీ వినిపించి చావక పోయినా బాబా ఏదో చెప్పి ఉంటారనే భావనతో భక్తులు పట్టించు కోరు. అదీ మన చప్పట్ల రహస్యం...’’ అని ముగించేడు చప్పట్ల బాబా.
నేను నివ్వెర పోయాను. నా ఙ్ఞానాంధకారం నశించి . అఙ్ఞాన కిరణాలు అంతటా ప్రసరించేయి. నా తల వెనుక ఓ తేజో చక్రం కాస్సేపన్నా తిరిగి ఉంటుంది. ధన్యోస్మి.
జై ... బోలో ... చప్పట్ల బాబా మహరాజ్ కీ జై ! ... అంటూ చప్పట్లు కొడుతూ అరిచేను.
చప్పట్ల బాబా తన తొలి భక్తుడిని చూస్తూ చిరు నవ్వులు చిందించారు.
1.
1 కామెంట్:
చప్పట్ల బాబా గారి ప్రప్రథమ ఆంతరంగిక ఏకైక భక్తాగ్రేసరులైన మీకు మా చప్పట్ల వందనాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి