26, జులై 2013, శుక్రవారం

తెలుగు పద్యం చిరంజీవికవిత్వం మీద కవిత్వం కూడా కవిత్వమే అంటూ లోగడ ఓ బ్లాగు టపా రాసేను. దానిని  ఇక్కడ నొక్కి చదవొచ్చును. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ఈ పద్యం మీద ఓ రెండు పద్యాలు చూడండి ...

పద్యమ్ము నెవడురా పాతి పెట్టెదనంచు
నున్మాదియై ప్రేలుచున్నవాడు ?

పద్యమ్ము నెవడురా ప్రాతవడ్డది యంచు
వెఱ్ఱివాడై విఱ్ఱవీగు వాడు ?

పద్యమ్ము ఫలమురా ! పాతిబెట్టిన పెద్ద
వృక్షమై పండ్ల వేవేల నొసఁగు !

పద్యమ్ము నెప్పుడో పాతి పెట్టితి మేము
లోకుల హృదయాల లోతులందు !

ఇప్పుడద్దానిఁబెకలింప నెవరి తరము ?
వెలికి తీసి పాతుట యెంతటి వెఱ్ఱితనము ?
నిన్నటికి మున్ను మొన్ననే కన్నుఁదెఱచు
బాల్య చాపల్యమున కెంత వదఱుతనము !?


( కడిమెళ్ళ వర ప్రసాద్ )

పద్యం మీద మరో పద్యం చూడండి ...

పద్యము భారతీసతికి పాదయుగంబునఁబెట్టినట్టి నై
వేద్యము శ్రోత్రతాజన వివేకము, నవ్య మనోహరమ్ముగా
చోద్యముఁగొల్పు చుండు, కవిసూరి జనాళికి, పూర్ణ భావ సం
హృద్యము, పూర్వరాడ్జన వరిష్ఠ విశిష్ఠ వరప్రసాదమున్.

( వద్దిపర్తి పద్మాకర్ )

                                              తెలుగు పద్యం చిరంజీవి..