ఛెప్పు కోడానికేముందిలే, చెప్పుల కథ - అనుకుంటాం కానీ, చెప్పడానికి చాలానే ఉన్నట్టుగా ఉంది ...
వెనుకటి రోజుల్లో మగాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు విధిగా కాళ్ళకి చెప్పులూ, చంకలో గొడుగూ ఉండేవి. హాదాని బట్టీ చేసే ఉద్యోగాన్ని బట్టీ కండువా తలపాగాలు అదనం. రైతువారీ అయితే చేతిలో కర్ర తప్పనిసరిగా ఉండేది. ఈ రోజుల్లో రెయిన్ కోట్లు వచ్చేక గొడుగు అంతవిధాయకం కావడం లేదు, ఏ కాలం లోనయినా కాళ్ళకి చెప్పులు మాత్రం ఉండక తప్పదు. ఎండయినా. వానయినా గొడుగు పట్టు కెళ్ళడం కొంత అనాగరకంగా తలచే కాలమిది. కొంతకాలం క్రిందటి వరకూ సినిమాలలో హీరోయినూ. ఆవిడ వెనుక గ్రూపు డాన్సర్లూ రంగు ర్గుల గొడుగులు పట్టుకుని త్రిప్పుతూ హొయలు పోతూ విన్యాసాలు చేస్తూ ఉండే వారు. ఇప్పుడలా చూపించడం లేదు అనుకుంటాను.అన్నట్టు గొడుగుల్లో ఆడ గొడుగులూ, మగ గొడుగులూ అని జండర్ భేదం కూడా ఉందండోయ్. పువ్వుల గొడుగులు ఆడవారికే . కాక పోతే చిన్న పిల్లలకి. నల్ల రంగు గొడుగులు మగాళ్ళవి.ఇవి కాక పెద్ద పెద్ద నగరాల్లో పేద్ధ రంగుల గొడుగులు పెట్టుకుని దాని క్రింద తాత్కాలిక వ్యాపారాలు .. సెల్ ఫోన్ లూ, వగైరాలు అమ్మడం ఇటీవల చూస్తూ ఉన్నాం. ఫలితార్ధం ఏమిటంటే, ఎవరయినా సరే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక గొడుగు క్రిందకు రావలసిందే ... దీనిని మరింత విపులంగా తరచి చూద్దాం.
దేవాలయాల్లో దేవుడి ఊరేగింపులో వాడే గొడుగులు జలతారు కుచ్చులతో, వెండి పొన్నుతో చాలా పెద్దవిగానూ అందంగానూ ఉంటాయి. వెల్ల గొడుగులవి. పూర్వం రాజులకీ అలాంటి గొడుగులే తప్పని సరిగా పట్టే వారు. ఛత్రదారులని ప్రత్యేకంగా ఉద్యోగులుండే వారు . దేవుడి సేవలోనూ, మహారాజులు సేవలోనూ ఛత్ర చామరాదుల ప్రత్యేకత ఇంతా అంతా కాదు.
రాజ్యం స్వహస్త ధృత దండ మివాత పత్రమ్ అంటాడు కాళిదాసు. అంటే రాజ్య పాలన సొంతంగా తాను పట్టుకున్న గొడుగు లాంటిదని అర్ధం. మనకి మరొకరు గొడుగు పట్టుకుంటే దిలాసాగా ఉంటుంది కానీ, మన దిబ్బ గొడుగు మనఁవే పట్టు కోవాల్సి వస్తే మాత్రం చచ్చే చిక్కే. హాయిగానే ఉంటుంది కానీ, జబ్బలు పీకఁవూ ! అదన్న మాట సంగతి. కాళిదాసు అందుకే రాజ్యాధికారాన్ని సొంత చేత్తో పట్టుకున్న గొడుగుతో పోల్చాడు.
చెప్పుల కథ చెప్పుకుందామంటూ బయలుదేరి కొంత శాఖా చంక్రమణం చేసి గొడుగుల కథలోకి వెళ్ళినట్టున్నాం. గొడుగు చెప్పుకి అగ్రజుడు మరి. సరే, గొడుగుల కథ కాస్సేపు మడిచి ప్రక్కన పెట్టి మళ్ళీ చెప్పుల కథ లోకి వద్దాం !
చెప్పులకి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. అగనాళ్ళు, అడివొత్తులు, ఉద్దాలు, ఉపానము, ఊడుపు, పాదుకలు, జోళ్ళు, పాదరక్షలు, పాదుకలు, మలకడాలు, ముచ్చెలు, మెట్లు, వగైరా ఇంకా చాలా పదాలకి చెప్పులు అనే అర్ధం, వీటిలో పాదకలను మళ్ళీ అడిగఱ్ఱ, పావకోడు, యోగవాగలు, వాగెలు, వగైరా పేర్లతో పిలుస్తారు.
చెప్పులలో రకాలకీ మనవాళ్ళు పేర్లు పెట్టారు. ఓరట్టు చెప్పులు, కిర్రు చెప్పులు, ఓరచ్చులు,కిఱ్ఱు పావుకోళ్ళు, కిఱ్ఱు బాగాలు,పిడివారులు వగైరా పేర్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకూ మనకు తెలియవు, కనీసం నాకు తెలియదు. కిర్రు చెప్పుల గురించి మాత్రం మనలో చాలా మంది వినే ఉంటారు. సాధారణంగా ఇవి తోలు చెప్పులు. నడుస్తూ ఉంటే కిర్రు కిర్రుమని చప్పుడు చేస్తూ ఉంటాయి. ఇక పావుకోళ్ళయితే కర్రతో చేస్తారు. పాంకోళ్ళు అనికూడా వ్యవహారం. మునులు వీటినే ధరించేవారు.
వెనుకటి రోజులలో పెళ్ళి వేడుకల్లో పెళ్ళి కొడుకు కాశీ ప్రయాణ ఘట్టంలో పాంకోళ్ళు ఇచ్చే వారు
. ఇప్పటికీ పెళ్ళి తంతులో కాశీయాత్ర ముచ్చట సజావుగానే ఉంది. నాకీ పెళ్ళొద్దని వరుడు కాశీ ప్రయాణం కట్టడం, బావమరిది బతిమాలి కాలికి చెప్పులూ, గొడుగూ, కర్రా, కొత్త బట్టలూ ఇచ్చి పటిక పంచదార ముక్క తినిపించి కాశీ ప్రయాణం మానుకుని తమ సోదరిని పెళ్ళి చేసుకొమ్మని అడగడం, వరుడు మనసు మార్చుకుని తిరిగి కళ్యాణమండపం మీదకి రావడం ... ఇదీ తంతు. పోతే పోవోయ్ అని ఊరుకుంటే ఏంజరుగుతుంది చెప్ప్మా ! అని నాకొక చిలిపి ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ వేడుక సమయంలో వరుడికి లోగడ పావుకోళ్ళు ఇచ్చే వారనుకున్నాం కదా ... తర్వాత వాటి స్థానంలో చాలా రోజుల వరకూ హవాయి చెప్పులు. లేదా మామూలు బాటా చెప్పులూ ఇవ్వడం మొదలెట్టారు. కొంతమందయితే వేడుక కోసం మామ్మూలు చెప్పులు పెట్టినా, వరుడికి ఖరీదయిన బూట్లు ఇస్తున్నారు. లేదా మగ పెళ్ళి వారే అడిగి మరీ కొనిపించు కుంటున్నారు.
నిన్నా మొన్నటి వరకూ అగ్రవర్ణాల వారుండే వీధిలోకి కాలి చెప్పులతో కడజాతి వాడు రావడం నిషిద్ధంగా ఉండేది. ఇప్పుడా మాటంటే చెప్పు తీసుకుని కొడతారు. కొట్టాలి కూడా.
చెప్పుల కథ చెప్పుకేనేటప్పుడు విధిగా పాదుకా పట్టాభిషేకంతో మొదలు పెట్టడం సబవు. రాముడు అరణ్య వాసంకి వెళ్ళాక, భరతుడు తల్లి చేసిన పని తెలిసి, బాధపడి, అడవికి వెళ్ళి అన్నగారిని తిరిగి రాజ్యానికి వచ్చి రాజ్యపాలన చేయమని బ్రతిమాలుకుంటాడు. సత్యవాక్పాలకుడు శ్రీరాముడు విన లేదు. చివరకి రాముడు లేని రాజ్యాన్ని తాను పాలించననీ, అందుకు అర్హత తనకి లేదనీ, రాముడి పాదుకలను అడిగి పుచ్చుకుని వాటిని సింహాసనం మీద ఉంచి పట్టాభిషేకం చేసి అన్న గారి పట్ల తన ప్రభు భక్తిని ప్రకటించు కున్నాడు భరతుడు. అయితే, అసలే అరణ్యవాసం తప్పని రాముడికి ఆ ఘోరారణ్యంలో కనీసం పాదుకలయినా లేకేండా చేసాడని ఒక తరహా మేధావులు గోల పెడుతూ ఉంటారు. ఇదీ పాదుకలకి ఉన్న మహిమ. చెప్పుల చరిత్రలో స్వర్ణయుగమది.
దేవుళ్ళ పేరిట దర్శనమిచ్చే పాదుకలను భక్తులు పరమ భక్తి శ్రద్ధలో కొలుస్తారు.
కనకపు సింహాసనమున శునకం ఎక్కిందో లేదో కానీ పాదుకలు ఎక్కాయి.
ఇక చెప్పుల పద్యాలు ఒకటి రెండు చూద్దాం ...
అల్ప బుద్ధి వానికి అధికార మిస్తే దొడ్డ బుద్ధి వారిని తన్ని తరిమేస్తాడని చెబుతూ వేమన గారు ‘‘చెప్పు తినెడు కుక్క చెఱకు తీపెరుగునా ?’’ అంటాడు.
ఇలాగే వేమన పద్యాలలో చెప్పుల ప్రస్తావన మరో చోట ఉంది. చెప్పు లోని రాయి, చెవి లోని జోరీగ, కంటి లోని నలుసు, కాలి ముల్లు, ఇంటి లోని పోరు ఇంతింత కాదయా ! అంటాడు. వెల్ సెడ్ కదూ ? వాటి బాధ అనుభవించే వాడికే తప్ప మరొకడికి తెలియదు మరి ! ఈ పద్యానికి లోని రాయి గురించి చెప్పు ( ఆత్మ వివేచన చేసుకో !) లాంటి వేదాంత పరమైన అర్ధాలు కూడా మన పెద్దలు చెప్పారు కానీ, అంత సీను మనకి లేదు. దాని సంగతి వదిలేద్దాం.
వెనుకటికో అవధానిగారికి ఓ పృచ్ఛకుడు ‘‘ కప్పను గని ఫణివ వరుండు గడగడ
వణికెన్ ’’ అని సమస్య ఇచ్చేడు. దానిని అవధాని పూరించిన పద్యంలో చెప్పుల ప్రస్తావన ఉంది కనుక అదీ చెప్పుకుందాం.
కుప్పలు కావలి కాయఁగ
చెప్పులు కఱ్ఱయును బూని శీఘ్ర గతిం దా
జప్పుడగుచు వచ్చెడి వెం
కప్పను గని ఫణి వరుండు గడగడ వనికెన్ !
ఇదీ పూరణ. పొలంలో వరి కుప్పలు కాపాలా కాయడానికి వెంకప్ప అనే రైతుచేతిలో కర్ర, కాలికి కిర్రు చెప్పులూ వేసుకుని వచ్చేడుట. వాటి చప్పుడుకి పాము బెదిరి పోయి గడగడా వణికి పోయిందిట.
అల్పుల గురించి ఓ కవి చెబుతూ ..
నక్కలు బొక్కలు వెతుకును
అక్కరతో నూరపంది అగడిత వెదుకున్
కుక్కలు చెప్పులు వెదుకును
తక్కిడి నా లంజ కొడుకు తప్పే వెదుకున్.
అన్నాడు. నిజఁవే కుక్కలు చెప్పులను ఉండనివ్వవు. చింపి పోగులు పెడతాయి. ఇళ్ళలో కుక్కలను పెంచే వారికి ఇది అనుభవైక వేద్యమే. ఇలా మన చెప్పులు కుక్కల పాలిబడటం కుక్కల చరిత్రకే తీరని అవమానంగానూ.నష్టదాయకంగానూ. తీరని ద్రోహంగానూ ... యింకా చాలాగానూ మా తింగరి బుచ్చి వాపోతున్నాడు.
సాముల్ని కర్రతోనూ. చెప్పుతో తేళ్ళనీ , జెర్రెలనీ కొట్టి చంనడం మనుషుల అలవాటు. ఈ విధంగా చెప్పులు తేళ్ళ వంటి విషజంతువుల వధలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయన్నమాట. విష జంతువులే కాదు, అలాంటి వెధవల పాలిట కూడా చెప్పులే సరైన ఆయుధాలు. రోమియోగాళ్ళనీ, బేవర్సుగాళ్ళనీ చెప్పు దెబ్బడలతో సత్కరించడం అమ్మాయిలకు అవసరం.చేత్తో కొట్టడం కన్నా, చెప్పుతో కొడితే మరీ అవమానించి నట్టవుతుంది.
సభల్లో నచ్చని వక్తల మీద, రాజకీయ నాయకుల మీద చెప్పులు విసరడం తెలిసినదే. అయితే కోడి గుడ్లు, టమాటాల కంటె ఇది కాస్త ఖరీదయిన వ్యవహారం అనుకుంటాను.హోళీనాడు రంగులు పూస్తారని చెప్పి పాత గుడ్డలు వేసుకు వెళ్ళి నట్టుగా వీటి కోసం ఏ చిరిగిన చెప్పులో ప్రత్యేకించడం మంచిది. లాభదాయకం. మీ ఇష్టం. ఆలోచించండి.
కుక్కలే కాదు, కొత్త చెప్పులూ కరుస్తాయి సుమండీ. ఆ బాధ వర్ణనాతీతం. అలవాటు పడే వరకూ నరకం చూపిస్తాయి. అందుకే పరైన చెప్పులూ, సరిజోడు పెళ్ళామూ లభించడం అదృష్టమనే చెప్పాలి. చెప్పులయితే కనికరించి కొన్ని రోజులకి కరవడం మానేస్తాయి కానీ, మొండి పెళ్ళాలు జీవితపర్యంతం కరుస్తూనే ఉండే ప్రమాదం ఉంది.
ఇక, ఉచితంగా చెప్పులు దొరికే చోటు ఏదంటే ఖచ్చితంగా దేవాలయాలే ! అని ఎవరయినా ఠక్కున చెప్పగలరు. కాక పోతే ఒక్కోసారి పెళ్ళి పందిళ్ళలో కూడా మనకి కావలసిన అనువైన, అందమైన కొత్త చెప్పులు ఉచితంగా దొరికే వీలుంది. ఏదో సినిమాలో నా షోలాపూర్ చెప్పులు పోయాయని గోల పాట ఒకటుంది కదూ ? ఇలాంటి చోట్ల పోయిన చెప్పులన్నీ ఉద్దేశ పూర్వకంగానే ఎవరో ఎత్తుకెళ్ళారనీ అనుకో నక్కర లేదండీ. ఒక్కో సారి హడావిడిలో మనవి కానీ చెప్పులు వేసు కోవడం, కుడి ఎడమల చెప్పులు తారుమారయి అవస్థలు పడడం కూడా జరుగుతూనే ఉంటుంది.
అందుకే ఆలయంలో దేవుడి ఎదుట నిలుచున్నా, చిత్తం చెప్పుల మీదనే ఉంచే భక్తులుంటారు. ఇప్పుడయితే రూసాయో, రెండో తీసుకుని టోకెన్లు ఇచ్చి, మనం వచ్చే వరకూ మన చెప్పులు భద్ర పరుస్తున్నారు కానీ లోగడ ఆ సదుపాయం ఉండేది కాదు. ఇప్పటికీ ఆ సదుపాయం లేని దేవాలయాలు చాలానే ఉన్నాయి. అవి కొత చెప్పులు ఉచితంగా కావాలనుకునే వారి పాలిట చెప్పుల కల్ప తరువులు. అయితే మనకి నచ్చిన , మనకి సరిపోయిన మంచి చెప్పులు కనిపిస్తే మన పాత చింకి చెప్పులు అక్కడ విడిచేసి దర్జాగా ఉడాయించ వచ్చు. కానీ కొన్ని మెళకువలు పాటించక పోతే దొరికి పోతాం. ముఖ్యంగా మనం వేసుకు పోదామనుకున్న చెప్పులాయన, లేదా, ఆమె ఆ చెప్పులు విడిచి ఎంత సేపయిందీ, తిరిగి వెంటనే వచ్చే ప్రమాదమేదయినా ఉందా , చుట్టు ప్రక్కల ఎవరినా నిఘా వేస్తున్నారా ? మొదలయిన విషయాల గురించి ముందుగా రెక్కీ నిర్వహించి తెలుసు కోవడం మంచిది. లేదా దెబ్బ తినేస్తాం అని మా తింగరి బుచ్చి థియరీ.
మరో విషయ మేమిటంటే, మనం శివాలయం ముందు నుంచి చెప్పుల జత ఎత్తు కొచ్చామనుకోండి ... వెంటనే మరి కొన్నాళ్ళ పాటయినా మతంమార్చెయ్యాలి. పరమ విష్ణు భక్తుల మయి పోవాలి. ఆ శివాలయం వేపు కొన్నాళ్ళు వెళ్ళడం వొంటికి మంచిది కాదు.
మా తింగరి బుచ్చిలాంటి ప్రబుద్ధులు చెప్పులు మార్చాలనిపిస్తే ఏదో దేవాలయ దర్శనం చేస్తూ ఉంటారు. సురక్షితమైన ఆలయం ఎన్ను కోవడంలో వారి మెళకువ అంతా ఇంతా కాదు. ఎప్పుడో చెప్పు దెబ్బలు తినే వరకూ వారి తీరు మారదు.
’’ఈ మేలు చేసావంటే నీ రుణం ఉంచు కోను, నాచర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తా ’’ అని ఎవరయినా అంటే మరీ వాచ్యార్ధాన్ని సీరియస్ గా తీసుకో కూడదు. చర్మం వొలిచి చెప్పులు కుట్టించడమంటే జీవితాంతం చేసిన మేలు గుర్తుంచు కుంటాననడమే కానీ నిజంగా అలాంటి చెప్పుల జత వొస్తుందనుకో కూడదు.
చెప్పుల్లో చెప్ప లేనన్ని రకాలు. బాత్ రూమ్ చెప్పులూ. ఇంట్లో తిరగడానికి వాడే చెప్పులూ, వర్షాకాలంలో వాడేవీ, ఎండా కాలంలో సౌకర్యంగా ఉండేవీ, ఫంక్షన్లలో డాబుగా కనిపించేవీ ... చాలా రకాలుంటాయి. సాదా చెప్పులూ. రబ్బరు చెప్పులూ, తోలు చెప్పులూ, బూట్లూ, హాఫ్ బూట్లూ ... చెప్పడం నాతరం కాదు. కొంత మంది రాజకీయ కాయకులకూ, ముఖ్యంగా అమ్మణ్ణులకూ, సినీతారలకూ చెప్పుల పిచ్చి జాప్తీయే. ఎన్ని రకాల చెప్పులు కొన్నా వారికి తనవి తీరదు. ఓ ముఖ్యమంత్రిణి ఇంట చెప్పుల జతలు వందల సంఖ్యలో ఉంటాయని చెప్పుకుంటారు.
ఆఫీసు కెళ్ళే భర్తల చెప్పులు, లేదా బూట్లూ, మేజోళ్ళూ తుడిచి శుభ్రం చేసి సిద్ధం చేయడం ఓ తలనొప్పి వ్యవహారం. బడి నుంచి ఇంటికి వస్తూనే కాలి చెప్పులు ఓ మూలకి విసిరేసే పిల్లలూ, బూట్లు విప్పి ఏ మూలనో గిరాటు వేసే పిల్లల తోనూ తల్లులకి నిత్యం సతమతమే.
చివరగా చెప్పుల సామెతలు కూడా చూద్దాం ...
1. చెప్పు కాలు నెత్తిన పెట్టి, వఠకోపమంటాడు.
2. చెప్పు కింద తేలు లాగా
3. చెప్పు తినెడి కుక్క చెఱకు తీపెరుగునా ?
4. పట్టు గుడ్డలో చెప్పును చుట్టి కొట్టినట్టు !
5. చెప్పుల వానికి చేనంతా తోలుతో కప్పినట్టుగా ఉంటుంది.
6. చెప్పులున్న వాడితోనూ, అప్పులున్న వాడితోనూ జాగ్రత్తగా ఉండాలి.
7. చెప్పులు సరిపో లేదని కాలు తెగ కోసుకుంటారా ?
8. చెప్పులు తెగినా చుట్టరికం తెగదు.
9. చెప్పు లోని రాయి చెవి లోని జోరీగ, ఇంటి లోని పోరు ఇంతింత కాదు
చెప్పులు అరిగేలా తిరగడ మంటే, పట్టు వదలకుండా కృషి చేయడమన్నమాట.
చెప్పుల కథలో చివరిగా ఒక స్వీయానుభవం కూడా చెప్పి ముగిస్తాను.
అదేదో సబ్బుల కంపెనీ ప్రకటన ... మరక మంచిదే ! లాగా , కాలికి చెప్పులు లేక పోవడం కూడా ఒక్కో సారి మంచిదే అని నా స్వీయానుభవం. చెబుతా వినండి.
అవి నేను ఓ మారు మూల కుగ్రామంలో పరిషత్ పాఠశాలలో టీచరుగా చేరిన రోజులు. రెండేళ్ళు ఆ కుగ్రామంలో నానా అవస్థలూ పడ్డాను. ఉద్యోగ మంటేనే విరక్తి కలిగింది. అక్కడి నుండి బదిలీ ఎప్పుడవుతుందా అని ఎదురు చూసాను. ఆరోజు రానే వచ్చింది. రెండేళ్ళు గడిచాక జిల్లా పరిషత్ వారు టీచర్ల బదిలీలు చేపట్టారు. మా మునిసిపల్ ఛైర్మన్ గారు తమకి అనుయాయులూ, తెలిసిన వారూ అయిన టీచర్ల బదిలీలు వారు కోరిన చోట్లకి చేయించే పనిలో జిల్లా కేంద్రానికి మరుచటి దినమే వెళ్తున్నారని తెలిసింది. వెంటనే మా ఊరికొచ్చి, ఆఘ మేఘాల మీద, అప్పటికే హెడ్మాష్టరు చేత అండార్సు చేయించిన బదిలీ దరఖాస్తు కాపీని ఛైర్మన్ గారి కి అంద చేయాలని తలపెట్టాను. ఆ రాత్రి కంటి మీద కునుకు లేదు. మర్నాడు ఛైర్మను గారి కారు బయలు దేరే లోపు నా అప్లికేషను వారి చేతిలో పెట్టాలి. లేక పోతే పని జరగదు మరి. నిద్ర లేమితో మర్నాడు ఆలస్యంగా లేచాను. తుళ్ళి పడ్డాను. మాసిన బట్టలు మార్చు కో లేదు. చెప్పులు తొడుక్కుని బయలుదేరే వేళకి ఓ చెప్పు తెగి పోయి నడవడానికి సహకరించడం లేదు. టైం లేదు. ఆ చెప్పులను అలాగే వదిలేసి, మా ఇంటికి ప్రక్క వీధిలోనే ఉండే ఛైర్మను గారింటికి వట్టి కాళ్ళతోనే హడావిడిగా బయలు దేరాను. వారు నా అవతారం చూసి. చెప్పులు లేని నా కళ్ళ వేపు ఓ సారి జాలిగా చూసి, గాఢంగా నిట్టూర్చి, నా చేతి లోనుండి దరఖాస్తు అందు కున్నారు. కాలికి ( తెగి పోవడం వ్లనే అనుకోండి ) చెప్పులయినా లేని నా రూపం వారిలో ఏ పేగు కదిలించిందో మరి, వారు చేపట్టిన బదిలీ లో మొదటిది నాదే ! చక్కగా మా ఊరికి దగ్గరగా చక్కని రవాణా సౌకర్యం ఉండే చోటుకి పట్టుబట్టి నాకు బదిలీ చేయించారు. ఇప్పుడు చెప్పండి ... అర్ధాంతరంగా చెప్పు తెగి పోవడం కూడా మంచిదే కదూ ?!
ఇదండీ నేను చెప్ప గలిగినంత చెప్పుల కథ ...
శలవా మరి ....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి