28, ఆగస్టు 2014, గురువారం

తెలుగు సినిమాలలో హాస్యం పండించడం చాలా సుళువు ! ప్రస్తుతానికో పది చిట్కాలు...



తెలుగు సినిమాల్లో ఆస్సెం ( హాస్యమే లెండి ) పుట్టించడం చాలా సుళువు.
ఏముందీ ఈ చిట్కాలు పాటిస్తే సరి ... జనాలు పిచ్చి ముఖాలేసుకుని పగలబడి నవవ్వుతారు ..
1.   టీచర్నో, లెక్చరర్ నో,  లేదా  ప్రిన్సిపాల్ నో  కారుకూతలు కూస్తూ, కొండొకచో  సరదాగా వారి మీద   చేయి చేసుకుంటూ, అల్లరి పాలు చేయిస్తే సరి ...
2.    పురోహిత వర్గాన్ని  ( వేరే కులాల వారిని, మతాల వారినీ అనే దమ్ముల్లేక ) వెర్రి వెంగళప్పల్లా చూపిస్తే పాయె !
3.    పోలీసు బాబాయిలను హీరో గారూ, వాడి తోక గాడూ చాక చక్యంగా బకరా చేస్తే చాలు ...
4.   బండ విలన్లను కూడా ఏదో పాయింట్ తో లొంగ దీసుకుని వాళ్ళ చేత గొడ్డు చాకిరీ చేయిస్తూ, కొరడాతో  హీరో గారు ఓ రేవు పెడితే చాలదూ !
5.   ద్వంద్వార్ధాల బూతు కూతలతో కాబోయే సినిమా పెళ్ళాలని
( హీరోయిన్లని )  అల్లరిపాలు చేస్తే భలే, భలే ..
6.   వికలాంగులనీ, వృద్ధులనీ, అసహాయులనీ  వెక్కిరించేలా తీస్తే చాలు.
7.    పాపం మన ఆస్సెగాళ్ళు ( అదే, కమేడియన్లు) హీరో చేతిలో ఎన్ని చెంప దెబ్బలు తింటే అంత ఆస్సెం పేలుతుంది కదా !
8.   ‘‘ ఒరేయ్ డాడీ ! ఓ కోటి రూపాయ లివ్వరా ! అలా బార్ కేసి వెళ్ళొస్తానూ ...’’ అనే గారాల కూచుల నంగి మాటలూ, తండ్రీ కొడుకుల బాంధవ్యాలూ ముచ్చట కొలిపే ఆస్సెం విరగ పండిస్తుంది చూస్కోండి ..
9.   మద్ది చెట్టుల్లా ఎదిగిన మన నలభై ఏళ్ళ హీరో గారు నిక్కరేసుకుని నోట్లో వేలు పెట్టుకుని స్కూలు కెళ్ళి పదో తరగతి చదువు కోవడం పొట్ట చెక్కలు చేస్తుంది కదా !
10.బికినీ సుందరుల బికినీ బటన్ ఊడి పోతున్నట్టుగానో, జాకెట్ హుక్, లేదా గౌను జిప్పు మన సంస్కారవంతమయిన సబ్బు ల్లాంటి జీరోలు ( హమ్మమ్మ ! హీరోలు)  ఊడ బెరకడమూ ఆస్సెమే సుమీ ...

థూ ! దీనమ్మ జీవితం. ఈ సినిమాలు నాశినమైపోనూ ...

( గమనిక : ఈ టపా అందరిని గురించీ, అన్ని సినిమాల గురించీ కాదు ... మినహాయింపులు ఎప్పుడూ ఉంటాయి )


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి