కామెడీ ఛానెల్ పెట్టరా బాబూ ! అంటే, మా కోనేటి రావు ఎప్పుడూ ఏదో న్యూస్ ఛానెల్ నే పెడతాడు.
ఇదేఁవిటిరా నాయనా అంటే, చూడవోయ్, బోలెడంత కామెడీ దొరుకుతుంది. పొట్ట చెక్కలై ఛస్తావ్ ! అంటాడు.
సరే చూదామని, చూడడం మొదలెట్టేను. క్రమేపీ కామెడీ కోసం ఆ ఛానెళ్ళు చూడడానికి ఎడిక్ట్ అయి పోయాను.
కామెడీ కాక పోతే, మరేమిటి చెప్పండి ? మన నాయకమ్మన్యుల నటనా విలాసాలు. ఆంగిక వాచిక విన్యాసాలూ, అభినయ విశేషాలూ, సంభాషణా చాతుర్యాలూ చూస్తూ ఉంటే, మా కోనేటి రావు చెప్పింది నిజమే అనిపిస్తుంది.
వీధి కొళాయి దగ్గర తగవులు కూడా వారి వాదోపవాదాల దగ్గర దిగదుడుపే అనిపిస్తుంది.
ఏదో
అంటాడు. అనలేదంటాడు. తిడతాడు. తిట్ట లేదంటాడు. మీరు నా మాటల్లో అంతరార్ధం
అసలే అర్ధం చేసుకో లేదు పొమ్మని దబాయిస్తాడు. కాదంటే కోపంతో బుసలు కొడతాడు.
అవినీతి కోట్లలో జరిగిందని అలిసి పోయే వరకూ అరుస్తాడు. ఆధారాలడిగితే, సమయం
వచ్చిప్పుడు బయట పెడతానంటాడు ( ఆ దిక్కు మాలిన సమయం ఎప్పుడు వచ్చి
ఛస్తుందో విధాతకి సైతం తెలియదు) పెజా సేవ అంటూ శోష వచ్చే వరకూ గీ పెడతాడు.
కుర్చీలాటలో తలముకలవుతాడు. అబద్ధాలను అవలీలగా కళాత్మకంగా వినిపించడంలో
దిట్టలు. అర చేతిలో వైకుంఠాలు వారి మేని ఫెస్టోలు.
టీవీల్లో చర్చా వేదికలు కదన రంగాలను తల పోస్తూ ఉంటాయి. పార్టీ కార్య క్రమాల్లో సైతం పిశాచ సమవాకారాలు వినిపిస్తూ ఉంటాయి. బాహా బాహీ, కచ్చా కచ్చీ, దండా దండీ. అంతా శిఖ పట్ల గోత్రాలు.
సాయ్ లెన్స్ ! అని పంతులు అరిస్తే బడి పిల్లలయినా అల్లరి మానేస్తారేమో కానీ, వీళ్ళు మాత్రం అరచు కోవడాలు తగ్గించరు. ఎవరేం అంటున్నారో తెలియక జుట్టు పీక్కోవాలి మనం. అది మన ప్రారబ్ధ ఖర్మ.
ఒక సారి రాజకీయ పాప పంకిలంలోకి దిగేక, ప్రతి
ఛోటా నాయకమ్మన్యుడూ తాను దైవాంశ సంభూతుడననుకుంటాడు. సకల సుగుణ శోభిత
పురుషోత్తముడ ననుకుంటాడు. సమస్త శక్తులూ సంక్రమించాయనుకుంటాడు.వాడి నడక, నడత, మాట తీరు, ప్రవర్తన అన్నీ అనూహ్యంగా మారి పోతాయ్.
ఎక్కడికి పోతున్నాం, మనం !
ఎక్క వలసిన ఎవరెస్టు శిఖరాల పైకా ?
దిక్కు మాలిన పాపాల పాతాల కుహరాల లోకా ?
(సి.నా.రె)
అని
విస్తు పోతాం. దశాబ్దాలుగా అలవాటు పడి పోయాం. ధరలు పెరిగి పోతున్నాయని
గగ్గోలు పెడతాం. నల్లాలో పది నిమిషాల పాటు నీళ్ళొచ్చాయని సంబర పడి పోతాం.
కలల్ని జోకొడుతూ కమ్మగా నిద్ర పోతాం. నిద్ర మత్తు లోనే జోగుతూ బ్యాలెట్
బాక్స్ ల వద్దకు వెళతాం. మనం ఓటు వేసి గెలిపించు కున్న మకిలి వాసననే
ఆఘ్రాణిస్తూ పరవశించి పోతాం.
అనతం
విషాదమే జీవితానుభవం అనుకుంటాం. కారణాలు వెతకం. ఈ భగ్న జీవిత కుటీరాలను
ఎలా మరమ్మతులు చేసు కోవాలో ఆలోచించం. గొంగళీ పురుగుల్లాగా ముడుచుకుని
పడుకుంటాం. మరి లేవం. లేవడానికి ఇష్ట పడం. అంత కన్నా, లేవడానికి భయ పడతాం
అనడం సమంజస మేమో ?
నాయకమ్మన్యులు ఇంత అహంకార పూరితులు కావడం ఎందుకు జరుగుతోందో ఆలోచిస్తూ ఉంటే, ఈ క్రింది శ్లోకాలు గుర్తుకు వచ్చేయి.
చూడండి:
యౌవనం ధన సంపత్తి: ప్రభుత్వ మవివేకితా
ఏకైక మస్యనర్ధాయ కిము యత్ర చతుష్టయమ్ ?
యౌవనం, ధన మదం, అధికారం, తెలివి తక్కువ తనం ఇవన్నీ వేటి కవే ఒక్కొక్కటీ అనర్ధదాయకాలు. మరి, ఒకే చోట ఈ నాలుగూ కూడితే, చెప్ప వలసిన దేముంది ?
మరో శ్లోకం చూడండి:
కపిరపి చ కాపిశాయన మద మత్తో వృశ్చికేన సందష్ట:
అపిచ పిశాచ గ్రస్త: కిం బ్రూమో వైకృతం తస్య.
అసలే కోతి ! అది కల్లు త్రాగిందిట. దాని మీద తేలు కుట్టిందిట. ఆ పైన పిశాచం పట్టిందిట ! ఇక చూడాలి, దాని
చేష్టలు ! అంటున్నాడు శ్లోక కర్త.
ఈ కోతుల రాజ్యంలో కోతి మూకను అదుపులో పెట్ట గలిగే కోదండ రాముడే లేడా ?
స్వస్తి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి