7, జనవరి 2015, బుధవారం

భలే వాడివయ్యా !

పారావారము నందు న
నారని పెను చిచ్చు వోలె హాలాహలమే
పారఁగ నద్దానిని మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై



భావం : పాల సముద్రంలో మహా అగ్ని లాగున విషం పుట్టింది. అది ఎంతకీ ఆరేది కాదు. లోకాలను కాపాడడం కోసం శివుడు దానిని మనసారా మ్రింగాడు.

పరమేశ్వరుడు లోకసంరక్షణార్థం   మద్యం పుచ్చు కొన్నాడని సమస్య. దానిని  అవధాని గారు  మనసారా అనే విరుపుతో చక్కగా పూర్తి చేసాడు.
అమృతం కోసం దేవతలూ రాక్షసులూ పాల సముద్రాన్ని మధించారు. వాసుకిని తాడుగా చేసుకున్నారు. మంధర పర్వతాన్ని కవ్వంగా చేసుకొన్నారు. పాల కడలిని చిలకడం మొదలు పెట్టారు. అందు లోనుండి కామ ధేనువు, కల్ప వృక్షమూ, ఐరావతమూ, శ్రీమహా లక్ష్మీ, కౌస్తుభమూ, అప్సరోంగనలూ వెలువడ్డారు. చివరగా కాలకూటం వెలువడింది. దానిని ఏం చేయాలో దేవ దానవులకు తెలిసింది కాదు. చివరకు ఆ విషాన్ని స్వీకరించమని శివుడిని ప్రార్ధించారు. లోక రక్షణ కోసం  శివుడు దానికి సిద్ధ పడ్డాడు.

ఆ సందర్భంలో పోతన గారు చాలా గొప్ప పద్యాలు రాసారు. వాటిని కూడా ఒకింత గుర్తు చేసు కుందాం. మంచి కవిత్వాన్ని మననం చేసు కోడానికి ముహూర్తం అక్కర లేదు కదా.

కంటే జగముల దు:ఖము
వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువై
యుంటకు నార్తుల యాపద
గెంటించుట ఫలము, దాన కీర్తి మృగాక్షీ

శివుడు పార్వతితో ఇలా అన్నాడు : లోకాల ఆర్తిని చూసేవు కదా ? పాల సముద్రం నుండి పుట్టిన విషం ఎంత వేడిమి గలదో విన్నావు కదా ? రాజైనందుకు ప్రజలను వారి ఆపదలలో ఆదుకోవాలి. దాని వలన మంచి కీర్తి లభిస్తుంది.
పార్వతి తన పెనిమిటి లోక రక్షణార్ధం కాలకూటాన్ని భుజించడానికి సిద్ధ పడితే పంతోషంగా అంగీకరించింది.
శుకుడు అందుకే అంటాడు :

మ్రింగెడు వాడు విభుండని
మ్రింగుడిది గరళ మనియు మేలని ప్రజకున్
మ్రింగు మనె సర్వ మంగళ,
మంగళ సూత్రంబు నెంత మది నమ్మినదో !

ఆహా ! గరళాన్ని మ్రింగే వాడు లోకప్రభువైన తన భర్త. మ్రింగేది కాలకూటం. అలా చేయడం వల్ల లోకాలకు మేలు కలుగు తుంది అని తలచి సర్వ శుభప్రదాయిని పార్వతి సరే విషాన్ని తినమని భర్తతో పలికిందిట. ఆ పతివ్రత తన మంగళ సూత్రాన్ని ఎంతగా నమ్ముకున్నదో కదా.
పరమ శివుడు హాలాహలాన్ని భక్షించే టప్పటి దృశ్యాన్ని పోతన గారు ఎంత గొప్పగా కళ్ళకు కట్టేలా చిత్రించారో చూడండి ...

కదలం బారవు పాఁప పేరు లొడలన్ ఘర్మాంబు జాలంబు పు
ట్టదు,నేత్రంబులు నెఱ్ఱగావు, నిజజూటార్ధేందుఁడున్ గందడున్
వదనాంభోజము వాడదా విషము నాహ్వానించుచో, డాయుచోఁ
బదిలుండై కడి సేయుచోఁదిగుచుచో, భక్షింపుచో, మ్రింగుచోన్.
పరమ శివుడు హాలాహలాన్ని రారమ్మని కవ్వించి పిలిచాడు. తనూ ఓ అడుగు ముందుకు వేసి సమీపించేడు. ఆ విషాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసాడు.కిందకి లాగాడు. నోట పెట్టుకుని మ్రింగాడు.
అలా శివుడు విషాన్ని భక్షిస్తూ ఉంటే, వొంటి మీద హారాలలా వేలాడుతున్న పాములు బెదరడం లేదు. కదలడం లేదు. ఆ మహా తాపానికి పరమ శివుని ఒంటి మీద ఒక్క చుక్క చెమట పుట్టడం లేదు. కనులు ఎఱ్ఱ బడడం లేదు. జటాజూటంలో ఉన్న చంద్రుడు ఆ వేడిమికి కంది పోలేదు. శివుని పద్మంలాంటి ముఖం వాడి పోలేదు.

భలే వాడివయ్యా, భోలా శంకరా !




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి