10, మార్చి 2015, మంగళవారం

కోలుకో లేని దెబ్బకు అప్పుడే ఆరేళ్ళా ?....



కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి (29-3-1952  -  11 -3 -2009 ).
 రాయాల్సిందేదో రాసేసి, చెప్పాల్సిందేదో చెప్పేసి, నిరాడంబరంగా,నిశ్శబ్దంగా, ఒకింత నిర్లక్ష్యంగా, వెళ్ళి పోయేరు. రచయితగా రావలసినంత పేరు తన ఖాతాలో జమ అయిందో లేదో చూసుకునే ఓపికా, ఆసక్తీ కూడా లేని పతంజలి ‘ అవుతే నాకేటి’ అని నవ్వేసి, వెళ్ళి పోయేరు. ప్రపంచ సాహిత్య ప్రమాణాలతో సరితూగే గొప్ప రచనలను చేసి, వెళ్ళి పోయేరు. కన్యాశుల్కం తర్వాత, అంత వాటంగా హాస్య బీభత్స రసాలను ప్రదర్శించ గలిగిన తెలుగు రచయితలు లేరనే చెప్పాలి.
 సన్నగా , రివటలా పొడుగ్గా, కొనదేరిన రాచ ముక్కుతో , సూటిగా, దయగా చూసే చూపులతో, అవతలి వాడి వివేకాన్నీ, వెకిలి తనాన్నీ కూడా సరిగానే అంచనా వెయ్య గలిగిన ధీమాతో కూడిన చిరునవ్వు - యిదీ స్థూలంగా పతంజలి రూపం ! తెలిసిన వాళ్ళకి, అత్యంత వైవిధ్య భరితమూ, అద్భుతమైన హాస్య వ్యంగ్య శైలీ, విభిన్న మానవ మనస్తత్వాలను ఆవిష్కరించే కథనాలతో - ఇంత సాహిత్యాన్ని యీ బక్క మనిషి ఒక్కడూ అందించేడా ! అని, ఆశ్చర్యం కలుగుతుంది. తెలుగు చిన్న కథ తొలి ఊపిరులు పోసుకున్న విజయ నగరానికి అతి చేరువలో అలమండ గ్రామంలో పుట్టిన పతంజలి డిగ్రీ చదువు విజయ నగరంలోనే సాగింది. పాత్రికేయునిగా విశాఖ పట్నం, విజయ వాడ, తిరుపతి, హైదరాబాద్ లలో శాఖా చంక్రమణం చేసారు. బతుకు బాటలో ఎన్నో ఉత్థాన పతనాల్ని చవి చూసేరు. ఒక అపూర్వమైన స్వీయ వ్యక్తిత్వంతో నిబ్బరాన్ని కోల్పో లేదు. బెదిరి పోలేదు. ఈనాడు, ఉదయం, ఆంధ్ర భూమి, సాక్షిలలో సంపాదకునిగా బాధ్యతలు ... మధ్యలో అవి వదులుకున్న సంధి కాలంలో సొంత పత్రిక పేరుతో చేతులు కాల్చకోవడం ... పచ్చళ్ళు, ఆయుర్వేద మందులు అమ్ముకోవడం, వైద్యం ... ఏవీ ఆయన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయ లేదు. ఆ యోగ పతంజలి యిక లేరు అనే నిజాన్ని జీర్ణించుకో లేక, యీ కొద్ది పాటి మాటలూ ... మొలకెత్తిన మైత్రీ బంధం పతంజలితో నా తొలి పరిచయం చిత్రంగా జరిగిందనే చెప్పాలి. ఆ రోజులూ, అప్పటి ఉద్వేగాలూ, దుందుడుకుతనాలూ వేరు. పతంజలి, ఆయన తమ్ముడు కలిసి, విజయ నగరంలో ఓ గదిలో ఉండి, మహా రాజా వారి కళాశాలలో చదివే వారు. పతంజలి డిగ్రీ మొదటి సంవత్సరం. అదే రోజుల్లో, అంటే, డెబ్భయ్యవ దశకం తొలి రోజులలో, నేను అక్కడే, మహా రాజా ప్రాచ్య కశాశాలలో భాషా ప్రవీణ చదివే వాడిని. కథా రచయితలుగానే తప్ప , పతంజలితో నాకు అప్పటికి ముఖ పరిచయం లేదు. పతంజలి మహా దూకుడుగా ఉండే వాడు. మా వూరి వాడే, ఓ అబ్బాయి, నా గురించి పతంజలితో చెడ్డగా చెప్పాడు. నాకు రచయితనని పొగరనీ, ఎవరితోనూ మాట్లాడననీ... యిలా ఏవో చెప్పాడు. దాంతో పతంజలి ‘‘ అలాగా ! ఆ పొగరేదో అణిచేస్తాను ... నా దెబ్బ రుచి చూపిస్తాను ...’’ లాంటి శపథాలేవో చేసాడుట. తీరా, సాయంత్రం అలాంటి ఉద్దేశంతో నన్ను ప్యారిస్ కార్నర్ దగ్గర కలిసేడు. కలిసేక సీను మారి పోయింది ! విజయనగరం కోట దగ్గర, బొంకుల దిబ్బ సమీపంలో,రోజూ సాయంత్రాల వేళ. ఊళ్ళోని రచయితలూ, కవులూ గుంపులుగా చేరి, కాళ్ళు పీకేలా , నిలబడి - సాహిత్య చర్చల్లాంటివి చేసే స్థలానికే ముద్దు పేరు ‘ ప్యారిస్ కార్నర్’ ! అక్కడ తొలి సారిగా కలిసేం - నేనూ, పతంజలీ. కాస్సేపు నన్ను దెబ్బ తీసే కార్యక్రమాన్ని వాయిదా వేసి, నా అభిరుచులూ, అభిమాన రచయితలూ, రచనలూ గట్రా యింటర్వ్యూ చేస్తున్నట్టుగా ఏవేవో అడిగేడు. నేను భయ పడుతూనే .వాబులు చెప్పేను. ఎంతయినా అతను రాజా కాలేజీ స్టూడెంటూ, నేను ప్రాచ్య కళాశాల విద్యార్ధినీ కదా ! అంతే ! పతంజలి నన్ను వాటేసుకుని, ‘ మిమ్మల్ని దెబ్బతీయాలనే వచ్చేను. కానీ యిక నుండీ మనం నేస్తాలం ... ఏం . ’’ అనడిగేడు. మొన్న ఆగష్టు నెలలో కలిసినప్పుడు ఆ ముచ్చట్లు చెప్పుకుని యిద్దరమూ ఎంత నవ్వుకున్నామో ! అలమండ రాజు గారి అబ్బాయి ఆ వయసులోనే అందించిన స్నేహానుభవం - నిత్య హరితమై ఏళ్ళు గడుస్తున్నా, మధురంగా మనసులో మెదులుతూనే ఉంది. మా రహస్య అజెండా మా స్నేహం, కలిసేక విజయనగరంలో ఉన్నన్ని రోజుల్లోనూ వొకరిని విడిచి వొకరం ఉండ లేదు. అప్పుడప్పుడు మాతో కవి సీర పాణీ, రచయిత దాట్ల నారాయణ మూర్తి రాజూ వొచ్చి కలిసే వారు. రోజూ నియమం తప్పకుండా మహా రచయిత చాసో గారిని కలవడానికి పోయే వాళ్ళం.చిన్ని పల్లి వారి వీధిలో చాగంటి వారి హవేలీ లోనో, కస్పా బజారులోనో కలిసే వాళ్ళం.ఆయన వెంట మహా శ్రద్ధా భక్తులతో వ్యాస నారాయణ మెట్ట వరకూ వెళ్ళే వాళ్ళం. ఆ కథా శిల్పి ఎన్ని గొప్ప విషయాలు చెప్పే వారో ! నోట్లో చుట్ట ఎర్రగా కాలుస్తూ, చురుకయిన చూపులతో , మా వేపే చూస్తూ సాహితీ ప్రసంగం చేస్తున్నట్టుగా ఉండేది వారి ధోరణి. మా కథలు ఆయనకిచ్చి అభిప్రాయం అడిగే వాళ్ళం. అంత పెద్దాయనా, ఏ మాత్రం విసుక్కోకుండా, మా కథల్లో మంచి చెడ్డలు విపులంగా చర్చించే వారు. మంచేఁవిటి ! నా ముఖం ! ... మా కథల్లో లోపాలు ఎత్తి చూపిస్తూ ఎండ గట్టే వారు. ఉడుక్కునే వాళ్ళం. ‘‘ ఈ ముసిలాయనతో మనం పడలేం బ్రదరూ ! ... అంచేత మన కథలింక ఈయనకి చూపించొద్దు ...ఎప్పటికయినా చాసో రాసిందానికన్నా గొప్ప కథ రాసి చూపిస్తాను ... ’’ అనే వాడు. అంత లోనే , గొంతు తగ్గించి, ‘‘ అబ్బే, అది వీలయ్యే పని కాదు . ఆ స్థాయిని మనం జీవిత కాలంలో అందుకో లేం . .. పోనీ ...ఆయన తన చుట్ట నోటొతో ఒక్క సారయినా , ‘ బాగుందయ్యా ! ’ అనే అనే కథ రాయాలి ... అందాక ... రోజుకో కథయినా చదవమని మన చుట్టల తాత గారిని కందిరీగల్లా కుడదాం ... ఏం . ’’ అని మా మధ్య ఓ రహస్య ఒప్పందం ఖరారు చేసాడు. ఆ తర్వాత, నా సంగతి అటుంచండి కానీ ... మా పతంజలి మాత్రం చా.సోనీ, అలాంటి ప్రసిద్ధ రచయితలనీ మెప్పించే రచనలు అనేకం చేసాడు. చా.సో గురించీ , అతని కథల గొప్పదనం గురించీ ఎంత విశ్లేషిస్తూ చెప్పే వాడో ! ఆ కథా శిల్పి చెక్కిన అపురూప కథకుడు - ఆ మధ్య చా.సో స్ఫూర్తి అవార్డుని సొంతం చేసుకున్నాడు ... అదీ పతంజలి ! పూర్వీకుని పరిచయం పతంజలితో సాగిన నా స్నేహ ప్రస్థానంలో మరో అబ్బుర పరిచే ముచ్చట. ఆయన విశాఖలో ఈనాడులో పని చేసే రోజులలో తరుచుగా కలిసే వాడిని. ‘ రాజుగోరు’ రాసిందప్పుడే. విజయ వాడలో ఉండేటప్పుడు ఓ సారి ఆఫీసులో కలిసాను. ఎప్పటిలాగే ఆత్మీయంగా పలకరించేడు. ఎన్నో కబుర్లు కలబోసుకున్నాం. ఆ రోజు నాకు ఆయన యింట్లోనే ఆతిధ్యం. ‘‘ మా యింటికి రండి... మా పూర్వీకుడ్ని ఒకరిని పరిచయం చేస్తాను ...’’ అని తీసికెళ్ళాడు. ఏ శతాధిక ముది వగ్గో అనుకున్నాను. చిత్రం ! అయన చూపించింది ఓ కోతిని. బజార్లో కోతులాడించే మనిషి దగ్గర కొని పెంచుతున్నాడుట ! ఆ చమత్కారం అతనికే చెల్లింది ! చేపల్ని పెంచిన పతంజలీ, పిట్టల్ని పెంచిన పతంజలీ చాలా మందికి తెలిసుండ వచ్చు. కోతుల్ని పెంచిన పతంజలి తెలీక పోవచ్చు. కదూ? అమ్మ దొంగా ! ఆ తర్వాత ఫోన్లూ, అప్పటప్పట ఉత్తరాలూ తప్ప మేం కలుసుకున్న సందర్భాలు తక్కువే. కథా, నవలా సాహిత్యంలో మా పతంజలి విరాడ్రూపాన్ని చూసి, మురిసి పోతూనూ ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు చెప్మా కలుసుకున్నాం ? ఆఁ! ... ఓ సారి విశాఖ పట్నంలో కలిసేం. నేను మా సాలూరు ( నేను ఉద్యోగ రీత్యా ఉండే వూరు) వెళ్ళడానికని బయలు దేరాను. దార్లో ఓ పుస్తకాల షాపులో దూరేను. పుస్తకాలు చూస్తున్నాను. వెనక నుండి బలమైన ఓ రెండు చేతులు నన్ను బలంగా వాటేసుకుని , ఉక్కిరి బిక్కి రి చేసాయి. చూద్దును కదా ... మా పతంజలి ! ‘‘ రాత్రికి ఉండి పోండి ... మన చిన్నప్పటి కబుర్లతో రాత్రిని కరిగిద్దాం ... ఏం ? ...’’ అనడిగేడు. అక్కడే, అమ్మకానికి ఉంచిన పుస్తకాలలోనుండి తనపుస్తకాన్ని ఒక దానిని తీసి, దాని మీద ‘ నాకెంతో ప్రియమైన మా పంతుల జోగారావు గారికి’ అని రాసి నాకిచ్చేడు.తీయని గుర్తుగా అది నా దగ్గరింకా పదిలమే. ‘పతంజలి భాష్యం’ దాని పేరు. ఆ రాత్రి ఎన్ని విశ్వ సాహివత్య వీధుల్లో పచార్లు చేయించేడో! ఆ విషయ సంపదకీ, సాధికారతకీ చకితుడినయి పోయేను. దగ్గర్లోనే ఉండి ఒక్క సారి కూడా కలవ లేదని నిష్ఠరమాడేడు. ‘ ఇప్పుడయినా, దొంగ ని పట్టుకున్నాను కనుక సరి పోయింది! సరే ... ఇక్కడ ఓ పత్రిక పెట్టాను ... తెలుసా ? ...’’ అనడిగేడు. ‘‘ తెలీదు.’’ అన్నాను నిజాయితీగా. ‘‘సరే లెండి! ... దాని గురించి నాకే తెలీదు ! ’’ అని నవ్వేసాడు. ఆ హాస్య ప్రియత్వమే అతని పుస్తకాలనిండా వెన్నెలలా పరుచుకుని ఉంది మరి ! ఆ సౌజన్యం అపురూపం పతంజలిని కలిసింది నా ‘ అపురూపం’ కథల సంపుటి ఆవిష్కరణ సభలోనే. నాకుగా నేను కోరక పోయినా , నా ప్రచురణ కర్త మాట మేరకు, నామీద గల అభిమానంతో నా పుస్తకానికి ముందు మాట రాయడమే కాక, ఆ రోజు సభకి వచ్చి పలకరించి వెళ్ళాడు నా గురించి అతను రాసిన నాలుగు ముక్కలూ ఎప్పటికీ నాకు నా కథలకంటే కూడా ప్రీతి పాత్రం. అవీ, యివీ ... మరి కొన్ని ... దు:ఖోద్వేగంలో గుర్తుకు రావడం లేదు... గుర్తున్నంత వరకూ మరి కొన్ని ... చదువుకునే రోజులలో అలమండ నుండి వచ్చే కేరియర్లలోంచి వంటకాలను బలవంతంగా రుచి చూపించడం ... ‘దిక్కుమాలిన కాలేజీ’ కథ రాసి, తను చదువుకునే కాలేజీ రాజకీయాలను ఎండ గట్టి కూడా ... ధైర్యంగా బోర విరుచుకుని నడవడం, నవ్వడం ...చతురలో నవలకి వెయ్యి రూసాయలొస్తున్నాయని ఎడాపెడా అప్పులు చేస్తున్నానని చెప్పడమూ ... కడసారి కలిసింది మొన్న ఆగష్టు పన్నెండవ తేదీన చివరి సారిగా పతంజలిని కలిసేను. అతని ఆరోగ్యం గురించి నేనూ అడగ లేదు... పతంజలీ చెప్ప లేదు ... కబుర్లు కలబోసుకున్నాం. విజయ నగరం కబుర్లు ... పతంజలికి అలమండ అన్నా, విజయ నగరం అన్నా అవధుల్లేని అభిమానం ! అక్కడి మిత్రులు ఎవరు పలకరించినా పులుకరించి పోతాడు. అప్పుడెప్పుడో వో సారి కలిసినప్పుడు విజయ నగరం గురించి చెబుతూ అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి ... ‘‘ ఆ ఊరి కోట, కందకం,కస్పా బజారు, బొంకుల దిబ్బ,మూడు మూడు లాంతర్లు, మూడు కోవెళ్ళు, మచ్చ కొండ, గంట స్థంబం, పెద్ద చెరువు ... చివరికి పెద్ద చెరువులో దోమలు కూడా నాకు మంచి నేస్తాలే ! ... ఎందుకంటే ...రాత్రి పూట నన్ను తెగ కుట్టి మేలుకుని ఉండేలా చేసి, కథలూ గట్రా రాసుకునేలా ప్రోత్సహించినవి , పాపం, అవే కదా ! ...’’ మరింక రాయ లేను ...  రక్తం ఉత్సాహంతో ఉరకలేసే వయసులో నన్ను దెబ్బ తీయాలని వచ్చి స్నేహ లతలా అల్లుకు పోయేడు - మా పతంజలి ! ... ప్రసార మాధ్యమాలలో పతంజలి ఇక లేరని విని , చూసి , అవాక్కయాను. అయ్యో మిత్రమా ! ఇప్పుడీ వయసులో ఎంత కోలుకో లేని దెబ్బ తీసావయ్యా ....
  పతంజలి రచనలు
 ఖాకీ వనం
 పెంపుడు జంతువులు
రాజు గోరు
 వీర బొబ్బిలి
 గోపాత్రుడు
 పిలక తిరుగుడు పువ్వు
 అప్పన్న సర్దార్
 ఒక దెయ్యం ఆత్మ కథ
 నువ్వే కాదు
 వేట కథలు
 రాజులు లోగిళ్ళు,
 చూపున్న పాట,
 పతంజలి భాష్యం,
 దిక్కు మాలిన కాలేజీ కథల సంపుటి ...
 డా. కె.వి.నరసింహా రావు వీరి ఖాకీ వనం నవలని హిందీ లోకి అనువదించేరు. రాజకీయ,పోలీస్, న్యాయ, పత్రికా వ్యవస్థల మీద కొరడా ఝళిపిస్తూ శక్తి వంతంగా తెలుగులో రాసిన ఒకే ఒక్క రచయిత పతంజలి గారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి