8, మార్చి 2015, ఆదివారం

పోదూ, నీకంత సీన్ లేదు !

‘‘ తాడిని తన్నే వాడు ఒకడుంటే, వాడి తల తన్నే వాడు వేరొకడు ఉంటాడు’’ అనే సామెత తెలిసినదే కదా !

అందుచేత, ఏదో సాధించేసాం అను కోవడం , విర్రవీగి పోవడం సరికాదు. ఎంత ఎదిగినా , కొంత ఒదిగి ఉండడం మంచిది. లేక పోతే ఎవడో ఒకడు ఎప్పుడో ఒకప్పుడు ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అని దులపరించి పారేసే ప్రమాదం ఉంది.

ఈ చాటు పద్యాలు నాలుగూ చూడండి:


ఱంతుల్ మానుము కుక్కుటాధమ ! దరిద్ర క్షుద్ర శూద్రాంగణ
ప్రాంతో టాఖల మూల తండుల కణ గ్రాసంబు చే గ్రొవ్వి దు
దర్దాంతాభీల విశేష భీషణ ఫణాంతర్మాంసన సంతోషిత
స్వాంతుండైన ఖగేంద్రుని కట్టెదుట నీ జంఝాటముల్ సాగునే ?

ఈ పద్యం పెద్దన గారిదిగా ప్రసిద్ధం. కాగా, ఈ పద్యం శ్రీనాథునిదిగా కూచిమంచి తిమ్మకవి తన లక్షణసారసంగ్రహంలో పేర్కొన్నాడు.

ఓ అధమ కుక్కుటమా ! నీ తైతక్కలు ఇక చాల్లే ...దరిద్రగొట్టు తావుల్లో, చెత్తల్లో, పెంట కుప్పల్లో ఎంగిలి మెతుకులు ఏరుకుని తింటూ బలిసిన నువ్వెక్కడ ? కేవలం భీకరమయిన సర్పాల పడగలోని మాంసాన్ని తిని తృప్తి పడే ఖగరాజు ఎదుట నీ మిడిసిపాటు చెల్లదులే !


మరో పద్యం చూడండి:


స్థాన విశేషమాత్రమున తామరపాకున నీటి బొట్ట ! నిన్
బూనిక మౌక్తికంబనుచుఁ బోల్చిన మాత్రనె యింత గర్వమా !
మానవతీ శిరోమణుల మాలికలయందును గూర్ప వత్తువో ?
కానుకలియ్య వత్తువో, వికాసము నిత్తువొ , విల్వ దెత్తువో ?!

ఈ పద్యం ముక్కు తిమ్మన గారిదని చెబుతారు.

స్థాన విశేష మాత్రం చేత మాత్రమే కొందరకి, లేదా కొన్నింటికి గొప్పతనం చేకూరుతూ ఉంటుంది. తామరపాకు మీద నీటి బొట్టు ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. అంత మాత్రం చేత అది మంచి ముత్యం ఎన్నటికీ కానేరదు కదా !
కవి అదే చెబుతున్నాడు : ఓ తామరపాకు మీద నీటి బొట్టూ ! నువ్వు తామరపాకు మీద నిలచి ఉండడం చేత నిన్ను ముత్యంతో పోలుస్తూ ఉంటారు. అది స్థానవిశేషం వల్ల వచ్చిన గొప్పతనం. అంత మాత్రం చేత నీకు ఇంత గర్వం తగదు సుమా ! నువ్వేమయినా లలనల శిరోరత్నాలలో కూర్చడానికి పనికి వస్తావా ? ఎవరికయినా కానుకగా ఇవ్వడానికి తగుదువా ? నీకు వికాసమూ లేదు, విలువా లేదు!

అంతే కదా, నీటి బొట్టు తామరపాకు మీద ఉన్నంత సేపే ముత్యంలా మెరిసి పోతూ ఉంటుంది. స్థానభ్రంశం చెందిందా, యిక దాని పని అంతే. వొట్టి నీటి బొట్టే. కదా.

మరో పద్యం చూడండి:



తక్కక నేల ముట్టెగొని త్రవ్వగ నేర్తునటంచుఁదాకుతా
వొక్కటి జాతియందు మదమెక్కకు బుద్ధిని వెఱ్ఱిపంది ! నీ
వెక్కడ ! యాది ఘోణియన నెక్కడ ! యద్రి సముద్రదుర్గ భూ
ర్భాక్కు తలంబు నొక్క యరపంటినె మింటికినెత్త నేర్తువే ? !

ఓ వెఱ్ఱి వరాహమా ! నేలను ముట్టెతో త్రవ్వడంలో నాకు నేనే సాటి అంటూ గొప్పలు పోతూ గర్విస్తున్నావు.
నువ్వెక్కడ ? ఆదివరాహ మెక్కడ ? సముద్ర గర్భంలోని భూమిని ఒక కోరతో అవలీలగా ఆ తొలి కిటి మీదికి ఎత్తలేదూ ! ఆ ఆది వరాహం ముందు నువ్వెక్కడ, నీ ప్రతాపమెక్కడ !


ఈ పద్యం భట్టు మూర్తిదిగా చెబుతారు.

తమకు లేని పోని గొప్ప తనాన్ని ఆపాదించు కుంటూ. అహంకరించే అల్పులను అభిశంసిస్తూ కవులు చెప్పిన పద్యాలు చూసాం కదా.

సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని నిలదీస్తూ శ్రీనాథ కవి చెప్పిన ఒక చాటువు కూడా చూదాం. గమనిక: ఇక్కడ అల్పత్వమూ లేదు. అభిశంసనా లేదు. చమత్కారంగా కవి పరమ శివుని ‘‘ నీకంత సీన్ లేదులే ! ’’ అంటున్నాడు. అంతే.


గరళము మ్రింగితి ననుచున్
పురహర ! గర్వింప బోకు, పో,పో,పో ! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెతుకులు తినుమీ !

ఆ నాడు దేవాసురులు సముద్ర మధనం చేసేటప్పుడు ఉద్భవించిన విషాన్ని పరమశివుడు స్వీకరించాడు. లోకోపద్రవం నివారించాడు. అందుకే నీలకంఠుడిగా నామాంతరం పొందాడు.

ఓ పురహరా ! విషాన్ని మ్రింగాను కదా అని గర్విస్తున్నావు. చాలు . చాల్లే ! రేనాటి జొన్న మెతుకులు తిని చూడు నీ గొప్పతనమేమిటో తెలిసి వస్తుంది ! అని దీని భావం. రేనాటి జొన్న కూడు నోట పెట్టరానిదిగా ఉంటుందని కవి చమత్కారం.

ఇలాంటిదే శ్రీనాథుని మరో చాటువు చూడండి:


ఫుల్ల సరోజ నేత్ర ! యల పూతన చన్నుల చేదుద్రావి, నా
డల్ల, దవాగ్ని మ్రింగితి నటంచును నిక్కెద వేల ? తింత్రిణీ
పల్లవ యుక్తమౌ నుడుకు బచ్చలి శాకము జొన్న కూటితో
మెల్లన నొక్క ముద్ద దిగ మ్రింగుము నీ పస కాననయ్యెడిన్ !

ఇది పలనాటి జొన్న కూడు గురించినది. కృష్ణా ! ఆనాడు రక్కసి పూతన విషపు చనుబ్రాలు త్రాగాననీ, అల్లప్పుడు విషాన్ని మ్రింగాననీ, గొప్పలు పోతున్నావు. చింతాకుతో కూడిన ఉడుకు బచ్చలి కూరను జొన్న కూటితో ఒక ముద్ద నోటిలో పెట్టుకో ! నీపస ఏమిటో తెలిసి పోతుంది.

ఇదీ, నీకంత సీన్ లేదు ! అని కుండ బద్దలు కొట్టిన పద్యాల కథ .





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి