6, మార్చి 2015, శుక్రవారం

కోప మేల నోయీ !


ఉత్తమే క్షణకోప స్స్యాత్, మధ్యమే ఘటికాద్వయం
అధమే స్యా దహోరాత్రం, పాపిష్ఠే మరణాంతకమ్

ఈ శ్లోకంలో కవి కోపం గురించి చెబుతున్నాడు.కోపం అంటూ వచ్చేక, ఎవరెవరిలో ఆ కోపం ఎంత సేపు ఉంటుందో నిర్ధారిస్తున్నాడు.
ఎలాంటి వారికయినా, ఎప్పుడో ఒకప్పుడు కోపం రాకుండా పోదు. కానీ. ఉత్తములైన వారిలో ఆ కోపం కొంచెం సేపు మాత్రమే ఉండి తగ్గి పోతుంది. వారిలో ఆ కోపం క్షణం సేపు కన్నా ఎక్కువ సేపు ఉండదు.
అదే మథ్యములలో అయితే కోపం రెండు ఘడియల సేపు ఉండవచ్చును.
అధమ ప్రకృతి గల మనుషులలో, అంటే , నీచులలో వచ్చిన కోపం మొత్తం ఒక రోజంతాఉండవచ్చును.
దీని వల్ల ఎంత కోపం వచ్చినా, ఎంతో కొంత సేపటికి తగ్గి పోక తప్పదని తెలుస్తోంది.
కానీ ఓ రకం వాళ్ళలో మాత్రం కోపం వస్తే , బతికి ఉన్నంత కాలం ఆ కోపం పోదు. వాళ్ళు ఆ కోపాన్ని, కోపకారణాన్ని జీవితాంతం మనసులో పెట్టుకుంటారు.
వాళ్ళనే పాపిష్ఠి వాళ్ళు అని చెప్పాలి. వారిది ఆసురీతత్త్వం. అంటే రాక్షస ప్రకృతి అన్న మాట.
కోపం వేగంగా తగ్గి పోవాలన్నా, కోపం వల్ల వేరే దుష్ఫలితాలు కలగకుండా ఉండాలన్నా, మన వాళ్ళు ఒక చిట్కా చెప్పనే చెప్పారు కదా.
కోపం వచ్చి నప్పుడు పది వరకూ అంకెలు లెక్క పెట్టమన్నారు. అప్పటికి వచ్చిన కోపం తగ్గి పోతుంది.
ఒక వేళ తగ్గ లేదనుకోండి, కొంచెం డోసు పెంచండి. మరో పదో, ఇరవయ్యో అంకెలు ఎక్కువ లెక్క పెట్టండి అప్పటికీ తగ్గక పోతే, ఏనిమల్ డోసు వాడి చూడండి. ఇంకా ఈ చిట్కా పని చేయ లేదనుకోండి . మీ యిష్టం చ్చినంతగా కోపాన్ని ప్రదర్శించండి. అరచి అరచి అలసి సోయి మీరే శాంతిస్తారు.
గురజాడ వారి కన్యా శుల్కంలో కోపిష్ఠి పాత్రలు చాలానే ఉన్నాయి. ధామ్ ధూమ్ లాడుతూనే ఉంటాయి.
గురువు గిరీశాన్ని వెంట బెట్టుకుని కృష్ణారాయపురం అగ్రహారం వొచ్చిన కొడుకు వెంకటేశాన్ని‘ వెధవాయీ, ఈ మారైనా పాసయినావా ?’ అని ప్రేమతో కసురుతూ అడిగిన అగ్నిహోత్రావధాన్లు గిరీశాన్ని చూసి, ‘ యా తుర కెవడోయ్’ అని నిలదీస్తాడు. గిరీశం పట్నం డాబు వొలకబోస్తూ, ‘ టర్క్ ! డామిట్ ! , టెల్ మాన్ ’
అన్నాడో, లేదో, అగ్నిహోత్రావధాన్లు అగ్గిరాఁవుడై పోయాడు.
‘ మానా? మానులా వుంచా నంచావూ? గూబ్బగల గొడతాను ’ అని గయ్యిమంటాడు.
సుబ్బిని లుబ్ధావధాన్లుకి యిచ్చి కన్యా శుల్కం పద్దెనిమిది వందలు తీసుకుని పెళ్ళి మాటలు నిర్ణయమైపోయిన సంగతి విని , భార్య వెంకమ్మ అదే గనుక జరిగితే నూతిలో పడి ఛస్తానని గగ్గోలు పెడుతుంది. చెల్లి బాధ చూడ లేక కరటక శాస్త్రి బావ గారితో ఏదో నచ్చ చెప్ప బోతే, దాంతో మళ్ళీ మన అగ్గి రాముడికి చిర్రెత్తు కొచ్చి, ’ వీళ్ళమ్మా శిఖ తరగా, ప్రతీ గాడిద కొడుకూతిండి పోతుల్లాగా నాయింట చేరి నన్ననే వాళ్ళే.తాంబోలం యిచ్చేసాను తన్నుకు ఛావండి ’ అని ఇంతెత్తు ఎగురుతాడు
కోపం ఎప్పుడూ మంచిది కాదు.
తన కోపమె తన శత్రువు ,తన శాంతమె తనకు రక్ష అనే హిత వాక్యం ఎప్పుడూ మరచిపో కూడదు. భారతం కూడా, కోపము తపముంజెఱచును ... అని చెబుతోంది.
కోపం పేరు చెబుతే గుర్తొచ్చే మొదటి ముని దుర్వాస మహా ముని. తపశ్శక్తిని ఎప్పుడూ కోపతాపాలతో ధారపోస్తూ ఉండడమే. ఆ ముని కోపం వల్లనే కదా అభిఙ్ఞాన శాకున్తలమ్ నాటకం కీలకమైన మలుపు తిరుగుతంది.
కోపానికి పరాకాష్ఠ పరమ శివుని మూడో కన్ను. శివ కోపానలానికి మదనుడు దగ్ధమై పోయాడు. అనంగుడైనాడు.
కీచకవథ ఘట్టంలో ద్రౌపదికి విరటుని కొలువులో కీచకుని వలన జరిగిన అవమానానికి రగిలి పోయి భీమ సేనుడు కోపంతో ఊగి పోయాడు. ప్రక్కనే ఉన్న మహా వృక్షాన్ని పెకిలించి వేసి, కీచకుడిని అంతం చేయాలని ఉద్రేక పడి పోయాడు. కానీ, అప్పడు పాండవులు అఙ్ఞాత వాసంలో ఉండడం చేత, దానికి భంగకరం కాకుండా, ‘‘ వలలుండెక్కడ సూచె ... ’’ అంటూ నర్మ గర్భమైన వాక్యాలతో ధర్మజుడు వారించ బట్టి, సరి పోయింది.
లోకంలో మనుషులు కోపాన్ని ప్రదర్శించడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తారు. రకరకాల హావ భావాలుప్రదర్శిస్తారు.  కొందరు పళ్ళు నూరుతారు. కొందరు ముఖం చిట్లించు కుంటారు.
మరి కొందరేమో ధుమ ధుమలాడుతారు.కొందరు చెవులు చిల్లులు పడేలా అరుస్తారు. కోపంతో ఊగి పోతారు. వేరొక కొందరు మూతి ముడుచుకుని మాట్లాడకుండా హఠం చేస్తారు. పెళ్ళా మీద కోపం వచ్చిన మగాళ్ళు లోగడ తింటున్న అన్నం కంచం పెళ్ళాం నెత్తిని బోర్లించి సమ్మానించే వారు. ఆడాళ్ళకి కోపం వస్తే చీపురు తిరగేస్తారు. వంట గదిలో గిన్నెలని ధణ ధణా నేల కేసి కొడుతూ ఉంటారు.పిల్లలకి కోపం వస్తే భోరున ఇల్లెగిరి పోయేలా ఏడుస్తారు.టీచర్లకి  కోపం వస్తే తొడ సాయసాలు పెడతారు. బెత్తాంతో భజంత్రీలు వాయిస్తారు ( ఈ రోజుల్లో మీద చెప్పిన పద్ధతుల్లో కోపాన్ని ప్రదర్శించే వీలు అంతగా లేదను కోండి ...చట్టాలు ఊరు కోవు. కో్పంతో రెచ్చి పోయి,  మన తాట తీస్తాయి మరి ! )
కోపంతో తమను తాము హింసించుకుని, నిరశన చూపే వాళ్ళు కొందరయితే, ఎదుటి వాడిని మాటలతోనూ, చేతలతోనూ హింసించి బాధించే వాళ్ళు కొందరు. ఈ రెండు విభాగాల్లోనూ కూడా హింస ప్రథాన పాత్ర పోషిస్తోందని మనం గ్రహించాలి.
పోలీసు వాడి కోపం లాఠీ కర్రలో పరివర్తనం చెందుతుంది. మేష్టరి కోపం బెత్తంతో చిందులేస్తుంది. పెళ్ళాల కోపం కూరలో ఉప్పెక్కు వెయ్యడంతో ఉపశమనం పొందుతుంది. ఆఫీసరు కోపం ఇంక్రిమెంటు కట్ చెయ్యడంతో నిమ్మళిస్తుంది.  రాజకీయ నాయకుడి కోపం వ్యతిరేకులని జైళ్ళపాలు చెయ్యడంలో శాంతిస్తుంది.  సామాన్యుడి కోపం ఐదేళ్ళ నిరీక్షణ తరువాత ఓటు రూపంలో వ్యక్తమవుతుంది. కాంగ్రెసు వాళ్ళ మీద కోపం జనాలు మొన్న దేశ వ్యాప్తంగా అలాగే తీర్చు కున్నారు కదా !
కోపంతో భాష మరి పోతుంది. బూతులు ప్రవహిస్తాయి. మన చంద్ర బాబుకి కోపం వస్తే ‘‘ ఏం మాట్లాడు తున్నావ్ ? పిచ్చ పిచ్చగా ఉందా ?!’’ అని ఆరా తీస్తాడు.
జగనన్నకి కోపం వచ్చినా, రాక పోయినా చంద్ర బాబుని దించీసి కుర్చీలో తనని కూచో పెట్ట మంటాడు. అప్పుడు చూపిస్తాను నా తడాఖా అంటూ రంకెలేస్తాడు. మన కమ్యూనిష్టులకి కోపం రాని దంటూ ఎప్పుడూ ఉండదు. కోపంతో చారిత్రక తప్పిదాలు చెయ్యడం వారి కొక హాబీ.
కోపం గురిచి ఇంకా చెప్పడానికి చాలానే ఉన్నా, మరీ ఎక్కువగా చెప్తే మీకు విసుగు కలిగి, కోపం వస్తుందేమో. మరి ముగిస్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి