15, మే 2015, శుక్రవారం

అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ !



ఇదేమయినా బావుందా , చెప్పండి ..‘కట్నం తీసుకునే వాడు  గాడిద ’ అని ఓ టీ.వీ ఛానెల్ అడపా దడపా హెచ్చరించడం మా గాడిదల దృష్టికి వచ్చింది. మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

ఏ గాడిదయినా నవ్వి పోతుంది. గాడిదలు కట్నం తీసు కోవడమేమిటి ! గాడిదలు కట్నం తీసుకున్న వైనం ఎక్కడయినా చరిత్రలో విన్నామా ? కన్నామా ? మరి కట్నం తీసుకునే వాడిని మాతో పోలిక తేవమేఁవిటి ? చోద్యం కాక పోతేనూ ! మధ్యలో మా వూసెందుకూ ఎత్తడం మేఁవంటే చులకన కాక పోతేనూ ? వెనుకటి కొక తండ్రి కూడా ఆడిన మాటను తప్పిన కొడుకుని గాడిదా ! అని తిట్టడం, వీడా కొడుకని గాడిద ఏడవటం జరిగింది. ఇలా ప్రతీ వాళ్ళకీ అలుసై పోవడం మాకు చాలా కష్టంగా ఉంది.

అందుకే త్వరలో జరగబోయే మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలో ఈ దారుణాన్ని నిరసిస్తూ ఓ తీర్మానం పెట్టబోతున్నాం. మానవ హక్కుల వారి దృష్టికి ఈ విషయం తీసికెళతాం. హన్నా ! గాడిద లంటే అంత చులకనా ; అంటే కొంత చులకన ఉండొచ్చని అర్ధం కాదు. గానానికి మేఁవూ, అందానికి లొటిపిటనూ చెప్పు కోవాలని మా మధురవాణి అక్కయ్య చెప్ప లేదూ ...ఏఁవిటీ ... వెక్కిరింతగా చెప్పిందంటారా ? ఎలా చెప్పిందని కాదు ... చెప్పిందా లేదా ? అంటే లోకంలో మా అందం గురించి ఎంతో కొంత చర్చ ఉండడం బట్టే కదా ? నిజానిజాలు పైవాడి కెరుక. చూసే అందం చూసే వాడి కళ్ళలో ఉంటుంది. గాడిద పిల్ల గాడిదకి ముద్దు. అలాగే గాడిదల అందం గాడిదలకే సొంతం. మా వినయ గుణమే మాకు అందం. గుర్రాన్నీ గాడిదనూ ఒక తాట కట్టొద్దని చెప్పడం గురించి అంటారూ ? దాని గురించి కూడా మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. గుర్రాల దేం అందం లెద్దురూ . గాడిద గుడ్డు అందం. అదిగో... ఈ ధూర్త మానవుల మాటలు చెవిని పడి పడీ మాకూ అనుకోకుండా అవే మాటలు వచ్చేస్తున్నాయి కదూ ? గాడిద గుడ్డేఁవిటి ? గాడిద గుడ్డు.

గాడ్ ద గుడ్ అనే దానికి వచ్చిన పాట్లు అవి. ఈ మాటని కూడా లోక వ్యవహారం లోనుండి తరిమేసేలా మా అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభ చర్యలు తీసుకుంటుంది.

గంగి గోవు పాలు గరిటడైనా చాలుట. కడివెడైనా ఖరము పాలు శుద్ధ దండగ అంటాడు ప్రజాకవి, గోవు మా లచ్చిమి అంటే మాకూ గౌరవమే కానీ మా పాల గురించి అలా అనడం ఏమన్నా బాగుందా చెప్పండి ? ఏమీ, మా బిడ్డలు మా పాలు తాగి ఏపుగా పెరగడం లేదా ? మమ్ములనూ, , మా పాలనూ హేళన చేస్తూ మా మనోభావాలను కించ పరచడం బాగుందా ?

వసుదేవుడంతటి వాడు మా జాతివాని కాళ్ళు పట్టు కొన్నాడే ! తెలుగు సంవత్సరాలలో ఖరనామ వంవత్సరంగా అజరామరంగా నిలిచేమే ? ఒక దేవజాతి ముఖాకృతిగా కలవారమే ! అట్టి మాకా ఈ దుర్గతి ... మా పట్లనా ఇంత చులకన భావం. ?

అధికారికి ముందూ, గాడిదకు వెనుకా ఉండ కూడదంటారు. అలా వాటంగా వెనక్కాళ్ళు రెండూ ఒకేసారి ఎత్తి తన్నగల మరో ప్రాణి లోకంలో ఉందా చెప్పండి ? అదీ మా ఘనత ! దానిని గుర్తించ రేమీ ?

మాలో కంచర గాడిదలూ, అడ్డ గాడిదలూ ఉన్నాయంటారు, సార్ధవాహుల సామాన్లు మోసే కంచర గాడిదల ఉన్నాయి కానీ నిజానికి అడ్డ గాడిదలంటూ మాలో వేరే జాతి గాడిదలంటూ ఏవీ లేవు. అట్టివి నరజాతిలో ఉన్నట్టు వినికిడి.

ఎందుకంటే, వెనుకటికి ఓ కవి సభలో ఓ సమస్యను పూరిస్తూ, ‘‘ కొందరు భైరవాశ్వములు ... అంటూ చెబుతూ .. కొందరు కృష్ణ జన్మమున కూసిన వారలు అని మమ్మల్ని కూడా పేర్కొన్నాడు. అంచేత నరజాతిలో అడ్డగాడిదలు ఉన్నట్టు రూఢి అయినట్టే కదా !

మునిమాణిక్యం నరసింహారావు గారు బడి పంతులు. ఓ రోజు పిల్లల కాంపోజిన్ పుస్తకాల కట్ట  చంకన పెట్టుకుని వస్తున్నారు. ఓ కొంటె విద్యార్ధి  వారిని అల్లరి పెడదామని, ‘‘ఏఁవిటి మాష్టారూ ? గాడిద బరువు మోస్తున్నారూ ?’’ అన అడిగేడు. దానికాయన వాడి మాడు పగిలేలా జవాబిచ్చేరు. ‘‘  అవున్నాయనా ! ఇది ఒక గాడిద బరువు కాదు నాయనా ! నలభై గాడిదల బరువు ! ’’ అని ...

అలాగే  ఓసారి ముట్నూరు కృష్ణారావు గారి మనవరాలు  చుట్టపు చూపుగా బందరు వచ్చి, తాతగారితో హాస్యమాడదామని, ‘‘ ఏఁవిటి తాతగారూ ! మీ ఊరినిండా గాడిదలే  కనిపిస్తున్నాయి ! ’’ అంది. దానికాయన తాపీగా ‘‘ అవునమ్మా, ఉన్నవి చాలక ఈ మధ్య పై ఊళ్ళ నుండి కూడా వచ్చి చేరుతున్నాయి ... ’’అని జవాబిచ్చి మనవరాలి కోణంగి తనానికి ధీటైన జవాబిచ్చేరు.
చూసారా ? జోకులు బావున్నాయి కానీ, అవీ మాతోనే ముడిపడి ఉన్నాయి.  మా బతుకు అలాంటిది మరి.

మేం మోసేవి పాత బట్టల మూటలే కావొచ్చు. కానీ పాత మాటల మూటలు మోసుకుంటూ గొప్ప కవులమని విర్రవీగుతూ తిరిగే కుకవుల కన్నా మేం గొప్పే కదా ?

మా బాధ్యత మేం చేస్తున్నామంతే.  మనకి చెందని పనుల్లో జోక్యం చేసుకుంటే చావు దెబ్బలు తప్పవని మా జాతి వాడే లోగడ నిరూపించేడు కూడానూ.

గుర్తుందా ? ఒక మడివేలు ఇంట ఓ కుక్క గాడిద ఉండేవి.  ఓ రోజు రాత్రి యజమాని ఇంట దొంగ పడ్డాడు. కుక్కా, గాడిదా కూడా దొంగ  పడడం చూసేయి.  చాకలి తనని బాగా చూడడం లేదనే ఉక్రోషంతో కుక్క తన కర్తవ్యం మరచి, అరవడం మానేసింది.గాడిద ఎంత చెప్పినా కుక్క అరవ లేదు. గాడిద తన యజమానికి మేలు చేయాలనే ఆలోచనతో తనకు మాలిన పనికి పూనుకొని గట్టిగా  ఓండ్ర పెట్టింది. గాఢ నిద్రలో ఉన్న చాకలి దాని అరుపులకి మేల్కొని కోపంతో దుడ్డు కర్ర తీసుకుని దానిని చావమోదాడు. త్యాగశీలి అయిన ఆ గాడిద తాను చావు దెబ్బలు తిని కూడా లోకానికి  ఎంత గొప్ప నీతిని తెలిపిందో కదా ! అలాంటి త్యాగధనుల జాతి మాది.


వెనుకటి రోజులలో ఇళ్ళలో ఆవకాయలు పెట్టేడప్పుడు అమ్మలూ. అత్తలూ. పిన్నమ్మలూ వగైరాలు మావిడి కాయలు ముక్కలుగా తరుగుతూ ఉంటే పిల్లలు వాటి జీళ్ళు పట్టుకు పోయి ఇంట్లో గోడల మీద కుడ్య చిత్రాలు వేసేవారు. గోడ పత్రికలతో  గో డలన్నీ ఖరాబు చేసే వారు.

ఆరాతల్లో దడిగాడు వానసిరా అనే మాట తరచుగా కనిపిస్తూ ఉండేది. వాళ్ళ రాతల్లో మాప్రస్తావన రావడం కొంచెం నొచ్చుకునే అంశమే అయినా, పిల్ల చేష్టలు ఎంతో మురినెం కదా. ఇప్పుడా బాధ లేదు. ఇళ్ళకు

రంగులు  వేద్దామన్న ఆలోచన రాగానే ముందుగా మీటింగ్ పెట్టి గోడల మీద పిచ్చి రాతలు రాసేరో. తాట  ఒలిచేస్తాం గాడిదల్లారా ! అనే హెచ్చరిక మా పేరు సాక్షిగా వెలువడుతుంది.

కరభము, ఖరము, గార్ధభము, గాలిగాడు ... లాంటి చాలా పేర్లు మాకున్నాయి. వాటిలో గాడిద అనే పేరే ముచ్చటగా ఉంటుంది.

అదలా ఉంచితే ...

క్షుద్ర మానవ జాతి మా పేర ఎన్ని సామెతలు పుట్టించిందో  కాస్త చూడండి ...

1.గాడిదకు గడ్డి వేసి, ఆవును పాలిమ్మన్నట్టు.

2.గాడిద కూత ( ఓంఢ్ర ) గాడిదకు కమ్మనిదే కదా

3.గాడిదకు పులి తోలు కప్పితే కఱవ గలదా ?

4.గాడిదకు మంగళ స్నానం చేయిస్తే, బూడిదలో పొర్లిందిట !

5.గాడిద కేమి తెలుసు గంధపు వాసన.

6.గాడిద కొడకా ! అంగే మీరు తండ్రులు, మేము బిడ్డలం అన్నాడట.

7.గాడిద గుడ్డు గరుడ స్తంభం.

8.గాడిదలతో వ్యవసాయం చేస్తూ, కాలి తాపులకు  దడిస్తే ఎలా ?

9.గాడిదతో స్నేహం కాలి తాపులకే

10.గాడిద పుండుకు బూడిద మందు.

11.గాడిద మోయదా గంధను చెక్కలు ?

12.గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్

13. గాడిదల మోత, గుఱ్ఱాల మేత

14, గాడిదలు దున్నితే, దొమ్మరులు పంటకాపులు కారా ?

15. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్ఛ పోయిందిట !

ఇహ చాలు. త్వరలో జరుగబోయే అఖిల భారత గాడిదల ఓండ్ర మహా సభలకు స్వాగత గీతం రాసే పనిలో బిజీగా ఉన్నాను. శలవ్...

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగ రాశారు . గాడిదకు గాడిద పాట్లు అర్ధం చేసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి