17, మే 2015, ఆదివారం

సభకు నమస్కారం !

సమ్యగ్భాషణం వ్యక్తికి భూషణమ్.

చక్కగా మాట్లాడ గలగడమే వ్యక్తికి అలంకారం. ఆకట్టుకునేలా ప్రసంగించ గల వారికి ఎప్పుడూ సంఘంలో ఒక ప్రత్యేకత ఉంటూనే ఉంటుంది. సభలలో అయితే, వక్తలలో గొప్పగా ఉపన్యసించ గలడని పేరు పొందిన వక్తల ప్రసంగాలను కార్యక్రమం చివరిలో ఉండేటట్టుగా నిర్వాహకులు జాగ్రత్త పడుతూ ఉంటారు. దానికి కారణం సభకు వచ్చిన జనాలను వెళ్ళి పోకుండా కట్టడి చేయడానికే అనే విషయం సర్వ విదితమే.

సభలలో తరుచుగా మాట్లాడాల్సి వచ్చే వక్తలకు ఎదురయ్యే ప్రధాన సమస్య , ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించడం అనేది. వేదిక మీద ఆసీనులైన పెద్దలందరికీ పేరు పేరునా నమస్కారాలు తెలియ జేస్తూ, ప్రేక్షక మహాశయులకు అభివాదాలు చేస్తూ ప్రారంభించాలనుకున్న వారి ఉపన్యాసం, వేదిక ఒక్కో సారి పెద్దలతో క్రిక్కిరిసి పోయి ఉండే పక్షంలో ఈ ప్రారంభ వాక్యాలు ఎంతకీ తెమలవు. దాదాపు వందన సమర్పణలా ఉంటాయి వారి ఉపన్యాస ప్రారంభ వాక్యాలు.

ఏవో తంటాలు పడి మొదలెట్టాక, ఇక ఆగే పని లేదు. వినేవారి సహనాన్ని పరీక్షకు పెట్టడమే

మైకాసురులని వీరిలో కొందరు అప్పటికే పేరు పడిపోయి ఉంటారు. సహనం చచ్చిన నిర్వాహకులు వారి వాక్ప్రవాహానికి అడ్డ కట్ట వేయడానికి నానా హావభావ ప్రదర్శనలూ చేస్తూ ఉంటారు.

ఎట్టకేలకు, చివరిగా ఓ రెండు ముక్కలు చెప్పి ముగిస్తాను అని భరోసా యిచ్చిన సదరు వక్త కచ్చితంగా ఆ పీకుడు మరో అరగంట దాకా కొనసాగించాడన్నమాటే.

ఇక, సభా కార్యకమాలలో చివరి వక్తగా ఉపన్యసించ వలసిన వక్త బాధ మరో రకంగా ఉంటుంది. అప్పటికే అతను చెప్ప దలచిన నాలుగు ముక్కలూ అంతకు ముందు మాట్లాడిన వక్తలలో ఎవరో ఒకరు చెప్పీసి ఉంటారు. ఇహ అతనికి కొత్తగా ఏమీ చెప్పడానికి మిగలక పోవడంతో ఉపన్యసించడానికి నానా తంటాలూ పడతాడు. విలువ చచ్చిన ఆ మాటలకు విసిగి పోయిన ప్రేక్షకులు ఒక్కోసారి ఉదాత్తంగానూ, ఒక్కోసారి భీకరంగానూ తమ అసమ్మతిని ప్రదర్శిస్తూ ఉంటారు.
బెదిరి పోయిన సదరు వక్త అర్ధాంతరంగా ఉపన్యాసం ముగించీసి, ఓ రైలు తప్పి పోయిన వాడి నవ్వు ముఖాన పులుముకుని, తిరిగి తన సీటులో కూలబడి, కర్చీఫుతో ముఖం రుద్దుకునే కార్యక్రమాన్ని మొదలెడతాడు.

ఉపన్యాసకులలో గండరగండలు కొందరుంటారు. వారికి వేదికతో పని లేదు. ప్రేక్షకులతో నిమిత్తంత లేదు. కార్యక్రమ అజెండాతో పని లేదు. సభా కార్య క్రమం దేనికి సంబంధించినదో వారికి తెలియ నక్కర లేదు. వస్తారు. అనర్గళంగా ఉపన్యాసంతో చితక్కొట్టేస్తారు. జరూరు పని ఉంది. మీరంతా మన్నించాలి అంటూ వారి అనుమతితో నిమిత్తం లేకుండా అక్కడ నుండి వెళ్ళి పోతారు. ఈ జబర్దస్తీ వక్తలు దేని గురించయినా మాట్లాడ గలరు. సాహిత్య సభలో కూరగాయల గురించీ, కార్మిక సభలో కథా సాహిత్యం గురించీ .....

ఇక, సభలలో దండల ప్రహసనం గురించి చెప్పు కోవాలంటే చాలా ఉంది. ఒక్కో తూరి కొన్ని సభలలో అప్పటి కప్పుడు దండలు వేసి సత్కరించాల్సిన వ్యక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగి పోతూ ఉండడంతో నిర్వాహకులు చేసేదేమీ లేక నిర్మొహమాటంగా ముందు సత్కరించిన సన్మానితుని కాస్త ప్రక్కకి లాగి, ఒక్క ముక్క క్షమాపణలతో దౌర్జన్యంగా వారి మెడలోని దండలను, వారి చేతికిచ్చిన బొకేలను, కొండొకచో వారికి కప్పిన దుశ్శాలువాను కూడా ఒలుచుకు పోతారు. ఇంద్రడుకి తన సహజ కవచ కుండలాలు ఇచ్చిన దాన వీర శూర కర్ణుని భంగిమలో ఓ చిరు నవ్వు బలవంతాన విసిరి లోలోపల కుమిలి పోతూ ఆ దౌర్జన్య కాండకు తలొగ్గడం తప్పితే సదరు వక్త చేసేదేమీ ఉండదు.

సభల గురించి మాట్లాడు కునేటప్పుడు కురు సభలో శ్రీకృష్ణ రాయబారం గురించి తలచు కోకుండా ఉండలేం. ఒక నిండు సభలో అంత అర్ధవంతంగా ఉపన్యసించిన మహా వక్త ప్రపంచ చరిత్ర లోనే మరొకడు లేడు.

మన వివేకానందుడినీ,

వాళ్ళ చర్చల్ నీ ఓ సారి మనసారా తలుచుకుని కాసంత ముందుకు జరుగుదాం.

కల్పిత పాత్రే అయినా, మన జంఘాల శాస్త్రిని మరచి పోవద్దు సమా !

ఇంకా ఎందరో మహానుభావులు. వారందరకీ వందనాలు చెబుతూ నా ఎరికలో జరిగి సభావశేషాలు, సభా విశేషాలు ఒకటి రెండు మీ ముందుంచుతాను:


విశాఖ పట్నంలో శ్రీ,శ్రీ షష్టి పూర్తి సభలో కవి ఆరుద్ర అలిగేరు. వివరాల జోలికి నేనిప్పుడు పోదలచు కోలేదు. ఆ రోజు సాయంత్రం పెద్ద బహిరంగ సభ జరిగింది. తాపీ ధర్మారావు సభాధ్యక్షులు.
అలిగిన ఆరుద్ర గారూ, వారి శ్రీమతి రామ లక్ష్మి గారూ ముందు వరసలో కూర్చున్నారు. సభలో ఉపన్యసించేందుకు ఆరుద్ర సుముఖంగా లేరు.


తాపీ ధర్మారావుగారు, ఇహ ఊరుకో లేక, పెద్దాయన కనుక, పెద్దరికం వహించి ఆరుద్ర గారిని ఉపన్యసించడానికి వేదిక మీదకి ఆహ్వానించేరు. ఆరుద్ర కదల లేదు.

తాపీ వారు వదిలి పెట్ట లేదు. ‘‘ ఇప్పుడు సభను ఉద్దేశించి ఆరుద్ర గారు నాలుగు మాటలు మాట్లాడుతారు.’’ అని ఏకపక్షంగా ప్రకటించారు. దాంతో ఆరుద్రకి ఎక్కడో కాలింది. మౌనంగా వేదిక ఎక్కి,

‘‘ సభకు నమస్కారం ! ఇక సెలవు !’’

అని, నాలుగంటే నాలుగే ముక్కలు పలికి వేదిక దిగి పోయేడు. ఆరుద్ర చతురతకి సభ నివ్వెర పోయింది.

ఆ తర్వాత మెత్తబడిన ఆరుద్ర ఆనాటి సభలో అపూర్వమైన ప్రసంగం అనర్గళంగా చేసేడనుకోండి ...

నేను విన్న మరో సభా ముచ్చట:

ఓ పెద్ద సభలో దేశం పట్టనంత ఒక మహాకవికి సన్మాన కార్యక్రమం జరిపించేరు. ఎందు చేతనో కానీ దుశ్శాలువా విషయంలో కొంత ఉదాసీనత కనబరచి, చవక రకం శాలువా కవిగారికి కప్పేరు. అంతే, కవిగారికి ఒళ్ళు మండి పోయింది. ఆ అసంతృప్తిని అణుచుకుంటూ ఇలా అన్నారుట: ‘‘ ఈ కార్యక్రమ నిర్వాహకులు నాకు కప్పిన శాలువా మాకు చాలా ఉపయోగ పడుతుందని విన్నవిస్తున్నాను. చాలో రోజులుగా ఒడియాలు పెట్టేందుకు సరైన గుడ్డ లేదంటూ ఇటీవల మా ఆవిడ ఒకటే సణుగుతోంది. ఆలోటు దీనితో తీరిపోతుంది.’’

కవిగారి వ్యంగ్యంతో కంగు తిని, నిర్వాహకులు అప్పటికప్పుడు ఖరీదయిన మరో శాలువా తెప్పించి వారికి కప్పి, బ్రతుకు జీవుడా ! అని ఊపిరి పీల్చుకున్నారుట.

ఒక సారి ఓ పెద్ద సభలో ప్రముఖ నటులు శ్రీ గుమ్మడి వేంకటేశ్వర రావు గారు ఉపన్యసించడానికి లేచారు. సభ నానా గోలగా ఉంది. ఎంతకీ సద్దు మణగ లేదు. గుమ్మడి గారు చాలా సేపు నిరీక్షించేరు. కార్యక్రమ నిర్వాహకులు కంగారు పడి పోతున్నారు. వాలెంటీర్స్ ఎక్కడో తిరుగుతూ పట్టించు కోవడం లేదు. ప్రేక్షకుల మధ్యకి పరుగులు తీసి వారిని సద్దుమణిగేలా చేదామని ఒకరిద్దరు వేదిక మీదనుండి లంఘించ బోయారు. గుమ్మడి గారు వాళ్ళని కంటి చూపుతో నివారించి, కంచు కంఠంతో హాలు దద్దరిల్లిపోయే లాగున ‘‘ హలో, వాలంటీర్స్ ! ముందు మీరంతా నిశ్శబ్దంగా ఉండాలి ’’ అని అరిచేరు.

మొత్తం సభలోని వారంతా ఒక్క సారి ఉలిక్కి పడి, అందులో చమత్కారం అర్థం చేసుకుని చాలా సేపు పగలబడి నవ్వేరు. తర్వాత గుమ్మడి గారు అద్భుతమైన ప్రసంగం చీమ చిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్ద వతావరణంలో చేసారు.

సభా కార్యక్రమాలలో వక్తల తొట్రుపాటుల వల్లనయితే నేమి, తెలియమి వల్ల నయితే నేమి జరిగే సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాయి కూడా. బరువైన పదాన్ని వాడాలనే దుగ్ధతో సన్మానితునికి శ్రద్ధాంజలి ఘటించే వారూ, సంతాప సభలో ప్రసంగించే అదృష్టం దక్కినందుకు తనకా రోజు అమితానందంగా ఉందంటూ వాక్రుచ్చే వారూ కూడా కనిపిస్తూ ఉంటారు.

నొక్కి వక్కాణించడాలూ, బల్ల గుద్ది చెప్పడాలూ సభలలో సర్వసాధారణం.


కవితా పఠనం జరిగే సాహితీ సభలలో అయితే ఒక్కో సారి పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి.

ఏ కవీ తన వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదరు చూస్తూ ఉంటాడే కాని. తన ముందు వాడి కవిత్వం శ్రద్ధగా విన్న దాఖలాలు ఎక్కడో కానీ కనిపించవ్.


సభలలో వక్తల హావ భావ చేష్టల వల్ల కూడా ఒక్కో సారి నవ్వులు పూస్తూ ఉంటాయి.

వక్తలలో కొందరకి కొన్ని పదాలు అలవాటుగా పదే పదే దొర్లిపోతూ ఉంటాయి. ఏం చేస్తాం, అవి వారి ఊత పదాలు మరి.

ఒక సారి ఒక ప్రాచ్య కళాశాలలో వార్షికోత్సవ సభ జరుగుతోంది. సభాధ్యక్షత వహించిన వారు పెద్ద పోలీసు ఆఫీసరు. ఆమెకు తెలుగు అంతగా రాదు. కళాశాల ప్రిన్సిపాల్ గారు మహా పండితులు. వారికి మాట మాటకీ ‘‘ దీని పేరేమిటీ ...‘‘ అనే ఊత పదం వాడడం అలవాటు. అలవాటు ప్రకారం, ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మాటి మాటికీ దీని పేరేమిటీ ... అనడం మొదలు పెట్టారు. అలా అన్న ప్రతి సారీ ఆయన చూపుడు వేలు అనుకో కుండా ఆవిడ గారి వేపే చూపెడుతూ ఉండడంతో సభలో అంతా క్షణానికో సారి పెద్ద పెట్టున నవ్వుతూ గోల చేసారు. వాళ్ళెందుకు నవ్వుతున్నారో కళాశాల అధ్యక్షుల వారికీ తెలియ లేదు .సభాధ్యక్షురాలికీ అవగతం కాలేదు !

వక్తలకు ఇలా ఊత పదాలు లేనిదే మాట్లాడ లేని బలహీనత ఉంటే మాత్రం సభల్లో హాస్యరసం చిప్పిల్లక తప్పదు.

సరే, కథా మంజరి అలవాటు ప్రకారం సభ గురించిన ప్రస్తావన ఉన్న ఒకటి రెండు శ్లోకాలను ప్రస్తావించాలి కదా ?

చూడండి:

న సా సభా యత్ర న సంతి వృద్ధా:, న తే వృద్ధా యే న వదంతి ధర్మం
నా సౌ ధర్మో యత్ర న సత్యమస్తి, న తత్సత్యం యచ్చతే నాభ్యుపేతమ్

ఎక్కడ వృద్ధులు లేరో అది సభ కాజాలదు. ఎవరు ధర్మాన్ని చెప్పరో, వారు వృద్ధులు కారు. దేని యందు సత్యం లేదో, అది ధర్మం కాదు. దేని వలన లోక కల్యాణం జరుగదో అది సత్యం కాజాలదు. అని మహా భారతం చెబుతోంది. అంటే, లోక కల్యాణం చేసే సత్య ధర్మ ప్రవచనం చేసే పండితులు ఎక్కడ ఉంటారో, అదే మంచి సభ అని భావం.

మరో శ్లోకం చూడండి:

యత్ర ధర్మో హ్యధర్మేణ, సత్యం యత్రానృతేన చ,
హన్యతే ప్రేక్షమాణానాం, హతా స్తత్ర సభాసద:

ఏ న్యాయ సభలో ధర్మం అధర్మం చేతను, సత్యం అబద్ధం చేతను బాధింపబడుతోందో ఆ సభలోని సభాసదులు జీవచ్ఛవాల వంటి వారే అవుతున్నారని దీని భావం.

ఇక్కడ మరో చిన్న అంశం - సభలోని వారిని సభాసదులు అని వాడడం జరిగింది. సాధారణంగా సభలోని వారిని సభికులు అనడం కద్దు. కానీ, సభికులు అంటే సభలో ధర్మం తెలిసిన వారే అనే కాక, జూదరులు అనే మరో అర్ధం కూడా ఉండడంతో ఆ పదం వాడడం అంత సబవుగా తోచదు.

మరొకటి చూడండి:

విపది ధైర్య మధాభ్యదయే క్షమా, సదసి వాక్పటుతా యుధి విక్రమ:
యశసి చాభిరతి ర్వ్యసనం శ్రుతౌ, ప్రకృతి సిద్ధ మిదం హి మహాత్మనామ్


ఈ శ్లోకంలో కవి కష్టంలో ధైర్యాన్ని, ఐశ్వర్యం కలిగి నప్పుడు ఓర్పు, యుద్ధంలో భుజబలం, కీర్తియందు ఆసక్తి విద్యయందు కోరిక సజ్జనుల సహజ గుణాలుగా చెబుతూ సభలలో సంపూర్ణమైన వాక్ నైపుణ్యం కలిగి ఉండడం కూడా సజ్జనుల సహజ గుణ మని చెబుతున్నాడు.

న సా సభా యత్ర న భాతి కశ్చిత్, న సా సభా యత్ర విభాతి చైక:
సభా తు సైవా2స్తి యథార్హరూపా, పరస్పరం యత్ర విభాంతి సర్వే.

ఒక్కడూ ప్రకాశించనిది, అది సభ అనిపించు కోదు. అంటే ప్రసంగించిన వక్తలందరూ చెత్తగా మాట్లాడితే అది మంచి సభ అనిపించు కోదుట. పోనీ, ఏ ఒక్కరో ప్రకాశించినా అదీ మంచి సభ అనిపించు కోదుట. అంటే, సభలో వక్తలంతా చెత్తగా ప్రసంగించి , ఏ ఒక్క వక్తో గొప్పగా మాట్లాడినంత మాత్రం చేత ఆ సభ మెచ్చుకో తగినది కాదని భావం. ఎక్కడయితే, ఉన్న వారందరూ ఒకరి వల్ల ఒకరు అధిక తరంగా ప్రకాశిస్తారో, అదే సభ అనే పేరుకి తగినది అని కవి భావం.


సభ గురించిన మరో మంచి శ్లోకం చూడండి:


సభా కల్పతరుం వందే, వేదశాఖోపజీవితం
శాస్త్రపుష్ప సమాయుక్తం, విద్వద్భ్రమర శోభితమ్.

వేదాలు అనే శాఖలతో, శాస్త్రాలు అనే పువ్వులతో, విద్వాంసులు అనే తుమ్మెదలతో ప్రకాశించే సభ అనే కల్ప వృక్షానికి నేను నమస్కరిస్తున్నాను అని దీని భావం.

చివరిగా గుర్తొచ్చిన ఓ జోక్ తో ముగిస్తాను ...


‘‘ నిన్న టౌన్ హాలులో మావారికి సన్మాన సభ జరిగింది. ఎంత ఘనంగానో జరిగిందిట ! టౌను హాలు సగం జనంతో నిండి పోయిందిట. తెలుసా !?’’ అంది మీనాక్షి దర్పంగా స్నేహితురాలు కామాక్షితో.

దానికి కామాక్షి మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ’’ పోదూ, మరీ బడాయి కాక పోతే ... ఆ సభకు మా వారూ వచ్చేరు. సగం హాలంతా ఖాళీయేనట కదా ? ’’ అంది.

స్వస్తి.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి