20, మే 2015, బుధవారం

సూది పురాణమ్ !



సూదే కదా అనుకుంటామా ? చిన్న సూదికి పెద్ద కథే ఉంది.
అవసర పడి వెతుక్కుంటామా ... ఎక్కడుందో కన బడదు. ఒక వేళ సూది కనబడితే దారం కనిపించదు. రెండూ దొరికి కుడదామని కూచుంటే, సూదిలోకి దారం కళ్ళ జోడు లేనిదే ఎక్కించ లేం !. అదెక్కడ పెట్టామో గుర్తుకు రాదు. దాంతో విసుగొచ్చి సూదీ దారాలని పక్కన పడేస్తాం. తర్వాత కళ్ళ జోడు జాడ కనిపించి, కొంచెం తీరిక దొరికింది కదా అని ఏరాత్రి పూటో కుట్టడానికి కూచుంటామా ! కరెంట్ ఠక్ న పోతుంది. జీవితంలో ఐరనీ ఇదే. మన దినాలు బావుండక పోతే అన్నీ ఇలాగే జరుగుతాయి ! ... సరే, ఈ సోది కాస్సేపు ఆపి, సూది కథలోకి వద్దాం.

సూచి అనే దానికి రూపాంతరమే సూది. దీనికి మరి కొన్ని పర్యాయ పదాలూ ఉన్నాయండోయ్. సేవని,సూచకము, సూచి, సూచిక,సూచిని, సేవతి ... ఈ పదాలన్నింటికీ సూది అనే అర్ధం ! ఇంత ఆయాసం మనం పడ లేం కానీ మనం సూది అనే పిలుచుకుందాం.సూదుల్లో చాలా రకాలు ఉన్నాయి. గుండు సూది. బొంత సూది, కుట్టు సూది, మందు సూది ...వీటిలో గుండు సూదులది రాచహోదా లెండి. ఇవి ఆఫీసుల్లోనూ అక్కడా చక్కా అందమైన ముఖమల్ ఆసనం అలంకరించిన చోట ఉంటాయి. వాటి దర్జాయే వేరు ! బట్టలూ, పుస్తకాలూ, బొంతలూ కుట్టే సూదులు రకరకాల సైజుల్లో ఉంటాయి. ఇవి కాక మిషను సూదులు వేరు. ఆస్పత్రులలో రోగుల జబ్బలకు పొడిచే మందు సూదులను లోగడ మరుగుతున్న నీళ్ళలో శుభ్రం చేసే వారు. స్టెరిలైజేషనంటారు దానిని. ఇప్పుడా బాధ లేదు. హాయిగా వాడి పారేసే మందు సూదులొచ్చేయి. సుఖమే కాక, ఇవి ఆరోగ్యరీత్యా మంచివి కూడానూ

 ఇక సూదుల పెద్దన్న దబ్బనం. వీటితో గోనె సంచులూ గట్రా కుడతారు.
అసలీ సూదులు మన దేశం లోకి విదేశాల నుండి ముందటి రోజుల్లో దిగుమతి అయ్యేవిట ! తర్వాత తర్వాత మనఁవూ సూదులను తయారు చేయడం మొదలెట్టాం.

గాంధీజీకి రోజూ బోలెడు ఉత్తరాలు వచ్చేవిట. ఓ రోజు గుండు సూది గుది గుచ్చి ఎక్కువ కాగితాల బొత్తి వచ్చిందిట. జాతి పిత ఆ ఉత్తరాన్ని పూర్తిగా ఓపికగా సాంతం చదివేక దానికున్న ఆ గుండు సూదిని తీసి జాగ్రత్త చేసి, ఉత్తరాన్ని చెత్త బుట్టలో వేసారుట ! ప్రక్క నున్న వారెవరో ఆశ్చర్య పడి ఇదేమిటని అడిగితే, ఈ ఉత్తరంలో మనకి పని కొచ్చేది ఈ గుండు సూది ఒక్కటే ! అని బదులిచ్చారుట !
మన మహా భారతంలో వచ్చిన సూది ప్రస్తావన అందరికీ తెలిసినదే కదా ! రారాజు పాండవులకి ఐదూళ్ళు కాదు కదా సూది మొన మోపినంత భూభాగం కూడా ఇవ్వనని చెప్పడం వల్లనే కదా భారత యుద్ధం వచ్చింది !
కుట్టు కోడానికే కాదు, సూది హింస కూడా ఒకటుంది. విలన్లూ, కొందరు రక్షక భటులూ నేరస్థుల గోళ్ళలో సూదులు కుక్కి నిజమో అబద్ధమో రాబట్టే, హింసాత్మక చర్యలకూ సూదులే ఉపయోగ పడడం సూదుల జీవితంలో ఒక మాయని మచ్చలా మిగిలి పోతుంది.

సూదిలోకి దారం అవలీలగా ఎక్కించ గలుగు తున్నామంటే మన కంటి చూపు భేషుగ్గా ఉన్నట్టే ! గుండు సూది నుండి ఇక్కడ సమస్తం దొరుకుతాయండీ అని ఏ షాపు గురించయినా చెప్పుకుంటూ ఉంటే ఆ షాపు ఇవాళ్టి మన మాల్ లాంటి దన్నమాట !

గతాన్నీ వర్తమానాన్నీ సమన్వయ పరుస్తూ కుట్టే సూది లేక పోయిందే ! అని కవి నారాయణ రెడ్డి గారు ఓ కవితలో ఖేద పడ్డారు.
పరమానందయ్య గారి శిష్యుల సూది కథ తెలిసినదే కదా. గురువు గారు ఓ సారి ఓ సూది తెండ్రా అని చెప్పారుట. పొలోమని శిష్యులందరూ బయల్దేరారు. వారికి ఓ చిన్న సూదిని అంతమందీ కలిసి తేవడం ఎలాగో తెలిసింది కాదు. సూది తెమ్మని గురువు గారు అందరికీ కలిసి చెప్పారాయె ! అందు వల్ల బాగా ఆలోచించి, ఆ సూదిని ఓ తాటిమానుకి గుచ్చి మోసుకొచ్చేరుట. తీరా , గురువుల దగ్గరకి వెళ్ళే సరికి తాటి దూలం ఒక్కటే మిగిలింది ! సూది దారిలో ఎక్కడో జారి పడి పోయింది !

సూదికి సంబంధించిన సామెతలు కూడా కొన్ని కనిపిస్తాయి. చూడండి ...

1. సూదికి రెండు మొనలు ఉంటాయా!

2. సూది కుతికె, దెయ్యపాకలి. ( పీక సన్నం, ఆకలెక్కువ లాంటిదన్నమాట)

3. సూది కోసం దూలం మోసినట్టు

4. సూది కోసం వెళితే, పాత రంకులు బయట పడ్డాయిట !

5. సూది గొంతు, బాన కడుపు

6. సూది తప్పితే దారం సూటిగా బెజ్జంలో పడుతుందా ?

7. సూది బెజ్జం చూసి జల్లెడ వెక్కిరించి నట్టు !

8. సూదిలా వచ్చి, గడ్డ పారలా మారినట్టు
9. సూదిని మూట కట్టి నట్టు

10.సూది బెజ్జంలో ఒంటె దూర వచ్చును కానీ, భాగ్య వంతుడు స్వర్గం చేర లేడు ( ఇది బైబిల్ సూక్తి)
11. గడ్డి మేటులో సూదిని వెదికినట్టు ! ( వృథా ప్రయాస అన్నమాట ! )

సూదిలొ దారం ... సందులొ బేరం లాంటి సినిమా పాటలు ఉన్నాయి కానీ, వాటిలో అశ్లీలత ఏమన్నా ఉందా అని బుర్ర గోక్కోవడం దండుగ. ఉండక పోతేనే ఆశ్చర్యం కానీ, ఉంటే అబ్బుర మేముంది ?

అన్యోన్యంగా ఉండే భార్యా భర్తలను చిలకా గోరింకాలా ఉన్నారంటారే కానీ సూదీ దారంలా కలిసి పోయారని అనక పోవడానికి కారణం ఏమిటో ; సూది కుట్టేదీ, దారం చుట్టుకు పోయేదీ కనుకనా ? చూడాలి.

ఇప్పటికీ ఇంకా చిన్న చిన్న వూళ్ళలో సూదులోళ్ళు అని చిల్లర వ్యాపారస్తులు కొందరు రోడ్లమ్మట తిరుగుతూ కనిపిస్తారు. చేతిలో ఓ నిడుపాటి గెడ కర్రకు మీద ఆ చివర అట్ట ముక్కలకు తగిలించి సూదులూ, పిన్నీసులూ, బూరలూ, మొలతాళ్ళూ లాంటివి తెచ్చి అమ్ముతూ ఉంటారు.

ఇక, చివరగా చిన్నప్పుడు మా పెద్దాళ్ళు తరుచుగా చెప్పి కడుపారా నవ్వించిన సూది కథ ఒకటి చెబుతాను ...
అనగనగనగా ... ఒక ఊళ్ళో ఒక అవ్వ నూతి గట్టు మీద కూచుని ( నూతి గట్టు మీద కూచోడ మేఁవిటనకండి. అదంతే కథకి కాళ్ళూ చేతులూ లేవు)
చిరిగిన బొంత కుడుతోందిట. ఇంతలో చెయ్యి జారి సూది నూతిలో బుడుంగున పడి పోయిందిట. కుయ్యో, మొర్రో అంటూ , సూదీ సూదీ బేతాళా ! అంది అవ్వ. దారం నూతిలో పడి పోయింది. దారం దారం బేతాళా ! అంది . బొంత పడి పోయింది. బొంతా బొంతా బేతాళా ! అంది ఈ సారి ఏకంగా అవ్వే నూతిలోకి పడి పోయింది ! ....
ఈ కథ ఇంత వరకూ ఇలా సాగుతూ ఉంటుంది. పిల్లలు ఊఁ ... కొడుతూనే ఉంటారు. ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ప్రశ్నలే ప్రశ్నలు !

ఊఁ.. అంటే అవ్వ నూతిలోంచి బయటి కొస్తుందా ?

ఉహూఁ !

ఉహూఁ అంటే వస్తుందా ?

(తల అడ్డంగా తిప్పే వాళ్ళం )

తల తిప్పితే వస్తుందా ?

(పగలబడి నవ్వుతాం)

వెంటనే మరో ప్రశ్న ! నవ్వితే వస్తుందా

మాట్లాడకుండా ఉంటే వస్తుందా ? కథ బాగుందంటే వస్తుందా ? వస్తుందంటే వస్తుందా ? రాదంటే వస్తుందా ! ...
ఇది అనంతం






















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి