23, మే 2015, శనివారం

మరీ ఇంత అన్యాయమా ! అన బడు వొక జుత్తుల పోలిగాని వ్యథ !

ఈ కథామంజరి నస బ్లాగు ఉంది చూసారూ దాని ఓనరు పరమ పిసినారి సుమండీ. ఏడాదిగా అతని దగ్గర ఎంతో వినయంగా పని చేస్తున్నాను. ఒళ్ళు దాచుకో కుండా పని చేస్తున్నాను. ఒళ్ళు హూనం చేసుకొని అతని ఇంటిని శుభ్రం చేసే చాకిరీ నాదే. రోజూ వాడి ఇంటిని శుభ్రం చేసే పని నాదే. చేసేది వాడే అయినా నన్నుఉపయోగించు కుంటున్నాడు కనుక నేనే ఆ చాకిరీ అంతా చేస్తున్నట్టు లెఖ్ఖ కదా ! ఇంత చాకిరీ వాడి కోసం చేసినా వాడు నామీద రవంత ప్రేమ కూడా చూపించడు.
పనంతా అయ్యేక దులిపి ప్రక్కకి విసిరేస్తాడు. నన్నసలు మళ్ళీ వాడి అవసరం వచ్చే వరకూ తాకనయినా తాకడు.
సరే వాడి పాపాన వాడు పోతాడులే.
ఈ మధ్య జుత్తు బాగా పెరిగి పోయి ఒకటే చిరాగ్గా ఉంది. నన్ను చూస్తూనే‘‘ తలమాసిన వెధవా’’ అంటూ తిడుతున్నాడు. నాకు ఒళ్ళు మండి పోతోంది. వాడి బ్లాగును ఎవడూ చూడకుండు గాక ! చూసినా ఒక్క కామెంటూ పెట్టకుండు గాక ! వాడి తొక్కలో సిస్టం చీటికీమాటికీ మొరాయించు గాక ! అని వాడిని మనసులోనే శపించేను.
వాడి ఇల్లంతా శుభ్రం చేయడం కోసం నన్ను ఇంతగా హైరానా పెడతాడా నా ఒళ్ళంతా చీదరగా ఉంది. మురికి పట్టి పోయాను. సబ్బో గిబ్బో పెట్టి కొంచెం స్నానం చేయిస్తే వాడి సొమ్మేం పోయింది నా వొంటిని అంటిన దుమ్మూ ధూళిని వదిలించడానికట - నన్నుటేబిలు అంచుకేసి టపా టపా బాదేడు. ఊపిరాడింది కాదు. వాడి మీద ఏ మర్డరు కేసో పెట్టి బొక్కలో తోచించేస్తేనో అన్నంత కోపం వచ్చింది.
ఆ మధ్య వాడి ఫ్రెండొకడు వచ్చి నన్ను చూసి పగలబడి ఒకటే నవ్వడం ! నా తల తీసేసి నట్టయింది.
ఎంత అవమానం !
‘‘ఈ తలమాసిన శాల్తీ ఎక్కడిదోయ్ ! ’’ అని వెక్కిరిస్తూ ఒకటే నవ్వేడు.
ఇహ నేను ఈ కథామంజరి ( ఏకైక నస బ్లాగు ) గాడి అథార్టీ భరించ లేను. కానీ ఏమీ చెయ్య లేను కదా. చేతిలో ఎర్ర ఏగానీ కూడా లేని వాడిని కదా అస్వతంత్రుడిని కదా !
అంచేత మనమే తగ్గాలి. ఒదిగి ఉండాలి. శాంతం భోషాణం పెట్టె అన్నారు పెద్దలు.
ఇలా ఉండగా నాకో దివ్యమైన ఆలోచన వచ్చింది. పోనీ మనమే జుత్తు కటింగ్ చేయించుకుని కాస్త ట్రిమ్ గా తయారై కనిపిస్తేనో అప్పుడయినా ఈ వెటకారాలూ వెక్కిరింతలూ తగ్గిస్తాడేమో?!
ఈ ఆలోచన వచ్చేక మా కథా మంజరి గాడి మూడ్ బాగుందని అనుకుని నా మనసులో మాట వాడి ముందు బయట పెట్టాను
‘‘ పారూజుత్తు బాగా పెరిగి పోయింది. తల మాసి పోంది. చిరాగ్గా ఉంది. సెలూన్ కి వెళ్ళి క్షవరం చేయించుకు రావాలనుకుంటున్నాను. డబ్బులివ్వరూ ? ’’ అని దేబిరిస్తూ అడిగాను.
అంతే. వాడేమన్నాడో తెలుసునా ?
‘‘ ఓరి జుత్తుల పోలిగా ! నీకు క్షవరం కూడానా దండగ ఖర్చు ! అట్టే మాట్లాడితే పెంట మీద విసిరి పారెయ్య గలను జాగ్రత్త !’’
అని కసిరేడు. ఏడాదిగా నా చేత అరవచాకిరీ చేయించుకొని ఇంత మాటంటాడా ! మరీ ఇంత అన్యాయమామీరే చెప్పండి ?
నా తమ్ము డొకడు ఉన్నాడు. మా ఓనరు గాడి షేవింగు కిట్ లో ఉన్నాడు. వాడూ నాలాగే తలంతా మాసిపోయిజుత్తుల పోలి గాడిలా ఉన్నాడు.
ఏదో ఒక రోజున మా కథామంజరి నస బ్లాగరు ఓనరు మహాశయుడు మా ఇద్దరినీ పెంట కుప్ప మీద విసిరి పారెయ్యక తప్పదనిపిస్తోంది. ఈ అన్యాయం ఖండించే వారే లేరా మము బ్రోచే వారే లేరా ! హే ! భగవాన్ !
గమనిక : ఈ టపాలో వాడిన‘‘ ఇల్లు ’’ అనే పదమునకు మానిటరూసీ.పీ.యూకీ బోర్డూమౌసూప్రింటరుస్కానరూ వగైరాలని అర్ధం చేసుకో గోరుతాను.
ఇట్లు,
తమ విశ్వాసపాత్రుడు,
జుత్తుల పోలిగాడు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి