27, మే 2015, బుధవారం

ఎర్ర డబ్బా ఆకలి కేకలు !



ఎర్రగా బుర్రగాకొంచెం కుదమట్టంగా ఉన్న నేను మీకు తెలుసు కదూ?
నగరాల్లోపట్నాలలోపల్లెల్లో నేను అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటాను. నన్ను ఆంగ్లంలో ఫొస్ట్ బాక్స్ అనిపిలుస్తారు. తెలుగు వాళ్ళు నన్ను పోస్టు డొక్కు అనీ, తపాల పెట్టె అనీ, ఎర్ర డబ్బా అనీ ముద్దుగా పిలుస్తూ ఉంటారు.
ఒకప్పుడు నా కడుపు నిత్యం నిండుగా ఆకలి బాధ ఎరుగ కుండా ఉండేది. కార్డులుకవర్లుఇన్ లేండ్ కవర్లతో నా కడుపు పొద్దస్తమానం నిండి పోయి ఉండేది. మా తపాల అన్నయ్య ప్రతి రోజు ఠంచనుగా వేళకి వచ్చినా నడుం ప్రక్క ఉన్న తాళం తీసి వాటిని సేకరించుకుని వెళ్ళి పోయేవాడు. ఆ తరువాత అవి పోష్టు ఆఫీసుకి చేరిఅక్కడ ముద్రలు వేయించుకునిఊర్ల వారీగా వేరు చేయబడి రైళ్ళలోబస్సుల్లో ఎంచక్కా ప్రయాణం చేసి వెళ్ళి పోయేవి. వెళ్ళిఅవి ఎవరికి చేరాలో వారింట అడుగు పెట్టేవి. ఒకప్పుడు ఆ ఉత్తరాలు తెచ్చే పోస్టు మేన్ కోసం జనాలు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే వారు.


ఉత్తరాలలో ఎన్ని రకాలో ! కుశలాలు అడిగేవికబుర్లు చెప్పేవినిష్టూరాలు పలికేవినిందలు వేసేవిసాయం కోరేవిఅభయం యిచ్చేవిధైర్యం చెప్పేవిబెంగలుబాధలుచికాకులుకష్టాలు కలబోసుకునేవికన్నీళ్ళు కార్చేవినవ్వుతూ కళకళ లాడేవి ... ...
కొన్ని మృదువుగాకొన్ని కఠినంగాకొన్ని క్లుప్తంగాకొన్ని సుదీర్ఘంగామరి కొన్ని పెళుసుగాకుండ బద్దలు కొట్టి నట్టుగాహెచ్చరికలుఓదార్పులుమంతనాలుహిత వచనాలువేడికోళ్ళు, వెక్కిరింతలు ... ...
శుభ వార్తలను మొసుకొచ్చేవి, దుర్వార్తలను చెప్పేవి. మొదటి వాటికి పసుపు నాలుగు చివర్ల పెట్టే ఆచారం ఉంది. రెండో రకం వాటికి నాలుగు చివర్ల నల్ల సిరా పూసే అలవాటూ ఉంది .
కొన్ని ముత్యాల కోవ వంటి అక్షరాలతో రాసినవి. కొన్ని గొలుసు కట్టు రాతతో చదవడానికే చికాకు పరిచేవి.
కొన్నింట చక్కని కవిత్వం. మరి కొన్నింట అక్షర దోషాలతో ఎంత చదివినా ఏం రాశారో అర్ధం కానట్టు ఉండే వాక్య విన్యాసంతో కూడినవి ...
ఇచ్చట అంతా క్షేమం. అచ్చట మీరంతా క్షేమంగా ఉన్నారని తలస్తాము. లాంటి వాక్యాలతో మొదలై, చిత్త గించ వలెను, తో పూర్తి చేసే వారు.
మహా రాజశ్రీ, అనో, బ్రహ్మశ్రీ వేదమూర్తులయిన అనో, గంగా భాగీరథీ సమానురాలైన ... అనో సంబోధనలు ఉండేవి.
ఇప్పుడా ఉత్తరాలూ లేవు, ఆ రాతలూ లేవు. ఉత్తరాలు రాయాలంటేనే బోర్. సెల్ ఫోన్ లు వచ్చేక మరీనూ. గంటల తరబడి అందులోనే కబుర్లు చెప్పు కోవడం, లేదా ఆకుకీ పోకకీ అతకనట్టు ఎస్సెమ్మస్ లు ఇచ్చు కోవడం. నా పాలిట కొరియర్ సర్వీసులొకటి వచ్చి పడ్డాయి. ఇంక నా ఊసెవరికి పడుతుంది ?
లేఖా రచన గొప్పతనం ఇప్పుడెవరికీ పట్టడం లేదు. సాహిత్యంలో లేఖా సాహిత్యానికి ప్రత్యేకమైన, ఉన్నతమైన స్థానం ఉంది. ప్రముఖుల లేఖలు చదవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది.
విశ్వ కవి రవీంద్రుడు మా ఆఫీసు గురించి పోస్టాఫీసు అనే ఒక గొప్ప కథ రాసిన విషయం మీకు తెలిసిందే కదా ?
నా ఉత్తరాల గురించి బాల గంగాధర తిలక్ పైనికుని ఉత్తరం, తపాల బంట్రోతు లాంటి గొప్ప వచన కవితలు రాసేడు. ఇంకా చాలా మంది నా గురించి , ఉత్తరాల గురించిరాసేరు. అపురూపమైన లేఖా సాహిత్యాన్ని సృజించేరు. అవన్నీ మరో మారు చెప్పుకుందాం.
ఆ మధ్య ఏదో తెలుగు సినిమాలో ఓ కమేడియన్ నా నోట్లో చెయ్యి పెట్టి ఎంతకీ ఊడి రాక గింజుకుంటూ విలవిలలాడుతూ ఊరంతా తిరగడం లాంటి కామెడీ కూడా ఏదో చేసాట్ట. నేను చూడ లేదను కోండి. ...
ఇప్పడు చాల మంది ఉత్తరాలు రాయడానికి బద్ధకం చేతనో, అశక్తత చేతనో, అయిష్టం వల్లనో, చేత కాని తనం చేతనోపూను కోక పోవడం చేత తరుచుగా నా కడుపు అర్ధాకలితో దహించుకు పోతోంది.
సంభాషణలో విప్పి చెప్ప లేని విషయాలను, పరిచి చూప లేని హృదయ స్పందనలను అక్షరం ఆవిష్కరించ గలదనే సత్యాన్ని విస్మరిస్తున్నాం మనం.
అందుకే ఒకప్పుడు ఉత్తరాలతో నిండుగా ఉండే నేను, ఇప్పుడు ఒకటీ అరా ఉత్తరాలతో బోసి పోయి ఉంటున్నాను..
అర్ధాకలితో అలమటించి పోతున్నాను. మరెందుకు లెమ్మని నాకు కొన్ని చోట్ల మా తపాల శాఖ వారు తాళాలు వెయ్యడం కూడా మానుకున్నారు. నన్ను పట్టించు కోవడం మానేసేరు.

చాలా వరకు ఇప్పుడు నేను దుమ్ము పట్టి ఉంటున్నాను. ఫాక్సులూ, ఇంటర్నెట్ లూ వచ్చేక నా పరిస్థితి మరింతగా దిగజారి పోయింది.
నా కేడుపు వస్తోంది. నన్ను పట్టించు కోరూ? ఉత్తరాలతో నా కడుపు నింపరూ? నా ఆకలి కేకలు చెవిని పెట్టరూ?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి