గొప్ప గొప్ప రచయితలూ , అసంపూర్ణ రచనలూనూ !
ముందుగా మీకు మా తింగరి బుచ్చిని పరిచయం చేయాలి.
ఉబుసు పోకనో, యదాలాపంగానో, ఖర్మ కాలో కథా మంజరి బ్లాగు చూసే వారికి ఈ తింగరి బుచ్చి పరిచిత పూర్వుడే ! కొత్త బిచ్చగాళ్ళ కోసం ... మన్నించాలి ! కొత్త పాఠకుల కోసం వాడిని గురించి పునశ్చరణ చేయక తప్పడం లేదు.
ఈ తింగరి బుచ్చి మా ఆవిడకి దూరపు బంధువు. పుట్టింటి వారి తరఫు బంధువనీ, అన్నయ్య వరస అనీ మా ఆవిడ తెగ మురిసి పోతూ ఉంటుంది. పుట్టింటి తరఫు బంధువు అనే మాట ఎలా ఉన్నా, వాడు అతి త్వరలోనే, మా వంటింటి బంధువయి పోయేడు.
పరిచయ మయిన తొలి రోజులలో ‘‘ మరో ఇడ్లీ వెయ్య మంటారా అన్నయ్య గారూ ? ! ’’ అని మా ఆవిడ అడిగితే సిగ్గు , మొహమాటం వగైరా వగైరాలని తెగ అభినయిస్తూ, ‘‘ఒ క్ఖటి ... ఒక్కటంటే ఒఖ్ఖటి ... ’’ అని ఇదై పోయే వాడు. ( ఏదయి పోయే వాడని మీరు నన్ను నిలదీస్తే చెప్పడం కష్టం. )
అలాంటిది, కొంత పరిచయం పెరిగాక ( అంటే వాడే మాతో పెంచు కున్నాక, ) ‘‘ చెల్లాయ్ ! ఇవాళ టిఫి నేమిటో ? ’’ అని ఆరా తీసే స్థాయికి ఎదిగాడు. తర్వాత ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగి పోయి, తనకి ఏ టిఫిను కావాలో అడిగి ( హొటల్లో మాదిరి ) ఆర్డరు వేసి చేయించుకునే స్థాయికి చేరి సోయేడు.
నిజం చెప్పొద్దూ ?! మా తింగరి బుచ్చి గాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నాకు, నేను వేరే ఎవరో పరాయి కొంపలో ఉన్నట్టుగా ఉంటుంది !
అంత చనువు సంపాదించేసాడు మాయింట్లో.
వాడి వాలకం నచ్చక మాఆవిడకు నచ్చ చెప్పబోతే, నా మాట వినడం మానేసింది. అందుకు వాడు వేసిన మంత్రం ఏమిటంటే, ‘మా చెల్లాయి చేతి వంట అమృతమే ! ’ అంటూ ఆమెను ఉబ్బేయడమే. అన్నీ అబద్ధాలే ... ఆకాడికి అమృతం వాడేదో రుచి చూసినట్టు అని లాజిక్కు వినిపించాను. ‘‘ ఊరుకోండి ! మీకంతా కుళ్ళు ... మీరు తప్ప నా చేతి వంట ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మెచ్చు కుంటారు ... మీరే ఎంపుళ్ళు పెడతారు ’’ అని మూతి మూడు వంకర్లుతిప్పింది. నాలో పురుషాహంకారం విజృంభించి, ‘‘ ఆకాడికి నీ చేతి వంటని లోకం లోని ప్రజానీకమంతా తిన్నట్టు ! బిల్ గేట్స్ తిన్నాడా ? బిల్ క్లింటన్ తిన్నాడా ?
అక్కినేని నాగేశ్వర రావు తిన్నాడా ? అమితాబ్ బచ్చన్ రుచి చూసాడా ?... ఘంటసాల తిన్నాడా ? పెంటగాన్ ప్రజలు చవి చూసేరా !... చైనా వాడు తిన్నాడా ? నానీ పాట్కర్ తిన్నాడా ! ...’’ అంటూ వర్లించేను. ఆ దెబ్బకి మా ఆవిడ వారం రోజులపాటు నాతో మాట్లాడడం మానీసింది. అప్పటి నుండి మా తింగరి బుచ్చి గాడొస్తే, వొళ్ళు మండి పోతున్నా సరే, ఓర్చుకుని మౌనంగా ఉండడం మొదలెట్టాను. కన్యా శుల్కంలో చెప్పినట్టు పేషెన్ప్ ఉంటే కానీ లోకంలో బతకలేం ! ( పూర్ రిచర్డ్ ఉవాచ. గిరీశం నోటంట)
సరే, అదలా ఉంచితే , తింగరి బుచ్చి గాడి బలహీనతా, బలమూ కూడా ఒక్కటే. ! అది ... వేదికను చూస్తే వెర్రెత్తి పోవడం ! మైకుని చూస్తే మైమరచి పోవడం ! ప్రజా సమూహాన్ని చూస్తే పరవశించి పోవడం !
ఎవరెంత వెనక్కి లాగినా కించ పడకుండా అనర్గళంగా ఉపన్యాసం దంచడం ...
చాలా సార్లు వాడిని జనాలు బలవంతంగా వాడి చేతి లోని మైకుని లాక్కుని, వేదికి మీద నుండి లాగి పడేసారు. దాని కతడు ఏమాత్రమూ అవమాన పడి నట్టు లేదు. పైగా, ‘ఫలించే వృక్షానికే రాళ్ళ దెబ్బ లన్నట్టు ’ అనే ఉదాత్త మయిన ఉపమానంతోనూ. ‘ మొరిగే కుక్కకే కాలి దెబ్బ లన్నట్టూ ’ అనే నీచోపమానంతోనూ సమర్ధించు కునేవాడు.
‘‘ నువ్వు గిరీశానికి తక్కువా, గణపతికి ఎక్కువా నయ్యా ’ అన్నాను ఓసారి నేరక పోయి. దాని కతడు సంతోషించేడు. గిరీశం వంటి మహాను భావుడి సంగతి ప్రక్కన పెడితే గణపతితో సమానం చేసి మన్నించడం నాకు చాలా సంతోషంగా ఉంది కథా మంజరీ !’’ అని ఆనందాశ్రువులు రాల్చేడు. ముద్దొచ్చి నప్పుడల్లా వాడు నన్నలాగే సంబోధిస్తాడు. అప్పటికి గానీ నేనెంత తప్పు చేసానో నాకు స్ఫురించ లేదు. సాహితీ ప్రియుల మనోభావాలు ఎంతగా దెబ్బ తింటాయో కదా ! అని మనసు విలవిల లాడి పోయింది. ఆ తప్పుకి ప్రాయశ్చిత్తంగా అన్నట్టు ‘‘ అంతే కాదు ... నువ్వు జంఘాల శాస్త్రికి తక్కువా, జన్ని వలస కన్నయ్యకి ఎక్కువానోయీ !’’ అనేసాను. ఈ సారి కూడా వాడు అమందానంద కందళిత హృదయారవిందు డయ్యేడు ....‘‘‘
‘‘ఎంత మాట !
జంఘాల శాస్త్రి గారితోనా పోలిక ! .. అపరాధం ! కానీ, ఆ జన్ని వలస కన్నయ్యగా రెవరోయీ ’’ అన్నాడు తన్మయంగా ... వీడికి వాడి గురించి తెలియక పోవడం నా అదృష్టం.
( వాడో పిచ్చోడు . తనలో తనే ఎప్పుడూ ఏదో వదరుతూ తిరుగుతూ ఉంటాడనే సత్యం నేను తింగరి బుచ్చికి చెప్ప దల్చుకోలేదు. )
అయిందా ?
అలాంటి తింగరి బుచ్చి అనే శాల్తీ నా ప్రారబ్ధం కొద్దీ ఈ ఉదయం మా ఇంటికి ఊడి పడి ... ‘‘ బావా ! ఎలాగయినా నువ్వో అసంపూర్ణ రచన ఒకటి వేగిరం రాసి పడెయ్యాలి !’’ అని భీష్మించుకు కూర్చున్నాడు. నేను అవాక్కయ్యాను. ( కొందరు కొన్ని విపత్కర పరిస్థితులందు ఇట్లు అవాక్కగు చుందురు కదా )
‘‘ అసంపూర్ణ రచనలంటూ ఎవరూ చెయ్యరోయి ! వివిధ కారణాల చేత వారి రచనలలో ఒకటో రెండో అలా అసంపూర్ణంగా మిగిలి పోతూ ఉంటాయంతే ...’’ అని ఙ్ఞాన బోధ చేయ బోయాను.
వాడు నవ్వి, ‘‘ నువ్వెంత అమాయకుడివి బావా ! అవి నిజంగా అసంపూర్ణ రచనలనుకుంటున్నావా ? కాదు ... కాదు ... కమ్మన్నా కాదు ! కొందరు ప్రముఖ రచయితలు మొదట్లో ఎడా పెడా రచనలు చేసి పారేసి, పేరు ప్రఖ్యాతులు సంపాదించీసుకుని, వాటిని కలకాలం పదిలంగా నిలబెట్టు కోవడం కోసం ఓ అసమగ్ర రచన రాసి పారేసి, లోకం మీద పడేస్తారు. కావాలనే ఆ రచనను అసంపూర్ణంగా రచిస్తారు. ఆ లోగుట్టు తెలీక మనం వెర్రి వెంగళప్పల్లాగా, ఫలానా ప్రముఖ రచయిత గారి అసంపూర్ణ రచన యిదీ ! అంటూ లొట్ట లేసుకుంటూ పదే పదే చదువుతాం! తెలుసా !అసలు కంటే కొసరు ముద్దనీ ... ఈ అసంపూర్ణ రచనలే వారు ముందు సంపాయించుకున్న కీర్తి ప్రతిష్ఠలను కలకాలం నిలబెడతాయ్ ఆ రహస్యం తెలియక నీబోటి వాళ్ళు ఆహా, ఓహో ! అంటూ వాటిని చదువుకుంటూ ఊఁ ... ఇదై పోతూ ఉంటారు ! ’’ అని తేల్చేసాడు.
‘‘ గోపీ చంద్ యమపాశం, రావి శాస్త్రి రత్తాలూ రాంబాబూ. అంతెందుకూ, మన అలమండ గాంధీ బాబు, అదే మన పతంజలి రాజుల లోగిళ్ళూ అలా రాసిన అసంపూర్ణ రచనలే ! కాక పోతే వాళ్ళు వాటిని పూర్తి చెయ్ లేకనా ! ’’ అని తీర్మానించీసేడు.
నా నోట్లో తడారి పోయింది. నిలువు గుడ్లేసుకుని ఉండి పోయేను.
ఈ తింగరోడి మాటలకి బదులు చెప్పే సాహసం చెయ్య లేను కదా !
’‘‘ అంతెందుకూ, నీకో పరమ రహస్యం యెబుతాను విను ! అసలు ఆనాడు నన్నయ్యగారూ. పోతన గారూ కూడా ఈ ట్రిక్కు ఉపయోగించే అసంపూర్ణ రచనలు చేసి వదిలారు తెలుసా ? ’’
ఈ వదరుబోతు మాటలకి నా జవజీవాలూ కృశించి పోయేలా ఉన్నాయి.
నా పరిస్థితిని పట్టించు కోకుండా తింగరి బుచ్చి తన ఉపన్యాసం కొనసాగించేడు.
ఆ విధంబెట్టి దనిన ...
‘‘ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతా మణితోనే అఖండ మయిన కీర్తి ప్రతిష్ఠలను మూట కట్టుకుని కూడా దానిని పదిలంగా నిలుపు కోవడం కోసం భారతం అనే అసంపూర్ణ రచన చేసాడు. రెండో, రెండున్నర పర్వాలో రాసి ఊరు కున్నాడు. అలాగే పోతన గారు కూడా ముందుగా రాసిన భోగినీ దండకంతోనే కీర్తి కాంతను స్వంతం చేసుకుని దానిని నిలుపు కోవడం కోసం భాగవతం అనే అసంపూర్ణ రచన చేసాడు ! అయితే, వారి రచనలకు మూల రచనలంటూ ఉండబట్టి ఆతర్వాత భారతాన్ని తిక్కన, ఎర్రనలూ. భాగవతాన్ని పోతన గారి కుమార రత్నమూ, శిష్య రత్నమూ పూర్తి చేసి పారేసారు ! ఆ విధంగా అసపూర్ణ రచనలుగా ఉంచేద్దామనుకున్న వారి ఆశలు కల్ల లయ్యాయి, ఆ విషయం బతికుండగా వారికి తెలియ దనుకో ... గతించేక తెలిసే అవకాశం ఎలానూ లేదు ! ...
అసంపూర్ణ రచనల వల్లనే కిర్తి ప్రతిష్ఠలు చిరకాలం ఎలా నిబెడతాయని నీ సందేహం. అవునా ? !
చెబుతా విను ! ఓ చిన్న ఉదాహరణ చెబుతాను ... విను ...
’’ అని గుక్క తీసు కోడానికి కాస్సేపు ఆగేడు.
ఆసరికి చేతిలో అట్లకాడతో సహా మా ఆవిడ బిగ్గరగా సాగుతున్న వాడి ఉసన్యాస ధోరణికి ముగ్ధురాలై యాంత్రికంగా నడుచుకుంటూ అక్కడకి వచ్చి నిలుచుంది.
వాడు తిరిగి తింగర్యోపన్యాసం మొదలెట్టాడు :
‘‘ నువ్వంతకు ముందెన్నడూ చూడని ఓ ఊరికి వెళ్ళా వనుకో ... అక్కడ అంద మయిన ఓ పదో ఇరవయ్యో ఇళ్ళ వరస కనిపించి. సంతోష పడతావు. ఆ భవన నిర్మాణ కౌశలాన్ని మెచ్చు కుంటావు. సరే వాటి మధ్య ఖర్మ కాలి ఓ అసంపూర్ణ కట్టడం కనిపించిందనుకో. నివ్వెర పోతావు. అయ్యో అనుకుంటావు. సరే, మళ్ళీ ఆఊరెళ్ళే పని నీకు పడక పోయినా ... తర్వాతి రోజులలో ఎప్పటికీ నీకా ఊరు గుర్తుకు వచ్చి నప్పుడల్లా ముందుగా ఆ అసంపూర్ణ కట్టడమే మదిలో మెదులుతూ ఉంటుంది. ఇందులో గొప్ప సైకాలజీ ఉంది. దానికి జర్మన్ లోనో, లాటిన్ లోనో, అధవా ఇంగ్లీషులోనో బారెడు పేరొకటి ఉండే ఉంటుంది. మనకికంకా తెలీదనుకో ! ఙ్ఞానం అసంపూర్ణంగా ఉండడం కూడా మనకి ఓ చక్కని అలంకారమే అనుకో ! ...
అసంపూర్ణ రచనలు చేసి లోకం మీద వదిలేసిన మహా రచయితలంతా ఈ సైకలాజికల్ పాయింట్ మాబాగా పట్టు కొన్నారు.
అందుచేతనే, గొప్ప వాళ్ళంతా అధమ పక్షం ఒకటయినా అసంపూర్ణ రచన చేస్తున్నారు. చెయ్యాలి కూడా. మరంచేత, నువ్వూ వెంఠనే ఓ అసంపూర్ణ రచన రాయాలి బావా ! ’’ అని ముగించాడు. ఆ వాగ్ధోరణికి మా ఆవిడ పరవశించి పోయి చప్పట్టు కొట్టింది. దాంతో రెచ్చి పోయి తింగరి బుచ్చి మరి కొంత సేపు ఇలా ప్రసంగించాడు :
‘‘ ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి రోజూ రుచి కరమైన వంటలు చేసి పెడుతున్నా, ఖర్మ కాలి ఓ రోజు ఉడకని అన్నమో, ఉడికీ ఉడకని కూరో చేసి, ఆ అసంపూర్ణ వంటకాన్ని మన ముఖాన తగ లేసారనుకో ! అదే మనకు చిరకాలం గుర్తుండి పోతుంది !
అసలా బ్రహ్మ దేవుడు కూడా కొన్ని అసంపూర్ణ రచనలు చెయ్య బట్టే, లోకంలో అర్ధాంతర చావులూ ... అల్పాయుష్క మరణాలూ సంభవిస్తున్నాయి. అందరికీ నూరేళ్ళే నుదుటన రచిస్తే, ఇక ఆ వెర్రి బ్రహ్మని తలుచు కునే దెవరు చెప్పు ? ...’’ అని ముగించాడు.
అప్పటికి నా ప్రాణాలు కడతేర్చుకు పోతున్నాయి.
సిగపాయ తీసి తందును కదా ! అనిపించింది కానీ మనకంత ధైర్యమేదీ ?!
అదీ కాక మా అమాయకపు శ్రీమతి వాళ్ళ అన్న గారి దివ్యమైన సలహాకి పొంగి పోయి : ‘‘ అవునండీ ... మీరు కూడా ఓ అసంపూర్ణ రచన చేద్దురూ ! ’’ అని ముందు గోముగానూ , తర్వాత శాసిస్తూనూ నిలదీసేప్రమాదం ఎలానూ పొంచి ఉంది. హతోస్మి !
ఇంతలో ... ... మా ఆవిడకు తటాలున ఏదో గుర్తుకొచ్చి. కెవ్వున అరచినంత పని చేసి చేతిలో అట్లకాడతో వంటింట్లోకి పరిగెత్తింది.
వెనుక మేమూ గాభరాగా పరిగెత్తాం.
అక్కడ ... ... పెనం మీద ఆవిడ రచించిన ఓ అసంపూర్ణ రచన --- మాడి పోయిన అట్టు రూపంలో పొగలు కక్కుతోంది. !
తింగరి ఉపన్యాసమ్ ప్రస్తుతానికి సమాప్తమ్.
ఇట్లు విధేయుడు,
ఖర్మకాలిన కథామంజరి బ్లాగరు, మరియు తింగరి బుచ్చి గాడి బాధితుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి